ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ 19 మహమ్మారి సమయంలో ఆశా కార్మికుల సంక్షేమం

Posted On: 27 JUL 2021 3:53PM by PIB Hyderabad

కోవిడ్ 19 పరిస్థితుల నిర్వహణ, నియంత్రణ కోసం జాతీయ ఆరోగ్య మిషన్ కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ‘ఇండియాలో కోవిడ్ 19 ఆరోగ్య వ్యవస్థ సంసిద్ధత మరియు అత్యవసర ప్రతిస్పందన ప్యాకేజీ ’ పేరిట 2019‌‌–20 ఆర్థిక సంవత్సరంలో రూ.1113.21 కోట్లు, 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.8147.28 కోట్ల రూపాయలను గ్రాంట్ ఇన్ ఎయిడ్గా విడుదల చేశారు.
కోవిడ్ 19 మహమ్మారి సమయంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఆశా వర్కర్లకు సాధారణ, పునరావృత కార్యకలాపాల కోసం ఒక్కొక్కరికి రూ.2000 చొప్పున  చెల్లించారు. అంతేకాకుండా కోవిడ్ 19 మహమ్మారి సమయంలో జాతీయ, రాష్ట్రాల నిబంధన మేరకు  జనని సురక్ష యోజన(జేఎస్వై), గృహ ఆధారిత నవజాత సంరక్షణ(హెచ్బీఎన్సీ) తదితర పథకాలను కొనసాగించిన ఆశా కార్యకర్తలకు వారి వారి కార్యకలాపాల మేరకు ప్రోత్సాహకాలను అందించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరారు.
కోవిడ్ 19 మహమ్మారి సమయంలో ‘ఇండియాలో కోవిడ్ 19 ఆరోగ్య వ్యవస్థ సంసిద్ధత మరియు అత్యవసర ప్రతిస్పందన ప్యాకేజీ ’ కింద  కోవిడ్ సంబంధిత విధులు నిర్వర్తించిన   ఆశా కార్యకర్తల సేవలకు గుర్తింపుగా అదనంగా 2020 జనవరి నుంచి  నెలకు రూ.1000 చొప్పున ప్రోత్సాహకాలు ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించించారు.
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద ఆశా కార్యకర్తలతోసహా హెల్త్ వర్కర్లందరికీ  బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. కోవిడ్ సంబంధిత విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ఈ పథకంతో రూ.50.00 లక్షల బీమా పరిహారం అందుతుంది.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అందిన నివేదిక ప్రకారం మొత్తం 8,78,071 ఆశా కార్యకర్తలు, ఇతర కమ్యూనిటీ వలంటీర్లు 2021 మార్చి వరకు కోవిడ్ 19 అనుబంధిత అదనపు చెల్లింపులు అందుకున్నారు. ప్రోత్సాహకాలు అందించే విషయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆలస్యం చేసినట్లు ఎటువంటి నివేదికలు అందలేదు.

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద 2021, జూన్ వరకు ఆశా కార్యకర్తలకు సంబంధించిన 43 క్లెయిమ్లను పరిష్కరించారు. ఈ చెల్లింపుల విషయంలో కూడా ఎటువంటి ఆలస్యం జరిగినట్లు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తెలపలేదు.

సామాజిక భద్రతా నియమావళి, వేతన నియమావళి 2020 పరిధిలోకి ఆశా కార్యకర్తలు రారు. ఆశా కార్యకర్తలు సామాజిక ఆరోగ్య స్వచ్ఛంద సేవలకులుగా, నిర్దేశిత లక్ష్యం/కార్యచరణ ఆధారిత ప్రోత్సాహకాలకు అర్హులుగా ఉండాలని భావించారు. దీని ఫలితంగా ఆశా కార్యకర్తలు ఈ క్రింది ప్రయోజనాలను పొందుతున్నారు.
బీమా చేసిన వ్యక్తి మరణించినట్లయితే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) కింద రూ.2.00 పరిహారం అందుతుంది. ఇందుకోసం భారత ప్రభుత్వం  వార్షిక ప్రీమియంగా రూ.330 చెల్లించింది.
ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన(పీఎంఎస్బీవై) కింద ప్రమాదవశాత్తు మరణం సంభవించినా, శాశ్వత వైకల్యానికి గురైనా రూ.2 లక్షల బీమా పరిహారం అందుతుంది. పాక్షిక వైకల్యానికి లక్ష రూపాయల పరిహారం అందుతుంది. ఇందుకోసం భారత ప్రభుత్వం వార్షిక ప్రీమియంగా రూ.12 చెల్లించింది.
ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్(పీఎంఎస్వైఎం) ప్రకారం 60 సంవత్సరాల వయసు దాటిన తర్వాత నెలకు రూ.3000 పెన్షన్గా అందుతుంది. ఇందుకోసం లబ్ధిదారుల ప్రీమియంలో యాభై శాతాన్ని భారత ప్రభుత్వం చెల్లిస్తోంది. మిగతా సగాన్ని లబ్ధిదారులు చెల్లించాలి)
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఈ మేరకు రాజ్యసభకు మంగళవారం  లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 

 

***

 



(Release ID: 1739689) Visitor Counter : 262


Read this release in: English , Urdu , Punjabi