రక్షణ మంత్రిత్వ శాఖ
కొలంబో తీరంవద్ద మంటల్లో శ్రీలంక నౌక!
అగ్ని జ్వాలల అదుపునకు వెనువెంటనే
రంగంలోకి దిగిన భారతీయ తీరరక్షణ దళం
Posted On:
26 MAY 2021 8:38PM by PIB Hyderabad
కొలంబో తీరానికి సమీపంలో హఠాత్తుగా అగ్నిప్రమాదానికి గురైన శ్రీలంక కంటెయినర్ నౌకలో మంటలను అదుపు చేసేందుకు భారతీయ తీరరక్షణ దళం (ఐ.సి.జి.) పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది. నౌకలో అగ్ని జ్వాలను నియంత్రించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. శ్రీలంకకు చెందిన ఎం.వి. ఎక్స్. ప్రెస్ పెరల్ అనే నౌకలో చెలరేగిన మంటలను అదుపుచేయడానికి భారత ప్రభుత్వం ఆదేశాలపై ఐ.సి.జి. ముందుకు దూకింది. శ్రీలంక ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై స్పందించిన భారత ప్రభుత్వం అంతకు ముందు తీరరక్షణ దళానికి తగిన ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సత్వరం సాయం అందించేందుకు ఐ.సి.జి. తన సాధనా సంపత్తిని పూర్తిగా ప్రయోగించింది. సముద్ర జలాల్లో గస్తీ విధుల్లో ఉన్న ఐ.సి.జి. వైభవ్ అనే నౌకను ఈ నెల 25న సంఘటనా స్థలానికి మళ్లించింది. మరో వైపు ట్యుటికోరిన్ తీరంనుంచి బయలుదేరిన ఐ.సి.జి. వజ్రా అనే నౌక ఈ నెల 26వ తేదీ తెల్లవారుజామునే ప్రమాద స్థలానికి చేరుకుంది. మంటలను అదుపు చేయడంలో ప్రస్తుతం ఈ రెండు నౌకలూ పూర్తిగా నిమగ్నమయ్యాయి. సముద్ర జలాల్లో ప్రతికూల వాతావరణాన్ని సైతం లెక్కచేయకుండా మంటలను అదుపు చేసేందుకు కృషి జరుగుతోంది.
ఈ రెండు నౌకలకు తోడు,.. కాలుష్యాన్ని నియంత్రించే ప్రత్యేక సదుపాయాలున్న ఐ.సి.జి. సముద్ర అనే నౌకను కూడా కూడా ప్రమాద స్థలానికి పంపించారు. అగ్ని జ్వాలలను అదుపుచేసే చర్యలను మరింత బలోపేతం చేసేందుకు, సముద్ర జలాల్లో చమురు తెట్టు ఏదైనా ఆవరించి ఉంటే అందుకు తగిన నివారణ చర్యలు తీసుకునేందుకు ఐ.సి.జి. సముద్రను పంపించారు. మరో వైపు పరిస్థితిని సమీక్షించేందుకు తీరరక్షణ దళానికే చెందిన ఐ.సి.జి. డోర్నియర్ విమానం ఆ ప్రాంతంలో విన్యాసాలు జరుపుతోంది. అయితే, ఆ ప్రాంతంలో చమురుతెట్టు సంఘటన జరిగినట్టు సమాచారం మాత్రం అందలేదు.
శ్రీలంకకు చెందిన ఎం.వి. ఎక్స్. ప్రెస్ పెరల్ అనే నౌక ద్వారా నైట్రిక్ యాసిడ్, తదితర ప్రమాదకర రసాయనాలు నింపిన 1,486 కంటెయినర్లను సముద్రమార్గంలో రవాణా చేస్తుండగా ఆ నౌకలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. తీవ్రస్థాయిలో చెలరేగిన మంటలు, దానికి ప్రతికూల వాతావరణం తోడవడం కంటెయినర్ వాహనాలు దెబ్బతినడం తదితర పరిణామాల మధ్య, నౌక కుడివైపునకు ఒరిగింది. దీనితో నౌకలోని కంటెయినర్లు నౌకనుంచి జారి పడిపోయాయి. ఈ పరిస్థితిలో అగ్ని జ్వాలలను అదుపు చేసేందుకు ఐ.సి.జి. నౌకలు, శ్రీలంకకు చెందిన నాలుగు ఓడలు ఉమ్మడిగా తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నాయి.
దీనికి తోడు సముద్ర జలాల్లో ఏదైనా కాలుష్యం తలెత్తిన పక్షంలో వెంటనే పరిస్థితిని నియంత్రించేందుకు, కావలసిన సహాయ సహకారాలను అందించేందుకు వీలుగా కోచి, చెన్నై, ట్యుటికోరిన్ తీరాల్లో ఐ.సి.జి. తగిన సన్నాహాలు చేసింది. ఎం.వి. ఎక్స్ ప్రెస్ పెరల్ నౌకలో అగ్ని జ్వాలలను అదుపు జేసే ప్రయత్నాల్లో భాగంగా,.. శ్రీలంక తీరరక్షణ దళంతో, శ్రీలంక అధికారులతో ఐ.సి.జి. సమన్వయం నెరుపుతోంది.
***
(Release ID: 1722047)
Visitor Counter : 162