ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఢిల్లీలో పెరుగుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో ఎయిమ్స్ సంసిద్ధతపై మంత్రి సమీక్ష


“వైరస్ గురించి తెలియనప్పుడే ఓడించాం, ఇప్పుడు మళ్లీ నిరూపించుకుందాం”

“దేశమంతటా అమలు చేయగలిగే సరికొత్త నమూనాల గురించి ఆలోచించండి”

వైద్య నిపుణులకు కేంద్రమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ పిలుపు

Posted On: 16 APR 2021 4:23PM by PIB Hyderabad

ఇటీవలి కాలంలో దేశరాజధాని ఢిల్లీలో అకస్మాత్తుగా మళ్ళీ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కే<ద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈ రోజు ఢిల్లీ ఎయిమ్స్ ను సందర్శించారు. కోవిడ్ నియంత్రణకు ఎయిమ్స్ సంస్థ సంసిద్ధత మీద ఆయనా సమగ్రంగా చర్చించారు.  అదే విధంగా ఎయిమ్స్ ఆధ్వర్యంలోని జయప్రకాశ్ నారాయణ్ అపెక్స్ ట్రామా సెంటర్ లోని రోగులతో కూడా ఆయన మాట్లాడారు.

ఎయిమ్స్ లో పడకల అందుబాటు, ఆక్సిజెన్ అందుబాటు, జనరల్, ఐసియు విభాగాలలో పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కోవిడ్, కోవిడేతర వ్యాధుల చికిత్సలో పాలుపంచుకునే వివిధ విభాగాల అధిపతులతో మాట్లాడటంతోబాటు విధి నిర్వహణలో వారికి ఎదురవుతున్న సాధకబాధకాల గురించి అడిగారు.

ఈ సందర్భంగా ఆయన కోవిడ్ యోధుల సేవలను ప్రశంసించారు. ఈ వైరస్ వ్యాధికి సంబంధించిన ప్రాథమిక అంశాల గురించి తెలిసి ఉందటం వల్ల మునుపటికంటే దీనిని ఎదుర్కోవటం కొంత సులభంగా తయారైందన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్త్రావించారు.   డాక్టర్లు ప్రస్తుత పరిస్థితిని గుర్తించటంతోబాటు దీని నియంత్రణపట్ల పట్టుదలతో ఉండటం హర్షణీయమన్నారు. ఇప్పటి పరిస్థితిని విశ్లేషించటంతోబాటు భవిష్యత్తులో ఎదురయ్యే అవకాశమున్న పరిస్థితికి సంసిద్ధతను కూడా సమీక్షించటానికే వచ్చినట్టు స్పష్టం చేశారు. దీనివలన ముందస్తు చర్యలకు వీలుంటుందన్నారు. “ఇప్పుడు మనకు మరింత అనుభవం, జ్ఞానం, అవగాహన ఉన్నాయి” అని గుర్తు చేశారు. ఇక్కడి రోగులకు సాయం చేయటంతోబాటు దేశవ్యాప్తంగా ఉన్న రోగులకు, సహ వైద్యులకు కూడా టెలీకన్సల్టేషన్స్ ద్వారా ఎయిమ్స్ డాక్టర్లు మార్గదర్శనం చేయటాన్ని మంత్రి ప్రధానంగా ప్రస్తావించారు.  

వైద్యపరికరాలలో భారతదేసం స్వయం సమృద్ధం కావటానికి చేసిన ప్రయాణాన్ని డాక్టర్ హర్షవర్ధన్ గుర్తుచేశారు. “ 2020 ఏప్రిల్ 5 నాటి పరిస్థితి నాకు గుర్తుంది. మనకు అప్పుడు పిపిఇ కిట్స్ లేవు, వెంటిలేటర్లు లేవు, ఎన్ 95 మాస్కులు లేవు. ఆరోగ్య పరమైన మౌలిక వసతులు లేనందుకు యావత్ ప్రపంచం నిర్దాక్షిణ్యంగా మనల్ని విమర్శించింది. కానీ మనం మన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకున్నాం. ఒకవైపు పూర్తిగా కొత్తదైన వైరస్ ను ఓడిస్తూ మరోవైపు మన మౌలిక సదుపాయాలు పెంచుకున్నాం.  కేవలం ఏడాది అనుభవంలో ఎంతో నేర్చుకున్నాం” అన్నారు.

కరోనా సంక్షీఓభ సమయంలో కరోనాతో సంబంధం లేని వ్యాధిగ్రస్తులకు కూడా చికిత్స అందించటం మీద దృష్టి సారించటాన్ని,  దానికి ప్రాధాన్యమివ్వటాన్ని ఆయన ప్రస్తావించారు “ కరోనా చికిత్స కారణంగా మనం ఇతర ప్రధాన వ్యాధులను నిర్లక్ష్యం చేయకూడదు. ఇప్పుడు మనౌ అన్ని చర్యలకూ అవసరమైన శక్తి యుక్తులు, మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఇప్పుడు ఏర్పడిన దురదృష్టకర పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో ఆలోచిద్దాం. దేశవ్యాప్తంగా అమలు చేయటానికి కూడా పనికొచ్చే కొత్త నమూనాలను రూపొందించటం మీద  ఆలోచిద్దాం.  నాణ్యమైన పరిష్కార మార్గాలు సూచించాలని కోరుతున్నా. అమలు చేయటంలో మీకు నా సహాయ సహకారాలు ఉంటాయి. మీ మీద దేశం ఎంతో నమ్మకం పెట్టుకుంది” అన్నారు.  

అనంతరం మంత్రి అక్కడి జయప్రకాశ్ నారాయణ్ అపెక్స్ ట్రామా సెంటర్ ను సందర్శించారు. ఈ కేంద్రాన్ని ప్రత్యేకంగా కోవిడ్ వ్యాధిగ్రస్తుల చికిత్సకోసం కేటాయిమ్చిన సంగతి తెలిసిందే. చికిత్స తీరుతెన్నులగురించి అక్కడి రోగులను ఆయన అడిగి తెలుసుకున్నారు. అత్యంత నాణ్యమైన చికిత్స అందిస్తామని ఈ సందర్భంగా డాక్టర్ హర్షవర్ధన్ అక్కడి బాధితులకు హామీ ఇచ్చారు. 

చివరిగా మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రజలు కోవిడ్ నియంత్రణకు దోహదం చేసే రీతిలో వ్యవహరించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ఆయన మరోమారు గుర్తు చేశారు. “కోవిడ్ నియంత్రణ దిశలో నడుచుకోవాల్సిన తీరుమీద ప్రజలలో చైతన్యం పెంచటమే ఈ సారి మన ముందున్న  అతిపెద్ద సవాలు.  జనం దీన్ని చాలా అఅషామాషీగా తీసుకుంటున్నట్టు కనబడుతోంది. ఇది చాలా ప్రమాదకరం. వ్యాప్తి అరికట్టటానికి మనం జాగ్రత్తలు తీసుకోవటం ఒక్కటే మార్గం. గత 7 రోజుల్లో ఒక్క కోవిడ్ కేసు కూడా రాని జిల్లాలు దేశవ్యాప్తంగా 52 ఉన్నాయి. రెండువారాలుగా కెసులు లేని జిల్లాలు 34. గత 21 రోజుల్లో కేసులు రాని జిల్లాలు 4. గత 28 రోజులుగా కేసులు రాని జిల్లాలు 44. అంటే, అప్రమత్తత స్థాయినిబట్టే వ్యాప్తి ఆగిపోతున్నది” అంటూ ఆయన ఈ గణాంకాలను వెల్లడించారు.  రెమిడిసివర్ లాంటి ఔషధాల బ్లాక్ మార్కెటింగ్ ను నిరోధించటానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా ఆయన వివరించారు. 

ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా, పలువురు సీనిఉఅర్ దాక్టర్లు ఈ సమగ్ర సమీక్ష సందర్భంగా మంత్రితోబాటు పాల్గొన్నారు. 

                   

****



(Release ID: 1712280) Visitor Counter : 202


Read this release in: English , Urdu , Hindi , Punjabi