ఆయుష్

అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో ఆన్ లైన్.లో యోగా శిక్షణా తరగతులు!


యోగాభ్యాసానికి ప్రాచుర్యం కల్పించడమే లక్ష్యం
ఆయుష్, యువజన క్రీడా మంత్రిత్వ శాఖల ఉమ్మడి కార్యక్రమం

Posted On: 22 APR 2021 6:59PM by PIB Hyderabad

  ఈ ఏడాది జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవానికి కేవలం రెండు నెలలు గడువు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఆన్ లైన్ ద్వారా యోగా శిక్షణ కార్యక్రమాన్ని అందించేందుకు రెండు కేంద్ర మంత్రిత్వ శాఖలు ఉమ్మడిగా ముందుకు వచ్చాయి. యోగాపై ఆన్ లైన్ ద్వారా నిర్వహించే ఈ శిక్షణాకార్యక్రమం ఇప్పటికే ఈ నెల 21వ తేదీన ప్రారంభమైంది. ఈ కార్యక్రమంకోసం కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ, యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ చేతులు కలిపాయి. ఈ శిక్షణా కార్యక్రమం తదుపరి దశగా రిపీట్ బ్యాచులు వచ్చే నెల 1వ తేదీన, ఆ తర్వాత వచ్చే నెల 21న,  అనంతరం జూన్ 21న  ప్రారంభమవుతాయి. యోగాసనాలను సులభంగా అభ్యసించేందుకు వీలుగా ఒక ఉమ్మడి యోగా నిబంధనావళిని ఈ శిక్షణా కార్యక్రమంలో వర్తింపజేస్తారు. గంటచొప్పున గరిష్ట వ్యవధితో కూడిన 24 తరగతుల్లో ఈ శిక్షణను నిర్వహిస్తారు. ఈ ఏడాది జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అనుగుణంగా ఈ కోర్సులను రెండు మంత్రిత్వ శాఖలు రూపొందించాయి. మన ఆలోచనా విధానం, దైనందిన ప్రజా జీవన శైలిలో యోగాకు భాగస్వామ్యం కల్పిస్తూ ఈ శిక్షణకు రూపకల్పన చేశారు.

  మహమ్మారి వైరస్ తో ఒకవైపు ప్రపంచం యావత్తూ సాహసోపేతంగా పోరాటం సాగిస్తున్నప్పటికీ, మరో వైపు మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇది ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తూ విస్తృత స్థాయిలో ఆందోళనను రేకెత్తిస్తోంది. ఈ పరిస్థితుల్లో యోగాకు ఉన్న బహుళార్థ ప్రయోజనాలు ప్రజలకు ఉపయోగపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యాన్ని పెంపొందించడంలో యోగాభ్యాసానికి ఉన్న ప్రత్యేకతకు ఇప్పటికే విస్తృత స్థాయిలో ప్రశంసలు కూడా లభించాయి. మారిపోయిన వాస్తవ పరిస్థితుల నేపథ్యంలో మన దైనందిన జీవితాలను సమతుల్యం చేయడంలో యోగా కీలకపాత్ర పోషించగలదన్న ఆశాభావం కూడా వ్యక్తమవుతోంది. యోగాను క్రమం తప్పకుండా పాటిస్తే ఆరోగ్యాన్ని మెరుగుపరుచకోవడానికి, శరీరంలో సహజ  సిద్ధమైన రోగనిరోధక శక్తిని మరింత బలోపేతం చేసుకోవాడనికి వీలుంటుంది.

  45 నిమిషాల వ్యవధితో కూడిన ఉమ్మడి యోగా నిబంధనావళిని ఈ ఏడాది నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధానంగా చేపట్టనున్నారు. భారతదేశానికి చెందిన పేరెన్నిక గన్న యోగా గురువులు ఈ నిబంధనావళిని 2015లో రూపొందించారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సామూహిక యోగాసనాల ప్రదర్శనను చేపట్టేలా ఈ నిబంధనావళిని తయారు చేశారు. యోగా శిక్షణలో ప్రారంభకులుగా పాల్గొనే వారికి ప్రయోజనకరంగా ఉండేలా వివిధ ఆసనాల కూర్పుతో ఈ ప్రదర్శనను చేపట్టనున్నారు. సామాన్య ప్రజలు కూడా సులభంగా అభ్యసించేలా  కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ప్రజల వయస్సు, లింగభేదంతో సంబంధం లేకుండా సరళమైన శిక్షణా తరగతులు, ఆన్ లైన్ యోగా తరగతుల ద్వారా వారు ఆసనాలను నేర్చుకోవడానికి వీలుంటుంది.

  రెండు కేంద్ర మంత్రిత్వశాఖల తరఫున మొరార్జీ దేశాయ్ యోగా అధ్యయన సంస్థ (ఎం.డి.ఎన్.ఐ.వై.) ఈ యోగా కోర్సును తీర్చిదిద్దింది. ఈ కోర్సులో పాల్గొనే వారు “యోగా వాలంటీర్” గా సర్టిఫికెట్ పొందేందుకు వీలుగా ఈ కోర్సును ఎం.డి.ఎన్.ఐ.వై. తయారు చేసింది. దేశంలో యోగా కోర్సు యోగ్యతా స్థాయిని నిర్దేశించే కేంద్ర సంస్థ అయిన యోగా సర్టిఫికేషన్ బోర్డు (వై.సి.బి.) ద్వారా ఈ సర్టిఫికెట్ మంజూరు చేయిస్తారు.  ఇన్ స్టాంట్ యోగా కోర్సుకు తదుపరి దశగా ఈ సర్టిఫికెట్ ను ప్రదానం చేస్తారు. కోర్సును ఉచితంగానే అందిస్తున్నప్పటికీ, సర్టిఫికెట్ ప్రాసెసింగ్ రుసుంగా నామమాత్రపు రుసుంగా 250 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. యోగా వాలంటరీ కోర్సు మొత్తం 36గంటల వ్యవధితో  నాలుగు అంచెలు (దశలు)గా ఉంటుంది. యోగా అప్రీసియేషన్ ప్రోగ్రామ్ పేరిట తొలి అంచె శిక్షణతో ఈ కోర్సు మొదలవుతుంది. రోజూ 45 నిమిషాల చొప్పున అభ్యాసంతో 4 రోజులపాటు తొలిదశ కొనసాగుతుంది. ఆ తర్వాత రెండవ దశ మొదలవుతుంది. ఉమ్మడి యోగా నిబంధనావళి పరిచయ కార్యక్రమం పేరిట సాగే ఈ రెండవ దశ అభ్యాసం రోజూ ఒకటిన్నర గంట వ్యవధి చొప్పున 12 రోజులు సాగుతుంది. మూడవ దశలో ఉమ్మడి యోగా నిబంధనావళి సాధనా కార్యక్రమం రోజూ ఒకటిన్నర గంట వ్యవధితో ఆరు రోజులపాటు సాగుతుంది. ఇక చివరి దశ కార్యక్రమం రోజూ ఆరు గంటల వ్యవధి చొప్పున రెండు రోజులపాటు నడుస్తుంది. ఉమ్మడి నిబంధనావళి స్వయం సాధన, మధింపు, సర్టిఫికేషన్ పేరిట ఈ చివరి దశ కార్యక్రమం చేపడతారు.

  రెండు కేంద్ర మంత్రిత్వ శాఖలకు అనుబంధించిన సామాజిక మాధ్యమ వేదికల ద్వారా ఈ శిక్షణా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా ప్రసారం చేస్తారు. ఆయా మంత్రిత్వ శాఖలకు చెందిన వివిధ విభాగాల పరిధిలోని సామాజిక మాధ్యమాల ద్వారా అంటే, యూట్యూప్, ఫేస్ బుక్ హ్యాండిల్స్ పై  కూడా ఇది ప్రసారమవుతుంది. ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా ప్రసారం చేసే సామాజిక మాధ్య వేదికలు (ఫేస్ బుక్ తో సహా): (https://www.facebook.com/moayush/) యూ ట్యూబ్: (https://www.youtube.com/channel/UCqRR2gs-I3zrNcE4so4TpgQ). దీనికి తోడుగా, ఫిట్ ఇండియా, ఉద్యమానికి, యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖకు సంబంధించిన సామాజిక మాధ్యమ వేదికల ద్వారా ఈ కార్యక్రమం అందుబాటులో ఉంటుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం, ఫిట్ ఇండియా ఉద్యమం ద్వారా యోగాపై సందేశాన్ని ప్రజలకు అందించేందుకు రెండు కేంద్ర మంత్రిత్వ శాఖలు భారీ ఎత్తున పరస్పర సహకారంతో పనిచేస్తాయి. ఉమ్మడిగా జరిపే ఈ కసరత్తులో భాగంగా సామాజిక మాధ్యమాన్ని ప్రధాన సాధనంగా వినియోగించుకుంటాయి. ఇంకా, రెండు మంత్రిత్వ శాఖల అజమాయిషీలో పనిచేసే విభిన్న విభాగాలు, స్వయంప్రతిపత్తి సంస్థలు, ఏజెన్సీలకు కూడా ఈ అవగాహనా కార్యక్రమంలో ప్రమేయం కల్పిస్తారు.

  ఈ ఉమ్మడి అవగాహనా కార్యక్రమంతోపాటుగా, “యోగాతో కలసి సాగండి, ఇంటివద్దనే ఉండండి” అన్న సందేశాన్ని కూడా ప్రచారం చేస్తారు. వైరస్ మహమ్మారి వ్యాప్తి, ప్రజలంతా సాధ్యమైనంతవరకూ ఇంటివద్దనే గడపాలంటూ వెలువడుతున్న సూచనల నేపథ్యంలో ఈ సందేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. క్రీడారంగ ముఖ్యులు, సుప్రసిద్ధులైన క్రీడా ప్రముఖులు కూడా తమ విలువైన సందేశాలతో ఈ కార్యక్రమానికి బాసటగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోవిడ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జనం ఇంటివద్దనే ఉంటూ యోగాను ఎలా అభ్యసించవచ్చునో, తాము తమతమ క్రీడాంశాల్లో యోగా కారణంగా ఎంత ప్రావీణ్యం సాధించామో వారు తమ సందేశాల ద్వారా వివరించే అవకాశాలున్నాయి.

   వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం నెలకొన్న తీవ్రమైన పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటూ, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాకు ప్రోత్సాహం కల్పించడానికైనా సరే ఎక్కువమంది సమూహాలుగా గుమికూడకుండా జాగ్రత్త వహించాల్సి ఉంది. అందువల్ల, ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవ సందేశానికి ప్రాచుర్యం కల్పించడానికి రెండు కేంద్ర మంత్రిత్వ శాఖలు డిజిటల్, వర్చువల్, ఎలక్ట్రానిక్ వేదికలను ఎంపిక చేసుకున్నాయి. తద్వారా ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనే పౌరులు కూడా తమతమ ఇళ్లవద్దనుంచే వర్చువల్ పద్ధతిలో పాల్గొనే పద్ధతిని ప్రోత్సహిస్తున్నారు.

   అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రజారోగ్యంలో యోగాభ్యాస పాత్ర, ప్రజారోగ్యానికి యోగా అందించగలిగే సేవలు వంటి అంశాలపై ప్రజలకు సందేశం ఇచ్చేందుకు అన్ని భాగస్వామ్య వర్గాలు ముందుకు రావాలని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ, యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చాయి. ఈ ఏడాది జూన్ 21వ తేదీన తమ ఇళ్లవద్దనే ఉమ్మడి యోగా నిబంధనావళిని పాటించడం ద్వారా ఈ సారి యోగా దినోత్సవం జరుపుకునేలా ప్రజలను ప్రోత్సహించేందుకు రెండు మంత్రిత్వ శాఖలూ ఈ పిలుపునిచ్చాయి. దీనితో ప్రజారోగ్యం, ప్రజాసంక్షేమం లక్ష్యంగా అన్ని భాగస్వామ్య వర్గాలు అందించగలిగే గణనీయమైన సేవగా ఇది నిలిచిపోతుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. యోగాభ్యాస ప్రక్రియలో ఆశించిన లక్ష్యాలను నిర్దేశించేందుకు ఈ మొత్తం ప్రక్రియ ఉపయోగపడుతుంది.

 

*****



(Release ID: 1713521) Visitor Counter : 194


Read this release in: English , Urdu , Hindi , Marathi