ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఢిల్లీ చాందినీ చౌక్ లో పునరుద్ధరించిన హరదయాళ్ మున్సిపల్ హెరిటేజ్ పబ్లిక్ లైబ్రరీని ప్రారంభించిన కేంద్రమంత్రి


అక్బర్ కాలంనాటి పర్షియన్ మహాభారతాన్ని ప్రశంసించిన మంత్రి డాక్టర్ హర్షవర్ధన్

కోవిడ్ నియంత్రణ ప్రవర్తనను అనురించాలని పిలుపు; కోవిడ్ యోధుల త్యాగాలు వృధాకాకూడదని సూచన
“ప్రధాని కలలుగన్న డిజిటల్ ఇండియా భారతీయుల జీవితాలను మెరుగుపరచింది”
దేశమంతటా త్వరలోనే టీకాల అందుబాటు పెరుగుతుందని డాక్టర్ హర్ష వర్ధన్ హామీ

Posted On: 11 JUN 2021 7:21PM by PIB Hyderabad

ఢిల్లీలోని చాందినీ చౌక్ లో ఇటీవలే పునరుద్ధరించిన హరిదయాళ్ మునిసిపల్ హెరిటేజ్ పబ్లిక్ లైబ్రరీని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రొ డాక్టర్ హర్షవర్ధన్ ప్రారంభించారు. అరుదైన గ్రంథాలున్న ఈ గ్రంధాలయాన్ని ఆయన జాతికి అంకితం చేశారు. దీని పునరుద్ధరణకోసం రూ. 3 కోట్లు వెచ్చించారు. 

 

ఈ సందర్భంగా డాక్టర్ హర్ష వర్ధన్ ఈ  పునరుద్ధరించిన గ్రంధాలయం గురించి మాట్లాడుతూ, పర్షియన్ మహాభారతాన్ని అబుల్ ఫజల్ అనువదించి అక్బర్ ఆస్థానంలో గానం చేసిన ఘనత ఉండగా అలాంటి గ్రంధం ఉండటం గొప్ప విషయమన్నారు. అదే విధంగా 1677 నాటి ప్రపంచ చరిత్ర గ్రంధం, 1810 లో చేతిరాతతో ఉన్న్ అ భాగవత పురాణం, భృగు సంహిత, హిందీ ఖురాన్ పాత గ్రంధం, యమునాపరీవాహక మైదాన ప్రాంత ప్రజలుమాట్లాడే బ్రిజి భాషలో తొలి గ్రంధం సైతం ఇక్కడ ఉందని గుర్తు చేశారు. 1862 లో మొదలై ఎన్నో పురాతన గ్రంధాలను నిక్షిప్తం చేసుకోవటంతోబాటు 1917 నుంచి 1988 దాకా ఢిల్లీ గెజెట్ లు అన్నీ ఉండటం మరో ప్రత్యేకతగా అభివర్ణించారు. 350 రాతప్రతులతోబాటు 8000 అత్యంత విలువైన పురాతన గ్రంధాలుండటం వలన వాటన్నిటినీ సంరక్షించటం భావ్యమని ఈ పునరుద్ధరణ చేపట్టామన్నారు. ఒక గ్రామం సరిహద్దు వివాదం భారత్-పాకిస్తాన్ విభజనతో సమస్యగా మారినపుడు ఈ గ్రంధాలయంలో దొరికిన సాక్ష్యాధారాలతో ఆ గ్రామం భారత్ పరమైందని ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తెచ్చారు.

కోవిడ్ నియంత్రణకు అనుకూలమైన ప్రవర్తనకు కట్టుబడి ఉండాలని మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈ సందర్భంగా ప్రజలకు మరోమారు పిలుపునిచ్చారు. దేశంలో కరోనా కేసులు నాలుగు వారాలుగా గణనీయంగా తగ్గుతూ ఉన్నాయని, లక్షలోపే రోజువారీ కేసులు వస్తున్న ధోరణి సాగుతోందని అన్నారు.  కేసులు తగ్గటం చూసి ఎంతమాత్రమూ నిర్లక్ష్య ధోరణితో ఉండకూదదని హెచ్చరించారు. అప్పుడప్పుడు మాత్రమే మాస్కులు ధరించటం, సరైన పద్ధతిలో ధరించకపోవటం, భౌతిక దూరం పాటించకపోవటం లాంటి కారణాలవల్లనే రెండో వేవ్ వచ్చిందన్నారు. ఎంతోమంది డాక్టర్లు, నర్సులు ఈ వ్యాధి నియంత్రణ ద్వారా మన ప్రాణాలు కాపాడటానికి వారి ప్రాణాలు సైతం త్యాగం చేయగా మనం వ్యాధి నియంత్రణకు పాటించే జాగ్రత్తలే వారికి ఘనమైన నివాళి అవుతుందని గుర్తించాలని హితవు పలికారు.

ఈ గ్రంధాలయాన్ని డిజిటైజ్ చేయటం గురించి ప్రస్తావిస్తూ, డిజిటల్ ఇండియా కోసం ప్రధాని శ్రీ నరేంద్రమోదీ కన్న కలల ఫలితంగానే ప్రభుత్వం చేపట్టిన డిజిటైజేషన్ విజయవంతమవుతోందన్నారు. మొత్తం లాక్ డౌన్ కాలంలో పది కోట్ల ఖాతాలకు సైతం లబ్ధి మొత్తాన్ని నేరుగా వారి వారి ఖాతాల్లో జమ అయ్యేలా చేయటం డిజిటలైజేషన్ వల్లనే సాధ్యమైందన్నారు. అదే విధంగా ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతాలలో అమలు చేస్తున్న నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ వలన ఆరోగ్య రంగంలో వేగం, పారదర్శకత, జవాబుదారీతనం పెరిగాయని గుర్తుచేశారు. ఇలాంటి కార్యక్రమాల వలన 80లలో ప్రజలలో ఉన్న “ కేంద్రప్రభుత్వం రూపాయి కేటాయిస్తే దాని లబ్ధిదారులకు కేవలం 15 పైసలే అందుతుంది” అనే అభిప్రాయం ఇప్పుడు పూర్తిగా పోవటానికి డిజిటలైజేషన్ కారణమైందన్నారు.

 

ప్రభుత్వం త్వరలో తగినన్ని టీకాలు అందరికీ అందుబాటులోకి వచ్చేలా చూస్తుందని,  18 ఏళ్ళు పైబడినవారందరికీ టీకాలు వేయటం పూర్తి చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ హామీ ఇచ్చారు. ఉత్పత్తి బాగా పెంచటం వలన మే నెలకంటే జూన్ లో ఎక్కువ టీకా డోసులు అందుబాటులోకి రావటాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ విధంగా సామర్థ్యం పెరిగే కొద్దీ, ఉత్పత్తి పెరిగి ప్రతి పౌరుడికీ టీకాలు వేయగలుగుతామన్నారు.

రాజ్య సభ మాజీ ఎంపీ శ్రీ విజయ్ గోయల్, బిజెపి మాజీ జాతీయ ఉపాధ్యక్షుడు శ్రీ శ్యామ్ జాజు,  ఉత్తరఢిల్లీ మేయర్ శ్రీ జయప్రకాశ్,  దక్షిణ ఢిల్లీ మేయర్ శ్రీమతి అనామిక, తూర్పు ఢిల్లీ మేయర్ శ్రీ నిర్మల్ జైన్, స్టాండింగ్ కమిటీ చైర్మన్ చహిల్ బిహారీ గోస్వామి  సభానాయకుడు శ్రీ యోగేశ్ కుమార్ వర్మ, గ్రంధాలయ సంయుక్త కార్యదర్శి శ్రీమతి సునీతా కౌశిక్, ఆ ప్రాంత కౌన్సిలర్ శ్రీ రవీంద్ర కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హరిదయాళ్ మున్సిపల్ హెరిటేజ్ పబ్లిక్ లైబ్రరీ కార్యదర్శి శ్రీమతి రేఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.



(Release ID: 1726430) Visitor Counter : 127


Read this release in: English , Urdu , Hindi , Tamil