ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ద్రవరూప వైద్య ఆక్సిజన్: వివరణ

Posted On: 06 MAY 2021 11:00AM by PIB Hyderabad

మానవ శరీరంలో 65 శాతం ప్రాణవాయువే(ఆక్సిజన్) ఉంటుందని మనందరికీ తెలిసిందే. అవును... మన ఉచ్వాసనిశ్వాసలకు ఆక్సిజన్ ఎంతో కీలకం... గ్లూకోజ్ నుంచి శక్తిని మన శరీర కణాలకు చేరవేసేది ఈ ప్రక్రియే. వాస్తవానికి శరీరంలోని ప్రతి కణానికీ ప్రాణవాయువు అవసరమే. మనం గాలి పీల్చినపుడు ఆక్సిజన్ పరమాణువులు మన ఊపిరితిత్తుల్లో ప్రవేశించి, వాటి గోడల గుండా రక్తప్రవాహంలో చేరుతాయి. ఇక కోవిడ్-19 తీవ్రతతో బాధపడే రోగులలో ఈ వ్యాధి ప్రధానంగా ఊపిరితిత్తుల పనితీరును దెబ్బతీస్తుంది కాబట్టి వారికి చికిత్సలో ఆక్సిజన్ చాలా కీలకం. కోవిడ్-19 తీవ్రత అధికంగాగల రోగులలో అత్యంత ప్రధాన లక్షణం శ్వాస సరిగా ఆడకపోవడం లేదా ఊపిరి పీల్చడంలో ఇబ్బంది కలగడమే. దీనివల్ల వివిధ శరీర భాగాలకు అవసరమైన ఆక్సిజన్ సరఫరాలోనూ లోపం ఏర్పడుతుంది. కనుక వారికి వైద్యపరమైన ప్రాణవాయువు ద్వారా ఆక్సిజన్ చికిత్స అవసరమవుతుంది. శరీరానికి ప్రాణవాయువు సరఫరాలో వైద్యపరమైన ద్రవరూప ఆక్సిజన్ (ఎల్ఎంఓ) ద్వారా చికిత్స అందించడం ఒక మార్గం. ‘ఎల్ఎంఓ’ అంటే చికిత్సలో ఉపయోగించే అత్యంత స్వచ్ఛమైన ఆక్సిజన్ రూపం. దీన్ని మానవ శరీరం కోసం మాత్రమే తయారుచేస్తారు.

ద్రవస్థితిలో ఎందుకు?

   స్వల్ప ద్రవీభవన, బాష్పీభవన స్థానాలుగల ఆక్సిజన్ గది ఉష్ణోగ్రత వద్ద వాయురూపంలో ఉంటుంది. అందువల్ల ద్రవరూపంలోకి మార్చడంద్వారా అధిక పరిమాణంలో నిల్వకు వీలు ఉండటంతోపాటు రవాణా సౌలభ్యం కూడా ఉంటుంది.

వైద్యపరమైన ద్రవరూప ఆక్సిజన్ ఎలా తయారుచేస్తారు?

   ఇందుకు చాలా పద్ధతులుండగా- ‘‘వాయు విభజన’’ యూనిట్ల (ఏఎస్‌యూ)ద్వారా ఆక్సిజన్ వేరుచేసే విధానాన్ని సర్వసాధారణంగా ఉపయోగిస్తుంటారు. ‘ఏఎస్‌యూ’లంటే ప్రాథమికంగా భారీ పరిమాణంలో వాయువులను వేరుచేసే యంత్రాగారాలు. వీటిలో ‘‘సూక్ష్మ స్వేదన పద్ధతి’’ (ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ మెథడ్)ని ఉపయోగించి, వాతావరణంలోని గాలినుంచి స్వచ్ఛమైన ప్రాణవాయువు (ఆక్సిజన్)ను ఉత్పత్తి చేస్తారు. సాధారణ గాలిలో నత్రజని (నైట్రోజన్) 78 శాతం, ఆమ్లజని (ఆక్సిజన్) 21 శాతం ఉండగా, మిగిలిన 1 శాతంలో అర్గాన్, కార్బన్-డై-ఆక్సైడ్, నియాన్, హీలియం, హైడ్రోజన్ వంటి ఇతర వాయువులుంటాయి. అందువల్ల ‘సూక్ష్మ స్వేదన’ పద్ధతిలో గాలినుంచి వాయువులను చల్లబరచి ద్రవరూపంలోకి మార్చిన తర్వాత వాటివాటి రూపాల్లోకి వేరుపరుస్తారు. అటుపైన అందులో నుంచి ద్రవరూప ప్రాణవాయువును వేరుచేస్తారు.

   వాతావరణంలోని గాలిని తొలుత ‘మైనస్ 181 డిగ్రీల’ సెంటీగ్రేడ్ స్థాయికి చల్లబరుస్తారు. ఈ స్థానం వద్ద ఆక్సిజన్ ద్రవరూపంలోకి మారుతుంది. ఇక నత్రజని ‘మైనస్ 196 డిగ్రీల’ సెంటీగ్రేడ్ వద్ద బాష్పీభవనం కనుక అది వాయురూపంలోనే ఉండిపోతుంది. అయితే, అర్గాన్ వాయువు ఆక్సిజన్ (–186°C)తో సమాన స్థాయిలో బాష్పీభవనం చెందుతుంది కాబట్టి, అది గణనీయ పరిమాణంలో ప్రాణవాయువుతోపాటు ద్రవీభవనం చెందుతుంది. ఈ ఆక్సిజన్, అర్గాన్ సమ్మేళనాన్ని వడకట్టి, పీడనం తగ్గించి, రెండో స్వల్ప-పీడనంగల స్వేదన పాత్రద్వారా పంపించి, మరింత శుద్ధిచేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక మనకు స్వచ్ఛమైన ద్రవరూప ఆక్సిజన్ లభిస్తుంది. దీన్ని అత్యల్ప ఉష్ణోగ్రతగల (క్రయోజెనిక్) ట్యాంకర్లద్వారా రవాణా చేస్తారు.

క్రయోజెనిక్ ట్యాంకర్లంటే ఏమిటి?

   క్రయోజెనిక్స్ అంటే- అత్యంత స్వల్ప ఉష్ణోగ్రత వద్ద పదార్థాల ఉత్పత్తి, వాటి స్వభావాలకు సంబంధించిన శాస్త్రం. క్రయోజెనిక్ ద్రవరూపం అంటే మైనస్ 90 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద బాష్పీభవనం చెందే ద్రవం. ఆ మేరకు మైనస్ 90 డిగ్రీల సెంటీగ్రేడుకన్నా అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద ద్రవీకృత వాయువుల సురక్షిత నిల్వ, రవాణాలో పొదుపు కోసం క్రయోజెనిక్ ద్రవ ట్యాంకర్లను ప్రత్యేకంగా రూపొందిస్తారు. ఇవి అత్యంత సురక్షిత రీతిలో రక్షిత పొరను కలిగి ఉంటాయి కాబట్టి, అత్యల్ప ఉష్ణోగ్రత వద్ద ద్రవరూప వాయువులను వీటిలో నిల్వచేయవచ్చు.

పీడన అనుగుణ శోషణ సాంకేతిక పద్ధతి అంటే ఏమిటి?

   ఆక్సిజ‌న్‌ను క్రయోజెనిక్ రహితంగా ప్రత్యేక శోషణ పద్ధతిని ఉపయోగించి  వాయురూపంలోనూ తయారు చేయవచ్చు. అత్యధిక పీడనంవద్ద కొన్ని వాయువులు ఘన ఉపరితలాలవైపు ఆకర్షితమయ్యే స్వభావాన్ని ఈ పద్ధతిలో సద్వినియోగం చేసుకుంటారు. పీడనం ఎంత అధికంగా ఉంటే, వాయువు అంత అధికంగా గ్రహించ(శోషించ)బడుతుంది. వాతావరణంలోని గాలివంటి వాయువుల సమ్మేళనాన్ని పీడనం నడుమ ‘జియోలైట్’ వంటి గ్రహణ (శోషణ) శక్తిగల పదార్థమున్న పాత్రగుండా పంపినపుడు అది ఆక్సిజన్ కన్నా నైట్రోజ‌న్‌ను అధికంగా ఆకర్షిస్తుంది. దీంతో కొంతభాగం లేదా మొత్తం నైట్రోజన్ ఆ పదార్థ ఉపరితలంపై ఉండిపోతుంది. అదిపోగా పాత్రనుంచి వెలువడే మిగిలిన వాయువులో తొలుత ప్రవేశపెట్టిన సమ్మేళనంతో పోలిస్తే ఆక్సిజన్ అత్యధికంగా ఉంటుంది. ఈ పద్ధతిని ఉపయోగించి తమ ప్రాంగణాల్లోనే ఆక్సిజన్ తయారీ యంత్రాగారాలను ఆస్పత్రులు ఏర్పాటు చేసుకునే వీలుంటుంది. తద్వారా పరిసరాల్లోని గాలిని కేంద్రీకరించుకుని, అందులోనుంచి ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇలా ఆస్పత్రుల సమీపాన ఆక్సిజన్ తయారీతో రవాణా అవసరం తప్పటమేగాక ప్రాణవాయువు అందుబాటు సౌలభ్యం ఉంటుంది. పైన పేర్కొన్న వైద్యపరమైన ఆక్సిజన్ వనరులకు అదనంగా సంచార ఆక్సిజన్ తయారీ యంత్రపరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటినే ‘ఆక్సిజన్ సాంద్రీకరణ’ (కాన్సెంట్రేటర్) పరికరాలు అంటారు. వీటిని ఇళ్లవద్ద కూడా ఉపయోగించుకునే వీలుంటుంది.

ముందస్తు భద్రత చర్యలు

   ఉష్ణోగ్రత తగినంత అధిక స్థాయిలో ఉన్నట్లయితే, అనేక పదార్థాలు ఆక్సిజ‌న్‌లో మండిపోతాయి. అందువల్ల అగ్ని ముప్పు లేకుండా సముచిత రక్షణ చర్యలు తీసుకోవడం అవశ్యం. దీంతోపాటు ఆక్సిజన్ సదుపాయాల నిర్వహణలో సిబ్బందికి తగిన శిక్షణ కూడా ఇవ్వాలి. ముఖ్యంగా కోవిడ్-19 తీవ్రత దృష్ట్యా ఆస్పత్రులలో ఆక్సిజన్ సిలిండర్ల నిల్వ, నిర్వహణ కూడా పెరుగుతున్నందున ప్రమాదం ముప్పు కూడా అధికంగానే ఉంటుంది. వైద్యపరమైన ఆక్సిజన్ విషయంలో అందుకోసం ఆర్డరు చేసే వ్యక్తులవద్ద తగిన ప్రిస్క్రిప్షన్ ఉండటంసహా మరికొన్ని అదనపు నియమ నిబంధనలను కూడా అనుసరించాల్సి ఉంది.

వివేచనతో ఆక్సిజన్ వినియోగం

   ఈ కీలకమైన ఆక్సిజన్ ఉత్పత్తిని ప్రత్యేకించి- ప్రస్తుత ప్రజారోగ్య అత్యవసర స్థితి నడుమ వివేచనతో ఉపయోగించేలా పౌరులు జాగ్రత్త వహించడం ముఖ్యం. దుర్వినియోగం చేయడం లేదా అవసరానికి మించి నిల్వచేయడమన్నది అనవసర భయాందోళనలకు, నల్లబజారు విక్రయాలకు దారితీస్తుంది. కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ కోవిడ్-19పై నిర్వహించిన విలేకరుల సమావేశం సందర్భంగా ‘ఎయిమ్స్’ సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ- ‘‘వివేచనతో ఆక్సిజన్ వినియోగం తక్షణావసరం. ఒక సిలిండర్ దుర్వినియోగం చేయడమంటే ఈ రోజుల్లో తీవ్రంగా చింతించాల్సిన అంశం. భవిష్యత్తులో తమకు అవసరం కావచ్చునన్న భయంతో చాలామంది ఇళ్లలో ఆక్సిజన్ సిలిండర్లను నిల్వ చేసుకుంటున్నారు. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. మీ ఆక్సిజన్ సంతృప్త స్థాయి 94 శాతం లేదా అంతకు మించి ఉన్నట్లయితే మీ శరీరంలో తగినంత ప్రాణవాయువు ఉందని అర్థం. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఆక్సిజన్ సాధారణ స్థాయిలోగల వ్యక్తి సిలిండరును ఉపయోగించడం దుర్వినియోగమేగాక ఆక్సిజన్ సంతృప్తత 90 శాతం లేదా 80 శాతంకన్న తక్కువగల వ్యక్తులకు ప్రాణవాయువు అందకుండా చేయడమే అవుతుంది’’ అని స్పష్టం చేశారు. అలాగే ఆక్సిజన్ సంతృప్తత 92 లేదా 93 ఉన్నప్పటికీ విషమంగా పరిగణించాల్సిన అవసరమే లేదని ఆయన వివరించారు. ఇలా ఉన్నపుడు రోగి సకాలంలో ఆస్పత్రికి చేరేదాకా ప్రమాదమేమీ ఉండదని దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చునని తెలిపారు.

 

***



(Release ID: 1716558) Visitor Counter : 420