సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించడానికి హనీ మిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన - కె.వి.ఐ.సి.

Posted On: 22 JUL 2021 1:18PM by PIB Hyderabad

హనీ మిషన్ కార్యక్రమాన్ని, ఎం.ఎస్‌.ఎం.ఈ. మంత్రిత్వ శాఖ పరిధిలోని, ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కె.వి.ఐ.సి) 2017-18 సంవత్సరంలో ప్రారంభించింది.  తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించడానికి, గ్రామీణ భారతదేశంలో, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన, మారుమూల ప్రాంతాల్లోని, రైతులు, ఆదివాసీలు, నిరుద్యోగ యువతకు నిరంతర స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.  ఈ కార్యక్రమం కింద, లబ్ధిదారులకు తేనెటీగలను పెంచుకోడానికి పెట్టెలు, సజీవ తేనెటీగలు, సాధన వస్తు సామాగ్రి తో పాటు తగిన శిక్షణ కూడా ఇస్తున్నారు.  ఈ కార్యక్రమం కింద, ఇంతవరకు, మొత్తం 15,445 మంది లబ్ధిదారులకు అవసరమైన సహాయాన్ని అందజేయడం జరిగింది. 

దీనితో పాటు, ఎం.ఎస్.ఎం.ఈ. మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న, ‘సాంప్రదాయ పరిశ్రమల పునరుత్పత్తి కోసం నిధుల పథకం’ (ఎస్.ఎఫ్.యు.ఆర్.టి.ఐ) కింద, సాంప్రదాయ తేనెటీగల పెంపకం దారులను సమూహాలుగా ఏర్పాటు చేసి, వారికి కొత్త యంత్రాలు, శిక్షణ వంటి సదుపాయాలు సమకూర్చడం ద్వారా వారికి స్థిరమైన ఉపాధి కల్పించడం జరుగుతోంది.   ఈ పధకం కింద, 13,388 తేనెటీగల పెంపకం దారులకు లబ్ధి చేకూరే విధంగా, 68.65 కోట్ల రూపాయల భారత ప్రభుత్వ ఆర్థిక సహాయంతో,  తేనెటీగల పెంపకం దారులకు చెందిన 29 సమూహాలను ఆమోదించడం  జరిగింది. 

వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ తేనెటీగల పెంపకం మరియు హనీ మిషన్ (ఎన్‌.బి.హెచ్‌.ఎం) పథకం కింద, ఈ రంగం సమగ్ర వృద్ధికి, శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించడం జరుగుతోంది. ఈ చర్య, వ్యవసాయ, వ్యవసాయేతర కుటుంబాలకు జీవనోపాధి సహాయం తో పాటు, ఆదాయం, ఉపాధి కల్పనకు దారితీస్తోంది. 

హనీ మిషన్ యొక్క మూల్యాంకనం / అంచనా అధ్యయనం చేసే పనిని, కె.వి.ఐ.సి.,  ముంబైలోని క్రిసిల్ (గతంలో - క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) సంస్థ కు కేటాయించింది.

నివేదిక లోని ముఖ్య సూచనలు, ఇతర అంశాలు ఈ విధంగా ఉన్నాయి:

i) అవసరానికి తగిన శిక్షణ, నైపుణ్యాభివృద్ధికి భరోసా; 

ii) ఆర్థిక సేవలు, రుణ సౌకర్యాలపై శిక్షణ,

iii) కాలానుగుణ నిర్వహణ మరియు వలసలపై అవసరమైన మద్దతును బలోపేతం చేయడం,

iv) నాణ్యతా ప్రమాణాల పై అవగాహన కల్పించడం; 

v) మార్కెట్ తో సంబంధాలను, బ్రాండింగ్‌ ను అధికారికం చేయడం; 

vi) ఎఫ్.పి.ఓ. ను పెంపొందించి, క్లస్టర్-ఆధారిత విధానం కోసం ఇప్పటికే ఉన్న పథకాలతో అనుసంధానం చేయడం. 

కె.వి.ఐ.సి. అమలుచేస్తున్న హనీ మిషన్ కార్యక్రమం కింద, 2021-22 ఆర్థిక సంవత్సరంలో బుందేల్‌ ఖండ్ ప్రాంతంలో 80 మంది తేనెటీగల పెంపకం దారులకు ప్రయోజనం చేకూర్చే విధంగా 08 స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడం జరిగింది.

కేంద్ర, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ నారాయణ్ రాణే ఈ రోజు లోక్‌-సభకు సమర్పించిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని పొందుపరిచారు. 

 

*****



(Release ID: 1738069) Visitor Counter : 339


Read this release in: English , Urdu , Punjabi