రైల్వే మంత్రిత్వ శాఖ

దేశ సేవలో భాగమై 30 వేల మెట్రిక్ టన్నుల ఆక్సిజెన్ సరఫరా చేసిన ఆక్సిజెన్ ఎక్స్ ప్రెస్ లు

దక్షిణాది రాష్ట్రాలకు 15 వేల టన్నులకు పైగా ఆక్సిజెన్ సరఫరా
దేశవ్యాప్తంగా నడిచిన 421 ఆక్సిజెన్ ఎక్స్ ప్రెస్ లు
15 రాష్ట్రాలకు ఊరటనిస్తూ 1734 టాంకర్ల రవాణా
ఆంధ్రప్రదేశ్ కు 3664 టన్నుల ఆక్సిజెన్ అందజేత

प्रविष्टि तिथि: 13 JUN 2021 2:11PM by PIB Hyderabad

అన్ని రకాల అవరోధాలనూ అధిగమిస్తూ, కొత్త ఉపాయాలు కనుక్కుంటూ భారత రైల్వేలు ఈ కరోనా సమయంలో దేశవ్యాప్తంగా అనేక రాష్టాలకు ద్రవరూప మెడికల్ ఆక్సిజెన్ ను సరఫరా  చేయగలిగింది. రైల్వేశాఖ వారి ఆక్సిజెన్ ఎక్స్ ప్రెస్ లు 30,000 మెట్రిక్ టన్నుల మైలురాయిని అధిగమించి దేశసేవలో తమ పాత్రను మరోమారు చాటుకున్నాయి.  ఇప్పటిదాకా భారతీయ రైల్వేలు దేశం నలుమూలలా ఉన్న అనేక రాష్ట్రాలకు 30182 మెట్రిక్ టన్నుల ఆక్సిజెన్  ను 1734 టాంకర్ల ద్వారా అందజేశాయి.

వివిధ రాష్ట్రాలకు ఊరట కలిగిస్తూ మొత్తం 421 ఆక్సిజెన్ ఎక్స్ ప్రెస్ లు తమ ప్రయాణాన్ని పూర్తిచేసుకున్నాయి. అందులో కేవలం దక్షిణాది రాష్ట్రాలకు అందజేసిన ఆక్సిజెన్ మాత్రమే 15,000 మెట్రిక్ టన్నులుంది.  ఆంధ్రప్రదేశ్ కు 3600 టన్నులు, కర్నాటకకు 3700 టన్నులు, తమిళనాడుకు 4900 టన్నులు సరఫరా చేసింది. ఈ వార్త వెలువరించే సమయం లోనూ లోడ్ చేసుకున్న రెండు రైళ్ళు 10 టాంకర్లలో 177 మెట్రిక్ టన్నుల ఆక్సిజెన్ ను మోసుకుంటూ మార్గమధ్యంలో ఉన్నాయి.

ఆక్సిజెన్ ఎక్స్ ప్రెస్ లు సరిగ్గా 50 రోజుల కిందట ఏప్రిల్ 24న మహారాష్ట్రలో 126 మెట్రిక్ టన్నుల ఆక్సిజెన్  తో తమ యాత్ర  ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి ఉంది. ఆక్సిజెన్ అడిగిన రాష్ట్రాలకు అతితక్కువ సమయంలోఅందజేయటం భారతీయ రైల్వేల ఘనత అనే చెప్పాలి. మొత్తంగా ఈ రైళ్ళు 15 రాష్ట్రాలకు ఆక్సిజెన్ అందజేశాయి.  అవి: ఉత్తరాఖండ్, కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, పంజాబ్, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, అస్సాం. 

 

ఈ పత్రికా ప్రకటన వెలువడే సమయం వరకు మహారాష్ట్రలో 614 మెట్రిక టన్నుల ఆక్సిజెన్ దించారు. ఉత్తరప్రదేశ్ లో 3797 టన్నులు, మధ్యప్రదేశ్ లో  656 టన్నులు, ఢిల్లీలో  5722 టన్నులు, హర్యానాలో  2354 టన్నులు, రాజస్థాన్ లో  98 టన్నులు, కర్నాటకలో 3782 టన్నులు,  ఉత్తరాఖండ్ లో  320 టన్నులు, తమిళనాడులో  4941 టన్నులు,  ఆంధ్రప్రదేశ్ లో  3664 టన్నులు,  పంజాబ్ లో  225 టన్నులు, కేరళలో 513 టన్నులు, తెలంగాణలో 2972 టన్నులు,  జార్ఖండ్ లో  38 టన్నులు, అస్సాంలో 480 టన్నులు దించటం పూర్తయింది. 

ఆక్సిజెన్ ఎక్స్ ప్రెస్ లు ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 15 రాష్ట్రా లలోని 39 నగరాలు, పట్టణాలలో ఆక్సిజెన్ ను దించాయి. అవి: ఉత్తరప్రదేశ్ లోని లక్నో, వారణాసి, కాన్పూర్, బరేలీ, గోరఖ్ పూర్, ఆగ్రా  మధ్యప్రదేశ్ లోని సాగర్, జబల్పూర్, కట్నీ, భోపాల్, మహారాష్టలోని  నాగపూర్, నాసిక్, పూణె, ముంబయ్, సోలాపూర్, తెలంగాణలో హైదరాబాద్, హర్యానాలోని ఫరీదాబాద్, గురుగావ్, ఢిల్లీలోని తుగ్లకాబాద్, ఢిల్లీ కంటోన్మెంట్, ఓఖ్లా,రాజస్థాన్ లోనిఒ కోట, కనక్ పరా, కర్నాటకలోని బెంగళూరు,  ఉత్తరాఖండ్ లో డెహ్రాడూన్, ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు, గుంటూరు తాడిపత్రి, విశాఖపట్నం,  కేరళలో ఎర్నాకుళం, తమిళనాడులో తిరువళ్ళూరు, చెన్నై, తూత్తుకుడి, కోయంబత్తూరు, మదురై, పంజాబ్ లోని భటిండా, ఫిల్లౌర్, అస్సాంలోని  కామరూప్, జార్ఖండ్ లోని రాంచీ

భారతీయ రైల్వేలు అన్ని మార్గాలలో ఆక్సిజెన్ అందించటానికి వీలుగా సన్నాహాలు చేసుకోగలిగింది., అందువలన ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా అందుకు అనుగుణంగా అతి తక్కువ సమయంలో చేరుకోగల ప్రణాళికతో సిద్ధంగా ఉంది. ఆక్సిజెన్ తీసుకురావటానికి అవసరమైన టాంకర్లను ఆయా రాష్ట్రాలు సమకూర్చుతాయి.  పశ్చిమాన హాపా, బరోడా, ముంద్రా మొదలుకొని తూర్పున  రూర్కెలా, దుర్గాపూర్, టాటా నగర్, అంగుల్ నుంచి ఆక్సిజెన్ ను తీసుకొని ఉత్తరాఖండ్, కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, పంజాబ్, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, అస్సాం రాష్ట్రాలకు అందజేయగలిగింది. అలా ఎక్కడినుంచి ఎక్కడికైనా మోసుకెళుతూ సంక్లిష్టమైన కార్యక్రమాన్ని సైతం నిర్దిష్టంగా, నిర్దుష్టంగా ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలిగింది.

సాధ్యమైనంత వేగంగా తక్కువ సమయంలో చేరేలా చూడటానికి రైల్వే శాఖ సరకు రవాణాలో సరికొత్త ప్రమాణాలు సృష్టించుకొని అందుకు అనుగుణంగా  ఆక్సిజె న్ ఎక్స్ ప్రెస్ రైళ్ళు నడిపింది.  ఎక్కువ దూరం నడిచే మూడు కీలకమైన మార్గాలలోని రైళ్ల సగటు వేగం గంటకు 55 కిలోమీటర్లకు పైనే ఉంది. అత్యంత ప్రాధాన్యమిస్తూ గ్రీన్ కారిడార్ లో దారి ఇస్తూ అత్యవసర పరిస్థితికి అనుగుణంగా వ్యవహరించటంలోనూ, వివిధ జోన్ల మధ్య సమన్వయం సాధించటం వల్లనే ఇది సాధ్యమైంది. దీన్నొక సవాలుగా తీసుకొని రేయింబవళ్ళు అప్రమత్తంగా ఉండటం వల్లనే సకాలంలో ఆక్సిజెన్ అందించిన తృప్తి రైల్వేలకు దక్కింది. వివిధ సెక్షన్లలో సిబ్బంది మారటం లాంటి సాంకేతిక అనివార్యతలకు కేవలం ఒక నిమిషం మాత్రమే ఆపటం ఈ ఎక్స్ ప్రెస్ రైళ్లకిచ్చిన ప్రాధాన్యానికి అద్దం పట్టింది.  

ఆక్సిజెన్ రైళ్ళ రాకపోకలకు అంతరాయం గాని ఆలస్యంగాని జరగకుండా చూసేందుకు అన్ని ట్రాక్ లూ తెరచి ఉంది నిర్వహణ కార్యకలాపాలలో పూర్తి అప్రమత్తంగా ఉండటం గమనించవచ్చు. అదే సమయంలో ఇతర సరకు రవాణా వేగం ఏ మాత్రమూ తగ్గకుండా చూడగలగటం కూడా విశేషం. ఆక్సిజెన్ రైళ్ళు నడపటం ఒక కొత్త అనుభవమే అయినా ఎప్పటికప్పుడు  అందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటూ రైల్వే శాఖ ముందుకు సాగింది. ఈ రాత్రి కూడా పొద్దుపోయాక మరిన్ని ఆక్సిజెన్ రైళ్ళు ప్రయాణానికి సిద్ధమవుతున్నాయి.

 

***


(रिलीज़ आईडी: 1726813) आगंतुक पटल : 244
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi , Tamil