విద్యుత్తు మంత్రిత్వ శాఖ

హిమాచల్‌ప్రదేశ్‌లో నాలుగు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసిన ఎస్‌జేవీఎన్‌ లిమిటెడ్

Posted On: 26 MAY 2021 6:04PM by PIB Hyderabad

కేంద్ర విద్యుత్‌ శాఖ, హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వ ఉమ్మడి సంస్థ అయిన ఎస్‌జేవీఎన్‌ లిమిటెడ్‌, హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లా (రామ్‌పూర్‌), కిన్నూర్‌, లాహౌల్‌ స్పితి, హమీర్‌పూర్‌ జిల్లాల్లో నాలుగు ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ఇందుకోసం 4.5 కోట్లు వ్యయం చేసింది. రాష్ట్ర ప్రజలందరికీ టీకాలు వేయించాలన్న తన ప్రయత్నాల్లో భాగంగా, టీకాలను నిల్వ చేసే రూ.కోటి విలువైన శీతల ఉపకరణాలను కూడా ప్రభుత్వానికి అందించింది.

    ఐజీఎంసీకి రూ.2 కోట్లకుపైగా ఆర్థిక సాయానికితోడు, 50 వాలు పడకలను కూడా ఎస్‌జేవీఎన్‌ అందించింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రులకు వెంటిలేటర్లు, ఆక్సీమీటర్లు, ఇతర వైద్య పరికరాలు, పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు, చేతి తొడుగులను కూడా అందించింది.

    హిమాచల్‌ప్రదేశ్‌లో ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు, కొవిడ్‌పై పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థలకు రూ.కోటి వరకు సాయం అందజేసి, మద్దతుగా నిలిచింది. ఈ ఉదార కార్యక్రమాల కోసం గత నాలుగు నెలల్లో రూ.7.5 కోట్లు ఖర్చు చేసింది.

    బిహార్‌, ఉత్తరాఖండ్‌తోపాటు సంస్థ కార్యకలాపాలు సాగిస్తున్న రాష్ట్రాల్లోని ఆసుపత్రులకు వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్లు, ఆక్సీమీటర్లు, ఇతర వైద్య పరికరాలను ఎస్‌జేవీఎన్‌ అందించింది.

    కరోనాను ఎదుర్కొనేందుకు, ఎస్‌జేవీఎన్‌ ఉద్యోగులు తమ ఒకరోజు వేతనం రూ.45 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధి/ హెచ్‌.పి.కొవిడ్‌-19 సంఘీభావ ప్రతిస్పందన నిధికి విరాళంగా అందజేశారు.

    కొవిడ్‌ టీకాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు సంస్థ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు, ప్రాజెక్టులు/ కార్యాలయాల పరిధిలో నివశించే ప్రజలకు టీకాలు వేసేలా ఫోర్టిస్‌ ఆసుపత్రితో ఎస్‌జేవీఎన్‌ ఒప్పందం కుదుర్చుకుంది. 

    దేశాన్ని, ప్రజలను ఇబ్బంది పెట్టే సమస్యలు ఎదురైన ప్రతిసారీ ప్రభుత్వానికి, సమాజానికి మద్దతుగా నిలవడంలో ఎస్‌జేవీఎన్‌ ఎప్పుడూ ముందుంటోంది. అవసరాల్లో ఉన్న ప్రజలకు ఆహారం, ఇతర నిత్యావసరాలను అందిస్తూ తన ఉదారతను ఈ సంస్థ చాటుకుంటోంది. పీఎం కేర్స్‌ నిధికి రూ.25 కోట్లను విరాళంగా అందజేసింది.
 

***



(Release ID: 1722042) Visitor Counter : 178