ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

‘అంతర్జాతీయ పొగాకు నియంత్రణ’ 25 ఏళ్ల ప్రగతిని ప్రముఖంగా ప్రస్తావిస్తూ వర్చువల్ సదస్సునుద్దేశించి డాక్టర్ హర్షవర్ధన్ ప్రసంగం


భారత్‌కు ప్రత్యేక జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం ఉంది... దీన్నొక
కర్తవ్యంలా... సామాజిక ఉద్యమంలా అనుసరించాలి: డాక్టర్‌ హర్షవర్ధన్‌;

“పొగాకు నియంత్రణపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ముసాయిదా
చట్రాన్ని తొలుత ఆమోదించిన దేశాల్లో భారత్‌ కూడా ఒకటి”

Posted On: 24 JUN 2021 8:48PM by PIB Hyderabad

   ‘ప్రపంచ పొగాకు నియంత్రణ’ పాతికేళ్ల ప్రగతిని ప్రముఖంగా ప్రస్తావిస్తూ కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఇవాళ వర్చువల్ సదస్సులో ప్రసంగించారు. ‘‘బాలల కోసం పొగాకు విముక్త ఉద్యమం” సంస్థ 25వ వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన ఈ సదస్సులో గంటపాటు వర్చువల్‌ మాధ్యమం ద్వారా ప్రత్యేక కార్యక్రమాల ప్రదర్శన సాగింది. ప్రపంచవ్యాప్తంగా పొగాకు వినియోగాన్ని గణనీయంగా తగ్గించడంలో పొగాకు నియంత్రణ ఉద్యమాలు ఏ మేరకు విజయం సాధించిందీ ఇందులో ప్రముఖంగా ప్రదర్శించారు. పొగాకు వినియోగంలో రెండంకెల తగ్గుదల నమోదైన ఐదు దేశాల నుంచి ఎంపిక చేసిన అధికారులు, సామాజిక సంఘాల నాయకులు ఇందులో పాల్గొన్నారు. ఈ సదస్సునుద్దేశించి కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ ప్రసంగిస్తూ- గడచిన 75 ఏళ్లలో భారత దేశవ్యాప్తంగా సాంక్రమిక వ్యాధుల నియంత్రణలో గణనీయ ప్రగతి సాధించినట్లు వెల్లడించారు. అకాల, అసాంక్రమిక వ్యాధుల సంబంధిత మరణాలతోపాటు అనేక అనారోగ్యాలకు పొగాకు వినియోగమే కారణమని, ప్రజారోగ్యానికి ఇదొక సవాలుగా పరిణమించిందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ ప్రసంగం పూర్తిపాఠం:

   ‘‘విశిష్ట అతిథులారా! మనమంతా గర్వించాల్సిన ‘బాలల కోసం పొగాకు విముక్త ఉద్యమం’ 25 వార్షికోత్సవంలో మీతోపాటు పాల్గొనే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు. ఈ సంస్థ నేతృత్వంలో ఇన్నేళ్లుగా సాధించిన అనేక విజయాలపై నా వంతుగా ఎనలేని ప్రశంసలు తెలియజేస్తున్నాను. అయితే, పొగాకు వినియోగం మానవ సమాజంలో ఎంతగా అల్లుకుపోయిందంటే- ఈ సాంక్రమిక వ్యాధిని అదుపు చేయడానికి అవిశ్రాంత కృషి అవసరం. ఈ నేపథ్యంలో మిత్రులారా- భారతదేశం తన 75వ స్వాతంత్ర్య వార్షికోత్సవానికి చేరువవుతోందని ప్రకటించడానికి ఈ సందర్భంగా నేనెంతో సంతోషిస్తున్నాను. గడచిన 75 ఏళ్లలో జనాభా ఆరోగ్యస్థాయి సాధనలో భారత్‌ విశేష ప్రగతి సాధించింది. సాంక్రమిక వ్యాధులను అరికట్టడంలో కొన్నేళ్లుగా మేం గణనీయ పురోగతి సాధించాం. దీనివల్ల సాంక్రమిక వ్యాధి సంబంధిత అనారోగ్యాలు, మరణాలు బాగా తగ్గాయి. కానీ, అసాంక్రమిక వ్యాధులు దీర్ఘకాలికమైన గుండెజబ్బులు, మధుమేహం, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు, కేన్సర్లు, మానసిక ఆరోగ్య రుగ్మతలు, గాయాలు వంటివి క్రమంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల నడుమ పొగాకు వినియోగం అకాల, అసాంక్రమిక వ్యాధులతో ముడిపడిన మరణాలతోపాటు అనేక అనారోగ్యాలకు దారితీస్తూ ప్రజారోగ్యానికి సవాలుగా పరిణమించింది.

   భారతదేశంలో పొగాకు వినియోగ నియంత్రణ కృషి మొత్తం 130 కోట్ల జనాభాకూ చేరువ కావాలన్నది లక్ష్యం. ఆ మేరకు దీని దుష్ప్రభావాలు, దానితో ముడిపడిన ముప్పుల గురించి ప్రతి వయోవర్గానికీ అవగాహన కల్పించడం దీని ఉద్దేశం. నా రాజకీయ జీవితం తొలినాళ్లలో ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నపుడు 1997లో నేను ‘ఢిల్లీలో ధూమపాన నిషేధం-పొగతాగనివారి ఆరోగ్య రక్షణ చట్టం’ రూపొందించగా శాసనసభ దాన్ని ఆమోదించింది. గౌరవనీయ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ‘బహిరంగ స్థలాల్లో ధూమపాన నిషేధం’పై కేంద్రం ఇదే చట్టాన్ని నమూనా కింద స్వీకరించింది. ఆనాటినుంచీ పొగాకుపై మా సమష్టి పోరులో మేం సుదీర్ఘ ప్రయాణం చేశాం. పొగాకు వినియోగం తగ్గించడంలో భాగంగా దానికి సంబంధించిన ప్రచారం, ప్రకటనలను నియంత్రిస్తూ మేం అనేక చట్టాలు చేశాం. అలాగే పొగాకు నియంత్రణపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ముసాయిదా చట్రాన్ని తొలుత ఆమోదించిన దేశాల్లో భారత్‌ కూడా ఒకటని ఈ సందర్భంగా నేను సగర్వంగా ప్రకటిస్తున్నాను.

   భారతదేశానికి ప్రత్యేకంగా ‘జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం’ ఉంది. దీనికి అనుగుణంగా గడచిన ఏడేళ్లలో మా ప్రభుత్వం బలమైన రాజకీయ సంకల్పం, సమష్టి కృషితో చేపట్టిన లక్ష్య నిర్దేశిత చర్యలు పొగాకు నియంత్రణలో గణనీయ విజయాలను సాధించాయి. ఆ మేరకు పొగాకు ఉత్పత్తుల పాకెట్లపై 85శాతం భాగాన్ని పెద్ద హెచ్చరికలతో ముద్రించేలా చర్యలు తీసుకున్నాం. అదేవిధంగా పొగాకు ఉత్పత్తుల వాడకం మానడం కోసం ప్రజలకు తోడ్పాటునిచ్చేందుకు సహాయ కేంద్రం ఏర్పాటు చేశాం. ఎలక్ట్రానిక్‌ సిగరెట్లు, వాటిని పోలిన పరికరాలను నిషేధించే చట్టం ద్వారా ‘ఈ-సిగరెట్ల’ బెడదను తొలగించాం. చలనచిత్రాలు, టీవీ కార్యక్రమాలలో పొగాకు ఉత్పత్తుల ప్రదర్శన, వినియోగం సంబంధిత దృశ్యాలను నియంత్రణ పరిధిలోకి తెచ్చాం. మేం చేపట్టిన ప్రధాన చర్యలలో ఇవి కొన్ని కాగా, వీటితోపాటు అవగాహన కల్పించడం ద్వారా పొగాకు నియంత్రణను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నాం.

మిత్రులారా!

   పొగాకు నియంత్రణ కార్యక్రమాన్ని ఒక ఆదర్శ కర్తవ్యంలా, సామాజిక ఉద్యమం తరహాలో కొనసాగించాలి. మానవాళికి ఎంతోకొంత విలువైన సేవద్వారా గుర్తింపు పొందే, మన జీవితాలకు అర్థం కల్పించే ఒక పవిత్ర లక్ష్యంతో ముందడుగు వేయాలి. పొగాకు రహిత సమాజం దిశగా కృషిలో నావంతు తోడ్పాటుకు గుర్తింపుగా 1998లో ఇదే రోజున ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతిష్టాత్మక ‘డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ ప్రశంస పతకం’ ప్రదానం చేయడాన్ని నేను సగర్వంగా, సవినయంగా గుర్తు చేసుకుంటున్నాను. పొగాకు నియంత్రణ కర్తవ్యంలో భాగంగా యువతకు తీవ్ర హానిచేస్తున్న ‘ఈ-సిగరెట్లు’, ఆ తరహా ఉత్పత్తుల నిషేధం కోసం 2019లో జాతీయస్థాయి చట్టం రూపొందించడంలో నా కృషికి గుర్తింపునిస్తూ ఈ సంవత్సరమే ప్రపంచ ఆరోగ్య సంస్థ నాకు ‘డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ ప్రత్యేక పురస్కారం’ ప్రదానం చేసింది. గడచిన మూడు దశాబ్దాలుగా శక్తివంచన లేకుండా పొగాకుపై పోరాటంలో నేను ప్రదర్శిస్తున్న ఉత్సాహాన్ని ఎత్తిచూపడానికే ఈ సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను. అంతేకాకుండా ఇవాళ ఈ సదస్సుకు హాజరైన పొగాకు నియంత్రణ ఉద్యమ విశిష్ట దూతలు ఇదే స్ఫూర్తితో మరింత ముందడుగు వేయడంలో ఇది ఉత్తేజమిస్తుందని భావిస్తున్నాను. పొగాకు నియంత్రణ పోరాటంలో మనం పరిశుద్ధ కర్తవ్య నిబద్ధతతో ముందుకు వెళ్తున్నాం కాబట్టి నైతికంగా మనం రుజుమార్గంలో ఉన్నట్లేనన్న వాస్తవాన్ని గుర్తుచేసుకుందాం.

   పొగాకు వాడకంపై యువతలో విముఖత పెంచే దిశగా ఈ సమాజంలో మనం ఎంతగానో కృషి చేయవచ్చు. పొగాకు వాడకం, నికోటిన్‌ స్వీకరించడంవల్ల ఎదురయ్యే ప్రమాదాల గురించి అవగాహన కల్పించే బాధ్యతను పాఠశాలలు స్వీకరించవచ్చు. తదనుగుణంగా విద్యార్థులకు సమాచార వనరులు సమకూర్చడంతోపాటు తమ ప్రాంగణాలను పొగాకు, ఎలక్ట్రానిక్‌ నికోటిన్‌ నింపిన పరికరాల (ENDS) రహితం చేయవచ్చు. పొగాకు వాడకంతో కలిగే అనేక అనర్థాలుసహా వ్యక్తిగత ఆర్థికస్థితిపై వాటి దుష్ప్రభావంపై యువతను చైతన్యం చేయడానికి యువజన బృందాలు స్థానికంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించవచ్చు. పొగాకు లేదా ఈ-సిగరెట్ల వాడకాన్ని సూచించే దృశ్యాలు లేకుండా చలనచిత్ర, టెలివిజన్‌, నాటక నిర్మాణ సంస్థలు స్వీయ కట్టుబాటును విధించుకోవచ్చు. అలాగే నికోటిన్‌, పొగాకు సంబంధిత పరిశ్రమల ప్రాయోజితాలతోపాటు ‘బ్రాండ్‌ అంబాసిడర్‌షిప్‌’ వంటి ఆఫర్లను ప్రముఖులు, సమాజాన్ని ప్రభావితం చేయగల వ్యక్తులు తిరస్కరించవచ్చు.

   సుదీర్ఘ పొగాకు వినియోగం కారణంగా నవ యువకులు అకాల మరణం పాలవడం చూసినప్పుడు గుండె తరుక్కుపోతుంది. ఈ నేపథ్యంలో పొగాకు నియంత్రణ చర్యలు, విధానం లేదా చట్టాన్ని పలచబరిచే లేదా బలహీనం చేసే ప్రయత్నాలపై ఆగ్రహావేశాలు ప్రజానీకం నుంచి బహిరంగ నిరసనకు దారితీసేలా చూడాలన్నది నా ఆకాంక్ష. సమష్టి పోరాటంతో మనం ఈ యుద్ధంలో చారిత్రక విజయం సాధించి చరిత్ర సృష్టించడం తథ్యమడంలో నాకెలాంటి సందేహం లేదు. ఈ దిశగా అత్యున్నత వివేచనతో, కర్తవ్య నిబద్ధతతో మన వంతు పాత్రను పోషించాల్సి ఉంది. ఈ మేరకు పొగాకురహిత ఆరోగ్యకర ప్రపంచం లక్ష్యంగా మనం ఇవాళ సంకల్పం పూనుదాం రండి. పొగాకు నియంత్రణ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భారత్‌ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నదని ఈ సందర్భంగా భరోసా ఇస్తున్నాను. ఈ కీలక సందర్భంలో నాకు అవకాశమిచ్చి ఇందులో భాగస్వామిని చేసినందుకు మీకందరికీ ధన్యవాదాలు. పొగాకు నియంత్రణ లక్ష్య సాధనకు అంకితభావంతో మీరు చేస్తున్న ప్రయత్నంలో ఘన విజయం సిద్ధించాలని ఆకాంక్షిస్తున్నాను.”



(Release ID: 1730231) Visitor Counter : 370


Read this release in: English , Urdu , Hindi , Punjabi