గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
గిరిజనులకు దన్నుగా వన్ ధన్ వికాస్ యోజన!
గిరిజనుల్లో ఔత్సాహిక పారిశ్రామిక, వాణిజ్య స్వభావాన్ని
ప్రోత్సహించే విస్తృత స్థాయి వ్యవస్థ
దేశవ్యాప్తంగా వన్ ధన్ వికాస్ కేంద్రాల ఏర్పాటు
Posted On:
16 APR 2021 7:47PM by PIB Hyderabad
“దేశంలోని గిరిజన ప్రాంతాల్లో 50వేల ‘వన్ ధన్ వికాస్ కేంద్రాలు’ ఏర్పాటు చేస్తాం. అటవీ ఉత్పత్తులను ప్రాథమిక స్థాయిలో ప్రాసెస్ చేసి వాటికి మరింత విలువ చేర్చే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు, గిరిజనులకు తగిన ఉపాధిని కల్పించి, వారి ఆదాయాన్ని పెంచేందుకు ఈ కేంద్రాలను స్థాపిస్తాం.,”
-ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
దేశ సమగ్రాభివృద్ధి, సమాజంలోని ప్రతి వర్గానికీ స్వావలంబన, సాధికారత కల్పించడమే లక్ష్యంగా ఎంతో దార్శినికత్వంలో ప్రధానమంత్రి తీసుకున్న సంకల్పం ఇది.
భారతీయ గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ధి సమాఖ్య (ట్రైఫెడ్) పేర్కొన్న ప్రకారం మొత్తం 33,360 వన్ ధన్ వికాస్ కేంద్రాలకు గాను 300మంది ఆదివాసులకు ఒకటి చొప్పున 2,224 వన్ ధన్ వికాస్ కేంద్రాలు, కేవలం 18నెలల కంటే తక్కువ కాలంలోనే ఏర్పాటయ్యాయి. అంటే ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ట్రైఫెడ్ సంస్థ ఈ కేంద్రాలను మంజూరు చేసింది. ఒక్కో వన్ ధన్ వికాస్ కేంద్రంలో 20మంది గిరిజనులకు సభ్యత్వం ఉంటుంది. అలాంటి 15 వన్ ధన్ వికాస్ కేంద్రాలన్నీ కలసి ఒక సమూహంగా ఏర్పాటవుతాయి. వన్ ధన్ క్లస్టర్లుగా పేర్కొనే ఈ సమూహాలు ఆయా కేంద్రాలకు కావలసిన ఆర్థిక సదుపాయాలను, జీవనోపాధిని, మార్కెట్లతో అనుసంధానాన్ని, గిరిజనుల్లో ఔత్సాహిక పారిశ్రామిక, వ్యాపార అవకాశాలను కల్పిస్తాయి. 23 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని క్లస్టర్లకు ఈ సదుపాయాలను ఏర్పాటు చేస్తారు.
ఇక 3.3లక్షలమంది గిరిజన కుటుంబాలకు సంబంధించి 50వేల వన్ ధన్ వికాస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో 16,640 వన్ ధన్ కేంద్రాలకు గాను 600 కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ట్రైఫెడ్ ఆధ్వర్యంలో చేపట్టే సంకల్ప్ సే సిద్ధి కార్యక్రమం కింద ఆయా రాష్ట్రాల నోడల్ శాఖలు, అమలు సంస్థలతో కలసి ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. రానున్న మూడు నెలల కాలంలో ఈ కేంద్రాల ఏర్పాటుకు తగిన అనుమతులు మంజూరయ్యే అవకాశాలున్నాయి.
అంతేకాక గిరిజనల అభ్యున్నతి కోసం ట్రైఫెడ్ మరెన్నో కార్యక్రమాలు చేపడుతోంది. గిరిజన జనాభాకు ఉపాధి కల్పనావకాశాలను, ఆదాయ మార్గాలను కల్పించేందుకు వన్ ధన్ గిరిజన స్టార్టప్ కార్యక్రమాన్ని ట్రైఫెడ్ అమలు చేస్తోంది. చిన్న తరహా అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్ యంత్రాంగం (ఎం.ఎఫ్.పి.) ఏర్పాటులో భాగంగా స్టార్టప్ కార్యక్రమం అమలు చేస్తున్నారు. కనీస మద్దతు ధర (ఎం.ఎస్.పి.), ఎం.ఎఫ్.పి. పథకం కింద విలువల వ్యవస్థ అభివృద్థి కార్యక్రమాల ద్వారా ఈ ఈ కృషి జరుగుతోంది.
చిన్నతరహా అటవీ ఉత్పత్తులకు విలువను జోడించడం, బ్రాండింగ్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించే లక్ష్యంతో వన్ ధన్ గిరిజన స్టార్టప్ కార్యక్రమం చేపట్టారు. అడవులే ఆధారంగా బతుకు సాగించే గిరిజనులకు సుస్థిరమైన జీవనోపాధి కల్పించేందుకు వన్ ధన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు
దేశం వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని నోడల్ ఏజెన్సీలు, అమలు యంత్రాంగాలు అందించిన పటిష్టమైన ప్రోత్సాహం, సహాయంతో గత 18నెలల్లో వన్ ధన్ వికాస్ కేంద్రాలు గిరిజన ప్రాంతాల్లో చక్కగా వెళ్లూనుకున్నాయి. ఇందుకు సంబంధించి దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి పలు విజయ గాథలు కూడా వెలుగులోకి వచ్చాయి.
ఈ విషయంలో మణిపూర్ ఎంతో విజయవంతమైన రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఆ రాష్ట్రంలోని గిరిజనులకు ప్రధానమైన ఉపాధి వనరుగా వన్ ధన్ కార్యక్రమం నిలిచింది. 2019వ సంవత్సరం అక్టోబరు నెలలో మణిపూర్ లో ఈ కార్యక్రమం మొదలైనప్పటినుంచి ఇప్పటివరకూ 100 వన్ ధన్ వికాస్ కేంద్రాల సమూహాలు ఏర్పాటయ్యాయి. వాటిలో 77 క్లస్టర్లు ఇప్పటికే పనిచేయడం ప్రారంభించాయి. మొత్తం 1,500 క్లస్టర్లతో కూడిన ఈ సమూహాలన్నీ 30వేల మంది ఔత్సాహిక గిరిజన పారిశ్రామికులకు ప్రయోజనం చేకూరుస్తున్నాయి. వివిధ స్వల్బ తరహా అటవీ ఉత్పత్తుల సేకరణ, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ కార్యకలాపాల్లో వారంతా పాల్గొంటున్నారు. వన్ ధన్ వికాస్ కేంద్రాల ఏర్పాటులో దేశంలోని ఈశాన్య ప్రాంతం అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈ పథకం అద్భుతమైన ఫలితాలను అందిస్తోంది.
దీనికి తోడు ఈ పథకానికి మార్కెట్ అనుసంధానం కూడా పెరగడం విశేషం. అటవీ ఉత్పత్తులకు సంబంధించిన పలు గిరిజన సంస్థలు ఇప్పటికే మార్కెట్లతో అనుసంధానమై ఉన్నాయి. ఉసిరి, అనాస, అడవి ఆపిల్, అల్లం, చింతపండు వంటి వాటితో తయారయ్యే ఫ్రూట్ క్యాండీ మిఠాయిలు, అనాస, ఉసిరి, ప్లమ్ వంటి వాటితో తయారయ్యే జామ్.లు, అనాస, ఉసిరి, అడవి ఆపిల్, ప్లమ్, బర్మీస్ ద్రాక్ష వంటి వాటితో తయారయ్యే పండ్లరసాలు, స్క్వాష్ లు, దాల్చిన చెక్క, పసుపు, అల్లం వంటి సుగంధ ద్రవ్యాలు, ఇంకా ఊరగాయలు, ప్రాసెస్ చేసిన తిప్పతీగ ఉత్పాదనలు... ఇవన్నీ వన్ ధన్ వికాస్ కేంద్రాల ద్వారా సిద్ధం చేసి ప్యాకేజీ చేయించి మార్కెట్.కు చేరుస్తున్నారు. అదనంగా ట్రైబ్స్ ఇండియా డాట్ కామ్ (TribesIndia.com ), ట్రైబ్స్ ఇండియా దుకాణాల ద్వారా వీటిని మార్కెటింగ్ చేయిస్తున్నారు. వన్ ధన్ కార్యక్రమాలు ఇలా విజయనవంతం కావడంతో తదనుగుణంగా ఆయా రాష్ట్రప్రభుత్వాలను కూడా కార్యోన్ముఖం చేశారు. స్వల్పతరహా అటవీ ఉత్పాదనలకోసం కనీస మద్ధతుధర పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు క్రియాశీలం చేసేలా, మహమ్మారి వైరస్ వ్యాప్తి సమయంలో కూడా వివిధ రకాల స్వల్ప తరహా అటవీ ఉత్పత్తుల సేకరణ సజావుగా సాగేలా, తద్వారా కేవలం పది నెలల్లోనే నేరుగా నగదు బదిలీ ప్రక్రియ ద్వారా గిరిజనులకు ప్రయోజనం లభించేలా చర్యలు తీసుకున్నారు.
ఇక “సంకల్ప్ సే సిద్ధి” పేరిట గ్రామం-డిజిటల్ అనుసంధాన కార్యక్రమాన్ని ట్రైఫెడ్ తాజాగా ప్రారంభించింది. ఈ నెల 1వ తేదీన మొదలైన ఈ కార్యక్రమం వందరోజుల పాటు కొనసాగుతుంది. మొత్తం 150 బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. ఒక్కో ప్రాంతంలో పది బృందాల చొప్పున ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటాయి. ట్రైఫెడ్, ఆయా రాష్ట్రాల అమలు యంత్రాగాలు, ఏజెన్సీలు, భాగస్వామ్య సంస్థలనుంచి ప్రతినిధులకు ఈ బృందాల్లో ప్రాతినిధ్యం ఉంటుంది. ఒక్కో బృందం పది గ్రామాలను సందర్శిస్తుంది. ప్రతి ప్రాంతంలో వంద గ్రామాల చొప్పున దేశంలోని 1,500 గ్రామాల్లో మొత్తం వందరోజుల్లో ఈ బృందాలు పర్యటిస్తాయి. ఆయా గ్రామాల్లో వన్ ధన్ వికాస్ కేంద్రాలను క్రీయాశీలం చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. గిరిజన వ్యవహారాలు, ఆహార శుద్ధి శాఖల ఉమ్మడి కేంద్రాలుగా, సంప్రదాయ పరిశ్రమల పునరుద్ధరణ కేంద్రాలుగా ఆయా వన్ ధన్ వికాస్ కేంద్రాలను క్లస్టర్లను గుర్తించే పనిని కూడా ఈ బృందాలు నిర్వర్తిస్తాయి.
ఆత్మ నిర్భర భారత్ నినాదంతో దేశాన్ని స్వావలంబన దిశగా నడిపించాలన్న ప్రధానమంత్రి పిలుపు స్ఫూర్తితో “స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యం, గిరిజన ఉత్పత్తులనే కొనుగోలు చేయడం” అన్న నివాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ట్రైఫెడ్ ఎంతో కృషి చేస్తోంది. వన్ ధన్ విధానాన్ని గిరిజన ఔత్సాహిక పారిశ్రామిక విధానంగా పూర్తి స్థాయిలో పరివర్తన చెందించేందుకు కూడా కృషి చేస్తోంది. ఈ వన్ ధన్ వికాస్ కేంద్రాలను వన్ ధన్ క్లస్టర్లుగా ఏర్పాటు చేయడం ద్వారా,. గిరిజనులు తయారు చేసే అటవీ ఉత్పత్తులకు మరింత విలువను జోడించే లక్ష్యాన్ని ట్రైఫెడ్ నిర్దేశించుకుంది.
వన్ ధన్ వికాస్ కేంద్రాలను సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు కూడా ట్రైఫెడ్ కృషి చేస్తోంది. ఇదుకోసం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా వివిధ మంత్రిత్వ శాఖలు, సంస్థలతో కలసి పనిచేస్తోంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల మంత్రిత్వ శాఖ, ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వంటి వివిధ మంత్రిత్వ శాఖలతో ట్రైఫెడ్ ఇందుకోసం ఇప్పటికే అవగాహనా ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది.
1996వ సంవత్సరపు పంచాయతీ రాజ్ చట్టం నిబంధన ప్రకారం చేపట్టే షెడ్యూల్ట్ ప్రాంతాల విస్తరణ, 2006వ సంవత్సరపు అటవీ హక్కుల చట్టం ప్రకారం అటవీ ప్రాంతాల్లో నివసించే గిరినులకు సాధికారత కల్పించడం లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటారు.
ఫుడ్ ఫ్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖతో కలసి ట్రైఫెడ్ సంస్థ “ట్రైఫుడ్” ప్రాజెక్టులు ఏర్పాటు చేసింది. చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని జగదల్ పూర్, మహారాష్ట్రలోని రాయగఢ్ ప్రాంతాల్లో ప్రధానమంత్రి సంపద యోజన పథకం కింద ట్రైఫెడ్ ఈ ప్రాజెక్టులను ఏర్పాటు చేసింది. స్వల్పతరహా అటవీ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లుగా పనిచేసే ఈ ప్రాజెక్టులు వన్ ధన్ వికాస్ కేంద్రాలతో కలసి పనిచేస్తాయి. దీనితో ఈ యూనిట్లతో సంబంధం ఉన్న గిరిజన కుటుంబాలకు ఇతోధిక ప్రయోజనం లభిస్తుంది. స్వల్ప తరహా అటవీ ఉత్పత్తుల ఆధారంగా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసే అవకాశాలను అన్వేషించేందుకు కూడా ట్రైఫెడ్ కృషి చేస్తోంది. ఇందుకోసం మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, గోవా, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాలతో కలసి ట్రైఫెడ్ పనిచేస్తోంది.
ట్రైఫెడ్ నిర్వహించే ఈ కార్యక్రమాలు, గిరిజనుల్లో ఔత్సాహిక పారిశ్రామిక, వ్యాపార తత్వాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయి. స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ఇది సాధ్యమవుతుంది. గిరిజనులకే సొంతమైన, గిరిజనులే నిర్వహించే ఉత్పాదనా సంస్థల ఏర్పాటుకు వీలవుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిధులు, వనరులు కూడా ఇందుకు దోహదపడతాయి.
స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు ద్వారా 200వరకూ వన్ ధన్ ఉత్పాదనా కంపెనీలు ఏర్పాటు చేసేందుకు వన్ ధన్ వికాస్ యోజన పథకం అవకాశం కల్పిస్తోంది. ఇందులో భాగంగా హఠ్ బజార్లలో 3వేల వరకూ అటవీ ఉత్పత్తుల సేకరణ కేంద్రాలు, 600వరకూ గిడ్డంగులు ఏర్పాటు చేస్తారు. 200వరకూ మినీ ట్రైఫుడ్ కేంద్రాలు, వందదాకా ఉమ్మడి సదుపాయ కేంద్రాలు ఏర్పాటవుతాయి. దేశంలోని 275 జిల్లాల పరిధిలో వంద ట్రైఫుడ్ పార్కులు ఏర్పాటు చేస్తారు. అలాగే సంప్రదాయ పరిశ్రమల పునరుద్ధరణ పథకం కింద 100 కేంద్రాలను అభివృద్ధి చేస్తారు. గిరిజన అటవీ ఉత్పత్తుల విక్రయం లక్ష్యంగా 200మేర ట్రైబ్స్ ఇండియా రిటైల్ స్టోర్లు, ట్రైఫుడ్, ట్రైబ్స్ ఇండియా బ్రాండ్ ఉత్పత్తులకోసం ఈ కామర్స్ వేదికలు ఏర్పాటు చేస్తారు. వచ్చే ఏడాది ఈ ప్రణాళికలను విజయవంతంగా అమలు చేయడం ద్వారా, దేశవ్యాప్తంగా గిరిజన ఔత్సాహిక పారిశ్రామిక, వాణిజ్య వ్యవస్థను సంపూర్ణ స్థాయిలో సాధికారికంగా పరివర్తన చెందించేందుకు ట్రైబ్స్ ఇండియా ఎంతో కృషి చేస్తోంది.!
*****
(Release ID: 1712425)
Visitor Counter : 251