ఉప రాష్ట్రపతి సచివాలయం
సాగర సామర్థ్య అంశాల్లో ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామి దేశంగా తయారు చేసుకుందామంటూ ఉపరాష్ట్రపతి పిలుపు.
పురాతనకాలంలో అగ్రగామి సాగర సామర్థ్య దేశంగా భారతదేశం పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నేపథ్యంలో గత వైభవాన్ని తిరిగి దక్కించుకుందాం: వీపీ
భారతదేశ ఆర్ధిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న నౌకాశ్రయాలు
విశాఖ పోర్టుకు (విపిటి) సంబంధించిన అన్ని అంశాలను ఉపరాష్ట్రపతికి వివరించిన పోర్టు ట్రస్ట్ ఛైర్మన్
విపిటి విస్తరీకరణ ప్రణాళికలను వీపీకి వివరించిన ఛైర్మన్
Posted On:
26 JUN 2021 5:47PM by PIB Hyderabad
సాగర సామర్థ్య అంశాల్లో ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామిగా దేశంగా తయారు చేసుకుందామంటూ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఈ ప్రధానమైనలక్ష్యాన్ని చేరుకోవడంలో దేశంలోని నౌకాశ్రయాలు కీలకపాత్ర పోషిస్తాయని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా విశాఖ పట్నం పోర్టు ట్రస్ట్ ఛైర్మన్ శ్రీ కె. రామమోహనరావు ఆధ్వర్యంలో పోర్టుకు సంబంధించిన అన్ని అంశాలను ఉపరాష్ట్రపతికి వివరించడం జరిగింది. విశాఖ పోర్టుకు సంబంధించిన పలు కార్యక్రమాలగురించి, విస్తరణ ప్రణాళికల గురించి ఉపరాష్ట్రపతికి వివరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు ప్రపంచ నౌకా రవాణా మార్గాలకు సంబంధించి భారతదేశం వ్యూహాత్మక ప్రదేశంలో వుందని, భారతదేశానికి 7, 517 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతం వుందని దేశంలోని నౌకాశ్రయాలు భారతదేశ ఆర్ధిక వ్యవస్థ ప్రగతికి దోహదం చేస్తాయని అన్నారు.
సాగర ప్రాంతాలకు సంబంధించి పురాతన కాలంలో భారతదేశం శక్తివంత దేశంగా వుండేదని..పలు సముద్రాలపై చోళ, కళింగ రాజులకు పట్టు వుండేదని ఉపరాష్ట్రపతి గుర్తు చేశారు. గత వైభవాన్ని తిరిగి దక్కించుకునే బాధ్యత ప్రస్తుతం అందరిమీదా వుందని ఆయన అన్నారు.
దేశంలో ఏర్పాటు చేస్తున్న నౌకాశ్రయాల మౌలిక సదుపాయల గురించి ఉపరాష్ట్ర పతి వివరించారు.సాగరమాల ప్రాజెక్ట్ కారణంగా దేశంలో 504 ప్రాజెక్టులను గుర్తించారని వీటి కారణంగా అమలులోకి వచ్చే కార్యక్రమాలవల్ల 3.75 లక్షల కోట్ల రూపాయల మౌలిక సదుపాయాల పెట్టుబడులు వస్తాయని ఆయన అన్నారు.
కరోనా మహమ్మారి కారణంగా విశాఖ పోర్ట్ కు కార్గో రవాణా తగ్గిపోవడం గురించి ఉపరాష్ట్రపతి తన ప్రసంగంలో మాట్లాడారు. దీనికి సంబంధించి తిరిగి పునర్ వైభవం సంపాదిస్తామని ఆయన అన్నారు. కోవిడ్ అనంతరం ఆర్ధిక రంగం పుంజుకోవడంలో దేశంలోని నౌకాశ్రయాలు కీలకపాత్ర పోషిస్తాయని ఆయన స్పష్టం చేశారు.
కోవిడ్ రెండో వేవ్ సమయంలో దేశంలోకి ఆక్సిజన్ సరఫరాలను తీసుకురావడంలోను, తౌక్ తే, యాస్ తుపానుల సమయంలో సహాయకచర్యలు చేపట్టడంలోను దేశంలోని నౌకాశ్రయాలు ప్రశంసనీయ పాత్ర పోషించాయని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి అభినందనలు తెలిపారు.
మేరిటైమ్ ఇండియా విజన్ 2030ని ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి దేశంలోని పోర్టులు తమ కార్యకలాపాల నిర్వహణలో అంతర్జాతీయ ఉన్నత ప్రమాణాలను అనుసరించాలని అన్నారు. భారతదేశంలో నిబిడీకృతమైన శక్తి వుందని, అందరూ కలిసి కట్టుగా పని చేస్తే విజన్ 2030ని సాధించగలమని ఆయన స్పష్టం చేశారు.
కాలుష్యాన్ని నియంత్రించి పర్యావరణ సంరక్షణ చేపట్టడానికిగాను వీపీటీ తీసుకుంటున్న చర్యల గురించి ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా తెలుసుకున్నారు. ఈ విషయంలో అధికారులను ప్రశంసించారు. పునర్ వినియోగ ఇంధనం, ఇంధన సంరక్షణ చర్యలపై దృష్టి పెట్టాలని సూచించారు.
పోర్టులో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలను, పోర్ట్ నేతృత్వంలో కొనసాగుతున్న పారిశ్రామికీకరణను, డిజిటలీకరణను ఇంకా ఇతర హరిత హిత చర్యలను ఆయన ప్రశంసించారు. రానున్న రోజుల్లో విశాఖ పట్నం పోర్ట్ ట్రస్ట్ విస్తరీకరణ దిశగా ప్రయాణం చేయడం సంతోషదాయకమని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ విస్తరణకు సంబంధించి ప్రతిపాదిత రూ. 406 కోట్ల ఫ్రీ ట్రేడ్ అండ్ వేర్ హౌసింగ్ జోన్ ( ఎప్ టి డబ్ల్యు జెడ్ )నిర్మాణాన్ని 103 ఎకరాల్లో చేపట్టినట్టు అధికారులు వివరించారు. సాగరమాల కార్యక్రమం కింద ఈ ఎఫ్ టి డబ్ల్యు జెడ్ నిర్మాణానికి నిధులందిస్తారు. ఇక ప్రాధమిక సౌకర్యాలయిన రోడ్లు, విద్యుత్, రైలు మార్గం, రోడ్డు కనెక్టివిటీకోసం స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్ పివి) ఏర్పాటు చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వ పర్యాటక శాఖ మంత్రి శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ పట్నం పోర్ట్ ట్రస్ట్ ఛైర్మన్ శ్రీ కె. రామ మోహనరావు, విపిటి డిప్యూటీ ఛైర్మన్ శ్రీ దుర్గేష్ కుమార్ దూబే, ఇంకా ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
(Release ID: 1730640)
Visitor Counter : 162