ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
మహారాష్ట్రలో మరో గ్రామం కోవిడ్ రహితం!
సమష్టి కృషితో గ్రామస్థుల విజయం
కరోనా నిబంధనల అమలుతో లక్ష్య సాధన
గ్రామస్థుల్లో మార్పు తేవడంలో పంచాయతీదే కీలకపాత్ర
Posted On:
25 MAY 2021 11:11AM by PIB Hyderabad
కోవిడ్-19 సెకండ్ వేవ్.తో దేశం యావత్తూ యుద్ధం చేస్తుండగానే, మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామం కోవిడ్ రహితంగా ఆవిర్భవించింది. , అహ్మద్ నగర్ జిల్లాకు చెందిన భోయరే ఖుర్ద్ అనే గ్రామం కరోనా రహితంగా అవతరించింది. కోవిడ్ వ్యాప్తిపై ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కలిగించడం, కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించడం, గ్రామస్థులు క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు జరిపించుకోవడం, వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు బాధితులు తప్పనిసరిగా ఏకాంతంలో గడిపేలా చర్యలు తీసుకోవడం తదితర చర్యల ద్వారా గ్రామాన్ని కోవిడ్ రహితంగా తీర్చిదిద్దగలిగారు.
తమ లక్ష్యసాధనకోసం భోయరే ఖుర్ద్ గ్రామస్థులు హివారే బజార్ గ్రామం అడుగుజాడల్లో నడిచారు. 1,500మంది జనాభాతో కూడిన భోయరే ఖుర్ద్ గ్రామంలో ప్రజలందరూ సమష్టిగా కృషి చేసి ఊళ్లో కోవిడ్ కేసులను సున్నా స్థాయికి తగ్గించేశారు. దీంతో గ్రామం యావత్తూ కరోనా రహితంగా మారిపోయింది.
అహ్మద్ నగర్ నగరానికి దాదాపు 20కిలోమీటర్ల దూరంలో ఉన్న భోయరే ఖుర్ద్ పూర్తిగా పర్వతమయంగా ఉంటుంది. అనావృష్టి పీడిత ప్రాంతం కావడంతో ఈ గ్రామస్థులు ఉపాధి కోసం ముంబై వంటి మహానగరాలకు వలసపోయారు. రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలు విధించడంతో వారిలో చాలామంది కార్మికులు తిరిగి తమ సొంత ఊరికి వచ్చేశారు
ఈ నేపథ్యంలో ఈ గ్రామంలో మొదట్లో 3-4 కోవిడ్ కేసులు బయటపడ్డాయి. దీనితో కోవిడ్ సోకిన బాధితుల కుటుంబాలకు గ్రామ పంచాయతీ, ఆరోగ్య శాఖ వెంటనే యాంటిజెన్ పరీక్షలు నిర్వహించాయి. వ్యాధి లక్షణాలు ఉన్నాయని అనుమానం రాగానే అలాంటి వారందరినీ వెంటనే ఏకాంతంలో ఉంచేశారు.
దీని తర్వాత, తమ గ్రామాన్ని కరోనా రహితంగా తయారు చేయాలనే లక్ష్యంతో గ్రామస్థులు చొరవ తీసుకుని కొన్ని కార్యక్రమాలను చేపట్టారు. ఆశా వర్కర్లు, అంగన్ వాడీ కార్యకర్తల సహాయంతో గ్రామంలోని అన్ని కుటుంబాలకూ ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ వచ్చారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసే మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా వారు ఈ పరీక్షలు నిర్వహిస్తూ వచ్చారు.
కోవిడ్ నిబంధనలను అమలుచేసే చర్యల్లో పాలుపంచుకున్న డాక్టర్ సవితా కూటే కూడా తన అనుభవాలను పంచుకున్నారు. “గ్రామస్థుల్లో ఎవరికైనా జ్వరం, దగ్గు, ఆయాసం, వంటి లక్షణాలు కనిపించగానే అలాంటి వారికి వెంటనే యాంటిజెన్ పరీక్షలు నిర్వహించారు. వెనువెంటనే వారిని ఐసొలేషన్ లో ఉంచేశారు.” అంటూ డాక్టర్ సవిత వివరించారు.
ఒకవైపు వైద్యపరీక్షలు, ఐసొలేషన్ ఏర్పాట్లు చేస్తూనే మరో వైపు కోవిడ్ వైరస్ గురించి పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాన్ని కూడా గ్రామంలోని ఒక దేవాలంలో ప్రారంభించారు. కోవిడ్ నిబంధనలను, జాగ్రత్తలను గురించి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం లౌడ్ స్పీకర్ ద్వారా ప్రజలకు వివరించారు. వ్యాధి లక్షణాలు, వ్యాధి వ్యాప్తి గురించి గ్రామస్థులకు తెలియజేయడమేకాక, మహమ్మారి వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత సమయంలో తమను, తమ కుటుంబాలను కాపాడుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజెపుతూ వచ్చారు.
మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచుగా చేతులు శుభ్రపరుచుకోవడం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, వైరస్ సోకిన వారిని ఐసొలేషన్ లో ఉంచడం వంటి సందేశాలను గ్రామస్థులకు అర్థమయ్యేలా తెలియజెప్పారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు వెలువడే నిబంధనలను గ్రామస్థులు తప్పక పాటించేలా చేశారు
రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ ఆంక్షలను ప్రకటించగానే, భోయరే ఖుర్ద్ గ్రామ పంచాయతీ కూడా కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు గట్టి చర్యలే తీసుకుంది. వెంటనే “గాఁవ్ బంద్” ఆంక్షలను అమలు చేసింది.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాజేంద్ర అంబేకర్ మాట్లాడుతూ, ఊర్లో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రంలో గడిపేలా కోవిడ్ పాజిటివ్ అనుమానితులను ఒప్పించామని, దీనితో వ్యాధి సంక్రమణను విచ్ఛిన్నం చేయగలిగామని, తద్వారా మే నెలలోగానే గ్రామాన్ని కరోనా రహితంగా తయారు చేయగలిగామని చెప్పారు. “ఇతర గ్రామాలు కూడా మా ఊరిని ఉదాహరణగా తీసుకుని మమ్మల్ని అనుసరిస్తే, అవి కూడా కోవిడ్ రహితంగా మారడానికి ఎంతో కాలం పట్టదు.” అని అంబేకర్ అన్నారు.
గ్రామాన్ని కోవిడ్ రహితంగా మార్చుకోవడంలో తాము ఎదుర్కొన్న సవాళ్లను గురించి గ్రామ సేవక్ నంద కిశోర్ దేవ్కర్ వివరించారు. “కుటుంబాలకు దూరంగా ఉండాలంటూ గ్రామంలో వైరస్ సోకిన బాధితులను ఒప్పించడం మొదట్లో చాలా కష్టమైంది. అయితే, క్రమం క్రమంగా వారు తమకు పొంచి ఉన్న ముప్పును గురించి అర్థం చేసుకున్నారు. ఇంకే ముంది..వైరస్ బాధితులందరినీ ప్రత్యేకంగా క్వారంటైన్ లో ఉంచడం ఆ తర్వాత మాకు చాలా సులభతరమైంది.“ అని నందకిశోర్ అన్నారు.
*****
(Release ID: 1721595)
Visitor Counter : 275