జల శక్తి మంత్రిత్వ శాఖ
జల్ జీవన్ మిషన్ : వార్షిక ప్రణాళిక సమర్పించిన ఆంధ్రప్రదేశ్
2021-22లో 32.47 లక్షల కొళాయి కనెక్షన్లను ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించుకున్న రాష్ట్రం
Posted On:
30 APR 2021 3:56PM by PIB Hyderabad
రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో వున్న ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్ కల్పించాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి సంబంధించి 2021-22 ఆర్ధిక సంవత్సరం వార్షిక ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ వార్షిక కార్యాచరణ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 95.66 లక్షల కుటుంబాలు నివసిస్తున్నాయి. వీటిలో 47.13 %కుటుంబాలు మంచి నీటి కోసం కొళాయి కనెక్షన్ కలిగివున్నాయి. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 32.47 లక్షల మంచి నీటి కనెక్షన్ లను ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్రంలోని 13 జిల్లాలు, 17,044 గ్రామాలను ‘హర్ ఘర్ జల్’గా రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
జల్ జీవన్ మిషన్ క్రింద రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు రూపొందించే వార్షిక కార్యాచరణ ప్రణాళికలను తాగునీరు మరియు పారిశుధ్య శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఇతర మంత్రిత్వ శాఖలు / విభాగాలు మరియు నీతి ఆయోగ్ ప్రతినిధులు సభ్యులుగా ఉండే జాతీయ కమిటీ పరిశీలిస్తుంది. పరిశీలన తరువాత త్రైమాసిక పురోగతి మరియు ఎప్పటికప్పుడు చేసిన వ్యయం ఆధారంగా ఏడాది పొడవునా నిధులు విడుదల చేయబడతాయి. ‘హర్ ఘర్ జల్’ సాధించడానికి రాష్ట్రానికి సహాయపడటానికి వివరణాత్మక ప్రణాళికకు రూపకల్పన చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో జల్ జీవన్ మిషన్ కింద గత 1 ½ సంవత్సరాల కాలంలో 14.34 లక్షల కొళాయి కనెక్షన్లు అందించారు. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ లో 1,217 విలేజ్‌లను ‘హర్ ఘర్ జల్’ గా ప్రకటించారు. దీనిప్రకారం గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఇల్లు కొళాయి కనెక్షన్ కలిగి ఉన్నట్టు అయ్యింది. ప్రజలు ముఖ్యంగా మహిళలు, యువతులకు సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపే అవకాశం ఇవ్వడంతో పాటు జల్ జీవన్ మిషన్ సమాజానికి సాధికారతను కల్పిస్తోంది. మంచి నీటిని తీసుకొని రావడానికి ఇదివరకు మహిళలు, యువతులు ఎక్కువ సమయాన్ని వెచ్చించవలసి వచ్చేది. మంచి నీరు కోసం ఎక్కువ దూరం వెళ్ళవలసి వచ్చేది. ఇప్పుడు ఇంటికి కొళాయి ద్వారా నీరు సరఫరా అవడంతో ఆదా అవుతున్న సమయాన్ని వీరు ఇతర కార్యక్రమాలను చేపట్టడానికి, ఎక్కువ సమయం తమ కుటుంబ సభ్యులులతో గడపడానికి వీలవుతుంది.
ఆంధ్రప్రదేశ్ రూపొందించిన వార్షిక కార్యాచరణ కార్యక్రమాన్ని పరిశీలించిన జాతీయ కమిటీ నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాలు, షెడ్యూల్ కులాలు/ తెగలకు చెందినవారు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతాలు, కరవు ప్రాంతాలు, నీరు అవసరమైన ప్రాంతాలు , సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన పధకం కిందకి వచ్చే గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి పని చేయాలని సూచించింది.
2020 అక్టోబర్ రెండవ తేదీన ప్రారంభించిన 100 రోజుల కార్యాచరణ కింద 41,653 పాఠశాలలు, 42,722 అంగన్వాడీ కేంద్రాలు, 11,948 గ్రామా పంచాయతీ కార్యాలయాలు, 14,383 ఆరోగ్య కేంద్రాలకు మంచి నీటిని 100% పైపుల ద్వారా సరఫరా చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నిజాతీయ కమిటీ అభినందించింది.
జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్రానికి 2021-22లో కేటాయించిన 50,011 కోట్ల బడ్జెట్ నిధులు కాకుండా అదనంగా 15వ ఆర్ధిక సంఘం ఆర్‌ఎల్‌బి / పిఆర్‌ఐలకు నీటి సరఫరా, పారిశుధ్య నిధులు, రాష్ట్రాలకు ఇచ్చే మ్యాచింగ్ గ్రాంటులు, రాష్ట్ర ప్రాజెక్టులకు అందే నిధుల రూపంలో రాష్ట్రానికి కేటాయించిన 26,940 కోట్ల రూపాయలు అదనంగా అందుబాటులో ఉంటాయి. 2021-22లో దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో గృహాలకు మంచి నీటి సరఫరా చేయడానికి రూపొందించిన ప్రాజెక్టుల అమలుకు లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయనున్నారు. దీనివల్ల గ్రామీణ ఆర్ధికవ్యవస్థ బలపడుతుంది.
దీర్ఘ కాలంలో ప్రజలు జల్ జీవన్ మిషన్ కార్యక్రమాల అమలు బాధ్యతను తీసుకొనేలా చూడడానికి ప్రతి గ్రామానికి కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించి, నీటి సంఘాలను ఏర్పాటు చేయాలనీ జల్ జీవన్ మిషన్ మార్గదర్శకాలను రూపొందించింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ 18,659 గ్రామాలకుగాను 7,131 గ్రామాల్లో నీరు, పారిశుధ్య కమిటీ లను ఏర్పాటు చేసింది. స్థానిక గ్రామ ప్రజలు / గ్రామా పంచాయతీ, వినియోగదారులు సభ్యులుగా వుండే ఈ కమిటీ మంచి నీటి పథకాలు ఎక్కువకాలం సమర్ధంగా పనిచేసేలా చూసి నీటి సమస్య పరిష్కారానికి దోహదపడే విధంగా కార్యక్రమాలకు రూపకల్పన, నిర్వహణ, యాజమాన్య పద్ధతుల్లో కీలకంగా వ్యవహరిస్తోంది.
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, స్వచ్ఛ భారత్ మిషన్, 15 ఆర్ధిక సంఘం గ్రాంటులు, ప్రత్యామ్నాయ అడవుల పెంపకం, స్థానిక ప్రాంతాల అభివృద్ధి లాంటి కార్యక్రమాల కింద నిధులను సమీకరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నీటి పొదుపు, మంచి నీటి పరిశుభ్రత లాంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రానికి కమిటీ సూచించింది.
2024 నాటికి గ్రామీణ ప్రాంతంలో వున్న ప్రతి ఇంటికి పైపుల ద్వారా నీరు సరఫరా చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకాన్ని అమలు చేస్తోంది. 2020-21లో కొళాయి కనెక్షన్లు ఇవ్వడానికి రాష్ట్రాలకు కేంద్రం 790 కోట్ల రూపాయలను కేటాయించింది. ప్రస్తుత 2021-22 ఆర్ధిక సంవత్సరంలో మంచి నీటి సరఫరా సౌకర్యాలను మెరుగుపరచడానికి కేంద్రం 2,000 కోట్ల రూపాయలను కేటాయించింది.
గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరులను పటిష్టం చేయడం, సరఫరాను మెరుగు పరచడం, వ్యర్ధ జలాలను శుద్ధి చేసి తిరిగి వినియోగించడం లాంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీని కోసం జిల్లా, ఉప జిల్లా స్థాయిలో 408 మంది నిపుణులను నియమించాలని ఆంధ్రప్రదేశ్ నిర్ణయించింది. ఇంతేకాకుండా ఇంజినీరింగ్ అనుభవం వున్న 54,568 మంది సిబ్బందికి రాష్ట్ర/జిల్లా/బ్లాకు స్థాయి అధికారులు, గ్రామ కమిటీల సభ్యులు, స్వయంసహాయక సంఘాల సభ్యులకు ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది. ప్లంబర్, ఎలక్ట్రీషియన్, టాప్ పని, పంపుల నిర్వహణ అంశాలలో 18,536 మందికి శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. శిక్షణ పొందిన వీరిని జల్ జీవన్ మిషన్ కింద చేపట్టే నీటి ప్రాజెక్టుల నిర్వహణ కోసం వినియోగిస్తారు.
నీటి వనరుల లభ్యత, వినియోగ అంశాలపై ప్రజల భాగస్వామ్యం ఉండాలని జల్ జీవన్ మిషన్ నిర్దేశించింది. ప్రజలకు సాధికారత కల్పించడానికి ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగం సహకరిస్తున్నది. ప్రతి గ్రామంలో అయిదుగురు మహిళలకు నీటి నాణ్యత పరీక్ష పరికరాల వినియోగంలో శిక్షణ ఇవ్వడంతో పాటు వీటిని సకాలంలో కొనుగోలు చేసి సరఫరా చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. నీటి నాణ్యతను పరిశీలించడానికి రాష్ట్రంలో తొమ్మిది ప్రయోగశాలలు పనిచేస్తున్నాయి. వీటికి జాతీయ గుర్తింపు పొందడానికి కృషి జరుగుతోంది. నీటి నాణ్యతను పరీక్షించడానికి సబ్ డివిజన్ స్థాయిలో 69 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో వున్నాయి.
గ్రామాల్లో మంచి నీటి సరఫరా పరిశీలన యాజమాన్యం కోసం సెన్సార్ ఆధారిత పరికరాలను వినియోగించాలని రాష్ట్రానికి జాతీయ కమిటీ సూచించింది.
***
(Release ID: 1715141)
Visitor Counter : 217