రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కొవిడ్‌పై పోరాటానికి దిల్లీ కంటైన్‌మెంట్‌ ప్రాంతంలో ఆసుపత్రి వసతులను పెంచుతున్న భారత సైన్యం

Posted On: 28 APR 2021 8:00AM by PIB Hyderabad

దేశానికి నిస్వార్థ సేవ చేస్తున్న భారత సైన్యం, కొవిడ్‌పై పోరాటంలోనూ అదే నిబద్ధత చాటుతోంది. వృద్ధులు, వారిపై ఆధారపడినవారికి విస్తృత వైద్య సాయం అందించడానికి, యుద్ధ ప్రాతిపదికన అనేక ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో కొవిడ్‌ సౌకర్యాలను ఏర్పాటు చేసింది. పూర్తి కొవిడ్‌ ఆసుపత్రిగా మార్చిన 'బేస్‌ హాస్పిటల్‌ దిల్లీ కంటోన్మెంట్‌' (బీహెచ్‌డీసీ)లోనూ అలాంటి ఏర్పాట్లే చేసింది. అక్కడికి వచ్చే రోగులందరికీ అత్యవసర చికిత్స అందించేందుకు సంపూర్ణ వసతులు అందుబాటులో ఉంచింది.

    కరోనా రెండో దశ ప్రారంభంలో, బేస్‌ హాస్పిటల్‌లో 340 పడకలు ఏర్పాటు చేశారు. ఇందులో 250 ఆక్సిజన్‌ పడకలు. కొవిడ్‌ కేసుల్లో అనూహ్య పెరుగుదల కారణంగా అదనపు అవసరాల కోసం దీనిని ఏర్పాటు చేశారు. ఇక్కడ పడకలన్నీ నిండిపోగా, పడకలు ఖాళీ అయ్యేవరకు ఎదురు చూస్తామని అంగీకరించిన అదనపు రోగులకు ట్రౌమా కేంద్రంలో చికిత్సలు అందిస్తున్నారు. శుక్రవారం నాటికి 450 ఆక్సిజన్‌ పడకలు సహా 650 పడకలు సిద్ధం చేసేందుకు పనులు జరుగుతున్నాయి. గురువారం నాటికి ఐసీయూ పడకలను కూడా 12 నుంచి 35కు పెంచుతారు. జూన్‌ రెండో వారానికల్లా ఆసుపత్రి సామర్థ్యాన్ని 900 ఆక్సిజన్‌ పడకలకు విస్తరించేలా రెండో దశ విస్తరణ చేపడతారు.
 
    సమర్థవంతమైన రోగుల నిర్వహణ కోసం వైద్య నిపుణుల బృందం ఆధ్వర్యంలో కొత్త 'కొవిడ్‌ ఓపీడీ' 24 గంటలూ పని చేస్తోంది. ఇళ్లలోనే రోగుల ఐసోలేషన్‌, పరీక్షలు, చికిత్స సూచనలు, అవసరమైతే ఆసుపత్రుల్లో చేర్చుకోవడం వంటి సేవలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి ఇది నిర్వహిస్తోంది. ఈ బృందం రోజుకు దాదాపు 500 మంది రోగులను పరీక్షించి, అవసరమైన వైద్య సూచనలు అందజేస్తోంది. అత్యసవసర రోగులందరికీ తగిన చికిత్స అందేలా చూడడమే ఈ ప్రయత్న ఉద్దేశం.
 
    ఒక సీనియర్‌ అధికారి ఆధ్వర్యంలో "కొవిడ్‌ టెలీ కన్సల్టెన్సీ & ఇన్ఫర్మేషన్‌ సెల్‌" కూడా 24 గంటలూ పని చేస్తోంది. వైద్య సూచనలతోపాటు, ఆసుపత్రిలో చేరిన రోగుల వివరాలను ఇది అందిస్తోంది. ఈ విభాగాన్ని ప్రజలు బాగా ఉపయోగించుకుంటున్నదానికి గుర్తుగా సగటున 1200-1300 ఫోన్‌ కాల్స్‌ చేస్తూ తగిన సమాచారం పొందుతున్నారు. ఈ విభాగం నిర్వహిస్తున్న కొన్ని విధులు:-

- నిపుణులు అందించే వైద్య సలహాలతోపాటు టెలిఫోన్‌ ద్వారా సంప్రదింపులు
- ఆసుపత్రిలో చేరిన రోగుల సమాచారాన్ని బంధువులకు అందించడం
- పడక లభ్యత/ఆసుత్రిలో చేరికపై మార్గదర్శకత్వం
- కొవిడ్‌ పరీక్ష నివేదికలు
- రోగులు/బంధువుల నుంచి వచ్చే వ్యక్తిగత అభ్యర్థనలను సమన్వయం చేయడం
- కొవిడ్‌ టీకాకు సంబంధించిన సమాచారం
 
    టెలీ విభాగం సేవలు పొందడానికి ప్రజలు ఈ క్రింది నంబర్లకు ఫోన్‌ చేయాలి:-
 
- 011-25683580
- 011-25683585
- 011-25683581
- 37176 (ఆర్మీ లైన్‌ ద్వారా)

 

    కేసులు భారీగా పెరుగుతున్న కరోనా రెండో దశ సంక్షోభ సమయంలో అందుబాటులో ఉన్న అన్ని వైద్య వనరులను తమ సామర్థ్యం మేరకు భారత సైన్యం వినియోగంలోకి తీసుకొచ్చిన ఈ సమయంలో; విధేయత, చిత్తశుద్ధితో సేవలందిస్తున్న సైనిక వైద్య నిపుణులకు రోగులు మద్దతుగా నిలవాలి, వారిని ప్రోత్సహించాలని అభ్యర్థన.

***


(Release ID: 1714642)