ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

నాథెల్త్ 7వ శిఖరాగ్ర సమావేశంలో కేంద్రమంత్రి హర్షవర్ధన్ ప్రసంగం


‘కోవిడ్ కాలంలో భారతీయ ఆరోగ్య వ్యవస్థ విస్తరణ’పై చర్చ

“సంపద లేనివారికీ ఆరోగ్యం” అందించడమే ధ్యేయం

“అందరికీ ఆరోగ్యం అనే అంతిమ లక్ష్యం
ప్రైవేటు భాగస్వామ్యం లేనిదే సాధ్యంకాదు.”

Posted On: 26 MAR 2021 5:15PM by PIB Hyderabad

భారతీయ ఆరోగ్య రక్షణా సమాఖ్య (నాథెల్త్- NATHEALTH) ఆధ్వర్యంలో ఈ రోజు జరిగిన 7వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రసంగించారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ సమావేశం జరిగింది. ‘కోవిడ్ వైరస్ వ్యాప్తి అనంతర కాలంలో భారతీయ ఆరోగ్య వ్యవస్థ విస్తరణ’ అన్న అంశంపై ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించారు.  

  ఈ సందర్భంగా కేంద్రమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ, అందరికీ ఆరోగ్యం అన్న లక్ష్యాన్ని నెరవేర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.  “గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీజీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆరోగ్యానికి అగ్రశ్రేణి ప్రాధాన్యం ఇస్తోంది. అందరికీ ఆరోగ్యం అన్న లక్ష్య సాధన దిశగా మా కృషిని సంస్థాగతం చేస్తూ, 2017లో జాతీయ ఆరోగ్య విధానం ప్రారంభించా. అన్ని వయసుల వారికీ, అందరికీ సాధ్యమైనంత ఉన్నత స్థాయిలో ఆరోగ్యం, సంక్షేమం,  శ్రేయస్సును సాధించాలన్న దార్శనికతతో ఆరోగ్య విధాన వ్యవస్థను రూపొందించాం. ముందు జాగ్రత్తగా తీసుకునే నిరోధక చర్యలకు, ఆరోగ్య రక్షణ ప్రోత్సాహక చర్యలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా అందరికీ నాణ్యమైన సార్వత్రిక ఆరోగ్యరక్షణ సేవలను అందించడం, ఈ ప్రయత్నంలో ఎవ్వరికీ ఆర్థికపరంగా ఇబ్బందులు తలెత్తకుండా చూడటం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చాం. సమగ్రమైన ప్రాథమిక ఆరోగ్య రక్షణ వ్యవస్థను అందరికీ అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ఆయుష్మాన్ భారత్ అనే మరో బృహత్తర పథకాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది.” అని ఆయన చెప్పారు.

 

  “అభివృద్ధి ప్రక్రియ ముందుకుసాగడానికి దోహదపడే ఆరు ముఖ్యమైన అంశాల్లో ఆరోగ్యం కూడా ఒకటని 2021-22వ సంవత్సరపు బడ్జెట్ ఇప్పటికే గుర్తించింది. ఆరోగ్యం, సంక్షేమం లక్ష్యాలుగా సంపూర్ణ స్థాయిలో చేపట్టిన కృషికోసం 2021-22లో భారీ ఎత్తున రూ. 2,23,846కోట్ల నిధులను కేటాయించాం. అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే ఇది ఏకంగా 137శాతం ఎక్కువ.  ఆరోగ్య విధానం కింద నిర్దేశించుకున్న లక్ష్యాలకోసం ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. ఆరోగ్యంకోసం చేసే వ్యయాన్ని 2025నాటికల్లా స్థూల స్వదేశీ ఉత్పాదనలో 2.5శాతానికి పెంచేందుకు కృషి చేస్తున్నాం. అలాగే రాష్ట్రాల స్థూల స్వదేశీ ఉత్పత్తిలో 8శాతానికి మించిన స్థాయికి రాష్ట్రాల ఆరోగ్యరంగ వ్యయాన్ని పెంచాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు సూచిస్తున్నాం.” అని కేంద్రమంత్రి అన్నారు.

   వైరస్ మహమ్మారి  విజృంభణతో ప్రస్తుతం ఎదురైన సవాళ్లు, భవిష్యత్తులో ఎదురయ్యే ఇలాంటి సమస్యలను ఎదుర్కొనేలా ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రధానమంత్రి ఆత్మనిర్భర స్వాస్థ్య యోజన పథకం ఎలా దోహదపడగలదో ఆయన వివరించారు. “ప్రస్తుత సవాళ్లను, భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేలా ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరచడమే ప్రధానమంత్రి ఆత్మనిర్భర స్వాస్త్య యోజన ప్రధాన ధ్యేయం. వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తుగానే నిరోధించగలిగే పటిష్టమైన, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత నిఘా వ్యవస్థను విస్తరింపజేయడానికి కూడా ఈ పథకం ఉపకరిస్తుంది.” అని ఆయన చెప్పారు. అధునాతన వైద్య చికిత్సకు సంబంధించిన అత్యవసర వ్యవస్థకోసం తగిన రీతిలో ప్రతిస్పందించడం, శిక్షణ, పర్యవేక్షణ, ప్రజారోగ్య పరిశోధనా శాలల వ్యవస్థకు పటిష్టత వంటి అంశాలకు కూడా ఈ పథకం దోహదపడుతుందన్నారు. అలాగే, వ్యాధుల నియంత్రణ వంటి అంశాలపై పర్యవేక్షణ కోసం కొత్తగా ప్రాతీయ కేంద్రాల ఏర్పాటుకు కూడా ఈ పథకం దోహదపడుతుందన్నారు. 

     “పరివర్తనకోసం సుపరిపాలన, పారదర్శకత వంటివి ఈ ప్రభుత్వానికి దీటైన ప్రమాణాలు. వైద్యవిద్యారంగంలో సుదీర్ఘకాలంగా ఆశిస్తున్న సంస్కరణలు చేపట్టడానికి జాతీయ వైద్య కమిషన్ చట్టం మార్గాన్ని సుగమంచేసింది. అలాగే,..వైద్య విద్యను ప్రమాణబద్ధం చేసేందుకు వీలు కల్పిస్తూ జాతీయ అనుబంధ, ఆరోగ్యరక్షణ వృత్తుల కమిషన్ ఏర్పాటుకు ఆమోదం లభించింది. అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్రాల అధ్యయన సంస్థ (ఎయిమ్స్)ల  విస్తరణకు కూడా కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనితో దేశంలో ఎయిమ్స్ సంస్థల సంఖ్య 22కు చేరింది. వాటిలో సగం సంస్థలు ఇప్పటికే పని ప్రారంభించాయి. జిల్లాల్లోని ఆసుపత్రుల స్థాయిని పెంచి వాటిని వైద్య కళాశాలలుగా తీర్చిదిద్దాం. ఇప్పటికే నడుస్తున్న ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షాయోజన పథకంకింద మరింతగా విస్తరింపజేస్తున్నాం.” అని కేంద్రమంత్రి అన్నారు

  భారతదేశంలోని ఆరోగ్య రక్షణ వ్యవస్థలో ప్రైవేటు రంగం పాత్రను బలోపేతం చేసే అంశానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందని డాక్టర్ హర్షవర్ధన్ అభిప్రాయపడ్డారు. “ఆరోగ్య రక్షణ వ్యవస్థకు సంబంధించి ప్రపంచంలోనే  అత్యున్నత ప్రమాణాలను భారతదేశం సాధించాల్సి ఉంది. ప్రైవేటు రంగం మద్దతు లేకుండా ఈ లక్ష్యాన్ని అందుకోవడం సాధ్యం కాదు. ప్రైవేటు రంగం క్రియాశీలకమైన భాగస్వామ్యంతోనే మరింత విశాల దృక్పథంతో కూడిన ఆరోగ్య రక్షణ సదుపాయాలను కల్పించగలం.” అని అన్నారు. “దేశంలోని వివిధ నగరాల్లో, పట్టణాల్లో ప్రస్తుతం ఆరోగ్య రక్షణసదుపాయాలను వివిధ ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ సారథ్యంలోని ప్రజారోగ్య కార్యక్రమాలకు కూడా ప్రైవేటు సంస్థలు మద్దతుగా నిలుస్తున్నాయి. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, ప్రధానమంత్రి జాతీయ రక్తశుద్ధి కార్యక్రమం, వైద్య కేంద్రాలు, బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ వంటి కార్యక్రమాల నిర్వహణలో ప్రైవేటు సంస్థలు తగిన సహాయ, సహకారాలు అందిస్తున్నాయి. ప్రజారోగ్య లక్ష్యాలకు అనుగుణంగా ప్రైవేటు ఆరోగ్య రక్షణరంగం అభివృద్ధికి దోహదపడటం,.. 2017 సంవత్సరపు జాతీయ ఆరోగ్య విధానం ప్రాథమిక లక్ష్యాల్లో ఒకటిగా పొందుపరుచుకున్నాం. ఆరోగ్య రక్షణ వ్యవస్థలను మరింత ప్రభావవంతంగా, సమర్థంగా, హేతుబద్ధంగా, సురక్షితంగా, అందుబాటు యోగ్యంగా, నైతికంగా మార్చే ప్రక్రియలో ప్రైవేటు రంగం కూడా తగిన సేవలందించేందుకు ఆరోగ్య విధానం వీలు కలిగిస్తుంది.”

 

****(Release ID: 1708054) Visitor Counter : 139


Read this release in: Urdu , English , Hindi