సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

సూపర్‌-40 జాబితాలో భారత్‌


రాన్‌ ఆఫ్‌ కచ్‌లోని హరప్పా నగరం ‘ధోలావీరా’కు యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపుపై
కేంద్ర సాంస్కృతిక-పర్యాటక.. ‘డోనియర్‌’ శాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి పత్రికా ప్రకటన

Posted On: 27 JUL 2021 5:14PM by PIB Hyderabad

   గుజరాత్‌ రాష్ట్రం రాన్‌ ఆఫ్‌ కచ్‌పరిధిలోని హరప్పా నగరం ‘ధోలావీరా’కు ఐక్యరాజ్య సమితి విద్యా-శాస్త్ర-సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపునిచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర సాంస్కృతిక-పర్యాటక, ఈశాన్యప్రాంత అభివృద్ధి (డోనియర్‌) శాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి ఈ సమాచారాన్ని ఒక పత్రికా ప్రకటన ద్వారా పంచుకున్నారు. కొద్దిరోజుల కిందట తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేటలోగల (రామప్ప ఆలయంగా ప్రసిద్ధి చెందిన) రుద్రేశ్వర ఆలయం భారతదేశంలోని 39వ ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తింపు పొందిన నేపథ్యంలో తాజాగా ‘ధోలావీరా’ ఆ జాబితాలో 40వ స్థానంలోకి చేరింది. ఈ సందర్భంగా... “యునెస్కో ప్రపంచ వారసత్వం సంపద జాబితాలో నేడు ‘ధోలావీరా’ 40వ స్థానం పొందిన విషయాన్ని నా సహ పౌరులతో పంచుకోవడం నాకెంతో గర్వకారణం. భారత కీర్తికిరీటంలో ఇది మరొక కలికి తురాయి” అని శ్రీ కిషన్‌రెడ్డి తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా భారతీయులందరితో పంచుకున్నారు.

   ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర పడిన నేపథ్యంలో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలోగల భారతదేశంలోని ప్రదేశాల సంఖ్య 40కి చేరింది. వీటిలో 32 సాంస్కృతిక, 7 సహజ, 1 మిశ్రమ సంపదలున్నాయి. ఈ మేరకు ప్రపంచంలో 40 అంతకుమించి ప్రపంచ వారసత్వ సంపద ప్రదేశాలుగల ఇటలీ, స్పెయిన్‌, జర్మనీ, చైనా, ఫ్రాన్స్‌ దేశాల సరసన భారత్‌ స్థానం సంపాదించింది. భారతదేశం 2014 నుంచి మొత్తం 10 ప్రపంచ వారసత్వ సంపద ప్రదేశాలను ఆ జాబితాలో చేర్చిందని కూడా మంత్రి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి-వారసత్వాలను, భారత జీవనశైలిని ప్రపంచానికి చాటడంపై ప్రధానమంత్రి ప్రదర్శిస్తున్న దీక్ష, పట్టుదలలకు ఇది నిదర్శనమని ఆయన అన్నారు. ఈ మేరకు “ఇది భారతదేశం... ముఖ్యంగా గుజరాత్‌ ప్రజలు గర్వించదగిన రోజు... భారతదేశం 2014 నుంచి 10 ప్రపంచ వారసత్వ సంపద ప్రదేశాలను- అంటే... మొత్తంలో నాలుగోవంతును ఆ జాబితాలో చేర్చింది. భారతీయ సంస్కృతి-వారసత్వాలను, భారత జీవనశైలిని ప్రపంచానికి చాటడంపై ప్రధానమంత్రి ప్రదర్శిస్తున్న దీక్ష, పట్టుదలలకు ఇదే తిరుగులేని నిదర్శనం” అని ట్వీట్‌ చేశారు.

 

Image

***

హరప్పా నగరం ధోలావీరా గురించి...

   హరప్పా నగరం ‘ధోలావీరా’ 2014 నుంచే యునెస్కో తాత్కాలిక జాబితాలో ఉండగా, భారత ప్రభుత్వం 2020 జనవరిలో ప్రపంచ వారసత్వ కేంద్రానికి దీనిపై సవివర సమాచారంతో ప్రతిపాదన పంపింది.

ధోలావీరా: దక్షిణాసియాలో క్రీస్తుపూర్వం 3 నుంచి 2వ సహస్రాబ్ది మధ్య కాలంనుంచి అత్యంత జాగ్రత్తగా పరిరక్షించబడిన పట్టణ ఆవాసాల్లో ఈ హరప్పా నగరం ఒకటి. ఇప్పటిదాకా కనుగొనబడిన హరప్పా నాగరికత నాటి 1,000కిపైగా ప్రదేశాల్లో 6వ అతిపెద్ద ప్రదేశం. ఇక్కడ 1,500 ఏళ్లకుపైగా జనావాసాలు ఉండేవి. తొలినాటి మానవ నాగరికత ఉత్థానపతనాలన్నిటికీ ధోలావీరా సాక్షీభూతంగా నిలవడమేగాక పట్టణ, ప్రణాళిక, నిర్మాణ పద్ధతులు, జల నిర్వహణ, సామాజిక పరిపాలన-ప్రగతి, కళలు, తయారీ, వాణిజ్యం, భక్తి వ్యవస్థలు తదితరాలతో కూడిన బహుముఖ మేధస్సుకు ప్రతీకగా నిలిచింది. ధోలావీరాలోని పట్టణ ఆవాసాల్లో చక్కగా పరిరక్షించబడిన సుసంపన్న కళాఖండాలు వైవిధ్యభరితమైన ఓ ప్రాంతీయ కూడలిగాగల గుర్తింపును చాటుకుంటూ మొత్తంమీద హరప్పా నాగరికతను ప్రస్తుత విజ్ఞానంతో ప్రతిబింబిస్తుంటాయి.

ఈ వారసత్వ సంపద రెండు భాగాలుగా ఉంటుంది: చుట్టూ గోడతో కూడిన ఈ నగరంలో పశ్చిమ దిశలో శ్మశానం ఉంటుంది. ఈ నగరం చుట్టూ దృఢమైన ప్రాకారంతో కూడిన బలమైన కోట, వేడుకలు నిర్వహించే మైదానం, మధ్య, దిగువ పట్టణాలతో కూడి ఉంటుంది. కోటకు తూర్పు, దక్షిణ దిశలలో అనేక జలాశయాలు ఉంటాయి. ఇక్కడి శ్మశానవాటికలోని సమాధులలో అధికశాతం స్మారక చిహ్నాలుగా కనిపిస్తాయి.

   ధోలావీరా నగరంలో ఉచ్ఛస్థితిలో ఉన్న సమయంలో దీని ఆకృతి ఒక ప్రణాళికబద్ధ నగరానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపించేది. దీంతోపాటు వివిధ సామాజిక స్థాయి, వృత్తిపరమైన కార్యకలాపాలవారీగాగల ప్రాంతాలతో పట్టణ పరిసరాలు విభజితమై ఉండేవి. నీటి సమీకరణ-సరఫరా, వరద పారుదల వ్యవస్థలు ఆధునిక సాంకేతిక, నిర్మాణ నైపుణ్యంతో కూడి ఉండేవి. ఆ మేరకు స్థానికంగా లభ్యమయ్యే సామగ్రితోనే నిర్మించబడిన వాటి ఆకృతి, నిర్మాణం అబ్బురమనిపిస్తాయి. అనేక హరప్పా కాలం నాటి పురాతన నగరాలు  నదీ తీరాల్లో్, నిరంతర జల లభ్యతగల చోట్ల ఏర్పడినవి కాగా, (రాగి, షెల్, అగేట్-కార్నెలియన్, స్టీటైట్, సీసం, సున్నపురాయి వంటి) ఖనిజాలు, ముడి పదార్థాలు లభ్యమయ్యే ఖదీర్‌ ద్వీపంలో ఏర్పడినది కావడం ధోలావీరా ప్రత్యేకత. అంతేకాకుండా ఇది అంతర్గత, మగన్‌ (నేటి ఆధునిక ఒమన్ ద్వీపకల్పం), మెసొపొటేమియన్ ప్రాంతాలతో బాహ్య వాణిజ్య సౌలభ్యం కల్పించే ఒక వ్యూహాత్మక ప్రదేశం కావడం విశేషం.

   హరప్పా (ప్రారంభ, పరిణత, అంతిమ దశల) నాగరికతకు సంబంధించిన పురాతన-చారిత్రక రాగి యుగపు పట్టణ ఆవాసానికి ధోలావీరా ఓ అసాధారణ ఉదాహరణ. అలాగే క్రీస్తుపూర్వం 3 నుంచి 2వ సహస్రాబ్దిలో బహుళ-సాంస్కృతిక, సామాజిక స్థాయులకు సంబంధించిన సాక్షీభూతం. హరప్పా నాగరికత ప్రారంభ దశలో క్రీస్తుపూర్వం 3000 వరకు ప్రాచీనతకు ఆధారాలు కనిపిస్తాయి. ఈ నగరం దాదాపు 1,500 సంవత్సరాలపాటు పరిఢవిల్లి, సుదీర్ఘ నిరంతర ఆవాసంగా కొనసాగింది. ఇక్కడ ప్రజల స్థిరనివాస మూలం, దాని వృద్ధి, అత్యున్నత స్థితిసహా నగరం రూపురేఖలతోపాటు ఆకృతిలో నిరంతర మార్పుల రూపంలో క్షీణత, నిర్మాణ అంశాలుసహా అనేక ఇతర లక్షణాలు తవ్వకాల్లో లభ్యమైన అవశేషాలు సుస్పష్ట చేస్తాయి.

   హరప్పా కాలపు పట్టణ ప్రణాళికకు ధోలావీరా ఒక అద్భుతమైన ఉదాహరణ. ఆ మేరకు ముందుచూపుగల నగర ప్రణాళిక, బహుళ అంచెల పటిష్ఠీకరణ, ఆధునిక జలాశయాలు-నీటి పారుదల వ్యవస్థ, నిర్మాణ సామగ్రిగా రాతిని విస్తృతంగా వాడటం వంటివి ఇందుకు నిదర్శనాలు. మొత్తం హరప్పా నాగరికత పరిఢవిల్లిన కాలంలో ధోలావీరా విశిష్ఠ స్థానాన్ని ఈ అంశాలు ప్రస్ఫుటం చేస్తున్నాయి.

   లభ్యమయ్యే ప్రతి నీటిచుక్కనూ ఒడిసిపట్టి నిల్వచేసే విధంగా రూపొందించిన విస్తృత నీటి నిర్వహణ వ్యవస్థ నాటి భౌగోళిక వాతావరణ మార్పులలో మనుగడ దిశగా ప్రజలకుగల ముందుచూపును వివరిస్తుంది. వర్షాకాలంలో ప్రవహించే సెలయేళ్ల నుంచి నీటిని మళ్లించి తక్కువ వర్షపాతంగల సమయంలో లభ్యత కోసం కోటకు తూర్పు, దక్షిణ దిశలలో రాతిని తొలిచి నిర్మించిన భారీ జలాశయాల్లో నిల్వ చేసేవారు. దీంతోపాటు మరింత నీటి లభ్యత దిశగా నగరంలోని పలుచోట్ల రాతిని తొలచి నిర్మించిన బావులు పురాతన ఉదాహరణలుగా నిలుస్తాయి. ముఖ్యంగా కోటకు సమీపానగల ఇటువంటి బావి అమితంగా ఆకట్టుకుంటుంది. ఇటువంటి విస్తృత జల సంరక్షణ పద్ధతులు అనుసరించిన విశిష్ట ధోలావీరా నగరం ప్రపంచంలోనే అత్యంత సమర్థ ప్రాచీన వ్యవస్థలకు కొలబద్దలాంటిది.

 

***



(Release ID: 1739680) Visitor Counter : 381


Read this release in: English , Hindi , Marathi , Gujarati