నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 ఫ్రంట్‌లైన్ కార్మికుల కోసం ప్రత్యేకమైన క్రాష్ కోర్సు

Posted On: 23 JUL 2021 4:31PM by PIB Hyderabad

కోవిడ్ 19 ఫ్రంట్లైన్ కార్మికుల కోసం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన3.0(పీఎంకేవీవై3.0) కింద కేంద్ర నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపక మంత్రిత్వశాఖ 18.06.2021 న ప్రత్యేకమైన క్రాష్ కోర్సు ప్రోగ్రామ్ను ప్రారంభించింది. ఈ కోర్సులో భాగంగా హెల్త్కేర్కు సంబంధించిన ఆరు  అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్(ఎల్ఎంఓ) రవాణా కోసం  2,800 మంది డ్రైవర్లకు కూడా శిక్షణ ఇస్తారు. ఆరోగ్య నిపుణులపై భారాన్ని తగ్గించడంతోపాటు ఆరోగ్య రంగంలో నిపుణులైన ఆరోగ్య కార్యకర్తల డిమాండ్ను భర్తీ చేయడానికి, సకాలంలో ఆరోగ్య సేవలు అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ క్రాష్ కోర్సును ప్రారంభించింది.

లక్ష్యాలకు అనుగుణంగా మార్పులు చేసిన ఈ క్రాష్ కోర్సు ద్వారా యువతకు ఉచితంగా నైపుణ్య శిక్షణతోపాటు సర్టిఫికేషన్, వేతన ఉపాధికి అవకాశం కల్పిస్తుంది.  ఈ క్రాష్ కోర్సు ప్రోగ్రామ్ కింద హెల్త్కేర్కు సంబంధించిన  బేసిక్ కేర్ సపోర్ట్, హోమ్ కేర్ సపోర్ట్, అడ్వాన్స్డ్ కేర్ సపోర్ట్, శాంపిల్ కలెక్షన్ సపోర్ట్, ఎమర్జెన్సీ కేర్ సపోర్ట్ మరియు మెడికల్ ఎక్విప్మెంట్ సపోర్ట్ అనే ఆరు అంశాలకు సంబధింధించి శిక్షణ ఇవ్వబడుతుంది.  ఈ క్రాష్ కోర్సు కాల వ్యవధి 144 గంటల నుండి 312 గంటల వరకు ఉంటుంది.

ఈ క్రాష్ కోర్సులో భాగంగా 21 రోజులపాటు తరగతి గదుల్లో థియరీ శిక్షణతోపాటు దాదాపు ఆస్పత్రులు, ఆరోగ్యకేంద్రాలు, వైద్య పరీక్ష కేంద్రాలు, శాంపిల్స్ సేకరణ కేంద్రాల్లో దాదాపు 90 రోజులపాటు  శిక్షణ ఇస్తారు.  

హెల్త్కేర్కు సంబంధించిన పై ఆరు అంశాలలో నైపుణ్యతను మరింత పెంచడానికి వారం రోజుల బ్రిడ్జ్ కోర్సు కూడా ఉంటుంది.

ఇక లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ రవాణాకు సంబంధించి  డ్రైవర్లకు 217 గంటలు లేదా 27 రోజుల శిక్షణ ఉంటుంది. హెవీ మోటార్ వెహికిల్  లైసెన్స్ కలిగిన డ్రైవర్లతోపాటు లైట్ మోటార్ వెహికిల్ డ్రైవర్లకు కూడా అపాయకరమైన రసాయనాల రవాణాకు సంబంధించి శిక్షణ ఇవ్వడంతోపాటు  సురక్షిత డ్రైవింగ్పైనా దృష్టిపెట్టబడుతుంది.

ఈ క్రాష్ కోర్సు శిక్షణ కార్యక్రమం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.276 కోట్ల వ్యయం చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆస్పత్రులు, వైద్యశాలలు, నర్సింగ్ హోమ్లు, డయాగ్నొస్టిక్ కేంద్రాలను భాగస్వామ్యం చేసేలా మంత్రిత్వశాఖ అన్ని ప్రయత్నాలు చేస్తోంది.

 కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం రాజ్యసభకు ఈమేరకు లిఖితపూర్వక సమాచారం ఇచ్చారు. 

 

***

 



(Release ID: 1738399) Visitor Counter : 122


Read this release in: English , Urdu , Marathi , Bengali