జల శక్తి మంత్రిత్వ శాఖ
జలజీవన్ మిషన్ పై అండమాన్ నికోబార్ కార్యాచరణ ప్రణాళిక సమర్ఫణ
సేవలందించడమే లక్ష్యంగా ప్రణాళికకు రూపకల్పన
Posted On:
08 MAY 2021 4:15PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ 2024 సంవత్సరానికల్లా కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేసే లక్ష్యంతో ప్రవేశపెట్టిన జలజీవన్ మిషన్ పథకం కింద కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ తన వార్షిక కార్యాచరణ నివేదికను జాతీయ కమిటీకి సమర్పించింది. సేవలను అందించడమనే లక్ష్యంపై దృష్టిని కేంద్రీకరిస్తూ అండమాన్ నికోబార్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. 2021-22వ ఆర్థిక సంవత్సరానికి ఈ ప్రణాళికను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమర్పించారు. అండమాన్ నికోబార్ దీవుల్లోని గ్రామీణ ప్రాంతాల్లో వందశాతం నీటి కుళాయిల కనెక్షన్లు అందించినట్టుగా 2021 మార్చి 22వ తేదీన ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ప్రకటించారు. దీనితో దేశంలో ఈ ఘనతను సాధించడంలో అండమాన్ నికోబార్ కేంద్రపాలిత ప్రాంతం మూడవ స్థానం సాధించింది. ఇప్పటికే, వందశాతం నీటి కనెక్షన్లు అందించిన ఘనతను గోవా, తెలంగాణ సాధించాయి. అండమాన్ నికోబార్ దీవుల గ్రామీణ ప్రాంతాల పరిధిలోని 9 బ్లాకులు, మూడు జిల్లాల్లో ఉన్న 266 గ్రామాల్లో మొత్తం 62వేల ఇళ్లు ఉన్నాయి. ఈ గ్రామాల్లోని ఇళ్లకు తోడుగా, 368 పాఠశాలలకు, 558 అంగన్ వాడీ కేంద్రాలకు, 292 ప్రజా సంస్థాగత సేవల కేంద్రాలకు కూడా పైపుల ద్వారా నీటి సరఫరాను కేంద్ర పాలిత ప్రాంత పరిపాలనా యంత్రాంగం ఏర్పాటు చేసింది.
జల జీవన్ మిషన్ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 ఆగస్టులో ప్రకటించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల భాగస్వామ్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తూ వస్తున్నారు. ఈ పథకం ప్రకటించిన నాటినుంచి ‘ప్రతి ఇంటికీ నీరు’ అన్న నినాదాన్ని సాకారం చేసేందుకు కేంద్రంతో పాటుగా, వివిధ రాష్ట్రప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సమష్టిగా కృషి చేస్తూ వస్తున్నాయి. జలజీవన్ మిషన్ పథకం ప్రారంభించే నాటికి దాదాపు 3.23కోట్ల ఇళ్లకు అంటే 17శాతం ఇళ్లకు కుళాయిల ద్వారా నీటి సరఫరా అందుబాటులో ఉంది. అప్పటినుంచి గత 19నెలల కాలంలో, కోవిడ్ వైరస్ మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ పల్లె ప్రాంతాల్లోని 4.17కోట్ల ఇళ్లకు కొత్తగా పైపుల ద్వారా నీటిని అందించారు. దీనితో దేశవ్యాప్తంగా 7.40కోట్ల ఇళ్లకు (38.6శాతం ఇళ్లకు) పరిశుద్ధమైన నీరు కుళాయిల ద్వారా అందుతోంది.
అండమాన్ నికోబార్ దీవుల్లో వందశాతం ఇళ్లకు నీటి కుళాయిలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో, అక్కడి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ ఇకపై ఎలాంటి ఆటంకం లేకుండా దీర్ఘకాల ప్రాతిపదికన నీటి కుళాయిల కనెక్షన్లు అందించాల్సిన అవసరం ఉంది. దీనితో 266 గ్రామాల్లో పూర్తి చేసిన నీటి సరఫరా పథకాలను సుస్థిరంగా కొనసాగించడంపై దృష్టిని కేంద్రీకరించాలని అండమాన్ నికోబార్ కేంద్ర ప్రాంతం తన వార్షిక కార్యాచరణ ప్రణాళికలో నిర్దేశించుకుంది. అలాగే, నీటి నాణ్యతా పర్యవేక్షణ, నిఘా వ్యవస్థ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత నీటి సరఫరా పర్యవేక్షణ, మురుగునీటి నిర్వహణ, నీటి సంరక్షణ, నీటి సమంజస వినియోగం, మురుగునీటి శుద్ధి ప్రక్రియ వంటి వాటిని ప్రధానంగా చేపట్టాలని కార్యాచరణ ప్రణాళికలో సంకల్పించారు.
జలజీవన్ మిషన్ కార్యక్రమం కింద, నీటి నాణ్యతా ప్రమాణాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. జలజీవన్ మిషన్ కార్యక్రమంలో ముందువరుసలో నిల్చి పనిచేసే సిబ్బందికి, స్థానిక ప్రజా సంఘాలకు నీటి నాణ్యతపై నిఘాలో క్రియాశీలక భాగస్వామ్యం కల్పించనున్నారు. నీటి నాణ్యతను పరీక్షించేందుకు క్షేత్రస్థాయి పరీక్షా కిట్లను వినియోగంలో ప్రతి గ్రామంలో ఐదుగురికి, ప్రత్యేకించి మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. నీటి సరఫరా వ్యవస్థకు ఉపయోగించే ప్రతి నీటి వనరునూ భౌతిక, రసాయన ప్రమాణాల ప్రాతిపదికగా ఏడాదికి ఒక సారి పరీక్షించాల్సి ఉంటుంది. అలాగే నీటిలో బాక్టీరియా కాలుష్యంపై ఏడాది రెండుసార్లు పరీక్షిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు సురక్షితమైన నీటి సరఫరాకు ఆయా రాష్ట్రాల్లోని ప్రజారోగ్య ఇంజినీరింగ్ శాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖ బాధ్యత వహిస్తాయి. క్రమం తప్పకుండా నీటిని పరిశోధనా శాలల్లో పరీక్షించడం ద్వారా నీటి నాణ్యతను కూడా ఈ శాఖలు పర్యవేక్షిస్తాయి. నీటి నాణ్యతా పరీక్షలకోసం అండమాన్ నికోబార్ కేంద్ర పాలిత ప్రాంతం స్థాయిలో ఒక పరిశోధనా శాలను ఏర్పాటు చేశారు. అలాగే జిల్లాల స్థాయిలో రెండు, సబ్ డివిజన్ స్థాయిలో ఏడు లేబరేటరీలను ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయి నీటి పరీక్షల కిట్ల వినియోగంలో అందరు ముఖ్యసేవికలకు, అంగన్ వాడీ కార్యకర్తలకు, పంచాయతీకి ఐదుగురు చొప్పున మహిళలకు శిక్షణ ఇచ్చారు. దీనికి తోడు, 75మంది ప్లంబర్లకు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం కింద శిక్షణ ఇచ్చారు.
వివిధ పథకాల ద్వారా అందుబాటులో ఉన్న వనరులను కూడా జలజీవన్ మిషన్ కోసం వినియోగించుకునేందుకు కృషి జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్.) నిధులు, స్వచ్ఛ భారత్ మిషన్ నిధులు, పంచాయతీ రాజ్ సంస్థలకు కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధులు, కాంపా నిధులు, స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులను కూడా వినియోగించుకునేందుకు చర్యలు తీసుకున్నారు. కన్వర్జెన్స్ నిధిని మురుగునీటి నిర్వహణకు, నీటి పొదుపు కార్యక్రమాలకు వినియోగించుకోవాలని అండమాన్ నికోబార్ కేంద్ర పాలిత కేంద్రానికి జలజీవన్ కమిషన్ జాతీయ కమిటీ సూచించింది.
జలజీవన్ మిషన్ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దేందుకు అండమాన్ నికోబార్ కేంద్రపాలిత ప్రాంతం గట్టిగా కృషి చేస్తోంది. ఈ లక్ష్యసాధనకోసమే ప్రజలను చైతన్య పరిచేందుకు దక్షిణ అండమాన్, ఉత్తర అండమాన్, మధ్య అండమాన్ పరిధిలోని 14చోట్ల 2020-21వ సంవత్సరంలో వీధి నాటకాలను, నుక్కడ్ నాటక్ కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే, పోస్టర్ తయారీ, వీడియో చిత్రీకరణ పోటీలు నిర్వహించారు. పథకంపై ప్రజలకు అవగాహన కల్పించి, పథకం అమలు ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు హోర్డింగులను, ప్రచార బ్యానర్లను ఏర్పాటు చేశారు. నీటి సంరక్షణ, నీటి పొదుపుపై పాఠశాల బాలలకు అవగాహన కల్పించే లక్ష్యంతో దాదాపు వెయ్యి చిన్నపుస్తకాలను ముద్రించారు. అధునాతన ప్రచార పద్ధతిలో ఇలాంటి కార్యక్రమాలను 2021-22వ సంవత్సరంలో మరింత విస్తృతంగా నిర్వహించేందుకు అండమాన్ నికోబార్ కేంద్ర పాలిత ప్రాంతం విస్తృతంగా సన్నాహాలు చేస్తోంది.
దేశంలో జలజీవన్ మిషన్ కార్యక్రమానికి రూ. 50,011కోట్ల బడ్జెట్ కేటాయింపులకు అదనంగా, 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి పంచాయతీ రాజ్ సంస్థలకు ఇచ్చే రూ. 26,940కోట్లు అందుబాటులో ఉన్నాయి. దీనికి తోడు, వివిధ రాష్ట్రాల ప్రాజెక్టుల నిధులు కూడా ఈ పథకానికి వినియోగించుకునే వెసులుపబాటు ఉంది. దీనితో దేశవ్యాప్తంగా పల్లెల్లో ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా నీటిని అందించేందుకు 2021-22వ సంవత్సరంలో లక్షకోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టాలని సంకల్పించారు. ఇంత భారీ స్థాయిలో జరిగే పెట్టుబడి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మంచి ఊపునిస్తుంది. అలాగే, యువతకు పెద్దఎత్తున ఉపాధినీ కల్పిస్తుంది. గ్రామీణ ప్రాంతాలకు ఒక గొప్ప వరంగా పేర్కొన దగిన ఈ పథకం అమలుతో మహిళలకు, బాలికలకు సుదూర ప్రాంతాలనుంచి నీటిని మోసుకువచ్చే ప్రయాస కూడా తప్పుతుంది.
*****
(Release ID: 1717280)
Visitor Counter : 128