ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
"చాలా మందికి కొవిడ్ స్వల్పంగానే సోకుతోంది, అందువల్ల ఆక్సిజన్ మరియు మందుల నిల్వలపై భయాందోళనలు అక్కర్లేదు" అని కొవిడ్ 19 కు సంబంధించిన ఆందోళనలు మరియు సమస్యలపై ప్రసంగిస్తూ డాక్టర్ గులేరియా తెలిపారు.
రెమ్‌డెసివిర్ దివ్య ఔషధం కాదు, స్వల్పలక్షణాలున్న రోగులకు దాన్ని ఉపయోగించకూడదు: డాక్టర్ గులేరియా
Posted On:
25 APR 2021 10:27PM by PIB Hyderabad
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా, మెదాంత ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నరేష్ ట్రెహాన్, ఎయిమ్స్ మెడిసిన్ విభాగం హెడ్ డాక్టర్ నవనీత్ విగ్ మరియు ఆరోగ్య సేవల డైరెక్టర్ డాక్టర్ సునీల్ కుమార్ లు కొవిడ్ 19కు సంబంధించిన ఆందోళనలు మరియు సమస్యలపై ఈ రోజు ప్రసంగించారు.
ఆక్సిజన్ మరియు ఔషాధాల కొరత గురించి డాక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ, “ఇళ్లలో రెమెడిసివిర్ మరియు ఆక్సిజన్ వంటి ఇంజెక్షన్ల నిల్వ చేయడం భయాందోళనలను సృష్టిస్తోంది. మరియు ఈ పద్దతి ఔషధాల కొరతకు కారణమవుతోంది. 85-90% మంది కొవిడ్ రోగులు తేలికపాటి జలుబు, జ్వరం, గొంతు నొప్పి మరియు వంటినొప్పితో మాత్రమే బాధపడతారు. ఇటువంటి వారికి ఇంట్లో ఉంచి చికిత్స అందిస్తే సరిపోతుంది. వారికి ఆక్సిజన్ లేదా రెమెడిసివిర్ అవసరం లేదు.” తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉన్న 10-15% మంది రోగులకు ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ లేదా ప్లాస్మా మొదలైనవి అవసరమవుతాయని, 5% కంటే తక్కువ మంది రోగులకు వెంటిలేటర్లు లేదా ఇంటెన్సివ్ కేర్ అవసరమని ఆయన అన్నారు.
రెమెడిసివిర్ ఆసుపత్రిలో ఉండటాన్ని తగ్గించదు లేదా ప్రాణాలను కాపాడదు అని ఆయన స్పష్టం చేశారు. మధ్యస్థ మరియు తీవ్రమైన కేసులలో మాత్రమే ఇది ఆసుపత్రిలో ఉండే అవసరాన్ని తగ్గించగలదు. స్వల్ప లక్షణాలున్న వారికి దీన్ని ఉపయోగించడం సమస్యలను క్లిష్టతరం చేస్తుంది. రెమ్‌డెసివిర్ దివ్య ఔషధం కాదు. ఇది ఆసుపత్రులలో మితమైన మరియు తీవ్రమైన కేసులకు మాత్రమే ఉపయోగిస్తారు అని తెలిపారు.
అవసరం లేనివారికి ఆక్సిజన్ అందించడంపై డాక్టర్ గులేరియా మాట్లాడుతూ " 94 కన్నా ఎక్కువ ఆక్సిజన్ లెవల్స్ కలిగి ఉన్నవారికి ఆక్సిజన్ అవసరం లేదు, ఎందుకంటే ఈ స్థాయికి మించి ఆక్సిజన్ లెవల్స్ పెరగడం రక్తంలో ఆక్సిజన్‌ను పెంచదు. అందువల్ల ఇది ఆక్సిజన్ సరఫరాలో కొరతను కలిగిస్తుంది మరియు తీవ్రమైన కేసులకు ఆక్సిజన్ లభ్యతను తగ్గిస్తుంది" అని తెలిపారు.
ఆర్టీ-పిసిఆర్ పాజిటివ్ టెస్ట్ తర్వాత వెంటనే తీసుకోవలసిన చర్యలపై డాక్టర్ నరేష్ ట్రెహాన్ మాట్లాడుతూ " ప్రజలు మొదట స్థానిక లేదా కుటుంబ వైద్యులను సంప్రదించాలని అన్నారు. కొవిడ్ వైద్య విధానంపై వైద్యులందరికీ తెలుసు. తద్వారా రోగి లక్షణాలను బట్టి హోం ఐసోలేషన్ కు సిఫార్సు చేయవచ్చు. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడే యోగా మరియు ప్రాణాయామం గురించి డాక్టర్ ట్రెహాన్ సలహా ఇచ్చారు. డబుల్ మాస్కింగ్, భౌతిక దూరం మరియు చేతుల పరిశుభ్రత యొక్క అవసరాలను డాక్టర్ ట్రెహాన్ పునరుద్ఘాటించారు. సరైన రక్షణ కోసం మాస్క్ ను ముక్కు మరియు నోటి చుట్టూ గాలి మార్గాన్ని మూసివేయాలని అన్నారు. రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు.
అక్సిజన్ డిమాండ్‌పై డాక్టర్ ట్రెహాన్ మాట్లాడుతూ ప్రస్తుత సంక్షోభంలో మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ అకస్మాత్తుగా పెరిగిందని అయితే దాని సరఫరా, తయారీ కోసం సరిపడా సౌకర్యాలు మన పరిశ్రమకు ఉన్నాయని అన్నారు. అయితే అందుకు అవసరమైన క్రయో రవాణా లేదు. దీనిపై ప్రభుత్వం చురుకుగా పనిచేస్తోంది. రాబోయే ఐదు నుంచి ఏడు రోజుల్లో పరిస్థితి అదుపులో వస్తుందని చెప్పారు.
పరిస్థితిని అదుపు చేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అనే అంశంపై డాక్టర్ సునీల్ కుమార్ ప్రసంగించారు. గత సంవత్సరం కోవిడ్ వచ్చినప్పుడు ఎటువంటి సంసిద్ధత లేకుండా ప్రభుత్వం అతి త్వరలో సామర్థ్యాన్ని అత్యున్నత స్థాయికి పెంచింది. కరోనా సంక్షోభానికి ముందు ఒకటి మాత్రమే ఉన్న ప్రయోగశాలలు 2500 కి పైగా ఏర్పాటు చేయబడ్డాయి. అలాగే పరీక్షా సామర్థ్యాన్ని రోజుకు లక్షల సంఖ్యకు పెంచాము. ట్రాకింగ్ మరియు కాంటాక్ట్ ట్రేసింగ్ మరియు పిపిఇ కిట్లు మరియు ఇతరుల తయారీని పెంచామని చెప్పారు. టీకాలు ప్రాముఖ్యతను పునరుద్ఘాటిస్తూ టీకాల దుష్ప్రభావాలు అతి తక్కువ స్థాయిలో ఉన్నాయని.. టీకాలు మరియు తగిన ప్రవర్తన కొవిడ్ వ్యాప్తిని అరికడతాయని డాక్టర్ సునీల్ చెప్పారు.
డాక్టర్ నవ్ నీత్ మాట్లాడుతూ రోగులకు చికిత్సను అందించే మన ఆరోగ్య కార్యకర్తలను మనం రక్షించాల్సిన అవసరం ఉంది. మన ఆరోగ్య కార్యకర్తలను కాపాడటానికి కొవిడ్ వ్యాప్తి గొలుసును విచ్ఛిన్నం చేయాలి మరియు అంటువ్యాధుల సంఖ్యను తగ్గించాలి. గొలుసును విచ్ఛిన్నం చేయడం సమాజంలోని అన్ని వర్గాల బాధ్యత. అన్నింటికంటే కొవిడ్ 19 సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ప్రజల బాధ్యత అని చెప్పారు.
****
(Release ID: 1714077)
Visitor Counter : 277