శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
సమీకృత కొవిడ్-19 కమాండ్ సెంటర్ల ఏర్పాటుకు డీఎస్‌టీ సంస్థ టిఫాక్ సిఫార్సు
Posted On:
19 MAY 2021 4:38PM by PIB Hyderabad
"సమగ్ర సామగ్రి, సిబ్బందితో దేశంలోని ప్రతి జిల్లాలో ఒక కొవిడ్-19 కమాండ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలి. ఈ కేంద్రానికి, గ్రామీణ ప్రాంతాలకు మధ్య పరస్పరం సమాచార మార్పిడి జరగాలి. అందుబాటులో ఉన్న వనరుల అత్యధిక వినియోగం, ఇతర శాస్త్రీయ ప్రయోజనాల కోసం సమాచారాన్ని ఉపయోగించుకోవడానికి ఇది సాయపడుతుంది" అని 'సాంకేతిక సమాచార అంచనా, మదింపు సంస్థ'
(టిఫాక్) సూచించింది. శాస్త్ర, సాంకేతికత విభాగం ఆధ్వర్యంలోని పనిచేసే స్వతంత్ర సంస్థ, సాంకేతిక భాండాగారం ఇది.
ఊహించిన దానికంటే తీవ్రంగా కొవిడ్ విరుచుకుపడింది. ముఖ్యంగా రెండో దశలో వేగంగా వ్యాపించి, గ్రామీణ ప్రాంతాల్లోకి కూడా చొచ్చుకుపోయింది. భారత గ్రామీణ ప్రాంతాల్లోకి కొత్త తీవ్రతతో కొవిడ్ విస్తరించిన నేపథ్యంలో; వ్యాధి వ్యాప్తి శాతం, కోలుకున్నవారి శాతం, మరణాల శాతం, ఔషధాల సరఫరా, ఆస్పత్రి పడకలు, ఆక్సిజన్ వంటి వైద్య సదుపాయాల లభ్యతకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం ఒక్క క్లిక్‌తో ఆయా ప్రభుత్వాలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. దీనివల్ల, కరోనా మరింత వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేసేలా వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి వీలవుతుంది.
టిఫాక్ ప్రకారం, అన్ని జిల్లాల కొవిడ్ కమాండ్ సెంటర్లు రాష్ట్ర కొవిడ్ కమాండ్ సెంటర్‌తో అనుసంధానమై ఉండాలి. రాష్ట్రవ్యాప్త సమాచారం ఇక్కడ అందుబాటులో ఉంటుంది. అలాగే, అన్ని రాష్ట్రాల కొవిడ్ కమాండ్ సెంటర్లు జాతీయ కొవిడ్ కమాండ్ సెంటర్‌తో అనుసంధానమై ఉండాలి. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి రాష్ట్రం, పల్లెకు సంబంధించిన సమాచారం ఇక్కడ లభ్యమవుతుంది.
ఈ సమాచారం మొత్తాన్ని డిజిటల్ రూపంలో నిల్వ చేయాలి. తద్వారా, కాలానుగుణ సమాచారం మొత్తం జాతీయ కొవిడ్ కమాండ్ సెంటర్ ద్వారా కేంద్రానికి, రాష్ట్ర కొవిడ్ కమాండ్ సెంటర్ల ద్వారా ఆయా రాష్ట్రాలకు అందుబాటులోకి వస్తుంది.
***
(Release ID: 1719978)
Visitor Counter : 160