వ్యవసాయ మంత్రిత్వ శాఖ
వ్యవసాయరంగానికి భారతదేశం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోంది: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్
వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కువ చేసి, ఆకలిని నివారించి, పౌష్టిక ఆహార లభ్యతను పెంపొందించడానికి సభ్య దేశాలు అమలు చేస్తున్న చర్యలు ప్రపంచాన్ని సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన ప్రదేశంగా మారుస్తున్నాయి.. శ్రీ నరేంద్ర సింగ్ తోమర్
ఎఫ్ఏఓ 42వ సమావేశంలో ప్రసంగించిన కేంద్ర వ్యవసాయ,రైతు సంక్షేమ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్
प्रविष्टि तिथि:
15 JUN 2021 8:06PM by PIB Hyderabad
వ్యవసాయ రంగానికి భారతదేశం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నదని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అన్ని చర్యలను అమలు చేస్తున్నదని ఆయన అన్నారు. వర్చువల్ విధానంలో జరిగిన ఎఫ్ఏఓ 42వ సమావేశంలో ప్రసంగించిన మంత్రి ఆవిర్భావం నుంచి ఎఫ్ఏఓ సభ్యదేశంగా ఉన్న భారతదేశం సంస్థ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నదని అన్నారు. కోవిడ్-19 నేపథ్యంలో ఎఫ్ఏఓ 42వ సమావేశం వర్చువల్ విధానంలో జరిగింది. 2020లో ఎఫ్ఏఓ ఆవిర్భవించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతదేశం 75 రూపాయల నాణేన్ని విడుదల చేసిందని తెలిపిన మంత్రి దీనిని వ్యవసాయం, పౌష్ఠిక ఆహారం ప్రాధాన్యతను వివరించేలా ముద్రించామని అన్నారు. ''పౌష్ఠిక విలువలు కలిగిన దేశం ప్రకాశిస్తుంది ” అన్న నినాదాన్ని దీనిపై ముద్రించామని తెలిపారు. ఎఫ్ఏఓ కార్యక్రమాలను భారతదేశంలో దేశ అవసరాలకు అనుగుణంగా బహుముఖ విధానంలో వ్వవసాయ రైతు సంక్షేమశాఖ అమలు చేస్తున్నదని ఆయన వివరించారు.
ఎఫ్ఏఓ కార్యక్రమాలను అమలు చేయడానికి భారతదేశం అవసరమైన పూర్తి సహాయ సహకారాలను అందించడానికి సిద్ధంగా ఉందని శ్రీ తోమర్ హామీ ఇచ్చారు. ఎడారి మిడతల నివారణ, వివిధ దేశాల్లో పంటలను నాశనం చేస్తున్న తెగుళ్ల నివారణకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి తెలిపారు. భారతదేశ ప్రతిపాదన మేరకు 2016ని అంతర్జాతీయ పప్పుధాన్యాల సంవత్సరంగా నిర్వహించిన ఎఫ్ఏఓ 2023 సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా నిర్వహిస్తోందని ఆయన అన్నారు.
వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్న భారతదేశం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. నీలి విప్లవం, హరిత విప్లవం సాధించిన భారతదేశం మరే దేశంలోనూ అమలు కాని విధంగా ప్రజా పంపిణీ విధానాన్ని అమలు చేస్తున్నదని ఆయన వివరించారు.
పాలకుల దూరదృష్టి , శాస్త్రవేత్తల పరిశోధనల వల్ల భారతదేశం ఆహార ధాన్యాల రంగంలో స్వయం సమృద్ధి సాధించిందని శ్రీ తోమర్ తెలిపారు. వివిధ ఆహార ధాన్యాల దిగుబడిలో భారతదేశం ప్రపంచంలో అగ్ర స్థానం లేదా ద్వితీయ స్థానంలో ఉందని అన్నారు.
భారతదేశం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న వ్యవసాయ రంగానికి కోవిడ్-19 నేపథ్యంలో మరింత ప్రాధాన్యత పెరిగిందని శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతి ఇకపై కూడా కొనసాగుతుందని అన్నారు. కోవిడ్-19 నేపథ్యంలో కూడా భారతదేశ వ్యవసాయ రంగం గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో 305 మిలియన్ టన్నుల ఆహారధాన్యాలను ఉత్పత్తి చేసిందని ఆయన వెల్లడించారు. భారతదేశం ఎగుమతి చేస్తున్న ఆహారధాన్యాలు ఇతర దేశాల అవసరాలను తీరుస్తున్నాయని అన్నారు.
2020లో ఏర్పడిన కోవిడ్ పరిస్థితులు, విధించిన లాక్ డౌన్ వల్ల వ్యవసాయ రంగ కార్యకలాపాలు ప్రభావితం కాకుండా చూడడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ నాయకత్వంలో కేంద్రం ముందస్తు జాగ్రత్త చర్యలను అమలు చేసి విజయం సాధించిందని అన్నారు. ప్రభుత్వం అమలు చేసిన చర్యల వల్ల సకాలంలో నాట్లు పడ్డాయని, వ్యవసాయం సాగడానికి అవసరమైన అన్ని వస్తువులు రైతులకు అందాయని పేర్కొన్న మంత్రి ఈ చర్యల వల్ల పంటల దిగుబడి, పంటల సేకరణ పెరిగిందని వివరించారు.
రైతులు మరియు వినియోగదారుల ప్రయోజనాల కోసం భారతీయ వ్యవసాయ ముఖచిత్రంలో మార్పులు తీసుకుని రావడానికి వ్యవసాయ మార్కెటింగ్‌ను సరళీకృతం చేయడం లాంటి ముఖ్యమైన విధాన,చట్టపరమైన నిర్ణయాలను తీసుకుని అమలు చేశామని మంత్రి తెలిపారు.
రైతులు వినియోగదారుల ప్రయోజనాలను రక్షించడానికి శీతలీకరణ సౌకర్యాలతో కూడిన ప్రత్యేక పార్శిల్ రైళ్లను "కిసాన్ రైలు" భారత రైల్వే ప్రవేశపెట్టిందని శ్రీ తోమార్ తెలిపారు. వీటిలో పాడైపోయే ఉద్యానవన ఉత్పత్తులు, పాలు మరియు పాల ఉత్పత్తులను ఉత్పత్తి కేంద్రాల నుంచి దేశంలోని పెద్ద పట్టణ మార్కెట్లకు రవాణా చేసి రైతులు, వినియోగదారులకు లబ్ది కలిగించామని అన్నారు.
కోవిడ్ సమయంలో కార్మికులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం “ప్రధాన మంత్రి గరిబ్ కళ్యాణ్ ప్యాకేజీ”ని ప్రారంభించి అర్హులైన 810 మిలియన్ ప్రజలకు ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేసిందని మంత్రి తెలిపారు. ఈ పథకాన్ని నవంబర్ వరకు పొడిగించామని అన్నారు. రైతులకు ఆదాయ సహాయాన్ని అందించడానికి “పిఎం కిసాన్” పథకం కింద 100 మిలియన్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు 137000 కోట్ల రూపాయలకు పైగా జమచేశామని మంత్రి తెలిపారు.
వివిధ ఒప్పందాల కింద కుదిరిన అవగాహనా కార్యక్రమాలకు కార్యరూపం ఇవ్వడానికి భారతదేశం సిద్ధంగా ఉందని సమావేశానికి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ హామీ ఇచ్చారు. వాతావరణంలో వస్తున్న మార్పులను తట్టుకుని వ్యవసాయ దిగుబడి సాగేలా చూడడానికి రైతులకు సాంకేతిక సహాయ సహకారాలను అందించడానికి ప్రభుత్వం జాతీయస్థాయిలో కార్యక్రమాలను అమలు చేస్తున్నదని మంత్రి వివరించారు. సేంద్రీయ వ్యవసాయానికి భారతదేశం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని తెలిపిన మంత్రి ఎఫ్ఏఓ అమలు చేస్తున్న చర్యలవల్ల సభ్య దేశాలు ప్రయోజనం పొందుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
***
(रिलीज़ आईडी: 1727403)
आगंतुक पटल : 514