వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

2023 సంవత్సరం చివరి నాటికి సి.డబ్ల్యు.సి. తన గిడ్డంగి నిల్వ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడంతో పాటు, 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి 10,000 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించాలి : శ్రీ పీయూష్ గోయల్


నూటికి నూరు శాతం ఆహార ధాన్యాలను, ఎక్కువ కాలం నిల్వ చేయడానికి వీలుగా, సి.డబ్ల్యు.సి. ఆధునిక గిడ్డంగులను నిర్మించాలి : శ్రీ పీయూష్ గోయల్

పూర్తి ప్రాథమిక ప్రజా / సిబ్బంది సౌకర్యాలతో పాటు, అదనపు మౌలిక సదుపాయాలను, 2024-25 నాటికి అభివృద్ధి చేసే విధంగా, తన మొత్తం 423 కేంద్ర గిడ్డంగులను ఆధునీకరించడానికి, ఒక బృహత్ ప్రణాళిక సిద్ధం చేయాలని, సి.డబ్ల్యు.సి. ని ఆదేశించడం జరిగింది.

అన్ని సి.డబ్ల్యు.సి. గిడ్డంగుల భద్రతా ఆడిట్ చేయవలసి ఉంది


సెంట్రల్ వేర్-‌హౌస్ కార్పొరేషన్ యొక్క ఆధునీకరణ, ఆస్తి మోనటైజేషన్ ప్రణాళికలను శ్రీ పీయూష్ గోయల్ ఈ రోజు సమీక్షించారు

Posted On: 06 APR 2021 5:23PM by PIB Hyderabad

కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాలు, రైల్వేలు, వాణిజ్యం, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీ పీయూష్ గోయల్, ఈ రోజు,  సెంట్రల్ వేర్-‌హౌస్ కార్పొరేషన్ యొక్క ఆధునీకరణ ప్రణాళికను, సమీక్షించారు.

ఈ సమీక్షలో భాగంగా, కేంద్ర మంత్రి శ్రీ గోయల్ మాట్లాడుతూ, 2023 సంవత్సరం చివరి నాటికి సి.డబ్ల్యు.సి. తన గిడ్డంగి నిల్వ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడంతో పాటు,  2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి 10,000 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించాలని, కోరారు.  ప్రస్తుతం, సి.డబ్ల్యు.సి. గిడ్డంగి నిల్వ సామర్థ్యం 125 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. 

సమీక్ష సమావేశంలో, శ్రీ గోయల్ మాట్లాడుతూ, టారిఫ్ హేతుబద్ధీకరణ, గిడ్డంగుల ఏర్పాటును, ఎటువంటి అధికారిక జోక్యం లేకుండా, సి.డబ్ల్యు.సి. స్వతంత్రంగా చేయాలని, సూచించారు.  కార్యకలాపాల కోసం నిర్ణయం తీసుకునే గరిష్ట అధికారాలను సి.డబ్ల్యు.సి. కి అప్పగించాలని ఆయన అన్నారు.  ప్రాధాన్యత ప్రాతిపదికపై, దేశంలో శీతల గిడ్డంగులు, నిర్మించడం పై దృష్టి పెట్టాలని కూడా, ఆయన సి.డబ్ల్యు.సి. ని కోరారు.  అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, దోపిడీతో సహా, ఇతర ప్రమాదాల కోసం, అన్ని గోదాములలో, క్రమం తప్పకుండా,  భద్రతా ఆడిట్ చేయాలని శ్రీ గోయల్ సి.డబ్ల్యు.సి. ని ఆదేశించారు.

గోధుమలు, బియ్యం నిల్వ కోసం సి.డబ్ల్యు.సి. దేశవ్యాప్తంగా, ఆధునిక గిడ్డంగులు నిర్మించాలని, తద్వారా దేశంలో ఎక్కువ కాలం ధాన్యాలు నిల్వ చేయవచ్చునని,  శ్రీ గోయల్ అన్నారు.

నాఫెడ్ ‌తో సమన్వయంతో ఉల్లిపాయ, బంగాళాదుంప, టొమాటో నిల్వ కోసం సి.డబ్ల్యు.సి. మరింతగా, శీతల గిడ్డంగుల సౌకర్యాలను నిర్మించాలని,  శ్రీ గోయల్ అన్నారు.

 

సి.డబ్ల్యు.సి. తన మొత్తం 423 గిడ్డంగులను ఆధునీకరించి, అభివృద్ధి చేయడానికి వీలుగా ఒక బృహత్ ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి సూచించారు.  వ్యవసాయ ఉత్పత్తుల కోసం, సి.డబ్ల్యు.సి. గిడ్డంగి / నిల్వ గ్యాప్ విశ్లేషణ చేయాలి, తదనుగుణంగా ఆర్కిటెక్టులు, నిపుణుల సహాయం తో ప్రణాళికలను సిద్ధం చేయాలి.

సిబ్బంది, ఖాతాదారులు, కార్మికులు, ట్రక్కు డ్రైవర్లు వంటి భాగస్వాముల అందరి సంరక్షణ కోసం సి.డబ్ల్యు.సి యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలని కూడా, కేంద్ర మంత్రి చెప్పారు.

 

అన్ని సి.డబ్ల్యు.సి. గిడ్డంగులలో పురుష కార్మికులు, మహిళా కార్మికులు, ఖాతాదారులు, డ్రైవర్లు, దివ్యాంగులకు మరుగుదొడ్లు, సరైన వేచి ఉండే గదులు / విశ్రాంతి గదులు, వర్కర్-షెడ్, తాగునీటి సౌకర్యాలు, చక్కటి, శుభ్రమైన వాతావరణం తో కూడిన ప్రాథమిక సౌకర్యాలు వంటి ఆధునిక, అనుకూలమైన సౌకర్యాలు తప్పకుండా ఉండాలని, ఆయన సూచించారు. 

*****



(Release ID: 1709970) Visitor Counter : 186