ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ టీకాల అవకతవకలపై ఢిల్లీ ప్రభుత్వానికి కేంద్రం లేఖ ప్రైవేట్ టీకా కేంద్రాలకు షో కాజ్ నోటీస్

Posted On: 05 APR 2021 7:14PM by PIB Hyderabad

కోవిడ్ సోకే అవకాశమున్న ప్రజలను రక్షించటానికి చేపట్టిన టీకాల కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు గమనిస్తూ, అత్యంత ఉన్నత స్థాయిలో సమీక్షిస్తూ ఉంది.  కొంతమంది 45 ఏళ్ళలోపు వారికి టీకాలిచ్చి ప్రైవేట్ కోవిడ్ సెంటర్లు అవకతవకలకు పాల్పడుతున్నట్టు దృష్టికి రావటంతో కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఆ కేంద్రాలకు లేఖ రాశారు.  

లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ లో తీవ్రమైన అవకతవకలు జరిగినట్టు తమ దృష్టికి వచ్చిందని ప్రిన్సిపల్ కార్యదర్శి ఆ లేఖలో ప్రస్తావించారు. ఢిల్లీ ఈశాన్యజిల్లాలోని విద్యాసాగర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్  మెంటల్ హెల్త్, న్యూరో అండ్ అలైడ్ సైన్సెస్ ( విమ్హాన్స్)  లో లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ లో అవకతవకలు గుర్తించినట్టు పేర్కొన్నారు. 45 ఏళ్ళ లోపు లబ్ధిదారులను ఆరోగ్య సిబ్బందిగా, కోవిడ్ యోధులుగా చూపి టీకాలు వేసినట్టు గుర్తించామన్నారు.

ప్రస్తుతం జరుగుతున్న కోవిడ్ టీకాల కార్యక్రమం నియమాల ప్రకారం ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్ళు పైబడిన పౌరులందరికీ కోవిడ్ టీకాలు ఇస్తున్నారు. అయితే, ఆరోగ్య సిబ్బందిగాని, కోవిడ్ యోధులుగాని అయితే మాత్రం 18 ఏళ్ళు పైబడినవారందరికీ టీకాలు ఇస్తున్నారు. అయితే, కోవిన్ వేదికమీద రిజిస్టర్ చేసుకున్న లబ్ధిదారుల జాబితాను పరిశీలించినప్పుడు మార్గదర్శకాలను ఉల్లంఘించి అర్హత పరిధికి లోబడని వారికి కూడా టీకాలు ఇచ్చినట్టు తేలింది. ప్రైవేట్ కోవిడ్ టీకా కేంద్రాలలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మార్గదర్శకాలను ఉల్లంఘించినట్టు  గుర్తించారు.

టీకాలు చాలా విలువైనవని, అందువలన విమ్హాస్న్ సంస్థ లో జరిగిన పొరపాట్లను తీవ్రంగా పరిగణిస్తున్నామని ఆరోగ్య మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. దీనివలన దేశవ్యాప్తంగా అర్హులైన వారికి న్యాయం జరగకపోయే ప్రమాదముందని అభిప్రాయపడింది. ఈ విషయంలో ఆ సంస్థలు వెంటనే షో కాజ్ నోటీస్ ఇవ్వాల్సిందిగా ఢిల్లీ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. అలాంటి అక్రమాలకు పాల్పడినందుకు 48 గంటలలోగా వివరణ కోరాలని, తగినంత జరిమానా విధించే విషయం పరిశీలించాలని కూడా  చెప్పింది. సంతృప్తికరమైన సమాధానం రాని పక్షంలో టీకాల పానెల్ నుంచి తొలగించాలని కూడా సూచించింది.

ఇలా ఉండగా, ఢిల్లీలోని ద్వారకలోని బెన్సప్స్ ఆస్పత్రిలో  కూడా కేంద్ర మార్గదర్శకాలు ఉల్లంఘించినట్టు తేలటంతో ఆరోగ్య మంత్రిత్వశాఖ సూచనల మేరకు షో కాజ్ నోటీస్ జారీ అయింది. అక్కడ కూడా 45 ఏళ్లలోపు అనర్హులైనవారికి టీకాలిచ్చినట్టు తేలింది.  

***



(Release ID: 1709800) Visitor Counter : 162


Read this release in: Punjabi , Hindi , English , Urdu