ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ప్రజారోగ్యంపై భారత-అమెరికా చర్చలు
ప్రమాణ స్వీకారం సందర్భంగా అమెరికా ఆరోగ్యమంత్రి జేవియర్ బెసెరాను అభినందించిన డాక్టర్ హర్షవర్థన్
కోవిడ్-19పై కలిసికట్టుగా పోరాడాలని ప్రతిజ్ఞ, ప్రస్తుత మహమ్మారి నుంచి ప్రపంచాన్ని బయటపడేయాలని సంకల్పం
“ప్రజారోగ్యంపై ఉభయ దేశాలు అభివృద్ధి చేసుకున్న బలీయమైన సహకార బంధం కోవిడ్-19 మహమ్మారి వంటి అసాధారణ పరిస్థితుల్లో కూడా సహకారానికి, మద్దతుకు విస్తరించుకోవాలి”.
నాడు పోస్టు చేయడమైనది:
07 MAY 2021 9:09PM by PIB Hyderabad
భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ డిజిటల్ విధానంలో అమెరికా ఆరోగ్య, మానవ సర్వీసుల శాఖ మంత్రి జేవియర్ బెసెరాతో సంప్రదింపులు జరిపారు.
ఆరోగ్య, మానవ సర్వీసుల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జేవియర్ ను ఆయన అభినందించారు. ద్వైపాక్షిక సహకారం, కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఏర్పడిన అసాధారణమైన సవాలును ఎదుర్కొనడంలో సన్నిహితంగా సహకరించుకునేందుకు వీలుగా సంప్రదింపులు ప్రారంభించాలని నిర్ణయించడం పట్ల కృతజ్ఞతలు తెలియచేశారు.
“ప్రజారోగ్య రంగంలో పటిష్ఠమైన సహకారాన్ని ఉభయ దేశాలు నిర్మించుకున్నాయి. ప్రస్తుతం కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఎదురైన అసాధారణ పరిస్థితులను ఎదుర్కొనడానికి దాన్ని విస్తరించుకోనున్నాం” అని బెసెరా ప్రతిపాదనలకు స్పందిస్తూ డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు.
“ఉభయుల మధ్య సంఘీభావంపై పరస్పర ప్రకటనలు వెలువడడం హర్షదాయకం. ప్రస్తుత మహమ్మారి కాలంలో దాన్ని సత్వరం ఆచరణీయం చేయడానికి అది ఉపయోగపడుతుంది. ఔషధ సరఫరా విషయంలో అమెరికా అందించిన మద్దతును మేం అభినందిస్తూ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం” అన్నారు.
కోవిడ్-19ని అదుపు చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను హర్షవర్థన్ వివరిస్తూ ప్రముఖ ఆరోగ్య నిపుణులతో కూడిన నేషనల్ టాస్క్ ఫోర్స్ పర్యవేక్షణలో క్రియాశీలమైన, ముందస్తు, క్రమబద్ధమైన వైఖరి అవలంబిస్తున్నామన్నారు. “మేం టెస్టింగ్ మౌలిక వసతుల విస్తరణపై నిరంతరం దృష్టి పెడుతున్నాం. 2020 జనవరిలో ఒకే ఒక్క లాబ్ ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 2500కి చేరింది. ఐసొలేషన్ పడకల సంఖ్య 151 రెట్లు, ఐసియు పడకల సంఖ్య 35 రెట్లు పెంచాం. మెడికల్ ఆక్సిజెన్ నిలకడగా సరఫరా అయ్యేలా చూసేందుకు గుర్తించిన ఆస్పత్రులన్నింటిలోనూ ఆక్సిజెన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం. పెరిగిన డిమాండును తట్టుకునేందుకు ఆక్సిజెన్ ఉత్పత్తిని పెంచాం. భారతదేశంలో వ్యాక్సినేషన్ కు మద్దతు ఇవ్వడానికి కోవిన్ 2.0 పేరిట ఒక ప్రత్యేక డిజిటల్ ప్లాట్ ఫారం ఏర్పాటు చేశాం” అన్నారు.
కోవిడ్-19పై ఉమ్మడి పోరుకు, మహమ్మారి నుంచి ప్రపంచం యావత్తు బయటపడేలా చేసేందుకు “ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ, అనుబంధ వ్యవస్థలన్నీ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న ఈ మహమ్మారి కాలంలో స్థానిక, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ సహకారంతో మన ఉభయ దేశాలు భాగస్వామ్యాన్ని మరింత విస్తరించాలి” అని డాక్టర్ హర్షవర్థన్ అన్నారు.
కోవిడ్-19 కారణంగా తమ దేశం ఎదుర్కొన్న సంక్షోభాన్ని బెసెరా గుర్తు చేసుకుంటూ తాజా విస్తరణ కారణంగా బాధ పడుతున్న భారతీయులపై సానుభూతిని ప్రకటించారు. కోవిడ్-19పై కలసికట్టుగా పోరాటానికి సహకారం అందించేందుకు అధ్యక్షుడు బైడెన్ చెక్కుచెదరని కట్టుబాటు ప్రకటించారని ఆయన హామీ ఇచ్చారు.
భారత ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ (అంతర్జాతీయ ఆరోగ్య సహకారం) శ్రీ లవ్ అగర్వాల్; అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్, ఏజెన్సీ ఫర్ టాక్సిక్ సబ్ స్టెన్సెస్ అండ్ డిసీజ్ రిజిస్ర్టీ అడ్మినిస్ర్టేటర్ డాక్టర్ రోషెల్ పౌలా వాలెన్ స్కీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. గ్లోబల్ హెల్త్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్; జో బైడెన్ కు కోవిడ్-19 అడ్వైజరీ బోర్డు సభ్యుడు డాక్టర్ లాయస్ పేస్, అమెరికా ఆరోగ్య కార్యదర్శికి కౌన్సెటర్ శ్రీమతి సరా డెస్పరెస్; భారతదేశం తరఫున అమెరికా హెల్త్ అటాచీ డాక్టర్ ప్రీతా రాజారామన్ కూడా సమావేశంలో పాల్గొన్న వారిలో ఉన్నారు.
***
(రిలీజ్ ఐడి: 1717286)
సందర్శకుల సూచీ సంఖ్య : : 222