సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో శ్రీ‌కాకుళం జిల్లాలో 2206 మంది దివ్యాంగులు, 432 మంది వ‌యో వృద్ధుల‌కు స‌హాయ ప‌రిక‌రాలు ఉచితంగా అందించే శిబిరాన్ని వ‌ర్చువ‌ల్ గా ప్రారంభించిన కేంద్ర సామాజిక న్యాయం, సాధికార‌త మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ తావ‌ర్ చంద్ గెహ్లాట్

నాడు పోస్టు చేయడమైనది: 06 JUL 2021 7:39PM by PIB Hyderabad

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని శ్రీ‌కాకుళంలో ఆనంద‌మ‌యి ఆడిటోరియంలో “దివ్యాంగ జ‌నుల‌కు” ఎడిఐపి ప‌థ‌కం కింద, వ‌యోవృద్ధుల‌కు “రాష్ర్టీయ వ‌యోశ్రీ యోజ‌న”  (ఆర్ వివై ప‌థ‌కం)   కింద  ఉచిత స‌హాయ సామ‌గ్రి స‌ర‌ఫ‌రా కోసం “సామాజిక అధికారిత శిబిరాన్ని” అలింకో, జిల్లా యంత్రాంగం స‌హ‌కారంతో దివ్యాంగుల సాధికార‌త శాఖ (డిఇపిడ‌బ్ల్యుడి) నిర్వ‌హించింది.

కేంద్ర సామాజిక న్యాయం, సాధికార‌త మంత్రి డాక్ట‌ర్ తావ‌ర్ చంద్ గెహ్లాట్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ శిబిరాన్ని వ‌ర్చువ‌ల్ గా ప్రారంభించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ఉప‌ముఖ్య‌మంత్రి, రెవిన్యూ, రిజిస్ర్టేష‌న్ స్టాంపుల శాఖ మంత్రి శ్రీ ధ‌ర్మాన కృష్ణ దాస్, శ్రీ‌కాకుళం పార్ల‌మెంటు స‌భ్యుడు శ్రీ రామ్ మోహ‌న్ నాయుడు కింజ‌రాపు ఈ స‌మావేశంలో ప్ర‌త్య‌క్షంగా పాల్గొన్నారు.

కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఎస్ఓపిల‌ను పాటిస్తూ బ్లాక్‌, పంచాయ‌తీ స్థాయిల్లో 2206 మంది దివ్యాంగ‌జ‌నులు, 432 మంది వ‌యోవృద్ధుల‌కు రూ.2.90 కోట్ల విలువ గ‌ల 4874 స‌హాయ ప‌రిక‌రాల‌ను ఉచితంగా పంపిణీ చేయ‌నున్నారు.

ప్ర‌ధాన‌మంత్రి నాయ‌క‌త్వంలో కేంద్ర ప్ర‌భుత్వం “స‌బ్ కా సాత్ స‌బ్ కా వికాస్” స్ఫూర్తితో గ‌త కొన్నేళ్లుగా దివ్యాంగ జ‌నులు, వ‌యో వృద్ధుల సంక్షేమానికి అసాధార‌ణ‌మైన కృషి చేసిన‌ట్టు ప్రారంభోప‌న్యాసంలో మాట్లాడుతూ శ్రీ తావ‌ర్ చంద్ గెహ్లాట్ చెప్పారు. ఇందు కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చేప‌ట్టిన కృషి గురించి మాట్లాడుతూ స్కాల‌ర్ షిప్ కార్య‌క్ర‌మం కింద ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు కేంద్ర‌ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన‌ రూ.29.68 కోట్ల నిధుల‌తో 1755 మంది దివ్యాంగ జ‌నుల‌కు ల‌బ్ధి చేకూరింద‌న్నారు. అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని 9 జిల్లాల్లో న‌డుస్తున్న‌ దివ్యాంగ పున‌రావాస కేంద్రాల‌కు రూ.1.59 కోట్లు విడుద‌ల చేసిన‌ట్టు చెప్పారు. పిడ‌బ్ల్యుడిల‌కు సంబంధించిన డేటా బేస్ సిద్ధం చేయ‌డం కోసం వైక‌ల్యాల‌తో బాధ ప‌డుతున్న వ్య‌క్తుల “ప్ర‌త్యేక‌ ఐడి ప్రాజెక్టు” అమ‌లు ప‌రుస్తున్నామ‌ని, వివిధ ర‌కాల వైక‌ల్యాల‌తో బాధ ప‌డుతున్న వారికి ఈ ప్ర‌త్యేక గుర్తింపు కార్డులు జారీ చేస్తామ‌ని తెలియ‌చేస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి 11.11 ల‌క్ష‌ల యుడిఐడి కార్డులు జారీ చేశామ‌ని వెల్ల‌డించారు. యాక్సెసిబుల్ ఇండియా కార్య‌క్ర‌మం కింద వివిధ ర‌కాల వైక‌ల్యాల‌తో బాధ ప‌డే వారికి సౌక‌ర్యవంత‌మైన వాతావ‌ర‌ణ క‌ల్ప‌న‌కు 35 అంత‌ర్జాతీయ, 55 జాతీయ విమానాశ్ర‌యాలు;  709 రైల్వే స్టేష‌న్లు, 10175 బ‌స్ టెర్మిన‌ల్స్, 683 వెబ్ సైట్లు సిద్ధం చేసిన‌ట్టు తెలియ‌చేశారు. 10 వేల ప‌దాల‌తో భార‌త సంజ్ఞా లిపి నిఘంటువును ఆవిష్క‌రించామ‌ని, మాన‌సిక ఆరోగ్య పున‌రావాసం కోసం 13 భాష‌ల్లో వారంలో 7 రోజులు 24 గంట‌లూ ప‌ని చేసే  (24x7) హెల్ప్ లైన్ ను ప్రారంభించామ‌ని చెప్పారు.

ఈ శిబిరాన్ని నిర్వ‌హించినందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ఉప ముఖ్య‌మంత్రి శ్రీ ధ‌ర్మాన కృష్ణ‌దాస్ కేంద్ర‌ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు తెల‌ప‌డంతో పాటు దివ్యాంగ జ‌నుల సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు ప‌రుస్తున్నందుకు జిల్లా యంత్రాంగాన్ని, కార్య‌క్ర‌మ నిర్వాహ‌కుల‌ను ప్ర‌శంసించారు.

ప్ర‌స్తుత కోవిడ్‌-19 నేప‌థ్యంలో ముంద‌స్తుగా గుర్తించిన 2638 మంది ల‌బ్ధిదారుల్లో సుమారు 50 మంది ల‌బ్ధిదారుల‌కు అతిథుల స‌మ‌క్షంలో ప్ర‌ధాన కార్య‌క్ర‌మం జ‌రుగుతున్న వేదిక‌పై స‌హాయ ప‌రిక‌రాలు అందించారు. మిగ‌తా ల‌బ్ధిదారుల‌కు స‌మీపంలోని బ్లాక్ ప్ర‌ధాన కేంద్రంలో  పంపిణీ శిబిరాలు నిర్వ‌హించి ప‌రిక‌రాలు పంపిణీ చేస్తారు.

ఈ శిబిరంలో పంపిణీ చేయ‌నున్న అధిక సాంకేతిక ప‌రిజ్ఞానం గ‌ల వ‌స్తువుల్లో ఎఐడిపి స్కీమ్ కింద కీళ్ల సంబంధిత వ్యాధుల కార‌ణంగా అంగ‌విక‌లురైన వారిలో అర్హుల‌కు బ్యాట‌రీతో ప‌ని చేసే 255 మోటార్ త్రిచ‌క్ర‌వాహ‌నాలున్నాయి. ఒక్కో మోటారు ట్రైసికిల్ విలువ రూ.37,000 కాగా ఎఐడిపి కింద ల‌బ్ధిదారుల‌కు రూ.25,000 స‌బ్సిడీ ఇస్తున్నారు లేదా రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ ఎంపిలాడ్ నిధులతో స్పాన్స‌ర్ చేయ‌డం లేదా విరాళంగా ఇవ్వ‌డం జ‌రుగుతుంది.

శ్రీ‌కాకుళం పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గంలో ఈ శిబిరం కింద పంపిణీ చేస్తున్న 225 మోటార్ ట్రైసికిల్స్ కు అయ్యే రూ.30,60,000 నిధుల‌ను (ఒక్కో ట్రైసికిల్ కు రూ.12,000)  శ్రీ‌కాకుళం పార్ల‌మెంటు స‌భ్యుడు శ్రీ రామ మోహ‌న నాయుడు కింజ‌రాపు చేతిలోని ఎంపి లాడ్ నిధుల నుంచి అందిస్తున్నారు.

గుర్తింపు పొందిన ల‌బ్ధిదారుల‌కు బ్లాక్ స్థాయిలో నిర్వ‌హించే శిబిరాల్లో అందించ‌నున్న స‌హాయ ప‌రిక‌రాల్లో 225 మోటార్ ట్రైసికిళ్లు, 526 ట్రైసికిళ్లు, 690 ఫోల్డింగ్ వీల్ చెయిర్లు, 30 సిపి చెయిర్లు, 726 క్ర‌చ్ లు, 484 వాకింగ్ స్టిక్ లు, 78 స్మార్ట్ కేన్ లు, 12 స్మార్ట్ ఫోన్లు, 20 బ్రెయిలీ కిట్లు, 96 బ్రెయిలీ కేన్లు, 4 బ్రెయిలీ ప‌ల‌క‌లు, 88 రొలేట‌ర్లు, 48 వాక‌ర్లు, 2 టెట్రాపాడ్ లు, 11 ఎడిఎల్ కిట్లు, 11 సెల్ ఫోన్లు, 1486 బిటిఇలు (వినికిడి యంత్రాలు), 192 ఎంఎస్ఐఇడి కిట్లు, 115 ప్రోస్థెసిస్ లు మ‌రియు కాలిప‌ర్లు ఉన్నాయి.

కేంద్ర‌ప్ర‌భుత్వ నిర్వ‌హ‌ణ‌లోని దివ్యాంగ జ‌నుల స‌హాయ ప‌థ‌కం (ఎడిఐపి) కింద దివ్యాంగ జ‌నుల‌కు, రాష్ర్టీయ వ‌యోశ్రీ యోజ‌న (ఆర్ వివై) కింద వ‌యోవృద్ధుల‌కు స‌హాయ ప‌రిక‌రాలు పంపిణీ చేసే ఈ శిబిరాన్ని కేంద్ర సామాజిక న్యాయం, సాధికార‌త మంత్రిత్వ శాఖ నిర్వ‌హ‌ణ‌లోని  కృత్రిమ అవ‌య‌వాల త‌యారీ కార్పొరేష‌న్ (అలింకో), రాష్ట్ర స్థాయి లేదా జిల్లా స్థాయి అధికారుల స‌హ‌కారంతో నిర్వ‌హించింది.


(రిలీజ్ ఐడి: 1733277) సందర్శకుల సూచీ సంఖ్య : : 234
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil