గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

సైకిల్స్ ఫర్ చేంజ్ చాలెంజ్


తొలి జాబితాలో అవార్డుకు
ఎంపికైన11 నగరాలు!
ఆన్.లైన్ ద్వారా ఎం.ఒ.హెచ్.యు.ఎ. ప్రకటన
చాలెంజ్.పై నివేదిక విడుదల,.. ఆన్.లైన్ ఎగ్జిబిషన్ ప్రారంభం

నాడు పోస్టు చేయడమైనది: 28 JUL 2021 3:53PM by PIB Hyderabad

   స్మార్ట్ నగరాల పథకంలో భాగంగా ప్రారంభించిన సైకిల్స్ ఫర్ చేంజ్ చాలెంజ్ కార్యక్రమం కింద సైక్లింగ్ అగ్రగామి నగరాలుగా తొలి జాబితాలో ప్రతిష్టాత్మకమైన టైటిల్.కు దేశంలోని 11నగరాలను ఎంపిక చేసినట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ పరిపాలనా మంత్రిత్వ శాఖ (ఎం.ఒ.హెచ్.యు.ఎ.)  చొరవతో నిర్వహించిన సైకిల్స్ ఫర్ చేంజ్ పోటీ మొదటి సీజన్ తదుపరి దశ ప్రారంభానికి సూచనగా ఈ అవార్డులను ప్రకటించారు. సైకిల్స్ ఫర్ చేంజ్ చాలెంజ్ అనే పథకంకింద సైక్లింగ్ కు అనువుగా వివిధ రకాల కార్యకలాపాలను నిర్వహించేందుకు,  తద్వారా దేశంలో సైక్లింగ్ విప్లవానికి శ్రీకారం చుట్టేందుకు దేశవ్యాప్తంగా ఉన్న 107నగరాలు ఇదివకే ముందుకు వచ్చాయి. సైక్లింగ్ అగ్రగామి నగరాల ఎంపికకు ముందుగా ఈ ఏడాది ప్రారంభంలో 25 అగ్రశ్రేణి నగరాలను ఎంపిక చేశారు. 25 నగరాల జాబితానుంచి 11 అగ్రగామి నగరాలను జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో కూడిన న్యాయనిర్ణేతల సంఘం ఎంపిక చేసింది. ఇలా ఎంపికైన నగరాలన్నింటికీ సైక్లింగ్ అగ్రగామి నగరాల అవార్డు కింద కోటి రూపాయల చొప్పున అందజేస్తారు. సైక్లింగ్ కార్యకలాపాలను మరింతగా ప్రోత్సహించేందుకు ఆయా నగరాలు ఈ మొత్తాన్ని వినియోగించుకోవచ్చు. సైక్లింగ్ చాలెంజ్ కింద ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక ఆసక్తి చూపించిన నాలుగు నగరాలు ప్రత్యేక ప్రస్తావనకు ఎంపికయ్యాయి. న్యాయనిర్ణేతల సఘం ఆధ్వర్యంలో ముందస్తుగా ఎంపికైన 25 నగరాల జాబితాను అనుబంధం-1.లో చూడవచ్చు.

   అవార్డు గెలుచుకున్న 11 అగ్రగామి నగరాల జాబితాను 2021 జూలై 28న కేంద్ర గృహనిర్మాణ, పట్టణ పరిపాలనా మంత్రిత్వ శాఖ (ఎం.ఒ.హెచ్.యు.ఎ.) కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా ప్రకటించారు. ఆన్.లైన్ ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల అధికారులు, ఇండియా సైకిల్స్ ఫర్ చేంజ్ భాగస్వామ్య వర్గాలుగా పాలు పంచుకుంటున్న అన్ని నగరాల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

  ఈ కార్యక్రమంలో తొలి చాలెంజ్ నివేదికను ఆవిష్కరించారు. అలాగే, తొలి సీజన్ సైక్లింగ్ చాలెంజ్ పయనంలో పాలుపంచుకుంటున్న నగరాలను సూచిస్తూ, ఆన్.లైన్ ఎగ్జిబిషన్ ను కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు. రెండవ సీజన్ సైక్లింగ్ చాలెంజ్ కార్యక్రమం 2021 ఆగస్టులో జరుగుతుందని, ఇందుకోసం తాజాగా  దరఖాస్తులను ఆహ్వానిస్తామని కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అన్ని స్మార్ట్ నగరాలు, రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంతాల రాజధాని నగరాలు, ఐదు లక్షల జనాభాను మించిన నగరాలనుంచి ఈ దరఖాస్తులను ఆహ్వానిస్తామని మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

 

తొలి చాలెంజ్ నివేదిక

 

The ఇండియా సైకిల్స్ ఫర్ చేంజ్ తొలి సీజన్ కార్యక్రమానికి సంబందించిన నివేదికను ప్రజలకు వెల్లడించారు. —'భారత సైక్లింగ్ విప్లవోదయం’ పేరిట ఈ నివేదికను ఆవిష్కరించారు. సైక్లింగ్ చాలెంజ్ కార్యక్రమానికి సంబందించి వివిధ నగరాల్లో ఇప్పటివరకూ జరిగిన కృషిని ప్రశంసిస్తూ, భవిష్యత్తులో చేపట్టవలసిన కార్యకలాపాలను సూచిస్తూ నివేదికను విడుదల చేశారు. సైక్లింగ్ చాలెంజ్ లో వివిధ నగరాలు సాధించిన కీలక విజయాలను, క్షేత్రస్థాయి పరీక్షల్లో నేర్చుకున్న పాఠాలను, రానున్న సంవత్సరంలో చేపట్టబోయే ప్రణాళికలను ఈ నివేదికా పత్రంలో ప్రస్తావించారు. నివేదిక వివరాలకోసం https://smartnet.niua.org/indiacyclechallenge/ అన్న లింకును సంప్రదించవచ్చు.

 

ఆన్.లైన్ ఎగ్జిబిషన్ ప్రారంభం

  భారతదేశంలో గత ఏడాదినుంచి సాగుతున్న సైక్లింగ్ విప్లవాన్ని అభినందిస్తూ, ఈ కార్యక్రమంలో 25అగ్రశ్రేణి నగరాల కృషిని వివరిస్తూ ఆన్.లైన్ ఎగ్బిబిషన్.ను కేంద్ర గృహనిర్మాణ, పట్టణ పరిపాలనా మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. తొలి దశలో తమ వీధులను సైక్లింగ్.కు అనువుగా ప్రత్యేక మార్గాలుగా తీర్చి దిద్దేందుకు ఈ నగరాలన్నీ ప్రత్యేక చర్యలు తీసుకున్నాయి. ఇందుకోసం ఆయా నగరాలు ఉతృష్టమైన నాయకత్వ పటిమను ప్రదర్శించాయి. అన్ని వర్గాల పౌరుల సహకారంతో ఎంతో ఆసక్తితో చర్యలు తీసుకున్నాయి. తమతమ నగరాలు తీసుకున్న చర్యలను గురించి తెలుసుకునేందుకు పౌరులందరూ ఈ ఆన్ లైన్ ఎగ్జిబిషన్.ను సందర్శించవచ్చు. రెండవ దశలో సైక్లింగ్ కార్యకలాపాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, కార్యక్రమంలో పౌరులు కూడా చేతులు కలిపేందుకు ఇది దోహదపడుతుంది. ఈ ఆన్.లైన్ ఎగ్జిబిన్ ను చూసేందుకు https://smartnet.niua.org/indiacyclechallenge/online-exhibition-overview/ అనే ఈ లింకును సంప్రదించవచ్చు.
 

మున్ముందు జరిగే కార్యకలాపాలు

  తొలి దశలో ముందస్తుగా ఎంపికైన 25 అగ్రశ్రేణి నగరాలు తదుపరి దశలోకి ప్రవేశిస్తాయి. సైక్లింగ్.కు అనువైన నగరాన్ని తయారు చేసేందుకు తదుపరి దశలో తగిన విధానాలను చేపట్టవలసి ఉంటుంది. అలాగే, అవసరమైన విభాగాల ఏర్పాటు, నగరవ్యాప్తంగా వర్తించే ప్రణాళికలకు రూపకల్పన వంటివి చేయాల్సి ఉంటుంది. ఆగస్టులో మొదలయ్యే ఇండియా సైకిల్స్ ఫర్ చేంజ్ చాలెంజ్ రెండవ సీజన్ కార్యక్రమాన్ని కూడా కేంద్ర మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. ఇందుకోసం అన్ని స్మార్ట్ నగరాలతో సహా, వివిధ రాష్ట్రాల కేంద్ర పాలిత ప్రాంతాల రాజధాని నగరాలు, ఐదు లక్షల జనాభాను మించిన నగరాలనుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.  గతం సంవత్సర కాలంలో ఇండియా సైకిల్స్ ఫర్ చేంజ్ చాలెంజ్ కార్యక్రమం నగరాలకు స్పూర్తిదాయంగా నిలిచింది. పర్యావరణ హితమైన, సృజనాత్మకమైన, పొదుపైన ఈ వినూత్న కార్యక్రమంలో ఆయా నగరాలు భాగస్వాములయ్యాయి. కార్యక్రమంలో పౌరులకూ ప్రమేయం కల్పించాయి. సైక్లింగ్ ఏర్పాట్లకు అడ్డంకులను తొలగించే పనులను చేపట్టాయి. కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సంసిద్ధమయ్యాయి. జాతీయ స్థాయిలో జరిగే ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి, ప్రజా భాగస్వామ్యంతో ఒక ఉద్యమంగా నిర్వహించడానికి సిద్ధపడ్డాయి.

*********

“భారతదేశపు సైక్లింగ్ విప్లవాన్ని 2020వ సంవత్సరం జ్వలింప జేసింది. సైక్లింగ్.కు ఆలవాలాలుగా మారేందుకు నగరాలు సంసిద్ధం కావడమేకాక, ఈ కార్యక్రమంలో చేతులు కలపడానికి ఆయా నగరాల పౌరులు కూడా ముందుకు వచ్చారు. తమ ఆలోచనలను పంచుకునేందుకు తొలిసారిగా ఆసక్తి చూపించారు. దీనితో ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి.: మరింత ఎక్కువ మంది జనం సైక్లింగ్ పై మక్కువ చూపుతున్నారు.;  నగరాల అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ విషయంలో  తగిన నాయకత్వం వహిస్తూ ఆదర్శంగా ఉంటున్నారు.—విధి నిర్వహణకోసం సైకిళ్లపై వెళ్తున్నారు. --నగరాలు చేస్తున్న ఈ ప్రయత్నాలకు మేం పెట్టుబడుల రూపంలో ప్రోత్సాహం అందిస్తున్నాం. సైక్లింగ్ విప్లవంలో మరిన్ని నగరాలు భాగస్వాములు కావాలని, సైక్లింగ్ కు అనువైన భవిష్యత్తు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని నేను కోరుతున్నాను. అందుకు తగిన ప్రోత్సాహం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను.”

దుర్గా శంకర్ మిశ్రా, కార్యదర్శి, కేంద్ర గృహనిర్మాణ, పట్టణ పరిపాలనా మంత్రిత్వ శాఖ.

 

“ఇండియా సైకిల్స్ ఫర్ చేంజ్ చాలెంజ్ కార్యక్రమం.., నగరాలను సైక్లింగ్.కు సానుకూలంగా మార్చడమే కాక, దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో సైక్లింగ్ చాంపియన్ల సమూహాన్ని సృష్టించడానికి దోహదపడుతోంది. విధి నిర్వహణ కోసం నేను స్వయంగా సైకిల్.పై వెళ్లడం ప్రారంభించాను. మార్పును ప్రత్యక్షంగా పరిశీలించాను. మన నగరాలను సైక్లింగ్ రాజధానులుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం.”

కుణాల్ కుమార్, సంయుక్త కార్యదర్శి, మిషన్ డైరెక్టర్, స్మార్ట్ నగరాల పథకం, కేంద్ర గృహనిర్మా
ణ పట్టణ పరిపాలనా మంత్రిత్వ శాఖ.

 

"సైక్లింగ్ అనువుగా వీధులను తీర్చిదిద్దండి. సైక్లిస్టులు వచ్చి తీరుతారు. గత ఏడాదిలో ఇందుకు సంబంధించిన సూచనలు మాకు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో కనిపించాయి.  అయితే, ఇది కేవలం ఆరంభం మాత్రమే... అందరికీ సురక్షితమైనదిగా, సంతోషకరమైనదిగా సైక్లింగ్.ను తీర్చిదిద్దేందుకు సైక్లింగ్ కార్యకలాపాలను మరింతగా పెంపొందించేందుకు మనం ఇక చర్యలు తీసుకోవాలి."

శ్రేయా గాదెపల్లి, ఆగ్నేయాసియా ప్రోగ్రామ్ లీడ్, ఐ.టి.డి.పి.

(అన్ని ఫొటోలకు లింకు)

 

అనుబంధం 1

భారతదేశపు సైక్లింగ్ అగ్రగామి నగరాలు (ఆంగ్ల అక్షరమాల క్రమంలో)

అవార్డుకు ఎంపికైన 11 అగ్రగామి నగరాలు

 

 

జ్యూరీ ప్రత్యేక ప్రస్తావన జాబితా

 

 

సైక్లింగ్ లో ఇతర అగ్రగామి నగరాలు

 

25 అగ్రశ్రేణి సైక్లింగ్ నగరాలపై కీలకాంశాలు

అవార్డుకు ఎంపికైన 11 అగ్రగామి నగరాలు

బెంగళూరు

ప్రతి పరిసర ప్రాంతం సైక్లింగ్ ప్రాంతం ఎందుకు కాకూడదు?

సైక్లింగ్ కోసం ప్రత్యేక లేన్లను నిర్మించడం ద్వారా సైక్లింగ్ చాలెంజ్.కి తగిన వేదికను బెంగళూరు నగరం సన్నద్ధంచేసింది. —పరిసర ప్రాంతాల్లో సైక్లింగ్ ప్రోత్సాహానికి సుస్థిర ఒప్పందం పెట్టుకుంది.  నగర యంత్రాగంతో కలసి పౌరులు, స్థానిక సంస్థలు పనిచేయడానికి ఈ ఒప్పందం తగిన అవకాశం కల్పించింది. సైక్లింగ్.తో పరిసరాలను విభిన్నంగా రూపొందించేందుకు ఇది దోహదపడింది. సైక్లింగ్.కు అనువుగా నగరాన్ని తీర్చిదిద్దే కృషిలో భాగంగా ఏకంగా నగరం నడిబొడ్డునే భారీ ప్రయత్నం జరిగింది. ఇక అన్ని ప్రాంతాల్లోనూ సైక్లింగ్ ఏర్పాట్లను విస్తరించాలని బెంగళూరు నగరం సంకల్పించింది. పరిసరాల్లోని  ప్రతి ప్రాంతాన్ని సైక్లింగ్.కు అనువుగా తీర్చిదిద్దేందుకు నడుంబింగించింది.!

 

“చెప్పు ఎక్కడ కొరుకుతుందనేది చెప్పులు ధరించిన వారికే తెలుస్తుంది.; అందువల్ల ప్రజల ప్రమేయంతో ప్రణాళికను రూపొందించినపుడే ప్రజల ఆందోళలను నగరాలు కూడా పట్టించుకునేందుకు అవకాశం ఉంటుంది. అప్పుడే సరైన చోట పెట్టుబడులు పెట్టడానికి వీలవుతుంది.”

 

వి. మంజుల,

కమిషనర్ & ఇ/ఒ.,  ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి, పట్టణ భూ రవాణా డైరెక్టరేట్, కర్ణాటక ప్రభుత్వం

భువనేశ్వర్

ప్రజా రవాణా స్థాయికి సైక్లింగ్ ఎలా విస్తరిస్తుంది?

మరింత ఎక్కుమందిని సైక్లింగ్ కు అలవాటు చేసేందుకు, నగరాల్లో ప్రస్తుత రవాణా ఏర్పాట్లను సైక్లింగ్.తో సమీకృతం చేసి తీరాల్సిందే. ఈ విషయాన్ని భువనేశ్వర్ ముందే గ్రహించింది. అందుకే నగరవ్యాప్తంగా ఉపయోగపడే సైక్లింగ్ వ్యవస్థ ఏర్పాటుకోసం ప్రణాళిక వేసింది. దీనితోపాటగా, ఎక్కువ జనసాంద్రత కలిగిన ప్రాంతాల అభివృద్ధిని, ప్రస్తుత రవాణా కారిడార్ల అభివృద్ధిని కూడా చేపట్టింది. పైగా,  సైక్లింగ్.ను  రెండు ప్రాంతాల మధ్య రవాణా ప్రత్యామ్నాయంగా తయారు చేసే అంశంపై దృష్టిని కేంద్రీకరించింది.  పార్కింగ్ టర్పాట్లను నిర్ధారించడం కూడా నగర ప్రణాళికలో భాగమే.—ప్రస్తుతం పార్కింగ్ విధానం, నగరవ్యాప్తంగా పార్కింగ్ నిర్వహణా ప్రణాళిక రూపకల్పన దశలో ఉన్నాయి.

చండీగఢ్

సైక్లింగ్ మార్గాలను అందరికీ పనికివచ్చేలా తయారు చేయడం ఎలా?

ప్రజలకేది అవసరమే వారినే అడగండి.

ఇప్పటికే సైక్లిగ్ వ్యవస్థను కలిగిఉన్న చండీగఢ్ ఒక మామూలు ప్రశ్నతో  ప్రజల చెంతకు వెళ్లింది.: సైక్లింగ్.ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు చేయాల్సిందేమిటి?  అన్నదే ఈ ప్రశ్న. ఇక్కడే వారికి సమాధానం దొరికింది.: రోజులో అన్ని ప్రాంతాల్లో, అన్ని సమయాల్లో తాము సురక్షితంగా ఉన్నామన్న భావన సైక్లిస్టుల్లో కలగాలన్నది సమాధానం. నగరంలో ప్రస్తుతం ఉన్న సైకిల్ ట్రాకులను ప్రక్షాళన చేసేందుకు ఇదే దారి చూపింది.—సైక్లింగ్ ట్రాకుల వెంబడి వీధి దీపాలను, కూడళ్లలో సిగ్నళ్లను ఏర్పాటు చేయడానికి దోహదపడింది. నగర ట్రాఫిక్ విభాగం పోలీసు చొరవతో సైక్లిస్టుల భద్రతా బృందం ఏర్పాటైంది.—సైక్లిస్టులకు సహాయం అందించేందుకు ఇది దోహదపడింది. ఇక సైకిల్ ట్రాకులపై ఆక్రమణలను నిరోధించడం చండీగఢ్ నగరం చేసిన మరో భారీ కసరత్తు.

“శివారు ప్రాంతాలన్నింటినీ సైకిల్ మార్గాలతో నగరం నడిబొడ్డుతో అనుసంధానం చేసేందుకు బలమైన ప్రణాళికకను మా నగరం రూపొందించింది. భారతదేశంలోనే అతిపెద్ద ప్రజా సైకిల్ షేరింగ్ వ్యవస్థ చండీగఢ్ నగరంలో త్వరలో అందుబాటులోకి రాబోతోంది. 617 డాకింగ్ స్టేషన్లతో, 5,000సైకిళ్లతో దేశంలో ఇదే అత్యుత్తమ వ్యవస్థగా తయారవుతుంది.!”

ఎన్.పి. శర్మ,

చీఫ్ జనరల్ మేనేజర్, చండీగఢ్ స్మార్ట్ సిటీ లిమిటెడ్.

వరంగల్

సైక్లింగ్.ను అందరికీ ఆకర్షణీయంగా మార్చేస్తే,. అంతకంటే ఇంకేం కావాలి?

  పర్యావరణ హితకారిగా సైక్లింగ్.ను ప్రవేశపెట్టేందుకు, వివిధ వర్గాల పౌరులు సైక్లింగ్ పట్ల ఆకర్షితులయ్యేలా చూసేందుకు, సైక్లింగ్ ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు వరంగల్ నగరం విశిష్టమైన కృషి చేసింది. నగరంలో ప్రత్యేక సైక్లింగ్ మార్గాలను తీర్చిదిద్దారు. సైక్లింగ్ పట్ల అన్ని వర్గాల పౌరులూ ఆకర్షితులయ్యేలా  మరెన్నో చర్యలు తీసుకున్నారు. వయోజనులకోసం సురక్షిత ర్యాలీలు, సైక్లింగ్ ఇతివృత్తంగా చిత్రలేఖన, వ్యాస రచన పోటీలు, బాలలకు పతంగుల ఉత్సవాలు, కళాశాల విద్యార్థులకు మొక్కలు నాటే కార్యక్రమాలు, మహిళలకోసం స్లో సైకిల్ రేసులు, రంగోళి పోటీలు నిర్వహించారు. సైక్లింగ్.పై వివిధ వర్గాల్లో సంపూర్ణ అవగాహన కల్పించారు.  సైకిళ్లను కొనుగోలు చేయలేని నిమ్నవర్గాలవారికి సైకిళ్లను విరాళంగా అందించి, తద్వారా అవసరమైన వారందరికీ సైకిళ్లు అందేలా చూశారు. యువకులు, వయోజనులు, ధనికులు, పేదలు...ఇలాంటి తేడాల్లేకుండా ప్రతి పౌరుడికీ సైకిల్ అందుబాటులోకి వచ్చేలా వరంగల్ చర్యలు తీసుకుంటోంది. సైకిల్ యానంలో పౌరులంతా భాగస్వాములయ్యేలా పకడ్బందీగా వ్యవహరించారు.

“ఎలాంటి కాలుష్యానికి తావులేని రీతిలో ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని ప్రోత్సహిస్తూ వరంగల్ నగరంలో ఎంతో సుందరంగా సైకిల్ మార్గాలను అభివృద్ధి చేశారు. పర్యావరణ హితమైన హరిత భవితవ్యం లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలోని మరిన్ని నగరాల్లో కూడా ఇలాంటి సైకిల్ లేన్లను చూడాలని మేం ఆశిస్తున్నాం.”

 

కె. తారక రామారావు

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి, తెలంగాణ ప్రభుత్వం.

కోహిమా

పర్వత ప్రాంతాల్లో సైక్లింగ్ బాగుంటుందా?

 కొండ ప్రాంతాల్లో సైక్లింగ్ సురక్షితంగా, ఆనంద దాయకంగా ఉంటుందని పౌరులకు నచ్చజెప్పేందుకు కోహిమా నగర అధికారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారు ఏం చేశారంటే...సైకిల్ తొక్కడంలో, వర్క్ షాపుల నిర్వహణలో శిక్షణ ఇచ్చారు. కొండవాలుకు, ఎగువ ప్రాంతాలకు సైకిల్ తొక్కడం నేర్పించారు. క్రమం తప్పకుండా వివిధ కార్యక్రమాలు, సైకిల్ ర్యాలీల నిర్వహణతో మరింత మంది సైకిళ్లవైపు మొగ్గు చూపారు. ఈ రోజున,..ఇదివరకంటే ఎక్కువ సంఖ్యలో సైక్లిస్టులు కోహిమా వీధుల్లో కనిపిస్తున్నారు. చాలా మంది సైకిళ్లపైనే విధులకు వెళ్తున్నారు. కొంతమంది అయితే, తమ సమూహాల్లో కూడా సైక్లింగ్.ను అలవాటు చేశారు. దీనితో ఈ కొండ ప్రాంతాల్లో సైక్లింగ్ వల్ల కొత్త తరహా పరిస్థితులు నెలకొంటున్నాయి.



“సైకిల్ ఫర్ చేంజ్ చాలెంజ్ కార్యక్రమం పుణ్యమా అని, కోహిమా ప్రజల్లో ఒక అపోహ తొలగిపోయింది. కోహిమా లాంటి కొండ ప్రాంతంలో సైకిల్ తొక్కడం అసాధ్యమనే భావన పూర్తిగా తొలగిపోయింది. ఈశాన్య ప్రాంతపు సైక్లింగ్ రాజధానిగా  కోహిమాను తీర్చిదిద్దేందుకు మేం వేగంగా ముందుకు సాగుతున్నాం.!”

కోవీ మెయాసే

సి.ఇ.ఒ., కోహిమా స్మార్ట్ సిటీ

నాగపూర్

సైక్లింగ్ తో ప్రజల మనసును గెలిచేదెలా?

వారికేం కావాలో వినండి.

 

  సైక్లింగ్.కు అలవాటు చేసే ప్రక్రియకు సంబంధించి ప్రతి దశలోనూ ప్రజలేం చెబుతున్నారో వింటున్నారనేందుకు నాగపూర్ చక్కని నిదర్శనం. సైక్లింగ్.పై నగరంలో నిర్వహించిన సర్వేలో ఏకంగా 15,000మంది తమ ప్రతిస్పందనను తెలిపారు. సైక్లింగ్.కు తమ అభ్యంతరాలేమిటో వారు ప్రధానంగా ప్రస్తావించారు. నగరంలో సైక్లింగ్ ఏర్పాట్లను మెరుగుపరిచేందుకు ఈ అధ్యయనం ఎంతగానో దోహదపడింది. సైక్లింగ్ ప్రణాళికలను ఆచరణాత్మకంగా పరీక్షించేందుకు పరిసర ప్రాంతాల గుర్తింపునకు అధికారులు వివిధ ప్రాంతాల నగర నివాసుల సంక్షేమ సంఘాలతో కలసి పనిచేశారు. మొదటి ప్రయోగాత్మక పరీక్షను అమలులో పెట్టినపుడు పౌరులు ఎంతో క్రియాశీలంగా పాల్గొన్నారు. వారు వెంటనే తమ అభిప్రాయాలను కూడా తెలియపరిచారు. వారి అభిప్రాయాలు ప్రాతిపదికగా సైక్లింగ్ ప్రణాళికలను వేగవంతం చేసేందుకు ఇపుడు చర్యలు తీసుకుంటున్నారు.

న్యూటౌన్ కోల్కతా

ఎక్కువ మంది సైకిళ్లవైపు మొగ్గు చూపేలా చేయడం ఎలా?

వారికి సైకిళ్లు అందించి, నేర్పించడమే...

 

  ప్రజలకోసం మరిన్ని సైకిళ్లు తెప్పించడం, వారికి సైకిల్ నేర్పించడమనే సాధారణ సూత్రం ఆధారంగానే న్యూటౌన్ కోల్కతా కసరత్తు చేసింది. ఆ తర్వాత తొలి ప్రయత్నంగా, నగర వ్యాప్తంగా వెయ్యి సైకిళ్లతో ప్రజా సైకిళ్ల షేరింగ్ వ్యవస్థను తీసుకువచ్చారు. అనంతరం సైక్లింగ్.పై ప్రత్యేకించి మహిళలకు శిక్షణ ఇప్పించారు. ఇందుకోసం వారం వారం శిక్షణా శిబిరాలను నిర్వహించారు. ప్రస్తుతం న్యూటౌన్ కోల్కతా నగరం మరింత విస్తృత స్థాయిలో అవగాహనా కార్యక్రమానికి ప్రణాళికను రూపొందిస్తోంది. అలాగే, నగర వ్యాప్తంగా 70కిలోమీటర్ల మేర సైకిల్ మార్గాల వ్యవస్థను నిర్మిస్తున్నారు.


“సైక్లింగ్.ను చురుకుగా ప్రోత్సహించేందుకు  న్యూటౌన్ కోల్కతా నగరం అనేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా, సైకిల్ ట్రాకుల నిర్మాణం, రక్షణకు సంబంధించిన గుర్తింపు బోర్డుల ఏర్పాటు, సైకిల్ క్లినిక్కులు, స్మార్ట్ సైకిల్ స్టాండ్లు, సైక్లింగ్.లో శిక్షణా ఏర్పాట్లు చేశారు. సైకిల్ తొక్కడం సురక్షితమైన ఆరోగ్యవంతమైన రవాణా ప్రత్యామ్నాయం. ప్రత్యేకించి వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో రవాణాకు ఇదే సరైన మార్గాంతరం!”

దేవాశీస్ సేన్, చైర్మన్

పశ్చిమ బెంగాల్ గృహనిర్మాణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ, న్యూటౌన్ కోల్కతా గ్రీన్ స్మార్ట్ సిటీ లిమిటెడ్., న్యూటౌన్ కోర్కతా అభివృద్ధి ప్రాధికార సంస్థ

పింప్రి చించ్వడ్

నగరవ్యాప్తంగా గ్రీన్ సైక్లింగ్ నెట్వర్క్ ఉంటే ఇక కావలసిందేమిటి?

  పింప్రి చించ్వడ్.లో,.. నగరంలోని బహిరంగ ప్రదేశాలను అనుసంధానిస్తూ ఒక సైకిల్ మార్గాన్ని ఏర్పాటు చేసి ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఈ అనుభవం ప్రాతిపదికగా నగరవ్యాప్తంగా హరిత సేతు పేరిట మాస్టర్ ప్లాన్.ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం ముందుగా, నగరపౌరులు, ప్రజాసేవా సంఘాలు, నిపుణుల అభిప్రాయాలను సేకరించి, అభిప్రాయాలకు అనుగుణంగా వ్యవహరించారు. నగరంలోని హరిత ప్రాంతాలను కలుపుతూ సైక్లింగ్ వ్యవస్థను రూపొందించడంతో ఈ మాస్టర్ ప్లాన్ తయారైంది. మాస్టర్ ప్లాన్.ను కాగితాలకే పరిమితం చేయకుండా ఆ ప్రణాళికకు వాస్తవరూపం తేవడానికి కావలసిన నిధులను ఇప్పటికే కేటాయించారు.

“ఏ ప్రభుత్వ పథకానికైనా ప్రజలే కీలకం. ఇండియా సైకిల్స్ ఫర్ చేంజ్ చాలెంజ్ పేరిట అమలుచేసే పథకానికి పింప్రి చించ్వడ్ పౌరులనుంచి సానుకూల ప్రతిస్పందన లభించింది. ఇక పింప్రి చించ్వడ్ భవిష్యత్తు సుస్థిరంగా ఉండగలదన్న నమ్మకం నాకు కలిగింది.!”

ఉషా అలియాస్ మాయి ధోరే,

మేయర్, పింప్రి చించ్వడ్

వడోదర

బాలలు ఇపుడు కూడా సైకిళ్లపై స్కూళ్లకు భద్రంగా వెళ్లగలరా?

వడోదర నగరం అలాగే భావిస్తోంది.!

  వడోదర నగరంలో ఒక పొరుగు ప్రాంతం, 9 పాఠశాలలతో సైక్లింగ్ నెట్వర్క్ ప్రారంభమైంది. స్కూళ్లకు వెళ్లే బాలల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు అధికారులు కూడా పిల్లలతో సైకిళ్లపై స్కూళ్లకు వెళ్లారు. సైక్లింగ్.ను సురక్షితంగా తీర్చిదిద్దేందుకు వారు ఆ తర్వాత పిల్లలతో కలసి పనిచేశారు.  సమస్యలేమిటో చెప్పాలని పిల్లలను అడగటం మాత్రమే కాదు. స్కూళ్లకు వెళ్లే సైకిల్ మార్గాలను చైతన్యవంతమైన రంగులతో ఆకర్షణీయంగా తయారు చేశారు. దారిలో విభిన్నమైన గుర్తింపు బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ సైక్లింగ్.కు ఆరంభంలో తీసుకున్నచర్యలు మాత్రమే. పిల్లలు ఆనందంగా హాయిగా సైకిల్.పై వెళ్లేందుకు వీలుగా నగరంలో ప్రతి ప్రాంతాన్ని తీర్చిదిద్దేందుకు ఈ చర్యలే దోహదపడ్డాయి.

Rajkot

ప్రతిరోజూ మరింత మంది సైకిళ్లపై పయనించేలా చేయడం ఎలా?

ఇందుకు రాజ్.కోట్ నగరానిదే సరైన జవాబు!

 ఇప్పటికే రోజూ సైకిల్.పై వెళ్లే వారిని ప్రశ్నించి వివరాలు సేకరించడంతో రాజ్ కోట్.లో అధికారుల పని ప్రారంభించారు.—క్షేత్రస్థాయి సమస్యలను తెలుసుకునేందుకు పోస్టమ్యాన్, తదితరులను ప్రశ్నించారు. ఆ తర్వాత వాటికి పరిష్కారాలు చూపించారు. 1,500మందికి పైగా మున్సిపల్ అధికారులు సైకిళ్లపై విధులకు వెళ్తూ విధులకు హాజరై పౌరులకు ఆదర్శంగా నిలిచారు. ఇతర ఉద్యోగులు సైకిళ్లపై విధులకు వెళ్లేలా ప్రైవేటు కంపెనీలను కూడా ప్రోత్సహించారు. సైకిళ్లపై వెళ్లే వారికి ప్రోత్సాహకాలు కల్పించారు. ఇప్పటికే చాలామంది సైకిల్.పై వెళ్లడం ప్రారంభించారు.  సైక్లింగ్.కు సురక్షితమైనవిగా నగరంలో తరచుగా వాడే 40 మార్గాలకు గుర్తించారు.

“సైక్లింగ్.పై తమ ప్రేమను, అభిమానాన్ని అన్ని వయసుల పౌరులూ గుర్తుకు తెచ్చుకునేందుకు ఇండియా సైకిల్ ఫర్ చేంజ్ చాలెంజ్ కార్యక్రమం దోహదపడింది.  మార్పుకోసం డిమాండ్ చేయడానికి ఒక వేదికను వారికి అందించింది.”

నీలేశ్ ప్రజాపతి, ప్రాజెక్ట్ ఆఫీసర్, ఐ.సి.ఎల్.ఇ.ఐ.

సూరత్

సైక్లింగ్.ను జనం ఎలా అర్థం చేసుకుంటారో తెలిసేదెలా?

చిన్నారులతో పని ప్రారంభిస్తే సరి!

  సైకిల్.ను జీవనశైలిలో భాగంగా చూసే చిన్నారుల తరంపై దృష్టిని కేంద్రీకరించారు. సూరత్ నగరం తొలుత ఇలాగే పని ప్రారంభించింది. పాఠశాలల్లో సైక్లింగ్.ను పాఠ్యాంశంగా ప్రారంభించారు. ఇలా చేయడం ఇదే తొలిసారి; సైక్లింగ్ గురించి అవగాహన కల్పించేందుకు ప్రచార కర్తలను కూడా ఎంపిక చేశారు; సైక్లింగ్.కు అనువైన వీధులేవో తెలుసుకునేందుకు చిన్నారులకోసం పోటీలు ప్రారంభించారు. పాఠశాలలు, నివాస ప్రాంతాల గుండా సైకిల్ మార్గాలను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. పిల్లలు ఆ మార్గాల్లో పయనించి తమ అభిప్రాయాలు వెల్లడించేలా చర్యలు తీసుకున్నారు. ఇంకేముంది! సైక్లింగ్.తో సూరత్ ఇపుడు మెరుగైన రేపటి కోసం పురోగమిస్తోంది!

 

“ఇండియా సైకిల్స్ ఫర్ చేంజ్ చాలెంజ్.తో భారతదేశంలో కొత్త సైక్లింగ్ యుగం మొదలైంది. పర్యావరణం, ఆర్థిక పరిస్థితులపై ఈ కార్యక్రమం కలిగించే సానుకూల ప్రభావాన్ని మేం ఇప్పటికే చూస్తున్నాం.  అన్నింటినీ మించి పౌరులకు లభించే సంక్షేమం చాలా  కీలకంగా మారింది.”

కమలేశ్ యాగ్నిక్,

చీఫ్ రెసిలెన్స్ ఆఫీసర్, సూరత్.. చైర్మన్, సర్వసైనిక్ ఎడ్యుకేషన్ సొసైటీ

జ్యూరీ ప్రత్యేకంగా ప్రస్తావించిన నగరాలు

ఔరంగాబాద్

పాత వ్యవస్థను మరచిపోకుండా కొత్తదాని నిర్మాణం ఎలా?

ఇందుకు ఔరంగాబాద్ జవాబు చెబుతోంది.!

  సైక్లింగ్.కు సంబంధించి ఈ  నగరం పాత జ్ఞాపకాలతో పని ప్రారంభించింది! వారసత్వం కోసం సైకిల్స్, అనే పేరుతో కార్యక్రమం చేపట్టింది. నగరంలోని ప్రాచీన వారసత్వ కట్టడాలను అన్వేషించేందుకు ప్రజలు సైకిళ్లపై వీధుల్లోకి రావాలని భావించింది.  ప్రయోగాత్మకంగా సైకిల్ లేన్స్ ఏర్పాటు విషయంలో కూడా ఔరంగాబాద్ ఇదే భావనతో ముందుకు వెళ్లింది.—పాత వస్తువులకు కొత్తగా జీవం ఇచ్చేందుకు సిద్ధపడింది— రీసైకిల్ చేసిన పాత టైర్లను, పాత దీప స్తంభాలను సైక్లింగ్ మార్గాలకు హద్దులుగా అమర్చారు. ఇక ఇప్పుడు, వారసత్వ కట్టడాలున్న ప్రాంతాలను కలుపుతూ సైకిల్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఔరంగాబాద్ పురోగమిస్తోంది.

గురుగ్రామ్

సైకిల్స్ ఫర్ చేంజ్ కార్యక్రమాన్ని పౌర సంఘాలు చేపడితే ఎలా ఉంటుంది?

ఎంతో పని జరుగుతుంది. మరెంతో వేగంగా!

  సైక్లింగ్.ను ప్రజలకు అలవాటు చేసే విషయంలో గురుగ్రామ్ విభిన్నంగా వ్యవహరించింది. ఇప్పటికే అందుబాటులోని సామర్థ్యాలను వాడుకునే వెసులుబాటు కల్పించుకుంది. నగర నివాసుల సంఘాలు, స్థానిక కౌన్సిలర్లు వంటి పలురకాల పౌరులను సమీకృతం చేసింది. వారిచ్చిన తోడ్పాటుతో నగరంలో పలు రకాల సైక్లింగ్ కార్యకలాపాలను చేపట్టారు. వారానికి  ఒకరోజు కార్లను వాడకుండా కట్టుబాటు చేయడం, వాటి స్థానంలో సైకిల్ మార్గాలను ప్రయోగాత్మకంగా చేపట్టడం. మార్గాలకు హద్దులను రూపొందించడం వంటి చర్యలు తీసుకున్నారు! అందరూ సమైక్యంగా పనిచేసి, గురుగ్రామ్ నగరాన్ని సైక్లింగ్ విప్లవంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కృషి చేశారు. వచ్చే ఏడాదిలోగా ఏకంగా 60కిలోమీటర్ల మేర సైకిల్ లేన్ల ఏర్పాటుకు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు.

జబల్పూర్

అన్నీ పూర్తి చేసిన నగరం ద్వారా మనం నేర్చుకునేదేమిటి?

నాయకత్వ వ్యవహారాలు.

  సైక్లింగ్.ను ప్రోత్సహించేందుకు  జబల్పూర్.లో వివిధ శాఖలకు చెందిన ఔత్సాహికులు ముందుకు వచ్చారు. వీధుల్లో పోటీలు, ర్యాలీలు, వెబినార్లు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారాలు, చిత్రలేఖన పోటీలు వంటివి కూడా నిర్వహించారు! ప్రయోగాత్మక పరీక్షలను కూడా ఈ నగరం నిర్వహించింది.—సైకిల్ మార్గాలు, మలుపు ఏర్పాట్లు, కూడళ్ళను మళ్లీ రూపకల్పన చేయడం, ఫ్లోటింగ్ బస్టాపులు, కొన్ని ప్రాంతాల్లో వాహనాల వేగాన్ని తగ్గించే ఏర్పాట్లు తదితర పనులు చేపట్టారు. ఇక నగరం సంపూర్ణంగా సైక్లింగ్.కు అనువుగా మార్చే విషయమై నిర్ణయం తీసుకోనున్నారు. ఇందుకోసం, నగరంలోని ఆరోగ్య కమిటీలు, విధాన నిర్ణయ కర్తలు ఒకచోట సమావేశం కావలసి ఉంది.

సిల్వస్సా

సైక్లింగ్ నగర వ్యాప్త వేడుకగా మారితే జరిగేదేమిటి?

ఇక ప్రతి పౌరుడూ సైకిల్.పైనే.!

  సైక్లింగ్ పలూజా —ఈ పేరుతో నెలరోజుల సైక్లింగ్ ఉత్సవాన్ని సిల్వస్సా నగరం ప్రారంభించింది.—ఇందులో భాగంగా చిన్నారులకోసం సైకిల్ మేళాలు, ప్రజా సైకిల్ రైడింగ్ పోటీలు, శిక్షణా కార్యక్రమాలు, సైకిళ్లను విరాళాలుగా ఇచ్చే కార్యక్రమాలు, బహిరంగ వీధి పోటీలు, అవుట్ డోర్ సినిమా ప్రదర్శనలు నిర్వహించారు! సైకిల్ మార్గాలను పరీక్షించి, కూడళ్లకు మళ్లీ రూపకల్పన చేసేందుకు సైక్లింగ్ ఉత్సవం దోహదపడింది.—పౌరులనుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ పనులు చేయగలిగారు.— కేవలం నెలరోజులు మాత్రమే కాకుండా భవిష్యత్తులో ప్రతి రోజూ సైక్లింగ్.ను వేడుకగా చేపట్టాలన్నదే సిల్వస్సా ఆలోచన.   

సైక్లింగ్.లో ఇతర అగ్రశ్రేణి నగరాలు

కొచ్చి

నగర ర్యాలీ సైక్లింగ్.కు మద్దతు ఎలా ఇస్తుంది?

జనానికి ప్రథమ స్థానం ఇవ్వడం ద్వారా!

  కొచ్చి నగరంలో సైక్లింగ్ చిన్నగానే మొదలైనా ఆ తర్వాత వేగం పుంజుకుంది. మరింత భారీ స్థాయి సైకిల్ ర్యాలీల స్థాయి వరకూ ముందుకు సాగింది. చివరకు రిపబ్లిక్ దినోత్సవం రోజున 700మందితో ఏకంగా ఒక మెగా ర్యాలీని నిర్వహించారు. తొలి సైకిల్ లేన్ ప్రయోగాత్మక పరీక్షగా ఇది నిలిచింది! జనంలో చక్కని ప్రతిస్పందన, పౌరుల సానుకూల అభిప్రాయం ఆధారంగా ఇపుడు మరింత విస్తృతంగా సైకిల్ లేన్ల వ్యవస్థ ఏర్పాటుకు నగరం సంసిద్ధమైంది. నగరవ్యాప్తంగా వెయ్యికిపైగా సైకిళ్లతో సైకిల్ షేరింగ్ వ్యవస్థను కూడా జోడించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.  

“కొచ్చి నగరంలో కొత్తగా సైక్లింగ్ మార్గాలు అందుబాటులోకి రావడం సైకిళ్లపై తిరిగే వారికి సంతోషదాయకం. మెట్రో స్టేషన్లకు అనుసంధానంగా అద్దె సైకిళ్ల వ్యవస్థ ఏర్పాటుతో కొచ్చిలో  జనం ఆలోచనా విధానమే మారబోతోంది, రోజువారీ పనులకోసమే కాకుండా విరామ సమయంలో కూడా సైక్లింగ్ ఒక అలవాటుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.”

 

రీత్తూ జె. జాకబ్,
కో-ఫౌండర్, యునైటెడ్ బై సైక్లింగ్

హైదరాబాద్

నగరంలోని వివిధ శాఖలు కలసి పనిచేస్తే ఏమవుతుంది?

అడ్డంకులన్నీ వాళ్లే తొలగిస్తారు!

  సైక్లింగ్.కు సంబంధించి హైదరాబాద్ బలమైన సహకార బంధం ఏర్పచుకుంది. నగరపాలక సంస్థ, ట్రాఫిక్ పోలీసు విభాగం, రవాణా అధికారుల మధ్య ప్రతి దశలోనూ ఈ సహకారం కుదిరింది. ప్రయోగాత్మక సైక్లింగ్ ప్రాంతాలను గుర్తించడం దగ్గరనుంచి, పరిష్కారాలు రూపొందిచే దశవరకూ పూర్తి సామరస్యంతో పనిచేశారు. పెయింట్లు, బిల్ బోర్డులు, గుర్తింపు బోర్డులు వినియోగిస్తూ సైకిల్ లేన్లను వారు ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఈ సహకార బంధాన్ని సంస్ధాగతం చేయడమే లక్ష్యంగా హైదరాబాద్ ప్రస్తుతం పనిచేస్తోంది.  నగరవ్యాప్తంగా సైక్లింగ్ వ్యవస్థ ఏర్పాటుకోసం ఆరోగ్య కమిటీలకు బాధ్యతను అప్పజెప్పబోతున్నారు.

దావణగేరె

సైక్లింగ్.కోసం ఒక నగరం కొత్త గుర్తింపును తెచ్చుకుంటే..?

సైక్లింగ్ అనేది లోకల్ ట్రెండ్ అవుతుంది!

 

  సైక్లింగ్.ను తిరిగి ఆచరణలోకి తెచ్చేందుకు దావణగేరె నగరం స్థానికంగా ప్రచారం ప్రారంభించింది.— సైక్లింగ్ ప్రధానాంశంగా సైకిల్ ర్యాలీల్లో ప్రత్యేక వాణిజ్యం చేపట్టింది. ఎల్.ఇ.డి. స్క్రీన్ల ద్వారా నగర వ్యాప్తంగా ప్రచారం సాగించింది. స్థానిక రేడియో షో కార్యక్రమాల ద్వారా సైక్లింగ్ గీతాలను ప్రచారం చేసింది. ఈ ప్రచారం చివరకు మంచి ఫలితాలనే ఇచ్చింది! సైక్లింగ్.ను ప్రయోగాత్మకంగా చేపట్టినపుడు పెద్దసంఖ్యలో జనం కూడా ఆసక్తి కనబరిచారు. తమ నగరంలో సైక్లింగ్ కార్యకలాపాలకు మద్దతు ప్రకటించారు.

న్యూఢిల్లీ

సైక్లింగ్.ను కళతో మేళవిస్తే జరిగేదేమిటి?

  కళాకారుల ప్రధాన కేంద్రంతో కలసి దేశ రాజధాని అయిన ఢిల్లీ నగరం,.. చైతన్యవంతంగా సైక్లింగ్ ప్లాజాను నిర్వహించింది. వీధి స్థాయి కళారూపాన్ని పూర్తిగా అగ్రస్థాయికి తీసుకెళ్లింది. ఇందుకోసం వర్ణచిత్ర కళాకారులను సమైక్యం చేసింది. నగరంలోని ఒక ప్రాంతాన్ని, సైకిల్ లేన్లను ప్రజాకళా రూపాలతో తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంది. మరో ప్రాంతానికి, చివరకు నగరవ్యాప్తంగా సైక్లింగ్.ను విస్తరించేందుకు కూడా సంసిద్ధమైంది.

నాసిక్

మార్పుకోసం సమాచారాన్ని ఎలా వినియోగించాలి?

  సైక్లింగ్.పై సమాచారం ఆధారంగా నిర్ణయం తీసుకునే పద్ధతిని నాసిక్ నగరం ఆశ్రయించింది. మొదటగా,... ఇప్పటికే ఎక్కువగా వినియోగిస్తున్న సైక్లింగ్ మార్గాలేమిటో విశ్లేషించి, వాటిని విభిన్న గ్రూపుల కోసం కేటాయించారు. —పారిశ్రామిక సిబ్బంది, విద్యార్థులు, యాత్రికులతో సహా వివిధ వర్గాల కోసం, సైకిల్ లేన్లుగా ఆ మార్గాలను ఎంపిక చేశారు.  ఇక రెండవ చర్యగా, ..రోజూ విభిన్నమైన సమయాల్లో ఆ మార్గాలపై సవివరంగా విశ్లేషణ జరిపారు. ఆ ప్రాంతంలో ఎదురయ్యే తీవ్రమైన సమస్యలేమిటో తెలుసుకోవడానికి ఈ విశ్లేషణ ఉపకరించింది. ఇక మూడవ ప్రయత్నంగా, ఎప్పటికప్పుడు పెరిగే సైక్లిస్టుల సంఖ్యపై సమాచారం సేకరించారు. ఇదే సమాచారాన్ని నగరవ్యాప్తంగా ప్రదర్శించారు. ఇతర చోట్ల కూడా సైక్లింగ్.పై మొగ్గుచూపేలా తగిన స్ఫూర్తిని కలిగించేందుకు ఈ సమాచారాన్ని వినియోగించారు.  ఈ నగరంలో ప్రస్తుతం వంద కిలోమీటర్లకు పైగా వీధులను సైక్లింగ్ కోసం వినియోగించుకునేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.

కాకినాడ

సైక్లింగ్ నెట్వర్క్ కు నగరాలు సారథ్యం వహిస్తే....?

సైక్లింగ్ ప్రతి ఒక్కరికీ చేరువవుతుంది!

సైక్లింగ్.కు విస్తృతంగా మద్దతును కూడగట్టేందుకు కాకినాడ నగరం ఎన్నో చర్యలు తీసుకుంది. ప్రతి వార్డుకు సైక్లింగ్ సారథిని గుర్తించింది. నగరంలో జరిగిన 12 సైకిల్ ర్యాలీల్లో వెయ్యిమందికి పైగా పౌరులు పాల్గొన్నారు. తొలి సైక్లింగ్ మార్గం ప్రయోగాత్మక ప్రారంభానికి ఇది దోహదపడింది.  నగరం నిర్వహించిన సర్వేలు, సంప్రదింపులు చక్కగా సాగేలా సైక్లింగ్ చాంపియన్లు కూడా తగిన చర్యలు తీసుకున్నారు. వీటిలో విభన్న వర్గాల నగర పౌరులు భారీగా పాలుపంచుకున్నారు. మహిళలు, చిన్నపిల్లలు, అంగవైకల్యం కలిగిన వారు కూడా ఎంతో ఆసక్తితో పాల్గొన్నారు.

ఉదయపూర్

నగరంలో ప్రధాన ప్రాంతాన్ని సైక్లింగ్.కు అనువుగా మార్చేస్తే...?

  నగరంలోని ప్రధాన మార్గాల్లో ఒక దాన్ని సైక్లింగ్ ట్రాక్.తో ప్రయోగాత్మకంగా పరీక్షించాలని ఉదయపూర్ నిర్ణయించుకుంది.  బస్టాండ్, ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, మిలటరీ ఆవరణలు వంటి కేంద్రాలను కలుపుతూ సైక్లింగ్.ను పరీక్షించాలని సంకల్పించారు. సైకిల్.పైనే విధులకు వెళ్లాలన్న ప్రచారంతో నిర్వహించిన ఈ కార్యక్రమం పలువురు రోజువారీ ప్రయాణికులు సైక్లింగ్.పైవు మొగ్గు చూపేందుకు దోహదపడింది. నగర మేయర్ దృష్టిని ఇది ఎంతగానో ఆకర్షించింది. ఇపుడు శాశ్వతంగా సైక్లింగ్ ప్రాంతంగా మారే దిశగా  ఉదయపూర్  అడుగులు వేస్తోంది.

సాగర్

ఏదైనా సరస్సు ఎక్కుమందిని సైక్లింగ్.వైపు ఆకర్షించగలదా?

సాగర్ నగరం అలోచన అదే!

 పేరులోనే నీటిని దాచుకున్న సాగర్ నగరం తన పేరుకు తగ్గట్టుగానే వ్యవహరించింది. లఖా బంజారా సరస్సు చుట్టూ సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. చెరువు చుట్టూ ఉన్న పాఠశాలలు, వారసత్వ కట్టడాలు, పార్కులు, రవాణా కేంద్రాలు, క్రీడల స్టేడియం వంటి వాటిని కలుపుతూ సైక్లింగ్ ఏర్పాట్లు చేశారు. ఎంతో సుందరమైన, ఆకర్షణీయమైన రీతిలో ప్రయోగాత్మక సైక్లింగ్ ట్రాక్ తయారు చేశారు.  సొంతంగా సైకిల్ లేనివారిని ప్రోత్సహించేందుకు పైలట్ పథకంలో అద్దె సైకిళ్ల స్టాండును ఏర్పాటు చేశారు.  ఈ ప్రయోగం ఫలితాలు, జనం ఆసక్తి ప్రాతిపదికగా నగర వ్యాప్తంగా సైక్లింగ్ ట్రాకులు ఏర్పాటు చేయాలని సాగర్ నగరం సంకల్పించింది.


స్మార్ట్  సిటీస్ పథకంలో భాగంగా చేపట్టిన ఈ చర్య సామాజిక కట్టుబాట్లను అధగమించి, మహిళలకు, బాలికలకు సాధికారత కల్పించింది. వారు తమ ఇళ్లనుంచి బయటపడి సైకిల్.పై వెళ్లేలా స్ఫూర్తిని కల్పించింది.”

 

మీనా పింప్ల పూరే

సామాజిక కార్యకర్త, సాగర్.

పణాజీ

సైక్లింగ్.తో యాత్రా కేంద్రం పునరద్ధరణ ఎలా?

దీనిపై పణాజీ సొంత ఐడియా!

  పణాజీ నగరాన్ని సందర్శన ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. తళతళ మెరిసే మాండవీ నదీ ప్రవాహాన్ని చూస్తూ ప్రశాంతమైన గోవా పరిసర ప్రాంతాల్లో సైకిల్.పై వెళ్తే ఎలా ఉంటుంది. అకస్మాత్తుగా సువిశాలమైన సముద్రం మీ కళ్లెదురుగా దర్శనమిస్తుంది. పణాజీ నగరం కూడా సరిగ్గా ఇలాంటి ఆలోచనతోనే ముందుకు సాగింది. సందర్శకులు, పర్యాటకుల నగర సందర్శన ఎలా ఉండాలో మరోసారి నిర్వచించాలనుకుంది.  పరిసర ప్రాంతాలన్నింటినీ కలుపుతూ సైక్లింగ్ మార్గాన్ని హాయిగొలిపేలా రూపొందించేందుకు పణాజీ ప్రణాళిక వేసింది.  వారసత్వ స్థలాలతో వీధులను తీర్చిదిద్దబోతోంది. ఇందుకోసం క్రమం తప్పకుండా సైకిల్ ర్యాలీలు నిర్వహించబోతోంది. 

 

గతకాలపు సైక్లింగ్ సంస్కృతిని పునరుద్ధరిస్తే...?

  సైక్లింగ్.కు అనువైన నగరం ఎలా ఉండాలో అందుకు నిదర్శనంగా ఒకప్పుడు ఇండోర్ కనిపించేది. కానీ ఏళ్లు గడుస్తున్న కొద్దీ ఇక్కడ సైకిళ్లపై తిరిగేవారి సంఖ్య క్రమంగా తగ్గింది. అయినా ఇప్పటికీ ఇండోర్ నగరంలో 2,000కు పైగా సైకిల్ స్టోర్లు ఉన్నాయి. లక్షకు పైగా సైకిళ్లు అద్దెపై అందుబాటులో ఉంటున్నాయి! అయితే తాజాగా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు, సైక్లింగ్.ను పునరుద్ధరించేందుకు, నగరం మధ్యన సైకిల్ లేన్లను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు ఇండోర్ సంసిద్ధమైంది. ప్రజలు మళ్లీ సైకిళ్లవైపు మొగ్గేలా అవగాహనా ర్యాలీలు కూడా ప్రారంభించాలని అనుకుంటోంది! నగరంలో ప్రస్తుత సైక్లింగ్ వ్యవస్థలో అంతరాలను భర్తీ చేసేందుకు ప్రణాళిక వేసింది. పాత సైక్లింగ్ సంస్కృతికి కొత్త జీవం అందించేందుకు ఇండోర్ నడుంబింగించింది..

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

*****


(రిలీజ్ ఐడి: 1740031) సందర్శకుల సూచీ సంఖ్య : : 252
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी , Marathi , Bengali , Punjabi