మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

యువతలో ఆత్మహత్యల శాతం

Posted On: 30 JUL 2021 5:13PM by PIB Hyderabad

'జాతీయ నేర రికార్డుల బ్యూరో'లో నమోదైన లెక్కల ప్రకారం; 2017-2019లో ఆత్మహత్యలకు పాల్పడిన ప్రజల గణాంకాలు రాష్ట్రం/యూటీ వారీగా, లింగం వారీగా, వయస్సుల వారీగా (14-18 సంవత్సరాలు &18-30 సంవత్సరాలు) అనుబంధం-1లో ఉన్నాయి. 'జాతీయ నేర రికార్డుల బ్యూరో' అందించిన సమాచారం ప్రకారం; 2017-2019లో ఆత్మహత్య చేసుకున్నవారి గణాంకాలు కారణాల వారీగా, లింగాల వారీగా, వయస్సుల వారీగా (14-18 సంవత్సరాలు & 18-30 సంవత్సరాలు) అనుబంధం-2లో ఉన్నాయి.

    జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం)లో భాగంగా, 1982 నుంచి 'జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని' (ఎన్‌ఎంహెచ్‌పీ) కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ  అమలు చేస్తోంది. ఇందులో భాగంగా, 'జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం' (డీఎంహెచ్‌పీ) అమలు కోసం రాష్ట్రాలు, యూటీల నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా ఆయా ప్రభుత్వాలకు సాంకేతిక, ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఆత్మహత్యల నివారణ సేవలు, పని ప్రాంత ఒత్తిడి నిర్వహణ, పాఠశాలలు, కళాశాలల్లో జీవిత నైపుణ్యాల శిక్షణ, కౌన్సెలింగ్ వంటివి అందించడం ఈ కార్యక్రమం లక్ష్యం.

    ఆయుష్మాన్ భారత్-హెచ్‌డబ్ల్యూసీ పథకంలో భాగంగా, సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కింద, మానసిక ఆరోగ్య సంరక్షణ సేవలను కూడా సేవల ప్యాకేజీలో కలిపారు. ఆయుష్మాన్ భారత్‌ కార్యక్రమంలోనే; ఆరోగ్య, వెల్‌నెస్‌ కేంద్రాల స్థాయిలో మానసిక, నాడీ సంబంధ రుగ్మతలపై (ఎంఎన్‌లు) కార్యాచరణ మార్గదర్శకాలు విడుదలయ్యాయి.

    చిన్నారుల రక్షణ, మానసిక ఆరోగ్యం, మానసిక సంరక్షణ కోసం, "సంవాద్‌" పేరిట 'నేషనల్ ఇనిషియేటివ్ & ఇంటిగ్రేటెడ్ రిసోర్స్ సెంటర్‌'ను బెంగళూరులోని 'నిమ్‌హాన్స్‌'లో ఏర్పాటు చేయడానికి 'నిమ్‌హాన్స్‌'తో కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

    కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, 'కుటుంబ కౌన్సెలింగ్ కేంద్రాలను' (ఎఫ్‌సీసీ) కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు (సీఎస్‌డబ్ల్యూబీ) అమలు చేస్తోంది. వీటిని సీఎస్‌డబ్ల్యూబీ 1983లో ఏర్పాటు చేసింది. అఘాయిత్యాలు, కుటుంబ అక్రమ సర్దుబాట్లు, సామాజిక బహిష్కరణ వంటివాటిలో బాధితులైన మహిళలు, చిన్నారులకు కౌన్సెలింగ్‌, సలహాలు, పునరావాస సేవలను ఈ పథకం కింద ఎఫ్‌సీసీలు అందిస్తాయి. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏర్పడే సంక్షోభాలు, గాయాల అంశాల్లోనూ ఇవి సాయం చేస్తాయి.
     
    కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ ఈ సమాచారం లిఖితపూర్వక సమాధానంగా ఇవాళ లోక్‌సభకు సమర్పించారు.

అనుబంధాన్ని చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

***



(Release ID: 1740893) Visitor Counter : 108


Read this release in: English , Urdu , Tamil