పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

కరోనాపై పోరాటంలో రాంచీ విమానాశ్రయం భాగస్వామ్యం జాప్యం లేకుండా అత్యవసర వైద్య సామగ్రి తరలింపు

Posted On: 10 MAY 2021 6:01PM by PIB Hyderabad

కరోనాను ఎదుర్కోవటానికి దేశంలోని విమానాశ్రయాలు భాగస్వాములవుతున్నాయి, దేశానికి మద్దతుగా వినయపూర్వక సహకారాన్ని అందిస్తున్నాయి. ఆక్సిజన్‌ ట్యాంకర్లు, కాన్‌సన్‌ట్రేటర్లు, నాజిళ్లు, కొవిడ్‌ టీకాలు, ఇంజెక్షన్లు, పరీక్ష కిట్లు, మందులు వంటి సామగ్రిని తరలించే క్రతువులో రాంచీ విమానాశ్రయం కూడా భాగస్వామిగా మారింది. అత్యవసర సామగ్రిని అత్యంత ప్రాధాన్యతతో, జాప్యం లేకుండా పంపేందుకు విమానాశ్రయ యాజమాన్యం అండగా నిలిచింది.

    దేశంలో ఆక్సిజన్‌ కొరతను అధిగమించడానికి గత నెల 24 నుంచి ఈ నెల 8వ తేదీ వరకు రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయంలో చేపట్టిన ఆపరేషన్‌లో 100 విమానాల ద్వారా 139 ఆక్సిజన్‌ ట్యాంకర్లను భారత వైమానిక దళం రవాణా చేసింది. సీ17, సీ130జే, ఏఎన్‌32, ఐఎల్‌76 వంటి వైమానిక దళ విమానాలు, ఇతర చిన్న విమానాలు స్వల్ప విరామాలతో ఈ రవాణాలో పాలుపంచుకున్నాయి.

    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన కొవిడ్‌ సంబంధిత జాగ్రత్తలన్నింటినీ ఈ ఆపరేషన్‌లో పాటించారు. ప్రయాణీకులు, సందర్శకులు, ఉద్యోగులు వంటి సంబంధిత వర్గాలవారంతా కొవిడ్‌ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని, రద్దీని తగ్గించేలా వివిధ సమయాలను ఎంచుకోవాలని విమానాశ్రయ యాజమాన్యం పదేపదే విజ్ఞప్తులు చేసింది. మాస్కులు ధరించడం, సామాజిక దూరం వంటి వాటిని కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే శిక్షాత్మక నిబంధనలు కూడా ఉన్నాయి.

    ఈ సందేశాన్ని తెలిపేలా టెర్మినళ్ల వద్ద అనేక ఎలక్ట్రానిక్, శాశ్వత బోర్డులను విమానాశ్రయాలు ప్రదర్శిస్తున్నాయి. కొవిడ్‌ జాగ్రత్తలను పాటించడం, ప్రయాణీకుల భద్రత పట్ల అవగాహన కల్పించడం ఈ ప్రచారం లక్ష్యం.

***



(Release ID: 1717519) Visitor Counter : 167


Read this release in: English , Urdu , Hindi , Tamil