జల శక్తి మంత్రిత్వ శాఖ
22నెలల్లో 97లక్షల గ్రామీణ ఇళ్లకు కుళాయిల ద్వారా తాగునీరు!
ఐదు రాష్ట్రాల్లోని మెదడు వాపు వ్యాధి ప్రభావిత ప్రాంతాలకు ప్రయోజనం
మెదడువాపు వ్యాధి నిరోధక చర్యలను బలోపేతం చేయడంలో జలజీవన్ మిషన్ గణనీయ పాత్ర
2021-22లో 5 రాష్ట్రాలకు రూ. 463కోట్ల కేటాయింపు
Posted On:
10 JUL 2021 2:35PM by PIB Hyderabad
మెదడు వాపు వ్యాధితోను, తీవ్రమైన మెదడువాపు వ్యాధితోను ప్రభావితమైన ప్రాంతాలకు అతి స్వల్ప వ్యవధిలోనే కుళాయిల ద్వారా శుద్ధమైన తాగునీటిని అందించాలన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపును సాకారం చేసేందుకు జలజీవన్ మిషన్ పథకం కింద భారీ స్థాయిలో కృషి జరిగింది. మెదడువాపు వ్యాధి సోకిన 61 బాధిత జిల్లాల్లోని 97లక్షలకు పైగా ఇళ్లకు కేవలం 22నెలల్లోనే ప్రాధాన్యతా ప్రాతిపదికపై కుళాయిల ద్వారా తాగునీటిని అందించారు. మెదడు వాపు వ్యాధి వ్యాప్తిని కట్టడి చేసేందుకు తీసుకునే నివారణ చర్యలను జలజీవన్ మిషన్ గణనీయంగా బలోపేతం చేసింది. అస్సాం, బీహార్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని ఆర్థికంగా వెనుకబడిన పేదల ఇళ్లకు శుద్ధమైన తాగునీటిని అందించడంలో జలజీవన్ మిషన్ కీలకపాత్ర పోషించింది.
2019వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ, జలజీవన్ మిషన్ పథకాన్ని ప్రకటించే సమయానికి మెదడు వాపు వ్యాధి ప్రభావితమైన ఐదు రాష్ట్రాల్లోని 61 జిల్లాల్లో కేవలం 8.02లక్షల ఇళ్లకే (అంటే 2.67శాతం ఇళ్లకే) నీటి కుళాయిల ద్వారా మంచినీటి సరఫరా అందుబాటులో ఉండేది. గత 22 నెలల్లో ఈ జిల్లాల్లో అదనంగా 97.41లక్షల ఇళ్లకు నీటి కుళాయిలను ఏర్పాటు చేశారు. ఇపుడు,..మెదడు వాపు సంక్రమిత ప్రాంతాల్లోని కోటీ 5లక్షల ఇళ్లకు (అంటే 35శాతం ఇళ్లకు) నీటి కుళాయిల ఏర్పాటుకు హామీ లభించింది. దీనితో నీటి కుళాయిల కనెక్షన్ల ఏర్పాటులో 32శాతం వృద్ధి నమోదైంది. ఇది జాతీయ సగటు వృద్ధి కంటే దాదాపు 12శాతం ఎక్కువ. అదే కాలంలో దేశవ్యాప్తంగా నీటి కుళాయిల కనెక్షన్ల వృద్ధి 23.43శాతంగా నమోదైంది.
మెదడు వాపు సంక్రమిత జిల్లాల్లో ప్రాధాన్యతా ప్రాతిపదికన నీటి కుళాయిల ఏర్పాటుకు సంబంధించి ప్రత్యేక నిధులను కూడా కేటాయించారు. ఆయా ప్రాంతాల్లో తాగునీటి వనరుల లభ్యత, నీటి కాలుష్యం స్థాయి వంటి అంశాల ప్రాతిపదికగా ఈ ప్రత్యేక నిధుల కేటాయింపు జరిగింది. మెదడు వాపు వ్యాధి సంక్రమిత జల్లాల పరిధిలో ఉన్న ప్రతి గ్రామీణ ఇంటికీ శుద్ధమైన తాగునీటిని అందించేందుకు జలజీవన్ మిషన్ కింద 0.5శాతం బడ్జెట్ ను కేటాయించారు. 2021-22 సంవత్సరానికి గాను ఈ ఐదు బాధిత రాష్ట్రాలకు రూ. 462.81కోట్ల కేటాయింపు జరిగింది.
మెదడువాపు వ్యాధి, తీవ్రమైన మెదడు వాపు వ్యాధి అనేవి చాలా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు.. బాలలకు, కిశోర ప్రాయంలో అడుగిడిన వారికి ఇది ఎక్కువగా సంక్రమిస్తుంది. ఇది దీర్ఘకాలిక వ్యాధిగా కూడా పరిణమించవచ్చు. లేదా చివరకు మరణానికి కూడా దారితీయవచ్చు. ఆర్థికంగా బలహీనులైన పేద వర్గాలకు చెందిన,. పౌష్టికాహారం సరిగా అందని చిన్నారులకు ఈ వ్యాధి ప్రధానంగా సంక్రమిస్తుంది. ఈ వ్యాధిని కట్టడి చేయడానికి, తగిన వ్యాధినిరోధక చర్యలను తీసుకోవడానికి ఐదు రాష్ట్రాల్లోని 61 సంక్రమిత జిల్లాలను గుర్తించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సారథ్యంలో, ఐదు మంత్రిత్వ శాఖల ద్వారా వ్యాధి నిరోధక చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ జిల్లాల్లో వ్యాధి వ్యాప్తిని తగ్గించేందుకు కీలక ప్రాజెక్టు కింద జలజీవన్ మిషన్ పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది.
‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ నినాదంతో ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపును స్ఫూర్తిగా తీసుకుని జలజీవన్ మిషన్ ముందుకు సాగింది. ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా మంచినీటిని సరఫరా చేయాలన్న లక్ష్యం సాధించడంలో ‘ఎవ్వరికీ మినహాయింపు ఉండరాదు’ అన్న సూత్రాన్ని అమలు చేసింది. 2019వ సంవత్సరంలో జలజీవన్ మిషన్ కార్యక్రమం మొదలయ్యేనాటికి దేశంలోని 18.95కోట్ల మంది గ్రామీణ జనాభాలో 3.23కోట్ల మందికి మాత్రమే కుళాయిల ద్వారా నీరు అందుబాటులో ఉంది. అయితే, గత 22 నెలల వ్యవధిలో కోవిడ్ వైరస్ మహమ్మారి సంక్షోభం, లాక్ డౌన్ ఆంక్షలు తలెత్తినప్పటికీ, జలజీవన్ మిషన్ పనులు మాత్రం వేగంగానే సాగాయి. జలజీవన్ మిషన్ పనుల అమలుతో 4.44కోట్ల ఇళ్లకు శుద్ధమైన తాగునీటి అందించే కుళాయిలను అమర్చగలికారు. నీటి సరఫరా కుళాయిల ఏర్పాటులో 23శాతం వృద్ధి నమోదైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని 7.67కోట్ల ఇళ్లకు (అంటే 40.31శాతం ఇళ్లకు) కుళాయిల ద్వారా తాగునీరు అందుతోంది. గోవా, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరిల గ్రామీణ ప్రాంతాల్లో వందశాతం కనెక్షన్లు అందించారు. ‘ప్రతి ఇంటికీ నీరు’ అన్న లక్ష్యం ఇలా సాకారమైంది. ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా నీటిని అందించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతను సాకారం చేసేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తూ, ప్రస్తుతానికి 69 జిల్లాలు, 98వేలకు పైగా గ్రామాల్లో ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయిలను అమర్చారు.
ఇక, మెదడువాపు వ్యాధి ప్రభావం ఉన్న జిల్లాలు, ఎస్.సి., ఎస్.టి. జనాభా ప్రాబల్యం కలిగిన గ్రామాలు, నీటి నాణ్యత సరిగా లేని ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ ప్రాధాన్యతా ప్రాతిపదికన నీటి కుళాయిలను వచ్చే కొన్ని నెలల్లోనే ఏర్పాటు చేయాలన్న ప్రధానమంత్రి పిలుపును పునరుద్ఘాటిస్తూ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆయా రాష్ట్రాలకు లేఖలు రాస్తూనే ఉన్నారు. అస్సాం, బీహార్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు కేంద్రమంత్రి ఈ లేఖలు రాశారు. ఈ ఐదు రాష్ట్రాల్లో, గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు కుళాయిల ద్వారా నీటిని అందించడంలో బీహార్ రాష్ట్రం చక్కని పనితీరు ప్రదర్శించింది. ప్రాధాన్యతా ప్రాంతాలుగా పేర్కొన్న, మెదడు వాపు వ్యాధి ప్రభావితమైన 15 జిల్లాల్లో ఈ పథకం అమలు చేయడంలో బీహార్ మంచి పనితీరు చూపింది. బీహార్ లోని వ్యాధి ప్రభావిత జిల్లాల్లో సగటున 85.53శాతం నీటి కనెక్షన్లు ఏర్పాటు చేయగలిగారు. నలందా జిల్లా 96శాతం లక్ష్యాన్ని సాధించగా, సరాన్, గోపాల్ గంజ్ 94శాతం, వైశాలి, శివన్ 91శాతం, పశ్చిమ చంపారాన్ 84శాతం, తూర్పు చంపారాన్ 80శాతం ఫలితాలు సాధించాయి.
దేశంలోని పాఠశాలలు, ఆశ్రమశాలలు, అంగన్ వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు సురక్షితమైన తాగునీరు అందేలా చూసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వందరోజుల అవగాహనా కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గత ఏడాది అక్టోబరు రెండవ తేదీన గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించారు. దీనితో హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, గోవా, తమిళనాడు, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు వెంటనే ఈ కార్యక్రమాన్ని అందిపుచ్చుకున్నాయి. పాఠశాలలు, ఆశ్రమ శాలలు, అంగన్ వాడీ కేంద్రాల్లో కుళాయిల ద్వారా తాగునీటి సరఫరాకు తగిన చర్యలు తీసుకున్నాయి. ఇక, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మాత్రం కుళాయిల ద్వారా నీటి సరఫరా ఏర్పాటు జాతీయ సగటుకంటే తక్కువ స్థాయిలో ఉంది. అస్సాంలో 30శాతం పాఠశాలలకు, 8శాతం అంగన్ వాడీ కేంద్రాలకు, పశ్చిమ బెంగాల్ లో 14శాతం పాఠశాలలకు, 7శాతం అంగన్ వాడీ కేంద్రాలకు మాత్రమే కుళాయిల కనెక్షన్లు అందుబాటులోకి వచ్చాయి. జాతీయ సగటు లెక్కల ప్రకారం అయితే, 65శాతం పాఠశాలలకు, 60శాతం అంగన్ వాడీ కేంద్రాలకు కుళాయిల ద్వారా నీరు అందుబాటులోకి వచ్చింది. కాగా, మిగిలిన అన్ని పాఠశాలలకు, ఆశ్రమశాలలకు, అంగన్ వాడీ కేంద్రాలకు రాబోయే కొన్ని నెలల్లోనే ప్రాధాన్యతా ప్రాతిపదికన సురక్షితమైన తాగునీటిని అందించాలని కోరుతూ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆయా రాష్ట్రాలను కోరారు. ఈ మేరకు అస్సాం, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన లేఖలు రాశారు.
దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఇంటికీ 2024వ సంవత్సరానికల్లా కుళాయిల ద్వారా నీటి సరఫరా అందించాలన్న లక్ష్యంతో జలజీవన్ మిషన్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 ఆగస్టు 15న ఢిల్లీలోని ఎర్రకోట బురుజునుంచి ప్రకటించారు. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల భాగస్వామ్యంతో కేంద్రం ఈ పథకాన్ని అమలు జరుపుతూ వస్తోంది. జలజీవన్ మిషన్ కోసం 2021-22సంవత్సరపు బడ్జెట్లో రూ. 50,011కోట్ల మొత్తాన్ని ప్రకటించారు. రాష్ట్రాల సొంత వనరులు, గ్రామీణ స్థానిక పరిపాలనా సంస్థలు, పంచాయతీ రాజ్ సంస్థల్లో నీటి సరఫరా, పారిశుద్ధ్య కార్యక్రమాలకు సంబంధించి, 15వ ఆర్థిక సంఘంతో అనుబంధంగా ఉన్న రూ. 26,940కోట్ల రూపాయల గ్రాంటుతో కలిపితే మొత్తం లక్షకోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని ఈ ఏడాది గ్రామీణ నీటి సరఫరా రంగానికి ఖర్చు చేస్తున్నారు. గ్రామాల్లో ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటుగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతోంది.
*****
(Release ID: 1734566)
Visitor Counter : 204