రైల్వే మంత్రిత్వ శాఖ

350కిపైగా ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా దేశవ్యాప్తంగా ప్రాణవాయువు సరఫరా పూర్తి


జాతికి 24387 టన్నుల ‘ఎల్‌ఎంఓ’ను చేరవేసిన ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌లు;

ఇప్పటిదాకా 1438 ట్యాంకర్లతో ‘ఎల్‌ఎంఓ’ రవాణాతో
15 రాష్ట్రాలకు ఊరటనిచ్చిన ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌లు;

ఈ మేరకు మహారాష్ట్ర-614; ఉత్తర ప్రదేశ్‌-3797; మధ్యప్రదేశ్‌-656; ఢిల్లీ-5692; హర్యానా-2135; రాజస్థాన్‌-98;

కర్ణాటక-2785; ఉత్తరాఖండ్‌-320; తమిళనాడు-2561; ఆంధ్రప్రదేశ్‌-2442; పంజాబ్‌-225; కేరళ-513;

తెలంగాణ-2184; జార్ఖండ్‌-38; అస్సాం-320 టన్నుల వంతున ప్రాణవాయువు చేరవేశాయి.

Posted On: 03 JUN 2021 6:00PM by PIB Hyderabad

   దేశవ్యాప్తంగా వైద్యపరమైన ద్రవ ఆక్సిజన్‌ (ఎల్‌ఎంఓ) రవాణాకు ఎదురైన అవరోధాలను అధిగమిస్తూ, కొత్త పరిష్కారాలతో ముందడుగు వేసిన భారత రైల్వేశాఖ వివిధ రాష్ట్రాలకు ఎంతో ఊరటనిస్తూ ప్రాణవాయువును సకాలంలో చేరవేసింది. ఈ మేరకు ఇప్పటిదాకా 1,438 ట్యాంకర్లతో 24387 టన్నులకుపైగా ‘ఎల్‌ఎంఓ’ను భారత రైల్వేలు ఆయా రాష్ట్రాలకు అందించాయి. తదనుగుణంగా నేటివరకూ మొత్తం 352 ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌లు ప్రాణవాయువు రవాణాలో తమ లక్ష్యాన్ని పూర్తిచేసుకోవడమేగాక అనేక రాష్ట్రాకు ఉపశమనం కలిగించాయి. దీనికి సంబంధించి వివరాలు అందే సమయానికి 11 ట్యాంకర్లలో 194 టన్నుల ‘ఎల్‌ఎంఓ'తో మరో 3 ఎక్స్‌ప్రెస్‌లు మార్గమధ్యంలో ఉన్నాయి.

   దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలకు ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా 2,100 టన్నులకుపైగా వైద్యపరమైన ద్రవ ఆక్సిజన్‌ (ఎల్‌ఎంఓ) అందింది. ఈ ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌లు 40 రోజల కిందట ఏప్రిల్‌ 24న మహారాష్ట్ర నుంచి 126 టన్నుల ‘ఎల్‌ఎంఓ’తో తమ ప్రయాణం ప్రారంభించడం ఈ సందర్భంగా గమనార్హం. ప్రాణవాయువు కోసం విజ్ఞప్తి చేసిన రాష్ట్రాలకు వీలైనంత ఎక్కువగా ఆక్సిజన్‌ సరఫరా చేయడాన్ని భారత రైల్వేశాఖ తన లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీనికి అనుగుణంగా మొత్తం 15 రాష్ట్రాలు- ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, పంజాబ్, కేరళ, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్, అస్సాంలకు ప్రాణవాయువు సరఫరాద్వారా ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌లు ఎంతో ఉపశమనం కలిగించాయి.

   భారత రైల్వేశాఖ ద్వారా ప్రాణవాయువు సరఫరాకు సంబంధించిన కడపటి సమాచారం అందే సమయానికి మహారాష్ట్రకు 614 టన్నులు; ఉత్తరప్రదేశ్‌కు దాదాపు 3797 టన్నులు, మధ్యప్రదేశ్‌కు 656 టన్నులు, ఢిల్లీకి 5692 టన్నులు, హర్యానాకు 2135 టన్నులు, రాజస్థాన్‌కు 98 టన్నులు, కర్ణాటకకు 2785 టన్నులు, ఉత్తరాఖండ్‌కు 320 టన్నులు, తమిళనాడుకు 2561 టన్నులు, ఆంధ్రప్రదేశ్‌కు 2442 టన్నులు, పంజాబ్‌కు 225 టన్నులు, కేరళకు 513 టన్నులు, తెలంగాణకు 2184 టన్నులు, జార్ఖండ్‌కు38 టన్నులు, అస్సాం రాష్ట్రానికి 320 టన్నుల చొప్పున ‘ఎల్‌ఎంఓ’ సరఫరా చేయబడింది.

   ఈ మేరకు దేశంలోని 15 రాష్ట్రాల్లోగల సుమారు 39 నగరాలు/పట్టణాలకు ‘ఎల్‌ఎంఓ’ రవాణా చేయబడింది. రాష్ట్రాలవారీగా- లక్నో, వారణాసి, కాన్పూర్‌, బరేలీ, గోరఖ్‌పూర్‌, ఆగ్రా (ఉత్తరప్రదేశ్‌); సాగర్‌, జబల్‌పూర్‌, కట్నీ, భోపాల్‌ (మధ్యప్రదేశ్‌); నాగ్‌పూర్, నాసిక్, పూణే, ముంబై, సోలాపూర్ (మహారాష్ట్ర); హైదరాబాద్ (తెలంగాణ); ఫరీదాబాద్, గురుగ్రామ్ (హర్యానా); తుగ్లకాబాద్, ఢిల్లీ కంటోన్మెంట్‌, ఓఖ్లా (ఢిల్లీ); కోట, కనక్‌పారా (రాజస్థాన్‌); బెంగళూరు (కర్ణాటక); డెహ్రాడూన్‌ (ఉత్తరాఖండ్‌); విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్‌); ఎర్నాకుళం (కేరళ); తిరువళ్లూరు, చెన్నై, ట్యుటికోరిన్‌, కోయంబత్తూరు, మదురై (తమిళనాడు); భటిండా ఫిలౌర్ (పంజాబ్‌); కామరూప్‌ (అస్సాం); రాంచీ (జార్ఖండ్‌) వంటి నగరాలు/పట్టణాలు ఈ జాబితాలో ఉన్నాయి.

   ఆక్సిజన్ సరఫరాకు వీలున్న ప్రదేశాలుగల వివిధ మార్గాలను భారత రైల్వేశాఖ ముందుగానే గుర్తించింది. తదనుగుణంగా ఏ రాష్ట్రంలోనైనా అవసరం పడిన సందర్భంలో అక్కడికి ఆక్సిజన్‌ రవాణాకు సదా సన్నద్ధతతో ఉంది. కాగా, ‘ఎల్‌ఎంఓ’ తీసుకొచ్చేందుకు ఆయా రాష్ట్రాలు రైల్వేశాఖకు ట్యాంకర్లను సమకూరుస్తాయి. వీటిద్వారా దేశం నలుదిక్కులలో పలుచోట్లగల ఆక్సిజన్‌ ఉత్పాదక ప్రాంతాలు- పశ్చిమాన హాపా, బరోడా, ముంద్రా; తూర్పున రూర్కెలా, దుర్గాపూర్, టాటానగర్, అంగుళ్‌ వంటి ప్రదేశాల నుంచి ట్యాంకర్లలో ఆక్సిజన్ నింపి,  దాన్ని ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, పంజాబ్, కేరళ, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, అస్సాం వంటి రాష్ట్రాలకు సంక్లిష్ట రైలు మార్గాలద్వారా రకరకాల ప్రణాళికల ప్రాతిపదికన చేరవేస్తుంది.

   ప్రాణవాయువు అవసరాలను సత్వరం తీర్చడం కోసం ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడపడంలో రైల్వేశాఖ ఎన్నడూ ఎరుగని సరికొత్త ప్రమాణాలు, మైలురాళ్లను సృష్టిస్తోంది. దూరప్రాంత మార్గాల్లో ఈ కీలకమైన రవాణా రైళ్ల సగటు వేగం అనేక సందర్భాల్లో 55 కిలోమీటర్లకన్నా ఎక్కువగా ఉంటోంది. అత్యంత ప్రాముఖ్యంగల హరిత కారిడార్‌లో వివిధ నిర్వహణ మండళ్ల బందాలు అత్యంత క్లిష్ట పరిస్థితుల నడుమన కూడా 24 గంటలూ శ్రమిస్తూ నిర్దేశిత సమయానికి ఆక్సిజన్‌ గమ్యానికి చేరేవిధంగా కర్తవ్యం నిర్వర్తిస్తున్నాయి. వివిధ సెక్షన్ల నడుమ సిబ్బంది విధులు మారడం కోసం సాంకేతికంగా నిలపాల్సిన సమయాన్ని కేవలం 1 నిమిషం స్థాయికి తగ్గించడం విశేషం. ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆగకుండా దూసుకెళ్లేందుకు వీలుగా ఆయా మార్గాలు సదా అందుబాటులో ఉంచబడుతున్నాయి. అదే సమయంలో ఇతర సరకు రవాణా రైళ్ల నిర్వహణకు భంగం కలగకుండా ఇదంతా సాగుతోంది. సరికొత్త ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ల నిర్వహణ చురుకైన కసరత్తు మాత్రమేగాక, సంబంధిత గణాంకాలు కూడా ఎప్పటికప్పుడు నవీకరించబడుతున్నాయి. ఇక ట్యాంకర్లలో ప్రాణవాయువు నింపుతున్న నేపథ్యంలో ఈ రాత్రి మరికొన్ని ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌లు బయల్దేరుతాయి.

 

***



(Release ID: 1724246) Visitor Counter : 131