ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19పై ప్రజారోగ్య ప్రతిస్పందనతోపాటు పశ్చిమ బెంగాల్‌సహా 8 ఈశాన్య రాష్ట్రాల్లో టీకాల పురోగతిపై డాక్టర్ హర్షవర్ధన్ సమీక్ష
కోవిడ్-19పై పోరులో నియంత్రణ... నిఘా సహా కోవిడ్
అనుగుణ ప్రవర్తనే సమర్థ ఆయుధాలని స్పష్టీకరణ;
పట్టణ శివార్లు... గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించాల్సి ఉందని సూచన;
ఈ ఏడాది ఆఖరుకల్లా పెద్దలందరికీ టీకాలు: డాక్టర్ హర్షవర్ధన్
Posted On:
19 MAY 2021 6:36PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఇవాళ తమశాఖ సహాయమంత్రి శ్రీ అశ్వనీకుమార్ చౌబేతో కలసి పశ్చిమ బెంగాల్ సహా 8 ఈశాన్య భారత రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులు, ముఖ్య కార్యదర్శులు/అదనపు ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ రాష్ట్రాలలో రోజువారీ నమోదయ్యే కోవిడ్ కేసులే కాకుండా మరణాలు, నిర్ధారిత కేసుల శాతం హెచ్చుగా ఉన్న నేపథ్యంలో ఆయన సమీక్షించారు.
ఈ సమావేశంలో త్రిపుర ముఖ్యమంత్రి/ఆరోగ్యశాఖ బాధ్యతలు కూడా చూస్తున్న విప్లవ్ కుమార్ దేవ్‌తోపాటు అసోం, మేఘాలయ, మణిపూర్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, సిక్కిం రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులు శ్రీ కేశవ్ మహంత; శ్రీ ఎ.కె.హెక్; శ్రీ లాల్‌పోక్లోక్‌పామ్ జయంతకుమార్ సింగ్; డాక్టర్ ఆర్.లాల్‌తంగ్లియానా; శ్రీ అలోలిబాంగ్; శ్రీ పాంగ్నుయూఫోమ్; డాక్టర్ మణి కుమార్ శర్మ కూడా పాల్గొన్నారు. మహమ్మారిపై పోరాటంలో రాష్ట్ర పాలన యంత్రాంగాలు అంకితభావం, ఓర్పు ప్రదర్శించడమే కాకుండా ప్రజా సంక్షేమానికి భరోసా ఇస్తున్నాయని ఆయన అభినందించారు. ‘‘గౌరవనీయులైన ప్రధానమంత్రి నాయకత్వాన మహమ్మారిపై 2020లో సంయుక్తంగా పోరాడాం.. 2021లోనూ ఈ యుద్ధం కొనసాగిద్దాం’’ అని ఆయన చెప్పారు.
ఈ దిశగా ప్రభుత్వ కృషిద్వారా సాధించిన విజయం గురించి డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ- ‘‘మహమ్మారి ఆరంభ దశలో కోవిడ్ నిర్ధారణకు దేశంలో ఒకేఒక్క ప్రయోగశాల మాత్రమే ఉండగా, నేడు దేశవ్యాప్తంగా 2000కుపైగా అందుబాటులో ఉన్నాయి. తదనుగుణంగా రోజువారీ పరీక్షల సామర్థ్యాన్ని 25 లక్షల స్థాయికి పెంచాం. ఆ మేరకు నిన్న ఒక్కరోజే 20 లక్షల మందికిపైగా పరీక్షలు పూర్తిచేయడం ద్వారా భారత్ తొలి చారిత్రక మైలురాయిని అందుకుంది. ఇది అంతర్జాతీయ రికార్డు కూడా కావడం విశేషం’’ అని వివరించారు. దేశంలో ప్రస్తుత కేసుల పెరుగుదల ఉధృతిని ఎదుర్కొనడం కోసం నవ్య నియంత్రణ చర్యలపై నిశితంగా దృష్టి సారించాలని చెప్పారు. అంతేకాకుండా కోవిడ్ అనుగుణ ప్రవర్తన పద్ధతులను కొనసాగించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు.
టీకాల కార్యక్రమ కీలక ప్రాముఖ్యాన్ని విశదీకరిస్తూ- ఇటీవలే 18 కోట్ల మందికి టీకాలు వేయడంద్వారా భారత్ మరో మైలురాయిని అధిగమించిందని నొక్కి చెప్పారు. ఈ ఘనతను సాధించడంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు తమవంతు పాత్ర పోషించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, రాష్ట్రాలవద్ద మరో కోటి టీకా మోతాదులు అందుబాటులో ఉందని ఆయన గుర్తుచేశారు. అంతేకాకుండా ‘‘2021 ఆగస్టు నుంచి డిసెంబరు మధ్యలో 216 కోట్ల టీకా మోతాదులను కొనుగోలు చేయనుంది. ఇందులో ఈ ఏడాది జూలై నాటికి 51 కోట్ల టీకా మోతాదుల కొనుగోలు పూర్తవుతుంది’’ అని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య కార్యకర్తలు, ముందువరుస పోరాట యోధులకు ముప్పు అధికంగనుక వారికి పూర్తిస్థాయిలో టీకాలు వేసేలా చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకూ విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది చివరికల్లా దేశంలోని వయోజనులందరికీ టీకాలు వేసే స్థితికి చేరగలమని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి చెప్పారు.
ఈశాన్య భారత రాష్ట్రాలతోపాటు పశ్చిమ బెంగాల్ కూడా కీలక సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు డాక్టర్ హర్షవర్ధన్ ప్రముఖంగా ప్రస్తావించారు. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితిని వివరిస్తూ- మిజోరం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కొత్త కేసుల పెరుగుదల కనిపిస్తోంది. నాగాలాండ్ రాష్ట్రంలో రోజువారీ కేసులు (15-20 నుంచి రోజుకు 300దాకా), వారంవారీ వ్యాధి నిర్ధారణ శాతం (1 నుంచి 34శాతానికి) వేగంగా పెరుగుతున్నాయి; ఈ నేపథ్యంలో పట్టణ శివార్లు, గ్రామీణ ప్రాంతాల్లో పరీక్ష సదుపాయాలను బలోపేతం చేయాల్సి ఉంది. అలాగే అస్సాంలో రోజువారీ కొత్త కేసులలో కామరూప్ (మహానగరం) నుంచే 45 శాతం నమోదవుతున్నాయి. మరోవైపు మేఘాలయలోని ఈస్ట్ ఖాసీ హిల్స్, రిగ్బోయ్ ప్రాంతాల్లో రోజువారీ కేసుల పెరుగుదల అత్యధికంగా ఉంది. ఇక మణిపూర్ రాష్ట్రంలో కోలుకునే కేసులు 78 శాతం కాగా, నమోదిత కేసులలో మరణాలు 1 శాతంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది అని మంత్రి పేర్కొన్నారు. సిక్కింలోనూ నమోదిత కేసులలో మరణాల శాతం తగ్గించే దిశగా, నిర్బంధ గృహవైద్యంపై కఠిన పర్యవేక్షణతోపాటు సామాజిక నిఘాను బలోపేతం చేయాలని సిక్కిం ఆరోగ్యశాఖ మంత్రికి సూచించారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఐసీయూల పడకలలో దాదాపు 22.5 శాతం నిండిపోగా, క్యాపిటల్ కాంప్లెక్స్, చాంగ్లాంగ్ జిల్లాల్లో గరిష్ఠంగా కేసులు నమోదవుతున్నట్లు తెలిపారు. పశ్చిమ బెంగాల్ విషయానికొస్తే- అన్ని జిల్లాల్లోనూ నిర్ధారిత కేసుల శాతం అత్యధికంగా ఉందన్నారు. ముఖ్యంగా కోల్‌కతా, ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, హౌరా, నాడియా జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. త్రిపురలో నిర్ధారిత కేసులు ఏప్రిల్ నెలలో 1.3 శాతం కాగా, నేడు సుమారు 8.7 శాతానికి చేరినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పశ్చిమ త్రిపుర, ఉనాకోటి, దక్షిణ త్రిపుర ఆందోళనకర జిల్లాల జాబితాలో ఉన్నాయన్నారు.
దేశంలో పుట్టుకొస్తున్న కొత్త ధోరణిని డాక్టర్ హర్షవర్ధన్ ప్రస్తావించారు. చిన్న రాష్ట్రాల్లో నేడు కేసుల పెరుగుదల ధోరణి కనిపిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. దీని విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. ఆరోగ్య మౌలిక వసతుల ఉన్నతీకరణసహా సకాలంలో పరీక్షల సామర్థ్యం పెంపుపై రాష్ట్రాలు దృష్టి సారించాలని కోరారు. మార్గదర్శకాల్లో మార్పులతో యాంటిజెన్ పరీక్షలను ఇప్పుడు మరింత ఎక్కువగా నిర్వహించే వీలుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి చెప్పారు. తద్వారా నిర్ధారిత కేసులలో మరణశాతాన్ని తగ్గించవచ్చునని సూచించారు. ముఖ్యంగా పట్టణ శివార్లు, గ్రామీణ ప్రాంతాలపై గణనీయ స్థాయిలో శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతయినా ఉందన్నారు.
రాష్ట్రాల్లో ముఖ్యంగా ‘ఆర్టీ-పీసీఆర్’ పద్ధతి కింద పరీక్షల సంఖ్యను పెంచాల్సి ఉందని (ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ) సహాయమంత్రి శ్రీ అశ్వనీకుమార్ చౌబే పునరుద్ఘాటించారు. పర్వత రాష్ట్రాల్లో దుర్గమ ప్రాంతాలకు వైద్యం అందేవిధంగా దూరవాణి-సంప్రదింపు సేవలను విస్తృతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన నొక్కిచెప్పారు. ఇక రాష్ట్రాలకు బ్లాక్ ఫంగస్ మందులు, ఆక్సిజన్ సరఫరాలో కేంద్రం అన్నివిధాలా తోడ్పాటునిస్తున్నదని తెలిపారు. ‘‘నిర్దేశిత కోవిడ్ విధాన ప్రక్రియలను మనం కొనసాగించినప్పుడే కోవిడ్ మీద యుద్ధంలో మనం విజయం సాధించగలం’’ అని స్పష్టం చేశారు.
రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల క్రమం గురించి ‘జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం‘ (ఎన్‌సిడిసి) డైరెక్టర్ డాక్టర్ సుజీత్ కుమార్ కె.సింగ్ స్థూలంగా వివరించారు. ఈశాన్య రాష్ట్రాల్లో దుర్గమ భౌగోళిక పరిస్థితులున్న గ్రామీణ ప్రాంతాలకు వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో ‘ర్యాట్’ విధానంలో పరీక్షల నిర్వహణసహా టీకాల కార్యక్రమాన్ని పెంచాలని ఆయన సూచించారు. కొన్ని ప్రదేశాల్లో నిర్ధారిత కేసులు 33 శాతంకన్నా అధికంగా నమోదు కావడం ప్రత్యేకించి ఆందోళనకర అంశమని పేర్కొన్నారు. దేశ ఆరోగ్య సదుపాయాల సేవలు సంపూర్ణ స్థాయిలో అందని ప్రాంతాల్లో వ్యాధి విస్తృత వ్యాప్తిని ఈ పరిణామం సూచిస్తున్నదని తెలిపారు. కొన్ని పర్వత రాష్ట్రాల్లో నమోదిత కేసులలో అధిక మరణశాతాన్ని తగ్గించేందుకు గృహనిర్బంధ వైద్యం కేసులపై సముచిత పర్యవేక్షణ అవసరమని, ‘ఐఎల్‌ఐ/సారి‘ కేసుల నియంత్రణకు దిశగా నిఘాను మరింత మెరుగుపరచాలని ఆయన అభిప్రాయపడ్డారు.
టీకాలను సరైన మోతాదులో గరిష్ఠంగా సద్వినియోగం చేసుకోవడం గురించి (ఆరోగ్యశాఖ) అదనపు కార్యదర్శి శ్రీ వికాస్ శీల్ వివరించారు. జాతీయ సగటు (90 శాతం)తో పోలిస్తే త్రిపుర (82 శాతం) మినహా మిగిలిన రాష్ట్రాల్లో ఆరోగ్య సంరక్షణ/ముందువరుస కార్యకర్తలకు టీకాకరణ తక్కువగా ఉందన్నారు. ఆ మేరకు 45 ఏళ్లకుపైబడిన కేటగిరీలో టీకాల కార్యక్రమానికి సంబంధించి మేఘాలయ (28 శాతం), మణిపూర్ (26 శాతం), పశ్చిమ బెంగాల్ (25 శాతం), అస్సాం (23 శాతం), నాగాలాండ్ (22 శాతం) రాష్ట్రాలు జాతీయ సగటు (32శాతం)కన్నా తక్కువస్థాయిలో ఉన్నాయి. అందువల్ల ఈ కేటగిరీ ప్రజానీకానికి టీకాల లక్ష్యం చేరేదిశగా అందుబాటులోగల స్లాట్లను పూర్తిగా వినియోగించుకునేలా చూడాలన్నారు. తదనుగుణంగా టీకా ప్రాధాన్యంపై అవగాహన కార్యక్రమాల ద్వారా 45 ఏళ్లకు పైబడినవారు సహా ఆరోగ్య సంరక్షణ /ముందువరుస కార్యకర్తల కోసం అందుబాటులోగల టీకా స్లాట్లను పూర్తిగా ఉపయోగించుకోవాలని రాష్ట్రాలకు సూచించారు.
టీకాల వృథాను అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలకు సమావేశం సూచించింది. ముఖ్యంగా అస్సాం, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో టీకాలు గణనీయంగా వృథా అవుతున్నట్లు వివరించారు. వృథాను కనీస స్థాయికి తగ్గించే దిశగా సిబ్బందికి పునఃశిక్షణ ఇవ్వాలని సూచించింది. ‘‘కేంద్ర ప్రభుత్వ సరఫరాయేతర మార్గం’’ద్వారా తయారీదారుల నుంచి సకాలంలో టీకాల సరఫరాపై దృష్టి సారించాలని సూచింది. ఈ మేరకు వారితో క్రమం తప్పకుండా సమన్వయం చేసుకోవడానికి కేంద్రం తరహాలో రాష్ట్రస్థాయిలోనూ ఇద్దరు/ముగ్గురు సభ్యులతో బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరింది. ఈ బృందం ప్రైవేట్ ఆస్పత్రులతోనూ సమన్వయం చేసుకుంటుందని పేర్కొంది. ఈ రాష్ట్రాల్లోని ఆస్పత్రుల జాబితా, అవి కాంట్రాక్టు కుదుర్చుకున్న టీకా మోతాదులు-వాటి సరఫరా వివరాలను ఇప్పటికే రాష్ట్రాలకు అందించినట్లు తెలిపింది. టీకాల కార్యక్రమ వేగం పెంపుదిశగా కేంద్రం నుంచి అన్నివిధాలా చేయూత లభిస్తుందని ఈ సందర్భంగా డాక్టర్ హర్షవర్ధన్ హామీ ఇచ్చారు.
కోవిడ్-19 నియంత్రణ సన్నద్ధత మెరుగుపై సమావేశం ఇచ్చిన సలహాలు-సూచనలను స్వీకరించిన సందర్భంగా కేంద్రం నుంచి తమకు అందుతున్న తోడ్పాటుకు రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులు, అధికారులు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్, సంయుక్త కార్యదర్శి (ఆరోగ్య) శ్రీ లవ్ అగర్వాల్, ‘ఎన్‌సిడిసి’ డైరెక్టర్ డాక్టర్ సుజీత్ కె.సింగ్, ఆరోగ్యశాఖలోని ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1720122)
Visitor Counter : 162