గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

రాజస్థాన్ మహిళల వ్యాపార విజయం!


శ్రీనాథ్ రాజీవికా మగ్వాస్ వన్ ధన్ వికాస్ క్లస్టరు ఏర్పాటు
వన్ ధన్ యోజన అందించిన ప్రోత్సాహంతో

గ్రామీణ, గిరిజన మహిళల అద్భుత విజయం
తమ సంప్రదాయాలను కొనసాగిస్తూనే ప్రగతి దిశగా ముందడుగు

Posted On: 20 MAY 2021 11:44AM by PIB Hyderabad

  గిరిజనుల అభ్యున్నతి లక్ష్యంగా ఏర్పడిన గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ధి సమాఖ్య (ట్రైఫెడ్) చేపట్టిన అనేక కార్యక్రమాలు వారి ఆర్థిక దుస్థితిని నివారించడంలో అండగా నిలుస్తున్నాయి. వన్ ధన్ యోజన కింద ఏర్పాటైన స్టార్టప్ కంపెనీలు, చిన్న తరహా అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం కనీస మద్దతు ధర పథకం, అటవీ ఉత్పత్తులను సమీకరించే వారికి  కనీస మద్దతు ధరను అందించే వస్తు విలువల, మార్కెటింగ్ వ్యవస్థ, ట్రైబల్ గ్రూపులు, క్లస్టర్ల ద్వారా మార్కెటింగ్ సదుపాయం తదితర చర్యలెన్నింటినో ట్రైఫెడ్ చేపడుతూ వస్తోంది. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అజమాయిషీలో ట్రైఫెడ్ అమలు చేసే ఇలాంటి కార్యక్రమాలతో గిరిజనులకు సవాళ్ల సమయంలో కూడా ఉపాధి లభిస్తోంది. ఇలాంటి గిరిజన విజయ గాథలకు  పశ్చిమ రాజస్థాన్ లోని వన్ ధన్ వికాస్ క్లస్టర్ గ్రూపు ఉదాహరణగా నిలుస్తోంది.

  గత సంవత్సర కాలంలో రాజస్థాన్ రాష్ట్రంలో మొత్తం 3,019 వన్ ధన్ వికాస కేంద్రాలు కలసి మొత్తం 189 వన్ వికాస్ కేంద్రాల క్లస్టర్లుగా రూపుదిద్దుకున్నాయి. వీటి ద్వారా దాదాపు 57,292 మంది గిరిజన లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారు. ఇప్పటి వరకూ  ఆ రాష్ట్రంలోని మొత్తం 37,259 వన్ ధన్ వికాస కేంద్రాలు 2,224 వన్ ధన్ వికాస కేంద్రాల క్లస్టర్లుగా రూపుదిద్దుకున్నాయి. ఒక్కో క్లస్టరులో 300మంది ఆదివాసీలు ఉంటున్నారు. గత రెండేళ్ల వ్యవధిలో ఈ క్లస్టర్లన్నింటికీ ట్రైఫెడ్ నుంచి ఆమోదం లభించింది.

  వీటిలో శ్రీనాథ్ రాజీవికా మగ్వాస్ పేరిట ఏర్పడిన వన్ ధన్ వికాస్ క్లస్టరు సాధించిన విజయాలు ఎంతో అద్భుతమైనవిగా రికార్టులకు ఎక్కాయి.

A picture containing text, personDescription automatically generatedA group of people standing outsideDescription automatically generated with low confidence

A picture containing different, severalDescription automatically generated

 

ఔత్సాహిక గిరిజన మహిళ శ్రీమతి ముగ్లీ బాయ్ నాయకత్వంలో ఏర్పడిన ఈ క్లస్టరు అతి తక్కువ వ్యవధిలోనే వనమూళికలతో తయారైన గులాల్.ను భారీ పరిమాణంలో విక్రయించింది. ఈ క్లస్టరు ద్వారా రూ. 5,80,000 విలువైన అమ్మకాలు జరిగాయి. 

  ఉదయపూర్ పరిధిలోని ఝదోలీకి చెందిన గిరిజనులు ఆ ప్రాంతపు దట్టమైన అటవీ ప్రాంతాలనుంచి వివిధ రకాల తాజా అటవీ పుష్పాలను సేకరిస్తారు. పలాశ్, కనేర్, రణికా, గేందా పుష్పాలను సేకరిస్తారు. ఇలా సేకరించిన పుష్పాలన్నింటినీ శ్రీనాథ్ వన్ ధన్ వికాస్ క్లస్టరుకు చేరుస్తారు. ఈ పుష్పాలన్నింటినీ పెద్దపెద్ద పాత్రల్లో నింపిన నీటిలో వేసి,..రెండు మూడు గంటలసేపు ఉడికిస్తారు. పుష్పాల సహజమైన రంగు పూర్తిగా నీటికి అబ్బేలా మరిగిస్తారు. తర్వాత రంగు నీళ్లను తీసి వాటికి మొక్క జొన్న పిండిని కలుపుతారు. దీనికి రోజ్ వాటర్ కలిపేసి మొత్తాన్ని గిరిజనులో చూర్ణంగా తయారు చేస్తారు. ఈ దశ అనంతరం బాగా ఎండబెట్టి అవాంచిత పదార్థాలను తొలగించి ఈ చూర్ణాన్ని గులాల్ గా తయారు చేస్తారు. ఇలా శుద్ధి చేసిన ప్రకృతి సిద్ధమైన గులాల్ ను ఆకర్షణీయంగా, గాలి చొరబడని రీతిలో ప్యాక్ చేసి విక్రయిస్తారు. వనమూళికలు, పుష్పాలతో గులాల్ తయారు చేసే ప్రక్రియలో 600మందికి పైగా గిరిజనులు పాలుపంచుకుంటున్నారు. గిరిజనులు తాము ఎంతోకాలంగా పాటిస్తున్న సంప్రదాయాలను, ఆనవాయితీలను కొనసాగిస్తూనే, ఇలా ఔత్సాహిక వ్యాపార ప్రక్రియలో పాలుపంచుకోవడం చక్కని విజయగాథగా నిలిచింది.  వన్ ధన్ వికాస్ యోజన అనే పథకం గిరిజనులకు ఎంతో ప్రయోజనకరంగా నిలిచిందనేందుకు ఇది గొప్ప నిదర్శనంగా నిలుస్తుంది.

   విలక్షణమైన ఏదైనా ఒక వన్ ధన్ వికాస్ కేంద్రంలో కనీసం 20మంది గిరిజనులు సభ్యులుగా ఉంటారు. ఇలాంటి 15 కేంద్రాలు, ఒక వన్ ధన్ వికాస్ క్లస్టరుగా ఏర్పడుతుంది. ఈ క్లస్టర్లు తన పరిధిలోని వన్ ధన్ వికాస్ కేంద్రాలకు ఆర్థిక సహాయం, జీవనోపాధి, మార్కెట్ అనుసంధానం, వ్యాపార అవకాశాలను కల్పిస్తాయి. దేశంలోని మొత్తం 23 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో అటవీ ఉత్పత్తులను సమీకరించే దాదాపు 6.67లక్షల గిరిజనులకు ఈ క్లస్టర్లు అనేక అవకాశాలను కల్పిస్తున్నాయి.  ఇప్పటివరకూ దాదాపు 50లక్షల మంది గిరిజనులు వన్ ధన్ స్టార్టప్ కంపెనీల ద్వారా ప్రయోజనం పొందారంటే వన్ ధన్ వికాస్ యోజన ఏ మేరకు గిరిజనుల జీవితాలను ప్రభావితం చేస్తోందో తెలుసుకోవచ్చు.

   గిరిజన జనాభా జీవనోపాధిని మెరుగుపరచడం, ఎలాంటి ప్రయోజనాలకు నోచుకోని గిరిజనులకు మెరుగైన జీవితాన్ని అందించడం, లక్ష్యాలుగా ట్రైఫెడ్ పనిచేస్తోంది. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆద్వర్యంలో ట్రైఫెడ్ అనేక కార్యక్రమాలు చేపడుతూ వస్తోంది. రాబోయే రోజుల్లో వన్ ధన్ వికాస్ యోజన పథకం అమలుతో మరిన్ని గిరిజన విజయ గాథలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానిక ఉత్పత్తులకు, స్వదేశీ ఉత్పాదనలకే ప్రాధాన్యం, స్వావలంబన లక్ష్యంగా ఆత్మనిర్భర భారత్ వంటి నినాదాల స్ఫూర్తితో గిరిజనుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు గట్టిగా కృషి జరుగుతోంది. గిరిజనుల జీవన పరిస్థితుల సంపూర్ణ పరివర్తనే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి.

 

***(Release ID: 1720276) Visitor Counter : 118


Read this release in: English , Urdu , Hindi , Tamil