ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం

సముద్ర గర్భంలో అన్వేషణకు మంత్రివర్గం ఆమోదం

Posted On: 16 JUN 2021 3:33PM by PIB Hyderabad

సముద్ర గర్భంలో లభిస్తున్న వనరులను వెలికి తీసిసముద్ర వనరులను సుస్థిరంగా వినియోగంలోకి తీసుకుని రావడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ రూపొందించిన "డీప్ ఓషన్ మిషన్" పథకానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ ఆమోదం తెలిపింది. 

దశల వారీగా అంయిదు సంవత్సరాలపాటు అమలు జరిగే ఈ మిషన్ కు 4077 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తారు. మొదటిదశను మూడు సంవత్సరాల పాటు (2021-24) 2823.4 కోట్ల రూపాయలతో అమలు చేస్తారు. నీలి విప్లవ సాధనకు కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా "డీప్ ఓషన్ మిషన్" అమలు జరుగుతుంది. దీనిని వివిధ సంస్థల సహకారంతో కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ప్రాధాన్యతా పథకంగా అమలు చేస్తుంది. 

"డీప్ ఓషన్ మిషన్" ఈ కింది ప్రధాన భాగాలను కలిగి ఉంటుంది:

i). సముద్రంలో ఖనిజాల అన్వేషణ, సముద్ర గర్భంలోకి మానవులను పంపడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకోవడం : శాస్త్రీయ సెన్సార్లు, పరికరాలను అమర్చిన సూట్‌తో ముగ్గురు వ్యక్తులను సముద్రంలో 6000 మీటర్ల లోతుకు తీసుకువెళ్ళడానికి సబ్మెర్సిబుల్ ను అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇటువంటి సామర్థ్యాన్ని ప్రపంచంలో కొన్ని దేశాలు మాత్రమే కలిగివున్నాయి. మధ్య హిందూ మహాసముద్రంలో 6000 మీటర్ల లోతు నుంచి ఖనిజ సంపదను వెలికి తీయడానికి సమగ్ర  మైనింగ్ వ్యవస్థకు రూపకల్పన చేయడం జరుగుతుంది. ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్ సి బెడ్ అథారిటీ ఆమోదించిన తరువాత ఈ ఖనిజ సంపదను వాణిజ్యపరంగా అభివృద్ధి చేస్తారు. 

ii). సముద్రంలో చోటుచేసుకునే వాతావరణ మార్పులపై సలహా సేవల అభివృద్ధి: వివిధ కాలాల్లోసముద్రంలో నెలకొనే వాతావరణంతో పాటు పది సంవత్సరాల కాలంలో నెలకొనే వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసి నివేదికలను సిద్ధం చేస్తారు. నీలి విప్లవ సాధనకు ఈ అధ్యయనాలు ఉపకరిస్తాయి. 

iii). సముద్ర గర్భంలో జీవవైవిధ్య అన్వేషణ, పరిరక్షణకు సాంకేతిక ఆవిష్కరణలు:: సూక్ష్మజీవులతో సహా సముద్ర గర్భంలో వుండే వృక్ష, జంతుజాలంపై జీవవైవిధ్య పరిశోధనలను నిర్వహించి, సముద్ర వనరులను వినియోగంలోకి తీసుకుని రావడానికి నూతన సాంకేతిక ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆవిష్కరణలు నీలి విప్లవ సాధనలో సముద్ర మత్స్యసంపద దాని అనుబంధ సేవలను వినియోగించడానికి అవకాశం కలుగుతుంది. 

iv). సముద్ర గర్భ సర్వే, అన్వేషణ : హిందూ మహాసముద్రం, సముద్ర మధ్యలో వుండే కొండలలో లభించే ఖనిజ సంపద అన్వేషణపై ఈ కారక్రమంలో ప్రాధాన్యత ఇస్తారు. సముద్ర వనరులను వెలికి తీస్తూ నీలి విప్లవ సాధనకు ఈ అన్వేషణ సహకరిస్తుంది. 

v).      సముద్రం నుంచి  శక్తి మరియు మంచినీరు: ఆఫ్‌షోర్ ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్  శక్తితో పనిచేసే డీశాలినేషన్ ప్లాంట్ కోసం అధ్యయనాలు మరియు వివరణాత్మక ఇంజనీరింగ్ డిజైన్ రూపకల్పనను ఈ ప్రతిపాదనలో చేర్చారు. నీలి విప్లవంలో ఇంధన అభివృద్ధి అంశానికి ఈ ప్రతిపాదన ప్రాధాన్యత ఇస్తుంది. 

vi). సముద్ర జీవశాస్త్ర ఆధునిక సౌకర్యాలు:  సముద్ర జీవశాస్త్ర రంగంలో మానవ మేధస్సు, ఇంజనీరింగ్ రంగాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో మిషన్ లో ఈ ప్రతిపాదనకు ప్రాధాన్యత ఇస్తారు. పరిశోధనల ఫలితాలను పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించడం, తీరంలో సౌకర్యాలను నెలకొల్పడం జరుగుతుంది. నీలి విప్లవంలో సముద్ర జీవశాస్త్రం , మత్స్య సంపద వ్యాపార ఉత్పత్తి రంగాలకు ఈ ప్రతిపాదన సహకరిస్తుంది. 

సముద్ర గర్భంలో ఖనిజ సంపదను వెలికి తీయడం క్లిష్టంగా ఉంటుంది. దీనికి అవసరమైన పరికరాలు వాణిజ్యపరంగా అందుబాటులో లేవు. దీనితో గుర్తింపు పొందిన సంస్థలు, ప్రైవేట్ రంగ సహకారంతో వీటిని స్వదేశంలో  అభివృద్ధి చేయడానికి కార్యక్రమాలను అమలు చేస్తారు. సముద్ర గర్భంలో పరిశోధనలను చేపట్టే సామర్ధ్యంతో ఒక నౌకను దేశంలోని ఒక షిప్ యార్డులో నిర్మిస్తారు. దీనివల్ల ఆ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ మిషన్ ను అమలు చేయడం వల్ల సముద్ర జీవశాస్త్ర రంగానికి మరింత ప్రాధాన్యత లభిస్తుంది. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ప్రత్యేక పరికరాల నమూనా, అభివృద్ధి, ఉత్పత్తి కార్యక్రమాలు, ప్రత్యేక నౌకల నిర్మాణం లాంటి కార్యక్రమాల వల్ల ఆర్ధిక వ్యవస్థ మరింత అభివృద్ధి సాధిస్తుంది. భారత పారిశ్రామిక రంగం ముఖ్యంగా చిన్న మధ్య తరహా సూక్ష్మ పరిశ్రమల రంగం అభివృద్ధి చెందడానికి అవకాశం కలుగుతుంది. 

భూగోళంలో 70% ప్రాంతంలో విస్తరించి ఉన్న సముద్రాలు మానవ జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సముద్ర సంపదలో 95% వరకు సముద్ర గర్భంలోనే నిక్షిప్తం అయి వుంది. మూడువైపులా సముద్రాన్ని సరిహద్దుగా కలిగిన భారతదేశ ఆర్థిక వ్యవస్థలో మత్స్య సంపద కీలక పాత్ర పోషిస్తోంది. దేశ జనాభాలో 30 శాతం మంది తీర ప్రాంతాల్లో నివసిస్తూ జీవనోపాధికి సముద్ర సంపదపై ఆధారపడి జీవిస్తున్నారు. ఆహారంశక్తిఖనిజాలుఔషధ సంపద కలిగివున్న సముద్రాలు వాతావరణ పరిస్థితుల మార్పుల్లో కీలకంగా మారాయి. సముద్రాల ప్రాధాన్యతను గుర్తించిన ఐక్యరాజ్య సమితి 2021-30 దశాబ్ద కాలాన్ని సుస్థిర అభివృద్ధి సాధనకు సముద్రశాస్త్రాల కాలంగా పరిగణిస్తోంది. 

భారతదేశంలో సముద్రాలకు ప్రత్యేక స్థానం ఉంది. 7517 కిలోమీటర్ల పొడవునా తీరప్రాంతం కలిగి ఉన్న భారతదేశంలో తొమ్మిది తీరప్రాంత రాష్ట్రాలు, 1382 దీవులు వున్నాయి. సముద్ర సంపద ప్రాధాన్యతను గుర్తించిన భారత ప్రభుత్వం అభివృద్ధికి దోహదపడే పది అంశాలలో నీలి విప్లవాన్ని కూడా చేర్చింది.  

***


(Release ID: 1727709) Visitor Counter : 413