ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఢిల్లీలో మరిన్ని ఐ.సి.యు., ఆక్సిజన్ పడకలకోసం తక్షణ చర్యలు: డాక్టర్ హర్షవర్ధన్


కేంద్ర ఆసుపత్రుల్లో, ఎయిమ్స్.లో కోవిడ్ చికిత్సా ఏర్పాట్లపై కేంద్రమంత్రి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం

ఆసుపత్రుల మౌలిక సదుపాయాల పటిష్టతకు
తక్షణం అన్ని చర్యలూ తీసుకోవాలని ఆదేశం..
అన్ని కేంద్ర ఆసుపత్రులకోసం డి.ఆర్.డి.ఒ.-టాటాసన్స్ ఆధ్వర్యంలో
ఆక్సిజన్ తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు నిర్ణయం

Posted On: 23 APR 2021 5:50PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ రోగులకు అందించే చికిత్సా ఏర్పాట్లను సమీక్షించేందుకు ఈ రోజు నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశానికి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అధ్యక్షత వహించారు. న్యూఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రి, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి, లేడీ హార్డింగే వైద్య కళాశాల ఆసుపత్రి, అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఆసుపత్రులలో తీవ్ర అస్వస్థులైన కోవిడ్ రోగులకు చికిత్సా ఏర్పాట్లపై సమీక్షకోసం ఈ సమావేశం నిర్వహించారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే వర్చువల్ లింక్ ద్వారా ఈ సమావేశంలో పాలుపంచుకున్నారు.

https://ci3.googleusercontent.com/proxy/Bjr7DnQZZpyF7JTAMpd443eTDtMsLrrfBIy1S_uyuTmXyVcjcjaUgXZXvjql5HDnTFMk-pVrQZ3ldYCM_Q5PXzFARwOIjtMAJ1eGbBz1SQ7jigAjDFnG00Jrvg=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001Q9R1.jpg

   సమీక్షా సమావేశం సందర్భంగా డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ, ప్రస్తుతం దేశంలో కోవిడ్ వైరస్ సెకండ్ వేవ్ వ్యాప్తి వేగంగా సాగుతోందని, చాలా వరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రతి రోజూ  భారీగా కేసులు నమోదవుతూ వస్తున్నాయని, రోజువారీ మరణాల రేటు కూడా పెరిగిందని  అన్నారు. ‘సంపూర్ణ ప్రభుత్వం’, ‘సంపూర్ణ సమాజం’ అన్న పద్ధతిలో కోవిడ్ పై పోరాటానికి కేంద్ర ప్రభుత్వం నాయకత్వం వహిస్తోందన్నారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలనా యంత్రాంగాల సహకారంతో దేశంలో ఆసుపత్రులను, ఆరోగ్య మౌలిక మౌలిక సదుపాయాలను గణనీయంగా బలోపేతం చేసినట్టు, ఇందుకోసం ప్రభుత్వం అనేక క్రియాశీలక నిర్ణయాలు తీసుకున్నట్టు కేంద్రమంత్రి చెప్పారు. ఇదివరకెన్నడూ లేనంత భారీ స్థాయిలో రోజువారీ కేసులు పెరుగుతూ ఉండటంతో, వివిధ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సదుపాయం ఉన్న ఐ.సి.యు. పడకలను, తగినంతగా ఆక్సిజన్, మందుల సరఫరాను, శిక్షితులైన సిబ్బందిని భారీ స్థాయిలో పెంచినట్టు ఆయన తెలిపారు.

https://ci4.googleusercontent.com/proxy/9aE8nw92VRIrR1b0bIJoCKd2kiO5cSV3OXgVDxJSMbw9IAWopbWsC2JYAbbSxZHj75kGOWGMNHt6axRCuK-uFPGGNg1Axse-D37QiOYt9x9PijdeHe5HOAvQyw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002KJIF.jpg

   ఆయా ఆసుపత్రుల్లో పడకల లభ్యత, ఆక్సిజన్ సదుపాయం ఉన్న పడకలు, ఐ.సి.యు. వెంటలేడర్ పడకల లభ్యతను కేంద్రమంత్రి కూలంకషంగా సమీక్షించారు. కోవిడ్ రోగుల తక్షణావసరాలకు అనుగుణంగా, పడకల ఏర్పాటును మరింత బలోపేతం చేయడానికి సత్వరం తీసుకున్న చర్యలను వివిధ ఆసుపత్రుల అధికారులు ఈ సమావేశంలో వివరించారు. ఆసుపత్రుల్లో చికిత్సా సదుపాయాలను మరింత బలోపేతం చేసే పనులను తక్షణ ప్రాతిపదికపై వెంటనే ప్రారంభించాలని, ఇతర రుగ్మతలతో వచ్చే రోగులకు సంబంధించిన ఆరోగ్య సేవలు ఏమాత్రం దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి అన్ని ఆసుపత్రులను ఆదేశించారు. ఆసుపత్రుల ఆవరణలోని వివిధ భవనాలను, బ్లాకులను, వార్డులను కోవిడ్ ప్రత్యేక సదుపాయాలుగా తీర్చిదిద్దాలని ఆయన ఆదేశించారు. 

  సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో కోవిడ్ రోగులకోసం మరో 172 పడకలను ఏర్పాటు చేసి, మొత్తం పడకల సంఖ్యను 391కి పెంచినట్టు ఈ సమీక్షలో అధికారులు తెలిపారు. సఫ్దర్ జింగ్ సూపర్ స్పెషాలటీ బ్లాకును పూర్తిగా కోవిడ్ రోగుల బ్లాకుగా తీర్చిదిద్దినట్టు తెలిపారు కేంద్ర విజ్ఞాన శాస్త్ర, పారిశ్రామిక పరిశోధనా మండలి (సి.ఎస్.ఐ.ఆర్.) సహాయంతో ఇక్కడ 36 ఐ.సి.యు. పడకలతోపాటుగా మొత్తం 46 పడకలు ఏర్పాటైనట్టు తెలిపారు. 

    ఇక రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలోని ఇతర భవనాల్లో కూడా కోవిడ్ రోగుల చికిత్సా సదుపాయాలు కల్పించి వాటిని పూర్తిగా కోవిడ్ రోగుల చికిత్సకే కేటాయించినట్టు ఆ ఆసుపత్రి అధికారులు తెలిపారు. దీనితో ఆ ఆసుపత్రిలో కోవిడ్ చికిత్సకు అదనంగా 200 పడకలు సమకూరినట్టు ఈ సందర్భంగా వివరించారు.

  ఇక లేడీ హార్డింగే వైద్య కళాశాల ఆసుపత్రిలో సి.ఎస్.ఐ.ఆర్. ఏర్పాటు చేస్తున్న మరో 240 పడకలు త్వరలోనే వినియోగంలోకి రాబోతున్నాయి. ఇందుకు సంబంధించి అవసరమైన సహాయాన్ని తాము అందజేస్తామని సి.ఎస్.ఐ.ఆర్. డైరెక్టర్, విజ్ఞాన శాస్త్ర, పారిశ్రామిక పరిశోధనా శాఖ కార్యదర్శి డాక్టర్ శేఖర్ మాండే హామీ ఇచ్చారు.

   న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్సా సదుపాయాల విస్తరణ ప్రక్రియకు సంబంధించిన వివవరాలను ఎయిమ్స్ డైరెక్టర్ తెలిపారు. కాలిన గాయాలకు చికిత్స చేసే బర్న్ వార్డులు, ప్లాస్టిక్ సర్జరీ కేంద్రంలోని వార్డులు, తదితర బ్లాకుల్లో అదనంగా పడకలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఎన్.సి.ఐ. జజ్జర్, డాక్టర్ ఆర్.పి. సెంటర్ ఫర్ ఆప్తాల్మిక్ సైన్సెస్, వృద్ధాప్య వైద్య శాస్త్ర వార్డులు వంటి వాటిల్లో పడకలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇక్కడ కోవిడ్ రోగులకోసం మొత్తం పడకల సంఖ్యను వెయ్యికి పెంచబోతున్నట్టు పేర్కొన్నారు.

  న్యూఢిల్లీలోని కేంద్రప్రభుత్వ ఆసుపత్రుల్లో, ఎయిమ్స్ ఆసుపత్రిలో ఆక్సిజన్ లభ్యత, ఆక్సిజన్ సరఫరాను సకాలంలో బలోపేతం చేసేందుకు జరిగే ప్రయత్నాలపై కూడా కేంద్ర ఆరోగ్య మంత్రి సమీక్ష నిర్వహించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ మాట్లాడుతూ, ఆక్సిజన్ తయారీ ప్లాంట్లనుంచి ఆసుపత్రులకు ఆక్సిజన్ రవాణా చేసేందుకు సంబంధించిన వ్యవహాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఢిల్లీకి ఆక్సిజన్ రవాణా చేసే వ్యవస్థకు సంబంధించిన అన్ని సమస్యల పరిష్కారంకోసం 24 గంటలూ నిర్విరామంగా పనిచేసే ఒక కంట్రోల్ రూమ్ ను పారిశ్రామిక ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య శాఖ (డి.పి.ఐ.ఐ.టి.)  ఏర్పాటు చేసినట్టు  ఆయన తెలిపారు. ఢిల్లీలోని అన్ని ఆసుపత్రుల ప్రాంతాల్లో ఆక్సిజన్ కోసం ఐదు ప్రెషర్ స్వింగ్ అడ్సార్ప్షన్ ప్లాంట్లను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించవలసిందిగా కేంద్ర ఆరోగ్య మంత్రి అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో కోవిడ్ రోగులకు సకాలంలో చికిత్స అందించడానికి సంబంధించి మరింత విస్తృత స్థాయి ప్రణాళికను అమలు చేయడానికి సంసిద్ధంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల అధికారులను ఆయన ఆదేశించారు. ఎయిమ్స్ ఆసుపత్రి, ఎన్.ఐ.సి. జజ్జర్, సఫ్దర్ జంగ్ ఆసుపత్రి, లేడీ హార్డింగే వైద్య కళాశాల, రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రులలో డి.ఆర్.డి.ఒ.-టాటా సన్స్ సంస్థల ద్వారా ఆక్సిజన్ తయారీ ప్లాంట్లను ఎర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నిమిషానికి వెయ్యి లీటర్ల చొప్పున ద్రవీకృత ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు.

   సమీక్షా సమావేశంలో మంత్రి అశ్వినీ కుమార్ చౌబే మాట్లాడుతూ, ఆసుపత్రుల భద్రతకు సంపబంధించి తీసుకోవలసిన చర్యలను కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల అధిపతులకు గుర్తు చేశారు. ఈ రోజు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి జరిపిన సమీక్షా సమావేశంలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్టు ఆయన తెలిపారు. పలువురు కోవిడ్ రోగులు ఎలాంటి మందులు లేకుండానే ఆసుపత్రులనుంచి ఇంటికి వెనుదిరిగి పోయారన్న వార్తలను మంత్రి ప్రస్తావిస్తూ, కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులన్నింటిలో కోవిడ్ రోగులకు తప్పనిసరిగా మందులు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గత ఏడాది కాలంగా నిస్వార్థ సేవలందిస్తున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు కూడా పడకలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

  ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ ప్రొఫెసర్ సునీల్ కుమార్, న్యూఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా, లేడీ హార్డింగే వైద్య కళాశాల డైరెక్టర్ డాక్టర్ డి.ఎన్. మాథుర్, సి.ఎస్.ఐ.ఆర్.- కేంద్ర భవన నిర్మాణ పరిశోధనా సంస్థ (సి.బి.ఐ.ఆర్.) డైరెక్టర్ డాక్టర్ గోపాల కృష్ణన్, సఫ్దర్ జంగ్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.వి. ఆర్య, రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాణా ఎ.కె. సింగ్ తదితరులు ఈ సమీక్షా సమావేశంలో పాలుపంచుకున్నారు.

 

***


(Release ID: 1713677) Visitor Counter : 180