విద్యుత్తు మంత్రిత్వ శాఖ
భారతదేశంలో విద్యుత్ సామర్థ్య పెంపుదల చర్యలను అమలు చేయడంద్వారా గణనీయమైన స్థాయిలో కర్బన ఉద్గారాలకు అడ్డుకట్ట.
విద్యుత్తును అధికంగా వాడే 13 విభాగాల్లో కర్బన ఉద్గారాల తగ్గింపుకు ప్రాధాన్యతనిచ్చేలా పర్ ఫార్మ్ అఛివ్ అండ్ ట్రేడ్ ( పిఏటి) పథకం. ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది 17 ఎంటిఓఇ ల ఆదాతోపాటు 87 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలకు అడ్డుకట్ట.
2020-21లో అమలు చేసిన స్టాండర్డ్స్ అండ్ లేబలింగ్ ( ఎస్ అండ్ ఎల్) కార్యక్రమంద్వారా 56 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా. దీని విలువ 3 వేల కోట్ల పైమాటే.
Posted On:
08 JUN 2021 9:08PM by PIB Hyderabad
విద్యుత్ ఆదాకోసం దేశవ్యాప్తంగా పరిశ్రమల్లో, సంస్థల్లో కేంద్ర విద్యుత్ శాఖ చేపట్టిన చర్యలు సత్ ఫలితాలను ఇస్తున్నాయి. వాతావరణంలో కర్బన ఉద్గారాలు తగ్గుతున్నాయి. ప్రత్యేకమైన పరికరాలను వాడడంద్వారా ఈ ఫలితాలను సాధిస్తున్నారు. భారీ పరిశ్రమలు, సంస్థల విషయంలో అమలు చేస్తున్న ఫర్ ఫార్మ్ అచివ్ అండ్ ట్రేడ్ ( పిఏటి) పథకం ఈ విషయంలో కీలకంగా మారింది. దీని ద్వారా సాంకేతికతలను అప్ డేట్ చేయడం, ఇంకా ఇతర చర్యలను చేపట్టడంద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తున్నారు. విద్యుత్తును ఆదా చేస్తున్న సంస్థలకు ఎనర్జీ సేవింగ్ సర్టిఫికెట్ ఇస్తున్నారు. విద్యుత్ ఆదాపై ఆయా సంస్థలకు లక్ష్యాలను నిర్దేశించి తద్వారా ఫలితాలను సాధించడం జరుగుతోంది.
పిఏటి పథకాన్ని 2020 నాటికి విద్యుత్ ను అధికంగా వాడుతున్న 13 సంస్థలకు విస్తరించారు. వీటిలో సిమెంట్, ఉక్కు, ఎరువుల తయారీ, థెర్మల్ విద్యుత్ కేంద్రాలు, రిఫైనరీలు, పెట్రోకెమికల్, రైల్వే రంగాలు వున్నాయి. ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది 17 ఎంటిఓఇ ల ( మిలియన్ టన్స్ ఆఫ్ ఆయిల్ ఈక్వివలెంట్) ఆదాతోపాటు 87 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలకు అడ్డుకట్ట వేయడం జరిగింది. ఇది బంగ్లాదేశ్ లాంటి దేశాలు వదిలే కర్బన ఉద్గారాలకు సమానం.
విద్యుత్ వినియోగానికి సంబంధించి ఇళ్లలోగానీ, ఆఫీసుల్లోగానీ వాడే విద్యుత్ పరికరాలే ముఖ్యం. అధిక విద్యుత్ ను వాడే వినియోగ వస్తువుల వాడకం పెరిగిన నేపథ్యంలో ప్రతి ఏడాది విద్యుత్ శక్తి డిమాండ్ పెరుగుతోంది. ఉన్నత సామర్థ్యంగల పరికరాలను వాడితే ఈ డిమాండును తగ్గించడానికి వీలు వుంటుంది. విద్యుత్తును సమర్థవంతంగా ఉపయోగించగలిగే ఉత్పత్తులను మాత్రమే మార్కెట్లోకి పంపడానికి వీలుగా బ్యూరో ఆప్ ఎనర్జీ ఎఫిషియన్సీ సంస్థద్వారా స్టాండర్డ్స్ అండ్ లేబలింగ్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం విద్యుత్ ఆదా చేసే వస్తువులపై ప్రజల్లో తగిన చైతన్యం కలిగించడం. విద్యుత్‌ను ఆదా చేసే పరికరాలను వాడడంవల్ల వినియోగదారులకు కలిగే మేలును ఈ పథకం ద్వారా వివరించడం జరుగుతోంది. ఈ పథకంద్వారా ఈ ఏడాది మార్చినాటికి 28 విద్యుత్ పరికరాల సమర్థతను ప్రజలకు వివరించారు. అంతే కాదు వీటికి సంబంధించిన 15 వేల మోడల్లను విద్యుత్ ఆదా సామర్థ్య మోడల్స్‌గా గుర్తించారు. వాటికి స్టార్ లేబుల్స్ వేశారు. తద్వారా దేశంలో 2020-21 నాటికి 56 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయింది. ఇది 30 వేల కోట్ల రూపాయల విలువైనది. ఈ కార్యక్రమంద్వారా ప్రతి ఏడాది దాదాపు 45 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలకు అడ్డుకట్ట వేయడం జరుగుతోంది. ఎంతో సమర్థవంతంగా ఫలితాలను ఇస్తున్న ఈ విధానాన్ని అంటే ఈ లేబలింగ్ కార్యక్రమాన్ని చాలా దేశాలు ఆదర్శంగా తీసుకొని ఫలితాలను పొందుతున్నాయి.
బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ( బిఇఇ)కి చెందిన అధికారి ఒకరు ఈ పథకం గురించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విద్యుత్ శాఖ ద్వారా మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ప్రభావవంతంగా పని చేస్తోందని ఇది అటు పర్యావరణానికి, ఇటు సమాజానికి ఉపయోగపడుతోందని అన్నారు. వివిధ రంగాలకు సంబంధించి నియంత్రిత విధానాలను, మార్కెట్ ఆధారిత విధానాలను సమన్వయం చేసుకుంటూ పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు.
భూమిపైన గల గ్రీన్ హౌస్ వాయువులలో ప్రధానమైనది కార్బన్ డయాక్సైడ్. వాతావరణంలో సివో2 నిల్వలు వేగంగా పెరిగిపోతున్న నేపథ్యంలో భూతాపం పెరిగిపోతోంది. తద్వారా పర్యావరణ, ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. పర్యావరణ వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి.
బిఇఇ అంటే ఏంటి?
విద్యుత్ సంరక్షణ చట్టం, 2001 ప్రకారం 2002లో కేంద్రప్రభుత్వ ఆధీనంలో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ని ఏర్పాటు చేశారు. విద్యుత్తును పొదుపు చేయడానికిగాను దేశంలోని అన్ని రంగాలకు అవసరమైన వ్యూహాలను, విధానాలను ఈ సంస్థ రూపొందించి అందిస్తోంది. తద్వారా ఆర్ధికరంగంపై భారం తగ్గుతోంది. ఇది విద్యుత్ సంరక్షణ చట్టం పరిధిలోనే పని చేస్తుంది. అన్ని రంగాలకు సంబంధించిన ప్రధానమైన సంస్థల సహకారంతో ఆయా రంగాల్లో విద్యుత్ సామర్థ్య విధానాలను అమలు చేయడం జరుగుతుంది.
***
(Release ID: 1725550)
Visitor Counter : 281