ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కో-విన్ ప్రపంచ సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన డాక్టర్ హర్షవర్ధన్
భారతదేశ ప్రాచీన సిద్ధాంతం “వసుధైవ కుటుంబకం” : ప్రపంచం యావత్తు ఒక కుటుంబం సూత్రం పట్ల విశ్వాసం పునరుద్ధరణ
“మా డిజిటల్ కార్యక్రమంలో కలికి తురాయి కో-విన్”
“పారదర్శకమైన ఈ వ్యవస్థ వ్యాక్సిన్ అందరికీ సమానంగా అందుబాటులో ఉండేందుకు సహాయపడడంతో పాటు ప్రతీ ఒక్క వ్యాక్సిన్ డోస్ ను ట్రాక్ చేయడానికి, వ్యాక్సినేషన్ కేంద్రాల్లో సరఫరాలను పర్యవేక్షించడానికి సహాయకారిగా ఉంది”.
“జనాభాలో వయోజనులందరికీ 2021 డిసెంబర్ నాటికి టీకా వేయించేందుకు మేం కట్టుబడి ఉన్నాం”
Posted On:
05 JUL 2021 5:18PM by PIB Hyderabad
ప్రపంచ కో-విన్ సదస్సును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ కో-విన్ ప్రపంచ సదస్సు ప్రారంభ కార్యక్రమాన్ని ఉద్దేశించి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.. ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, గుయానా, ఆంటిగ్వా & బర్బుడా, సెయింట్ కిట్స్ & నెవిస్, జాంబియా దేశాలు సహా మొత్తం 142 దేశాలకు చెందిన అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ప్రజోపయోగం కోసం ప్రపంచం మొత్తానికి కో-విన్ విస్తరించే లక్ష్యంతో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎంఓహెచ్ఎఫ్ డబ్ల్యు), విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఇఏ), జాతీయ ఆరోగ్య సంస్థ (ఎన్ హెచ్ఏ) ఈ సదస్సును ఉమ్మడిగా నిర్వహించాయి. మహమ్మారిని ఒక క్రమబద్ధమైన విధానంలో ఢీకొని, పోరాడి, అదుపులోకి తెచ్చేందుకు భారత ప్రజారోగ్య వ్యవస్థకు కో-విన్ చక్కని మార్గదర్శకం అందించింది. కరోనా టీకాలను పరస్పరం మార్పిడి చేసుకోవడం, నల్లబజారు విక్రయం, ఇతరత్రా దుర్వినియోగాలకు పాల్పడడాన్ని ఈ శక్తివంతమైన వ్యవస్థ సమర్థవంతంగా నివారించింది.
సదస్సులో కేంద్ర ఆరోగ్య మంత్రి ప్రసంగం :
చారిత్రకమైన కో-విన్ ప్రపంచ సదస్సుకు మీ అందర్నీ ఆహ్వానించడం నాకు చాలా ఆనందంగా ఉంది. 142 దేశాలు, భారత్లోని 20 రాయబార కార్యాలయాలు, ఐక్యరాజ్యసమితి కార్యాలయాల నుంచి 400 మంది విశిష్ట ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సును ఉద్దేశించి ప్రసంగించడం ప్రత్యేక గౌరవంగా భావిస్తున్నాను. ఈ విశిష్ట భాగస్వాముల్లో ప్రపంచంలోని భిన్న దేశాల మంత్రులు, ఆరోగ్య శాఖ అధికారులు, నిపుణులు ఉండడం మరింత ఆనందంగా ఉంది.
మా ప్రాచీన సిద్ధాంతం “వసుధైవ కుటుంబకం” అంటే ప్రపంచం అంతా ఒకే కుటుంబం సూక్తికి భారత్ ఎప్పుడూ కట్టుబడి ఉంది. దానికి ఈ ప్రపంచ సదస్సు ఒక సజీవ ఉదాహరణ.
దేశీయంగా అభివృద్ధి చేసిన, ప్రపంచంలోనే అతి పెద్దదైన భారతదేశ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి వెన్నెముకగా నిలిచిన కొత్త తరానికి చెందిన విప్లవాత్మక డిజిటల్ వేదిక “కో-విన్”ను ప్రపంచం యావత్తుకు అందించడం నా ప్రభుత్వానికి మరింత ఆనందంగా ఉంది.
మా డిజిటల్ ఇండియా కార్యక్రమం ఇటీవలే ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీజీ మానస పుత్రిక అయిన ఈ కార్యక్రమం కింద చేపట్టిన వివిధ అంశాలు 130 కోట్ల మంది భారతీయ ప్రజల జీవితాల్లో సంపూర్ణ పరివర్తన తెచ్చాయి. సంక్షేమ పథకాలు, సేవలను ప్రజలకు మరింత మెరుగ్గా చేరువ చేయడంతో పాటు లీకేజిలను అరికట్టి ప్రతీ ఒక్కరికీ వాటిని సమానంగా అవి సమానంగా అందేలా చేశాయి. టెక్నాలజీ సహాయంతో భారీ విజయం నమోదు చేసిన వాటిలో ఫైనాన్షియల్ ఇంక్లూజన్, ఇన్నోవేషన్ & ఎంటర్ప్రెన్యూర్ షిప్, ఇ-లెర్నింగ్, అందరికీ ఆరోగ్యం ఉన్నాయి.
మా డిజిటల్ ఇండియా కార్యక్రమానికే కో-విన్ కలికి తురాయి అన్నది నా భావన. ప్రపంచంలోనే అతి పెద్ద జనాభా గల దేశాల్లో ఒకటైన భారతదేశంలో అధిక శాతం మందికి అత్యంత సునాయాసంగా టీకాలు వేయించడంలో విజయం సాధించిన వేదికగా ఇది చరిత్ర పుట్లో నిలిచిపోతుంది. దీనికి లభించిన ప్రశంసలు ప్రపంచంలో దీని విజయానికి దోహదపడడంతో పాటు కొన్ని భాగస్వామ్య దేశాలు మా సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలు, అనుభవం తమకు కూడా పంచాలని కోరడం నా విశ్వాసం మరింత బలీయంగా పాదుకోవడానికి కారణమయింది.
మహమ్మారిపై ఎలా పోరాటం సాగించాలన్నదే సుమారు ఏడాదిన్నర కాలం పైబడి ప్రపంచంలోని దేశాలన్నింటి ప్రధాన అజెండా. మానవాళి చరిత్రలో ప్రజారోగ్య వ్యవస్థను తీవ్ర సంక్షోభంలోకి నెటి్ట అత్యంత సవాలు విసిరిన మహమ్మారి ఇదే. కోవిడ్-19 కోట్లాది మందికి వ్యాపించడంతో పాటు పలువురి జీవనోపాధిపై వినాశకరమైన ప్రభావం చూపింది.
ఈ మహమ్మారికి చెందిన దట్టమైన మేఘాలు ప్రపంచం యావత్తును ఆవరించిన వేళ ప్రపంచ దేశాల మధ్య ఏర్పడిన సంఘీభావం, దేశాల మధ్య పెరిగిన సహకారం ఒక ఆశాకిరణంగా నిలిచాయి. ఇంత విస్తృత స్థాయి సహకార భాగస్వామ్యాలు గతంలో ఎన్నడూ కనివిని ఎరుగనివి. కోవిడ్-19 కారణంగా తప్పనిసరి లాక్ డౌన్లు, నిర్బంధ భౌతిక దూరం పాటించడం తప్పనిసరిగా మారిన వేళ ఈ అసాధారణ సవాలును దీటుగా అధిగమించేందుకు మానవాళి యావత్తు సన్నిహితంగా కలిసి పని చేసింది.
ఈ మహమ్మారి సమయం అంతా ప్రపంచంలో దాని వల్ల ఏర్పడుతున్న వాతావరణాన్ని నిశితంగా గమనిస్తూనే శాస్ర్తీయ ఆధారాలు, ఉత్తమ ఆచరణలు కరదీపికగా కోవిడ్-19ని అదుపు చేసే వ్యూహాలు నిరంతరం రూపొందిస్తూ వాటికి అవసరమైన సవరణలు చేస్తూ వస్తున్నాం. టెక్నాలజీ వెన్నెముకగా అతి విస్తృత నిఘా పాటించడం ద్వారా టెస్ట్, ట్రాక్ అండ్ ట్రీట్ వ్యూహం సమర్థవంతంగా అమలుచేయడమే కాకుండా మరణాల రేటు ప్రపంచంలోనే తక్కువగా ఉండేలా చేయగలిగాం.
ఈ సమయం అంతా మా శాస్త్రవేత్తలు మెరుపు వేగంతో పని చేస్తూ రికార్డు సమయంలోనే రెండు కోవిడ్-19 వ్యాక్సిన్లు అందుబాటులోకి తేవడం ద్వారా జనవరి మధ్యలోనే మేం వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టేందుకు దోహదపడ్డారు.
ఇది ఒక అసాధారణ విజయమే అయినప్పటికీ మా ముందుకు వచ్చిన సవాలు అదొక్కటే కాదు. 130 కోట్లకు పైబడిన జనాభా గల దేశంలో వ్యాక్సిన్లు అందరికీ సమానంగా, చివరి వ్యక్తికి కూడా అందుబాటులో ఉండేలా చూడడం అన్నింటి కన్నా పెద్ద సవాలు.
వాస్తవానికి ఈ పెను సవాలు రావడం కన్నా ఎంతో ముందుగానే భారతదేశం ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు సహా మొత్తం ఆరోగ్య మౌలిక వ్యవస్థ అంతా చురుకైన భాగస్వామి కావలసిన అవసరం ఏర్పడింది. వ్యాక్సిన్ల మార్పిడి, బ్లాక్ మార్కెటింగ్, ఇతర దుర్వినియోగాలను అరికట్టేందుకు శక్తివంతమైన వ్యవస్థ ఒకటి సిద్ధం చేయాల్సి వచ్చింది. ఈ వ్యవస్థ గనుక ఏర్పాటు కాకపోయి ఉంటే మొత్తం వ్యాక్సినేషన్ కార్యక్రమం విఫలమై ఉండేది.
ఈ సవాళ్లను ముందుగానే పరిశీలనలోకి తీసుకుని వ్యాక్సినేషన్ కార్యక్రమం సమర్థవంతంగా ప్లాన్ చేయడానికి, అమలు చేయడానికి ఆయా రంగాల నిపుణుల భాగస్వామ్యంలో సాధికార బృందాలు ఏర్పాటు చేశాం.
అందుబాటులో ఉన్న డేటాలో అసమానతలు తొలగించి భాగస్వామ్య పక్షాలన్నింటినీ సమీకృతం చేయడం, అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వ్యాక్సిన్ సమానంగా అందేలా చేయడం కోసం ఈ కార్యక్రమం అంతటికీ వెన్నెముకగా నిలిచే ఒక సమగ్ర ప్లాట్ ఫారం ఏర్పాటు తప్పనిసరి అయింది. అలాగే టీకా కార్యక్రమంలో ప్రతికూల సంఘటనలు నిరంతరం ట్రాకింగ్ చేస్తూ వాటిని అధిగమించడం ద్వారా అందులో చిక్కుకున్న పౌరులకు సహాయం అందించవలసివచ్చింది. అలాగే చక్కని విధానాల రూపకల్పనకు డేటా సిద్దం చేసుకోవలసి వచ్చింది.
ఇంత విస్తారమైన వ్యవస్థ తేలిగ్గా ఉపయోగించగలిగేదిగా ఉంచడంతో పాటు బహుళ భాషల్లో దాన్ని సిద్ధం చేయాల్సివచ్చింది.
ఇంత భారీ అజెండా సిద్ధం కావడంతో నా పర్యవేక్షణలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు ఎలక్ర్టానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులు కలిసి ఇతర భాగస్వాముల సహకారంతో కో-విన్ పోర్టల్ ను అభివృద్ధి చేశారు. దీంతో కోవిడ్-19 వ్యాక్సినేషన్ పరిణామక్రమం ప్లానింగ్, అమలు, పర్యేవేక్షణ, మదింపు చేయగల ఒక శక్తివంతమైన వ్యవస్థ ఆవిర్భవించింది.
పౌరుల రిజిస్ర్టేషన్, అపాయింట్ మెంట్ షెడ్యూలింగ్, వ్యాక్సినేషన్, సర్టిఫికెట్ల జారీ అన్నింటికీ కో-విన్ వెన్నెముకగా నిలిచిందని నేను ఈ రోజు గర్వంగా చెబుతున్నాను. పారదర్శకమైన ఈ వ్యవస్థ వ్యాక్సిన్ ప్రతీ ఒక్క డోసు ఎవరికి చేరుతోంది, వ్యాక్సినేషన్ కేంద్రాల్లో సరఫరాలు ఎలా ఉన్నాయి, సూక్ష్మస్థాయిలో డిమాండు ఎలా ఉంది అనే అంశాలన్నీ ట్రాక్ చేసుకోవడానికి సహాయకారిగా నిలిచింది.
మొత్తం మీద భారత్ 36 కోట్ల వ్యాక్సిన్ డోస్ లు అందించేందుకు భారత్ చేరువ అవుతోంది. వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించిన ఆరు నెలల కన్నా తక్కువ కాలంలోనే ఈ విజయం మేం సాధించాం. 2021 డిసెంబర్ నాటికి దేశంలోని వయోజన జనాభా అందరికీ టీకాలు వేయాలన్న దృఢనిశ్చయానికి మేం కట్టుబడి ఉన్నాం.
ఈ మహమ్మారి సమయంలో ఏర్పడిన ఈ భాగస్వామ్య స్ఫూర్తి అతి పెద్ద పాఠం. భాగస్వామ్య చర్యలు, వనరుల ద్వారా మాత్రమే ప్రస్తుత ప్రజారోగ్య భాగస్వామ్య సవాలును దీటుగా ఎదుర్కొనగలుగుతాం.
మహమ్మారిని దీటుగా నిలువరించబడానికి, అంతం చేయడానికి ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వడం ఒక్కటే మార్గం. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ వేగం పెంచడం అత్యంత కీలకం. ప్రపంచవ్యాప్తంగా ప్రజా సంక్షేమానికి సమర్థవంతమైన టెక్నాలజీ వేదికగా కో-విన్ అందించడం మాకు ఆనందదాయకం. మీ దేశాలన్నీసంఘీభావంతో దీని విలువను పెంచి ప్రయోజనం పొందుతాయని నేను విశ్వసిస్తున్నాను.
మా డిజిటల్ ఇండియా కార్యక్రమం విజయానికి దర్పణం పట్టే వేదిక కో-విన్. ఇది నిలకడగా వృద్ధి చెందుతూ ఎన్నో మైలురాళ్లను సాధించింది.
మా జాతీయ డిజిటల్ ఆరోగ్య కార్యక్రమం మరెన్నో సర్వీసులు అందించేందుకు సహాయపడుతుంది. ఈ ఎన్ డిహెచ్ఎం రోగులు తమ ఆరోగ్య రికార్డులు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోగల సదుపాయంతో సహా అన్ని రకాల డేటా బేస్ ని అందుబాటులో ఉంచుతుంది.
వర్థమాన ఆర్థిక వ్యవస్థల్లో కొత్త సవాళ్లతో పాటు అవకాశాలు కూడా అందుబాటులోకి తీసుకురాగల సామర్థ్యం సమాచార సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్ టెక్నాలజీలకుంది. విస్తృతమైన ఆర్థిక సంస్కరణల ద్వారా ప్రపంచ వ్యాపారాలు, పెట్టుబడులకు మార్కెట్ ను తెరిచేందుకు భారతదేశం టెక్నాలజీలను సమర్థవంతంగా ఉపయోగించుకుంటోంది. మా డిజిటైజేషన్ వేగం పెంచడంపై మేం దృష్టి కేంద్రీకరించాం. భారతదేశం అసలు సిసలు టెక్నాలజీ లీడర్ గా పరివర్తన చెందే దిశగా ప్రయాణం ప్రారంభించాం.
(Release ID: 1733064)
Visitor Counter : 190