ప్రధాన మంత్రి కార్యాలయం

వారాణ‌సీ లో జ‌రిగిన ‘కాశీ ఏక్, రూప్ అనేక్’‌ కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

Posted On: 16 FEB 2020 7:00PM by PIB Hyderabad

హ‌ర హ‌ర మ‌హాదేవ,

ఇక్క‌డ‌కు పెద్ద సంఖ్య‌ లో త‌ర‌లివ‌చ్చిన చేతివృత్తుల, చేనేత‌ల సోద‌రులు, సోద‌రీమ‌ణులారా,

ఇది ఈ రోజు కాశీ లో నేను పాల్గొంటున్న మూడో కార్య‌క్ర‌మం.  మొట్ట‌మొద‌టగా నేను ఆధ్యాత్మిక కుంభ్ కార్య‌క్ర‌మానికి హాజరయ్యాను.  ఆ త‌రువాత నేను ఆధునికత‌ కు సంబంధించిన కుంభ్ కు వెళ్లి, అక్కడ వందల కోట్ల రూపాయ‌ల విలువ చేసే అనేక ప్రాజెక్టులను ప్రారంభించ‌డ‌మో లేదా పునాదిరాయిని వేయడ‌మో చేశాను. ఇక ఇప్పుడు ఒక రకంగా చూస్తే, స్వ‌తంత్రోపాధికి సంబంధించిన ఈ కుంభ్ లో నేను పాల్గొంటున్నాను.

వేరు వేరు చేతివృత్తుల క‌ళాకారుల ను ఒకేచోట క‌లుసుకోవ‌డం నేను చేసుకొన్న అదృష్టం.  ప్ర‌తి ఒక్క దార‌పు పోగును క‌లిపి మేలురకం వస్త్రాలను తయారు చేసే వారు మొద‌లుకొని అత్యుత్తమ బంకమ‌ట్టి సుద్దలనుంచి సుంద‌ర‌మైన కళారూపాల‌ను తీర్చిదిద్ది త‌మ శ‌క్తిని  ప్ర‌పంచంలో కెల్లా అత్యుత్త‌మ‌ కంపెనీల‌కు ధార‌ పోస్తున్న వారి వ‌ర‌కు.. ప్ర‌తి ఒక్క‌రూ ఇక్క‌డ గుమిగూడారు.  ఇది సంతోషించ‌వలసిన స‌మ‌యం.  ఇది ఒక కొత్త విశ్వాసాన్ని అందిస్తుంది. అంతేకాదు, ప్రోత్సాహాన్ని కూడా ఇస్తుంది.  నిజ‌మే, కాశీ ఒక్క‌టే కానీ ఈ నగరానికి వివిధ రూపాలు ఉన్నాయి.

ఈ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసినందుకు యోగి గారిని, ఆయ‌న యావ‌త్తు బృందాన్ని నేను అభినందిస్తున్నాను.  ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ఉత్ప‌త్తుల ను దేశ విదేశీ విప‌ణుల‌ కు తీసుకుపోవ‌డంతో పాటు వాటిని ఆన్‌లైన్ ద్వారా కూడా అందుబాటులో ఉంచేందుకు చేసిన ఈ ప్ర‌య‌త్నం ద్వారా దేశమంతా లాభ‌ప‌డుతుంది.  చేనేత కార్మికుల‌ కు, చేతివృత్తుల వారికి యంత్రాల ను,  బ్యాంకు రుణాల ను అందించ‌డం ద్వారా వారి జీవ‌నాన్ని మెరుగు ప‌ర‌చ‌డానికి అందిస్తున్న స‌దుపాయాలు ఎంతో అభినంద‌నీయ‌మైన‌విగా ఉన్నాయి.  ఈ సాధ‌నాల‌ను ఈ రోజు అందుకొన్న మిత్రుల‌ కు ఇవే నా అభినంద‌న‌లూ, శుభాకాంక్ష‌లూను.  

మిత్రులారా, భార‌త‌దేశంలో ప్ర‌తి ఒక్క ప్రాంతానికి, ప్ర‌తి ఒక్క జిల్లా కు త‌న‌దైన ఒక ప్ర‌త్యేక క‌ళ, ప్ర‌త్యేక ఉత్పత్తంటూ ఉండ‌డం ఆయా ప్రాంతాల కు, ఆయా జిల్లాలకు ఉన్నటువంటి ఒక బ‌లం.  భార‌త‌దేశం ఇలాంటి సంప్ర‌దాయాన్ని వంద‌ల సంవ‌త్స‌రాల నుంచి పెంచి పోషించుకొంటోంది.  మ‌న వ్యాపార‌స్తులు ఈ సంప్ర‌దాయాన్ని ప్ర‌పంచ‌మంత‌టికీ చేర‌వేశారు.  ర‌క‌ర‌కాల మ‌సాలా దినుసులు కావ‌చ్చు, ర‌క‌ర‌కాలైన ప‌ట్టువ‌స్త్రాలు .. అది కాటన్ కావ‌చ్చు, లేదా ప‌శ్ మినా కావచ్చు..  ఖనిజాలు కావచ్చు, భార‌త‌దేశం లో భారీ నిక్షేపాలు ఉన్నాయి  .  మ‌న దేశంలో ప్ర‌తి జిల్లా కు ఒక నిర్ధిష్ట ఉత్ప‌త్తి ఉంది.  మ‌రి దానికి సొంత ప్ర‌త్యేక‌త, సొంత విజ‌య గాథ కూడా ఉన్నాయి. మ‌న ఆదివాసీ ప్రాంతాల లో సైతం శ్రేష్ఠ‌మైన క‌ళాత్మ‌క‌త క‌లిగిన ఉత్పత్తులు త‌యార‌వుతూ ఉన్నాయి.  అదే మాదిరిగా  సాంప్ర‌దాయ‌క హ‌స్త‌క‌ళా ఉత్ప‌త్తులు, ప‌రిశ్ర‌మ‌లు అనేకం ఒక త‌రం త‌రువాత మ‌రొక త‌రం అన్న‌ట్లుగా ముందుకు సాగిపోతున్నాయి.  ‘ఒక జిల్లా, ఒక ఉత్ప‌త్తి’, ‘మేక్ ఇన్ ఇండియా’ వంటి ఆలోచ‌న‌ల కు ఈ ఘ‌న‌తే అతి పెద్ద ప్రేర‌ణ.  5 ట్రిలియ‌న్ డాల‌ర్ల విలువ‌ ను క‌లిగివుండే ఆర్థిక వ్య‌వ‌స్థను ఆవిష్క‌రించాల‌న్న ల‌క్ష్యాన్ని చేరుకోవ‌డంలో భార‌త‌దేశానికి ఉన్న శ‌క్తి ఇది.  

మిత్రులారా, మ‌న దేశంలో వ‌న‌రుల‌కు, ప్ర‌తిభావంతుల‌కు ఎన్న‌టికీ కొదవ లేదు. విస్తృతమైన ఆలోచ‌న‌లతో మ‌నం కృషి చేయ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉంది.  ఈ క‌థను ప్ర‌పంచానికి తెలియ‌జెప్ప‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉంది.  ఈ కృషి లో ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (యుపిఐడి) ఒక ముఖ్య‌పాత్ర‌ ను పోషించ‌గ‌ల‌దు. 30 జిల్లాల ‌లో 3,500 కు పైగా చేతివృత్తుల వారు , చేనేత కార్మికులు డిజైన్ల‌ ను త‌యారు చేయ‌డం లో గ‌త రెండేళ్ళ లో యుపిఐడి తోడ్పడింది.  సుమారు 1000 మంది క‌ళాకారుల కు వారి ప‌నిత‌నానికి సంబంధించిన ఉత్ప‌త్తుల‌ కు మెరుగులు దిద్దుకోవ‌డానికి ప‌నిముట్లను అందించ‌డం జ‌రిగింది.  కొనుగోలుదారులు, అమ్మ‌కందారుల స‌మావేశాల‌ ను ఏర్పాటుచేయ‌డం, చేతివృత్తుల‌ వారితో, నేత కార్మికులతో స‌మావేశాన్ని నిర్వ‌హించ‌డం, ప‌నిముట్ల‌ను అందించ‌డం, కార్యశాల (వర్క్ షాప్) ల‌ను నిర్వ‌హించ‌డం ద్వారా వేల కొద్దీ క‌ళాకారులు వారి వ్యాపారాల‌ ను అభివృద్ధి ప‌ర‌చుకోవ‌డంలో, వారి వ్యాపారాల‌ ను ఆధునీక‌రించుకోవ‌డంలో యుపిఐడి ఎంత‌గానో సాయ‌ప‌డింది.  ప‌నిత‌నం, అంత‌ర్జాతీయ నేర్ప‌రితనం.. వీటి విష‌యానికి వ‌స్తే ఉత్త‌ర్ ప్ర‌దేశ్ క‌ళాకారుల‌ కు యుపిఐడి చాలా పెద్ద వేదిక‌ గా మారుతోంది.

మిత్రులారా, నేను ఇక్క‌డికి వ‌చ్చే ముందు ‘ఒక జిల్లా, ఒక ఉత్ప‌త్తి’ (వన్ డిస్ట్రిక్ట్, వన్ పోడక్ట్) కు సంబంధించిన ఒక అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌నను చూశాను.  ఆ ప్ర‌ద‌ర్శ‌న‌ను చూడవల‌సిందిగా మిమ్మ‌ల్ని నేను అభ్యర్థిస్తున్నాను.  ఆ ప్ర‌ద‌ర్శ‌నలో ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని వివిధ ప్రాంతాల కు చెందిన అద్భుత‌మైన ఉత్ప‌త్తులన్నీ కొలువుదీరాయి.  వాడి, పార‌వేసే ప్లేట్ ల‌ను త‌యారుచేసే శ్రామికుల‌ కు ఆధునిక యంత్రాల‌ను ఇవ్వ‌డం జ‌రిగింది.  దీనితో వారిలో తొణికిస‌లాడుతున్న ఆత్మ‌విశ్వాసాన్ని- మీరు ఆ ప్రదర్శనకు వెళ్తేనే- అర్థం చేసుకోగలుగుతారు.

మిత్రులారా, 2022 క‌ల్లా ఒక‌సారి వినియోగించే ప్లాస్టిక్ కు స్వ‌స్తి చెప్పాల‌ని భార‌త‌దేశం సంక‌ల్పించుకొంది.  ప్ర‌పంచ‌మంతా ప్లాస్టిక్ కు ఒక ప్ర‌త్యామ్నాయాన్ని అన్వేషించేందుకు కృషి చేస్తున్న కాలంలో, మ‌నం ప‌ర్యావ‌ర‌ణానికి అనుకూలంగా ఉండే ప‌రిష్కార మార్గాల‌ను ఇటు భార‌త‌దేశాని కి, అటు ప్ర‌పంచానికి కూడా వెల్ల‌డి చేయవ‌చ్చును.

మిత్రులారా, మ‌న చారిత్ర‌క సంప్ర‌దాయాన్ని 21వ శ‌తాబ్దం అవ‌స‌రాలతో మేళ‌వించ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.  మేలు ర‌కం ఉత్ప‌త్తుల‌ ను త‌యారు చేయ‌డానికి మ‌నం కాలానుగుణ‌మైన మార్పుల‌ను తీసుకురావాలి.  సాంప్ర‌దాయ‌క ప‌రిశ్ర‌మ‌ల‌కు మ‌నం సంస్థాగ‌తమైన తోడ్పాటును అందించిన‌ప్పుడు మాత్ర‌మే ఇది సాధ్య‌ప‌డుతుంది.  మారుతున్న ప్ర‌పంచానికి, డిమాండుకు త‌గిన‌ట్లు ఉత్ప‌త్తుల‌ను మెరుగు ప‌ర‌చ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉంది.  ఈ సాంప్ర‌దాయక ప‌రిశ్ర‌మ‌లతో సంబంధం ఉన్న మిత్రుల‌కు శిక్ష‌ణ ను, ఆర్థిక స‌హాయాన్ని, కొత్త కొత్త మెళ‌కువ‌ల‌ను, మార్కెటింగ్ స‌దుపాయాల‌ను అందించ‌డం ఎంతో అవ‌స‌రం.  

గ‌త అయిదున్న‌ర ఏళ్ళుగా మేమంతాక‌ల‌సి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాం.  సౌర శ‌క్తి తో ప‌నిచేసే చ‌ర‌ఖా, సౌర శ‌క్తి తో ప‌నిచేసే మ‌గ్గం, సౌర శ‌క్తి తో ప‌నిచేసే దీపం, ఎల‌క్ట్రిక్ చాక్ వంటివి ఆ త‌ర‌హా లో కొన్ని ఉదాహ‌ర‌ణ‌లుగా నిలిచాయి.  మ‌న‌మంతా క‌ల‌సి కూర్చున్న ఈ హ‌స్త‌క‌ళ‌ల భ‌వ‌న స‌ముదాయం కూడా ప్ర‌భుత్వ దృక్ప‌థం, ప్ర‌భుత్వ ఆలోచ‌న‌ల ఫ‌లితం గా రూపుదిద్దుకొన్న‌దే.  మీరు నాతో చెప్పండి.. బ‌నార‌స్ గానీ, లేదా ఉత్త‌ర్ ప్ర‌దేశ్ కు చెందిన సామాన్య నేత కార్మికుడు గానీ లేదా ఎగుమ‌తిదారు గానీ 2014 వ సంవ‌త్స‌రం క‌న్నా ముందు పెట్టుబ‌డిదారుల‌ తో ఆన్ లైన్ లో సంభాషించే వారేనా?  ఇది ఊహ‌కు అందేదేనా?  అటువంటి వేదిక ఏదీ లేనందువ‌ల్ల ఇది సాధ్యం కాలేదు.  ఇదివ‌ర‌క‌టి ప్ర‌భుత్వాల వ‌ద్ద డ‌బ్బు గానీ, అవ‌గాహ‌న గానీ లేవా? అనేది మ‌నం చేప్ప‌జాల‌ం.  వైఖ‌రి తోనే స‌మ‌స్య‌.  దేశం ఆ దృక్ప‌థాన్ని అధిగ‌మించింది.  ప్ర‌తి ఒక్క వ్య‌క్తి, ప్రతి ఒక్క ప్రాంతం బ‌లంగా స్వ‌యంస‌మృద్ధంగా నిల‌బ‌డేట‌ట్లు చేయాల‌న్న ఉద్దేశ్యంతో మ‌నం ముందుకు సాగిపోతున్నాం.  ఈ కార‌ణం తోనే ఒక్క వారాణ‌సీ లోనే కాకుండా, దేశంలో చేతివృత్తుల వారు, వ్యాపారులు వారి ఉత్ప‌త్తుల‌ను ప్ర‌ద‌ర్శించగ‌ల అంత‌ర్జాతీయ స్థాయి కేంద్రాలను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది.   

‘ఒక జిల్లా, ఒక ఉత్ప‌త్తి’ కి సంబంధించిన కేంద్ర ప్ర‌భుత్వ సంపూర్ణ దార్శ‌నిక‌త కు వేగాన్ని జతపరిచినందుకు యోగి గారిని, ఆయ‌న బృందాన్ని నేను అభినందిస్తున్నాను.  ఈ ప్ర‌య‌త్నాల ఫలితంగానే గ‌త రెండేళ్ళ లో ఉత్త‌ర్ ప్ర‌దేశ్ నుంచి ఎగుమ‌తుల లో నిల‌క‌డైన వృద్ధి చోటు చేసుకొంది.  ఈ వృద్ధి ‘ఒక జిల్లా, ఒక ఉత్ప‌త్తి’ వంటి ప‌థ‌కాల తో, సూక్ష్మ, ల‌ఘు, మ‌ధ్య‌త‌ర‌హా వ్యాపార సంస్థ‌ల కు అందించిన స‌దుపాయాల తో సాధ్య‌మైంది.  ప్ర‌స్తుతం ప్రారంభించిన ఇ-కామ‌ర్స్ పోర్ట‌ల్ రాబోయే రోజుల లో ఎంతో సాయ‌ప‌డ‌నుంది.

మిత్రులారా, ఈ సంవ‌త్స‌ర‌పు బ‌డ్జెటు ప్ర‌భుత్వ ప్రాధాన్యాలను చాటిచెప్పింది. ఒక్క ఈ సంవ‌త్స‌రంలోనే కాకుండా రాబోయే అయిదు సంవ‌త్స‌రాల్లో  చిన్న, సన్నకారు ప‌రిశ్ర‌మ‌ల అభివృద్ధికిగాను ఒక కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళికను సిద్ధం చేయ‌డ‌మైంది.  త‌యారీ రంగం, వ్యాపార నిర్వ‌హ‌ణ లో సౌల‌భ్యం వంటి రంగాలపై ఈ బ‌డ్జెటు ప్ర‌ధానంగా దృష్టిపెట్టింది.  ఎమ్‌ఎస్ఎమ్‌ఇ లపై, స్టార్ట్ అప్ ల ‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకోవ‌డ‌ం జరిగింది.  ‘మేక్ ఇన్ ఇండియా’ లో ప్రాధాన్యాన్నిస్తున్న ఈ రంగాలే పెద్ద ఎత్తున ఉద్యోగ క‌ల్ప‌న‌కు ప్ర‌ధాన‌ మార్గాలుగా నిలిచాయి.

మిత్రులారా, జౌళి ప‌రిశ్ర‌మ‌, వ‌స్త్ర త‌యారీ ప‌రిశ్ర‌మ‌ ఇటు ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లో అటు యావ‌త్ భార‌త‌దేశం లో ఉపాధి క‌ల్ప‌నకు పెద్ద మాధ్యమంగా ఉన్నాయి.  ఈ ప్రాంతమంతా నేత కార్మికులకు, తీవాచీ త‌యారీ ప‌రిశ్ర‌మ ‌తో అనుబంధం ఉన్న క‌ళాకారులకు, శ్రామికుల కు ఒక ముఖ్య కేంద్రంగా ఉంది.  దుస్తుల‌ ప‌రిశ్ర‌మ పై, తివాచీల ప‌రిశ్ర‌మ పై ఆధార‌ప‌డి ల‌క్ష‌ల కొద్దీ కుటుంబాలు ఉన్నాయి.  ఈ సంవ‌త్స‌రం బ‌డ్జెటు జౌళి ప‌రిశ్ర‌మ కు ఒక కొత్త దృక్ప‌థాన్ని ఇచ్చే ప్ర‌య‌త్నాన్ని చేసింది. ఆరోగ్య సంబంధిత మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌, ఆటోమొబైల్ రంగం, ప‌ర్య‌ట‌న రంగం, ర‌క్ష‌ణ రంగం, వ్య‌వ‌సాయ రంగాల్లో సమ‌గ్ర వృద్ధి చోటుచేసుకొన్న కార‌ణంగా టెక్స్ టైల్స్ లో, టెక్నిక‌ల్ టెక్స్ ‌టైల్స్ లో డిమాండు కూడా అంతే వృద్ధి ని న‌మోదు చేసింది. 

భార‌త‌దేశం ఏటా కోట్ల రూపాయ‌ల విలువ ‌చేసే టెక్నిక‌ల్ టెక్స్ ‌టైల్స్ ను దిగుమ‌తి చేసుకొంటుంద‌న్న సంగ‌తిని మీరు ఊహించగలరు.  మ‌న టెక్నిక‌ల్ టెక్స్ టైల్స్ దిగుమ‌తులు మ‌న తివాచీ ఎగుమ‌తుల కంటే ఎంతో ఎక్కువగా ఉన్నాయి.  ఈ స్థితిగ‌తుల ను మార్చ‌డానికి గాను ముడి ప‌దార్థ‌మైన పాలిమ‌ర్ ఫైబ‌ర్ పై యాంటీ-డంపింగ్ డ్యూటీని ఈ బ‌డ్జెటు లో ర‌ద్దు చేయ‌డమైంది.  జౌళి ప‌రిశ్ర‌మ‌తో అనుబంధం క‌లిగిన వారు ద‌శాబ్దాల త‌ర‌బ‌డి కోరుతూ వ‌స్తున్న దానిని ప్ర‌భుత్వం ఈ ఏడాది నెరవేర్చింది.  పైపెచ్చు, ‘నేష‌నల్ టెక్నిక‌ల్ టెక్స్ టైల్స్ మిష‌న్’ ను కూడా ప్రారంభించ‌డం జ‌రిగింది.  ఈ మిష‌న్ కోసం రాబోయే నాలుగేళ్ళ కు గాను 1500 కోట్ల రూపాయ‌ల‌ను కేటాయించ‌డ‌మైంది.  టెక్నిక‌ల్ టెక్స్ టైల్స్ కు సంబంధించిన అన్ని సౌకర్యాలను.. మౌలిక స‌దుపాయాల‌ను, నైపుణ్యాలను.. దేశం లోనే స‌మ‌కూర్చడం జ‌రుగుతుంది.
 
మిత్రులారా, ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లో నిర్మాణం లో ఉన్న డిఫెన్స్ కారిడార్ కోసం ఈ సంవ‌త్స‌ర‌పు బ‌డ్జెటు లో దాదాపు 3,700 కోట్ల రూపాయ‌ల‌ను ఇవ్వ‌డ‌మైంది.  ఇటీవ‌ల అంత‌ర్జాతీయ ర‌క్ష‌ణ రంగ కంపెనీలు అనేకం ఇక్క‌డ లఖ్ నవూ లో ప‌రిశ్ర‌మ‌ల ను ఏర్పాటు చేయ‌డానికి ఆస‌క్తిని కనబర్చాయి.  ఎన్నో కంపెనీలు ఇప్ప‌టికే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.  డిఫెన్స్ కారిడార్ చిన్న పరిశ్రమలకు, మ‌ధ్య‌ త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల కు ల‌బ్ధిని చేకూర్చ‌డంతో పాటు, కొత్త చిన్న ప‌రిశ్ర‌మ‌ల‌కు కూడా అవ‌కాశాల‌ను ఇవ్వ‌నుంది.  ఈ డిఫెన్స్ కారిడార్ వ‌ల్ల వేల కొద్దీ నూత‌న ఉద్యోగ అవ‌కాశాలు కూడా అందివస్తాయి.

మిత్రులారా, సంప‌ద‌ ను సృష్టించే వారిని ‘న్యూ ఇండియా’ గౌర‌విస్తుంది; వారిని విశ్వ‌సిస్తుంది; వారి సేవ‌ల‌ను ఆమోదిస్తుంది.  సామాన్య మాన‌వుడు, అలాగే వ్యాపార‌స్తుడు ర‌క‌ ర‌కాల ప‌త్రాలు, ద‌స్తావేజుల బారి నుండి త‌ప్పించుకోవ‌డంలో వారికి స‌హాయప‌డే దిశలో ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.  ప్ర‌భుత్వ విధానాలు స‌ర‌ళంగా ఉండేట‌ట్లు, అడ్డంకులు సృష్టించేవిగా గాక‌ ముందుకు తీసుకుపోయే విధంగా ఉండేట‌ట్లు చూడ‌టానికి కృషి జ‌రుగుతోంది.  ఎమ్ఎస్‌ఎమ్ఇ  ప‌రిశ్ర‌మ‌లతో అనుబంధం క‌లిగిన నా మిత్రుల‌లో చాలా మంది లెక్క‌ల త‌నిఖీ (ఆడిట్) విష‌య‌మై చాలా వ‌ర‌కు ఫిర్యాదులు చేస్తున్నారు.  ఒక కోటి రూపాయ‌ల ట‌ర్నోవ‌ర్ క‌లిగివుండే వ్యాపారాలు కాగితాల‌తో స‌త‌మ‌త‌మ‌య్యే ప‌రిస్థితి ఉంది.  మీరు చార్ట‌ర్డ్ అకౌంటెంట్ సేవల‌ను కుదుర్చుకోవడం, ఆడిట్ స‌ర్టిఫికెట్ ను తీసుకోవడం వంటి ప‌నుల మీద అన‌వ‌స‌రంగా డ‌బ్బుల‌ను, కాలాన్ని వెచ్చించ‌వ‌ల‌సి వ‌స్తోంది.  ఈ సంవ‌త్స‌రం బ‌డ్జెటులో ఈ భారాల‌న్నింటి నుంచి మీకు స్వేచ్ఛ ను ఇవ్వ‌డం జ‌రిగింది.  ప్ర‌స్తుతం అయిదు కోట్ల రూపాయ‌ల‌కు పైగా టర్నోవ‌ర్ ప‌రిశ్ర‌మ‌ల‌కు మాత్ర‌మే ఆడిట్ అవ‌స‌రం అవుతుంది.  

మిత్రులారా, ప్ర‌భుత్వంలోని వివిధ విభాగాలు, అక్క‌ర‌లేని సుదీర్ఘ ప్ర‌క్రియ‌ల కార‌ణంగా చిన్న వ్యాపార‌స్తులు న‌గ‌దు ప‌ర‌మైన స‌మ‌స్య‌ను ఎదుర్కోవ‌ల‌సి వ‌స్తోంది.  ప్ర‌స్తుతం చ‌ట్టాన్ని స‌వ‌రించ‌డ‌ం జరిగింది.  ఇక మీద‌ట బ్యాంకింగేత‌ర ఆర్థిక స‌హాయ సంస్థ‌లు (ఎన్‌బిఎఫ్‌సి లు) మీ సరకుల ఇన్వాయిస్, బిల్లుల ఆధారం రుణాలను మంజూరు చేయగలుగుతాయి.  రుణాలు తేలిక‌గా మంజూరు అయ్యేట‌ట్లు చూడ‌టానికి మొబైల్ అప్లికేష‌న్ ఆధారిత ఇన్వాయిస్ ఫైనాన్సింగ్ లోన్స్ ప్రోడ‌క్టును ప్ర‌వేశ‌పెట్టాల‌న్న ఒక ప్ర‌ణాళిక కూడా ఉంది.  త్వ‌ర‌లోనే మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా రుణాన్ని పొంద‌గ‌లుగుతారు.  ఎమ్ఎస్ఎమ్ఇ ల‌కు నిర్వ‌హ‌ణ మూల‌ధ‌నాన్ని అందించే ఒక కొత్త ప్ర‌ణాళిక‌ను ప్రారంభించాల‌ని చూస్తున్నామ‌న్న ప్ర‌క‌ట‌న కూడా వెలువ‌డింది.

మిత్రులారా, చిన్న‌ ప‌రిశ్ర‌మ‌ల‌కు, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌కు ప్ర‌త్య‌క్షంగా సాయ‌ప‌డ‌టానికి దోహ‌దించే ప్ర‌భుత్వ కొనుగోళ్ళ‌కు, లాజిస్టిక్స్ కు సంబంధించిన అనేక నిర్ణ‌యాల‌ను తీసుకోవ‌డ‌మైంది.  చిన్న వ్యాపార‌స్తులు వారి ఉత్ప‌త్తుల‌ ను గ‌వ‌ర్న‌మెంటు ఇ-మార్కెట్ ప్లేస్ (GeM) ద్వారా ప్ర‌భుత్వానికి విక్ర‌యించి ఎంతో లాభ‌ప‌డ్డారు.  ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ కొనుగోళ్ళ‌ లో పార‌ద‌ర్శ‌క‌త చోటు చేసుకొంది.  ఈ వ్య‌వ‌స్థ‌ను సుల‌భ‌త‌రం చేయ‌డానికి యూనిఫైడ్ ప్రొక్యూర్‌మెంట్ సిస్ట‌మ్ ను ప్ర‌క‌టించ‌డ‌మైంది. దీనితో ప్ర‌భుత్వం చిన్న వ్యాపారుల వ‌స్తువుల‌ను, సేవ‌ల‌ను ఒకే వేదిక ద్వారా సేక‌రించ‌గ‌లుగుతుంది.

మిత్రులారా, ఎగుమ‌తిదారు సంస్థ‌ల‌ కు రిఫండులను అందించ‌డానికి ఒక డిజిట‌ల్ స‌దుపాయాన్ని సిద్ధం చేయ‌డం జ‌రిగింది.  ఇది ఎగుమ‌తిదారు సంస్థ‌ల‌కు రిఫండులను సుల‌భ‌త‌రం చేయగలదు, వేగవంతం కూడా చేయ‌గ‌ల‌దు.  మిత్రులారా, ఈ హాలులో ఆసీనులైన‌ వారంద‌రికీ ఎంతో సాయ‌ప‌డే ఒక అతి పెద్ద సంస్క‌ర‌ణ కూడా త్వ‌ర‌లో రాబోతోంది.  జిఎస్‌టి అమ‌లు వ‌ల్ల లాజిస్టిక్స్ లో పెద్ద మార్పు వ‌చ్చింది.  ప్ర‌స్తుతం దీనిని మరింత ప‌టిష్ట‌ప‌ర‌చ‌డం జ‌రుగుతోంది.  మొట్ట‌మొద‌టిసారిగా ‘నేశన‌ల్ లాజిస్టిక్స్ పాలిసీ’ రూపురేఖ‌ల‌ ను దిద్దే ప‌ని జ‌రుగుతోంది.  ఇది సింగిల్ విండో ఇ-లాజిస్టిక్స్ మార్కెట్ ఏర్ప‌డ‌టానికి దారితీస్తుంది.  ఇది చిన్న ప‌రిశ్ర‌మ‌లను మరింత పోటీ ప‌డేవిగా త‌యారుచేసి, ఉద్యోగ క‌ల్ప‌న లో తోడ్ప‌డుతుంది.  ఎమ్ఎస్ఎమ్ఇ ల‌ను బ‌ల‌ప‌ర‌చ‌డానికి మేలు ర‌కం వ‌స్తువుల‌ను, వేటినైతే భార‌త‌దేశం లో త‌యారు చేస్తున్నారో, అటువంటి ఉత్ప‌త్తుల దిగుమ‌తుల‌పై ఆంక్ష‌లను విధించ‌డం జ‌రుగుతోంది.

మిత్రులారా, ప‌న్నుల వ్య‌వ‌స్థ‌లో- అది ఆదాయ‌పు ప‌న్ను కావ‌చ్చు, లేదా కార్పొరేట్ టాక్స్ కావ‌చ్చు లేదా జిఎస్‌టి కావ‌చ్చు- సంస్క‌ర‌ణ‌ల ద్వారా మీరంద‌రూ, దేశంలోని ఇత‌రులు కూడా బోలెడ‌న్ని ప్ర‌యోజ‌నాల‌ను అందుకోబోతున్నారు.  ప‌న్ను చెల్లింపుదారుల చార్ట‌ర్ ను దేశం లో మొట్ట‌మొద‌టిసారిగా త‌యారుచేసే ప‌ని జ‌రుగుతోంది.  దేశం లో సంప‌ద‌ను సృష్టించేవారికి దీని ద్వారా ఎలాంటి అన‌వ‌స‌ర స‌మ‌స్య‌లు ఎదురు కావు.  ప‌న్ను చెల్లింపుదారు హ‌క్కులు ఏమేమిటో చాటిచెప్పే ఈ త‌ర‌హా ఆలోచ‌నను ప్ర‌పంచం లో చాలా దేశాలు చేయ‌నేలేదు.  ఇది ఒక ప‌న్ను చెల్లింపుదారుకు అత‌డి వ‌ద్ద స‌మాచారం సేక‌రించ‌డానికి వ‌చ్చిన ఎవ‌రినైనా ఎదుర్కొనేందుకు అధికారాన్నిస్తుంది.  ఇది ప‌న్ను చెల్లింపుదారుకు ల‌భించే ఒక పెద్ద హామీ కాగ‌ల‌దు.  ప‌న్ను వ‌సూళ్ళ‌ను మాన‌వ ప్ర‌మేయం లేకుండా (ఫేస్ లెస్) రూపొందించ‌డం జ‌రుగుతోంది.  త‌యారీని ప్రోత్స‌హించ‌డానికి ప‌న్నును 15 శాతానికి ప‌రిమితం చేయ‌డ‌మైంది.  ప్ర‌స్తుతం కార్పొరేట్ ట్యాక్స్ రేటులు చాలా త‌క్కువ‌గా ఉన్న అతి కొద్ది దేశాల లో ఒక దేశంగా భార‌త‌దేశం ఉంది.  ఇన్ వెస్ట‌ర్ లకు సాయ‌ప‌డ‌టానికి గాను ‘ఇన్ వెస్ట్‌మెంట్ క్లియ‌రెన్స్ సెల్’ ను ఏర్పాటు చేయాల‌న్న ఒక ప్ర‌ణాళిక కూడా ఉంది.  ఇది ఆన్ లైన్ పోర్ట‌ల్ గా రూపుదిద్దుకోనుంది.  ఇది రాష్ట్రాల స్థాయిలో, కేంద్రం స్థాయిలో అవ‌స‌ర‌మైన అనుమ‌తుల‌కు వీలు క‌ల్పించి, ప్ర‌ధాన‌మైన స‌మాచారాన్ని ఇట్టే అందుబాటులోకి తెస్తుంది.  

మిత్రులారా, ఈ చ‌ర్య‌ల‌న్నీ భార‌త‌దేశం లో ప్ర‌తి ఒక్క‌రి కోసం, ప్ర‌తి ఇన్వెస్ట‌ర్‌ కోసం, ప్ర‌తి స్టేక్ హోల్డర్ కోసం, ప్ర‌తి వ్యాపారి ప్ర‌యోజ‌నం కోసం ఉద్దేశించిన‌వే.  ఈ చ‌ర్య‌ల‌న్నిటిని దేశం 5 ట్రిలియ‌న్ డాల‌ర్ విలువైన ఆర్థిక వ్య‌వ‌స్థ గా మారాల‌న్న ల‌క్ష్యాన్ని సాధించ‌డంలో దోహ‌ద‌ప‌డాల‌నే తీసుకోవ‌డ‌మైంది.  మ‌న చేనేత‌కారులు, చేతివృత్తుల‌ వారు, చిన్న ప‌రిశ్ర‌మ‌ల‌ తో అనుబంధం క‌లిగిన శ్రామికుల మేలు కోరి ఆ త‌ర‌హా నిర్ణ‌యాల‌ ను మ‌రిన్ని తీసుకోవ‌డం జ‌రుగుతుంది.  అది కేంద్ర ప్ర‌భుత్వం కావ‌చ్చు, లేదా ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కావ‌చ్చు .. మేం స‌క‌ల ప్ర‌య‌త్నాలు చేస్తాం.  భార‌త‌దేశాన్ని ప్ర‌పంచంలోనే ఒక త‌యారీ కేంద్రంగా, ఇక్క‌డి నుంచి ఇత‌ర దేశాలకు ఉత్ప‌త్తుల‌ను ఎగుమ‌తి చేసేదిగా తీర్చిదిద్ద‌డానికి మ‌న‌మంద‌రం క‌ల‌సిక‌ట్టుగా కృషి చేద్దాం.
 
ఈ ఘ‌న‌మైన కార్య‌క్ర‌మానికి, త‌దేక దృష్టి క‌లిగిన కార్య‌క్ర‌మానికి, అంత‌ర్జాతీయంగా ఒక గుర్తింపును ఆవిష్క‌రించ‌డానికి నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి హాజ‌రైన మీరంద‌రికీ మ‌రొక్క‌మారు ఇవే నా శుభాకాంక్ష‌లు.  రాబోయే కొద్దిరోజుల్లో బ‌నార‌స్ లో అత్యంత ఆరాధ‌నీయ ప‌ర్వ‌దినం అయిన మ‌హాశివ‌రాత్రి రానుంది.  మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భం లో మీకంద‌రికీ నేను కూడా అభినంద‌న‌ల‌ను, శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తున్నాను.

ధ‌న్య‌వాదాలు.

 

***



(Release ID: 1708281) Visitor Counter : 81