ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 వ్యాక్సిన్ తో గర్భిణీ మహిళలు, శిశువులకు రక్షణ కల్పించవచ్చు : డాక్టర్ ఎన్.కె.అరోరా
“కోవిడ్ 10 వ్యాక్సిన్ ఉభయులకూ క్షేమమే”
Posted On:
02 JUL 2021 6:33PM by PIB Hyderabad
ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం జారీ చేసిన గర్భిణులకు వ్యాక్సినేషన్ మార్గదర్శకాల గురించి ఇమ్యునైజేషన్ నేషనల్ టెక్నికల్ సలహా బృందం (ఎన్ టిఏజిఐ) కోవిడ్-19 వర్కింగ్ గ్రూప్ చైర్ పర్సన్ డాక్టర్ ఎన్.కె.అరోరా డిడి న్యూస్ తో మాట్లాడారు.
రెండు జీవితాల భద్రతకు సంబంధించిన ప్రశ్న
కోవిడ్-19 రెండో విడత కాలంలో గర్భిణీల్లో మరణాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు డాక్టర్ ఎన్.కె.అరోరా తెలిపారు. “కోవిడ్-19 మహమ్మారి రెండో విడత విజృంభణ సమయంలో ఆ వ్యాధి సోకిన గర్భిణీ మహిళల మరణాల సంఖ్య తొలి విడతతో పోల్చితే రెండు నుంచి మూడు రెట్లు పెరిగినట్టు తేలింది. ఈ నేపథ్యంలో గర్భిణీ మహిళలను కూడా కోవిడ్-19 వ్యాక్సిన్ల లబ్ధిదారులుగా చేర్చడం అవసరం అని భావించారు. గర్భిణీ మహిళల విషయంలో ఆమె, ఆమె గర్భంలోని శిశువు ఇద్దరి రక్షణ ముడిపడి ఉన్నాయి. ఈ కారణంగానే గర్భిణీ మహిళలకు కూడా వ్యాక్సిన్ వేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది” అని చెప్పారు.
ఈ వ్యాక్సిన్ తల్లులకు ఎంతో ప్రయోజనకరం, కరోనా వైరస్ కు సంబంధించిన భయం, ఆందోళన నుంచి వారు విముక్తులవుతారు అని ఆయన చెప్పారు. “గర్భిణీ మహిళకు వ్యాక్సినేషన్ ఇప్పించడం ద్వారా ఆమె గర్భంలో పెరుగుతున్న శిశువుని కూడా కాపాడవచ్చు. తల్లిలో వ్యాధి నిరోధకత పెరిగితే అది పిండానికి కూడా బదిలీ అవుతుంది. తల్లి శరీరంలో వ్యాక్సిన్ వల్ల ఏర్పడే ప్రభావం, వ్యాధి నిరోధకత కనీసం జనన సమయం వరకు శిశువుకి కూడా లభిస్తుంది” అని ఆయన వివరించారు.
గర్భిణీ మహిళకు వ్యాక్సిన్ వల్ల కలిగే రక్షణ
వ్యాక్సిన్లు గర్భిణీ మహిళకు ఎంత వరకు సురక్షితం అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ వ్యాక్సిన్ తల్లి శరీరానికే కాకుండా శిశువుకి కూడా రోగనిరోధకత కల్పిస్తుంది గనుక తల్లులకు వ్యాక్సిన్ ఇవ్వాలని ఇప్పుడు ప్రపంచం అంతా ఆలోచిస్తోంది. “స్థూలంగా మన వ్యాక్సిన్లు భద్రమైనవని తేలింది. చివరికి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు అధికంగా ఇస్తున్న యూరప్, ఉత్తర అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో కూడా గర్భిణీ మహిళలకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఈ వాస్తవాలను, గణాంకాలను పరిశీలించిన అనంతరం మన దేశంలో కూడా గర్భిణీ మహిళలకు వ్యాక్సిన్ ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నారు” అని తెలిపారు.
గర్భం దాల్చిన ప్రారంభ సమయంలో గర్భంలోని శిశువు అవయవాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి గనుక గర్భిణీ మహిళలకు తొలి మూడు మాసాల కాలంలో వ్యాక్సినేషన్ చేయడంపై కొందరు అనుమానాలు, భయాలు వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ అరోరా ఈ అనుమానాలను నివృత్తి చేస్తూ వ్యాక్సిన్ ఇటు తల్లికి, అటు ఆమె గర్భంలోని శిశువుకి కూడా క్షేమమేనని హామీ ఇచ్చారు. “ఆ భయాలను నేను తోసి వేస్తున్నాను. మన వ్యాక్సిన్లలో ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే సజీవ వైరస్ ఉండదని నేను హామీ ఇస్తున్నాను. వ్యాక్సిన్ తల్లి శరీరంలో ఎదుగుతున్న శిశువుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదు” అని ఆయన భరోసా ఇచ్చారు.
వ్యాక్సిన్లు వేయించుకున్న గర్భిణీ మహిళల భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటాం అని ఆయన చెప్పారు. “వ్యాక్సిన్ వేయించుకున్న గర్భిణీ మహిళలు ఏదైనా ఆసౌకర్యానికి గురవుతున్నారా అనేది తెలుసుకునేందుకు దేశంలోని ఆరోగ్య శాఖ నెట్ వర్క్ వారిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటుంది. అలాగే శిశువు ఎదుగుదల తీరు ఎలా ఉందో కూడా పర్యవేక్షిస్తారు. వ్యాక్సిన్ వేయించుకున్న అనంతరం మన తల్లులు, సోదరీమణులు, కుమార్తెలు పూర్తిగా క్షేమం అని నిర్ధారించుకోవడమే దీని లక్ష్యం” అని వివరించారు.
గర్భిణీ మహిళలపై వ్యాక్సినేషన్ అనంతరం ఏర్పడే దుష్ర్పభావాల గురించి మాట్లాడుతూ “10 లక్షల మందిలో ఒక్క మహిళకు మాత్రమే బ్లీడింగ్ కావడం లేదా క్లాట్లు ఏర్పడడం వంటి లక్షణాలు కనిపించాయి. అలాంటి వారిలో తీవ్రమైన తలనొప్పి, వాంతులతో కూడిన తలనొప్పి, వాంతులతో కూడిన కడుపునొప్పి లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఏర్పడ్డాయి. వ్యాక్సిన్ వేయించుకున్న రోజు నుంచి మూడు లేదా నాలుగు వారాల వరకు ఈ మూడు లేదా నాలుగు లక్షణాలు కనిపించడం సాధారణమే. ఇలాంటి లక్షణాలు కనిపించగానే కుటుంబ సభ్యులు ఆ గర్భిణీ మహిళను సత్వరం వ్యాక్సినేషన్ వేసిన ఆస్పత్రికి తీసుకెళ్లాలి. ఆ రుగ్మతకు కారణం ఏమిటన్నది ఆస్పత్రిలో శోధించి అవసరమైన చికిత్స అందిస్తారు” అన్నారు.
గర్భిణీ మహిళలు ఎప్పుడు వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు?
ఏ సమయంలో అయినా గర్భిణీ మహిళలు వ్యాక్సిన్ తీసుకోవచ్చునని చైర్ పర్సన్ తెలిపారు. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం “గర్భం దాల్చినట్టు గుర్తించిన క్షణం నుంచి ఏ సమయంలో అయినా గర్భిణీ మహిళకు వ్యాక్సిన్ వేయవచ్చు. గర్భధారణ తర్వాత తొలి, ద్వితీయ, తృతీయ త్రైమాసికంలో ఎప్పుడు వ్యాక్సిన్ వేయొచ్చు అన్నది సమస్యే కాదు” అన్నారు.
(Release ID: 1732450)
Visitor Counter : 260