వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

వర్చువల్ విధానంలో సమావేశమైన ద్రవ్యాలు మరియు ఆహార పదార్ధాల్లో వినియోగించే వస్తువులపై ఏర్పాటైన కోడెక్స్ కమిటీ సమావేశానికి ఆతిధ్యమిస్తున్న భారత్


కమిటీ సచివాలయంగా సుగంధ ద్రవ్యాల బోర్డు

Posted On: 21 APR 2021 1:58PM by PIB Hyderabad

కోవిడ్ నేపథ్యంలో సురక్షిత ఆహారంతో పాటు నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఎఐ) అధ్యక్షురాలు  శ్రీమతి రీటా టీయోటియా అన్నారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆహార పదార్ధాల నాణ్యత, భద్రతల పరిరక్షణకు నియంత్రణ సంస్థలు మరింత అప్రమత్తంగా పనిచేయాలని ఆమె అన్నారు.  కోడెక్స్ అలిమెంటారియస్ కమిషన్ (సిఎసి) కింద ఏర్పాటైన  కోడెక్స్ కమిటీ ఆన్ స్పైసెస్ అండ్ క్యులినరీ హెర్బ్స్ (సిసిఎస్‌సిహెచ్) అయిదవ సమావేశం వర్చువల్ విధానంలో నిన్న జరిగింది. సమావేశాన్ని ప్రారంభించిన శ్రీమతి రీటా టీయోటియా సుగంధ ద్రవ్యాల ధర,  ప్రాధాన్యత వల్ల వీటిని కల్తీ చేయడానికి, వీటికి ప్రత్యామ్నాయ మార్గాలను సూచించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ' ఆర్ధిక ప్రయోజనాలను ఆశించి చేసే కల్తీ అత్యంత ప్రమాదకరమైన దుర్వినియోగం. ఇటువంటి సంఘటనలు జరగకుండా నిరోధించడానికి అత్యంత అప్రమత్తంగా పనిచేయవలసి ఉంటుంది, అంతర్జాతీయ విపణిలో సుగంధ ద్రవ్యాలకు నిర్ధేశించిన ప్రమాణాలు లిఖితపూర్వకంగా వున్నాయి. ప్రపంచవ్యాపితంగా మార్కెట్ ఉన్న  సుగంధ ద్రవ్యాలు,వంటల్లో ఉపయోగించే మూలికల భద్రత మరియు నాణ్యతను నిర్ధారించడానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉంది. ' అని ఆమె స్పష్టం చేశారు. 

ఏప్రిల్ 20వ తేదీన ప్రారంభమైన సిసిఎస్‌సిహెచ్ సమావేశాలు 29వ తేదీ వరకు వర్చువల్ విధానంలో జరగనున్నాయి. ఈ సమావేశాల్లో 50 దేశాలకు చెందిన దాదాపు 300 మంది నిపుణులు పాల్గొనున్నారు. ప్రస్తుత సదస్సులో నిపుణులు పొడి అల్లం, లవంగాలు, కుంకుమ మరియు వంటల్లో ఉపయోగించే వాము, తులసిలను ఏడు దశల్లోను, జాజికాయ,  మిరపకాయలు, మిరప పొడి ని  నాలుగు దశల్లోనూ పరీక్షించి వీటి నాణ్యతా ప్రమాణాలను నిర్దేశిస్తుంది. ఇవికాకుండా ఏలకులు, పసుపు మరియు ఎండిన పళ్లు, కాయల రూపంలో లభించే సుగంధ ద్రవ్యాల నాణ్యతా ప్రమాణాలను నిర్ధేశించే ప్రతిపాదనలు ఉన్నాయి. 

సమావేశం మాట్లాడిన సుగంధ ద్రవ్యాల బోర్డు కార్యదర్శి శ్రీ డి. సతియన్ తాజా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తొలిసారిగా ఆన్ లైన్ పద్దతిలో నిర్వహిస్తున్న సిసిఎస్‌సిహెచ్ సమావేశాలకు సభ్య దేశాల నుంచి స్పందన లభించిందని అన్నారు. అధిక సంఖ్యలో సుగంధ ద్రవ్యాలు మరియు వంటల్లో ఉపయోగించే మూలికలకు కమిటీ ర్యాంకులను ఇవ్వవలసి ఉందని అన్నారు. త్వరితగతిన పరిశీలన పూర్తి చేయడానికి వీటిని తరగతులుగా విభజించామని ఆయన తెలిపారు. 

అలిమెంటారియస్ కమిషన్ అధ్యక్షుడు  గిల్హెర్మ్ డా కోస్టా జూనియర్ మాట్లాడుతూ ఆహార భద్రతపై  నియంత్రణ లేకపోవడం వల్ల తీవ్రమైన సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. నిఘా లోపం వల్ల  ప్రతి సంవత్సరం వేలాది మంది ఆహార సంబంధిత  వ్యాధులకు గురవుతూ మరణిస్తున్నారని అన్నారు. దీనివల్ల  వివిధ దేశాలలో ఆర్థిక సంక్షోభంతో పాటు  నిరుద్యోగం పెరుగుతున్నదని అన్నారు.  సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించి, ప్రతిచోటా, ప్రతిచోటా, ప్రతిఒక్కరికీ ఆహార భద్రత మరియు నాణ్యతను అందుబాటులోకి తీసుకుని రావడానికి  కోడెక్స్ ప్రమాణాలను అభివృద్ధి చేసి అమలు చేయడానికి అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వవలసిన అవసరం ఉందని అన్నారు. 

భద్రత ప్రమాణాలను, లోపాలను గుర్తించడానికి పొలాల నుంచి ఇంటికి విధానాన్ని అమలు చేయవలసి ఉంటుందని భారతదేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రతినిధి డాక్టర్ రోడెరికో హెచ్. ఆఫ్రిన్ అన్నారు. ఆహార భద్రత, నాణ్యత, ప్రమాణాలను అమలు చేసే అంశానికి ఉత్పత్తిదారులు ఆహార నియంత్రణదారులు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. కోవిడ్-19 నేపథ్యంలో ఆహార భద్రత, నాణ్యత మరియు సుస్థిరత ప్రమాణాలకు మరింత ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుందని అన్నారు. 

భారతదేశంలోని అసిస్టెంట్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎఓఓ) ప్రతినిధి కొండా చావ్వా మాట్లాడుతూ “ఆహార భద్రత మరియు సరసమైన వాణిజ్యాన్ని నిర్ధారించడానికి వివిధ దశలలో నిర్దిష్ట ప్రమాణాలను అమలు చేయడం మరియు సామర్థ్యాలను పెంపొందించడం ద్వారా ప్రమాణాలను మెరుగుపరచడానికి మరియు సమన్వయం చేయడానికి తమ సంస్థ ప్రయత్నిస్తున్నదని అన్నారు. ఉత్పత్తిదారులు  మరియు వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడం మరియు సుగంధ ద్రవ్యాలు మరియు వంటల్లో ఉపయోగించే మూలికలకు  ప్రపంచ నాణ్యతా ప్రమాణాలను నిర్ణయించడానికి సమావేశాలను నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. 

సిసిఎస్‌సిహెచ్, సిఎసి 

       సుగంధ ద్రవ్యాలు మరియు వంటల్లో ఉపయోగించే మూలికల కోసం ప్రపంచవ్యాప్త ప్రమాణాలను అభివృద్ధి చేయడానికి మరియు విస్తరించడానికి మరియు ప్రమాణాల అభివృద్ధి ప్రక్రియలో ఇతర అంతర్జాతీయ సంస్థలతో చర్చలు జరపడానికి  2013 లో  సిసిఎస్‌సిహెచ్  ఏర్పడింది. కమిటీ సమావేశాలను నిర్వహించడం కోసం వందకు పైగా దేశాల సహకారంతో భారతదేశం  ఆతిథ్య దేశంగా మరియు సుగంధ ద్రవ్యాల బోర్డు భారతదేశం సచివాలయంగాను వ్యవహరిస్తున్నాయి.  ప్రారంభమైనప్పటి నుండి సుగంధ ద్రవ్యాలు  వంటల్లో ఉపయోగించే మూలికలకు ప్రపంచ ప్రమాణాలను రూపొందించడంలో కోడెక్స్ కమిటీ విజయం సాధించింది. ఇంతవరకు జరిగిన నాలుగు సెషన్లలో కమిటీ నాలుగు సుగంధ ద్రవ్యాలకు ప్రమాణాలను నిర్ధేశించి  ఖరారు చేసింది. ఎండిన లేదాపొడి రూపంలో వుండే నలుపు / తెలుపు / ఆకుపచ్చ మిరియాలు, జీలకర్ర, వాము  మరియు వెల్లుల్లి ప్రమాణాలను కమిటీ నిర్ధేశించింది. 

 ఐక్యరాజ్యసమితి అనుబంధ  ఆహార మరియు వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎఓఓ) మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సంయుక్తంగా 1963 లో   కోడెక్స్ అలిమెంటారియస్ కమిషన్ (సిఎసి)ను  ఒక అంతర్-ప్రభుత్వ సంస్థగా ప్రారంభించాయి.  వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఆహార వాణిజ్యంలో న్యాయమైన పద్ధతులను అమలు జరిగేలా చూడడానికి  సిఎసి కృషి చేస్తోంది. 

 

 మరింత సమాచారం కోసం: http://www.fao.org/fao-who-codexalimentarius/news-and-events/news-details/en/c/1395771/ దర్శించవచ్చును. 

 

***(Release ID: 1713271) Visitor Counter : 203