శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

నీరు, వాతావరణ మార్పులపై ప్రముఖుల ప్రధాన చర్చ

ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా వెబినార్

Posted On: 24 MAR 2021 1:12PM by PIB Hyderabad

అంతర్జాతీయ స్థాయిలో ఐదు అతిపెద్ద ప్రాధాన్యతలైన నీరు, ఆరోగ్యం, పర్యావరణం, వ్యవసాయం, ఇంధనం వంటి వాటిని తీవ్రంగా ప్రభావితం చేసే వాతావరణ పెను మార్పుల నియంత్రణకు ప్రత్యేక కృషి జరుగుతోందని కేంద్ర విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞాన శాఖ (డి.ఎస్.టి.) లోని వాతావరణ మార్పుల కార్యక్రమ విభాగం సలహాదారు, విభాగం అధిపతి డాక్టర్ అఖిలేశ్ గుప్తా తెలిపారు.  ఇందుకోసం హిమనీనద శాస్త్రం, వాతావరణ నమూనా ప్రక్రియ, పట్టణ వాతావరణం, గాలితుంపరపై అధ్యయనం, అసాధారణ  వాతావరణ పరిణామాలు, హిమాలయ వాతావరణ వ్యవస్థ వంటి వాటిపై అధ్యయనంకోసం దృష్టిని కేంద్రీకరించినట్టు ఆయన తెలిపారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఈ నెల 22న నిర్వహించిన ఒక జాతీయస్థాయి ఇ-వెబినార్ లో ఆయన ప్రసంగించారు.

  వాతావరణంలో చోటుచేసుకునే పెను మార్పుల ప్రభావానికి లోనయ్యే అంశాలను, సమస్యలను ఆయన విపులంగా వివరించారు. రాబోయే ఐదేళ్ల కాలంలో ఈ సమస్యల పరిష్కారానికి డి.ఎస్.టి. రూపొందించిన ప్రణాళికలను కూడా వివరించారు.

  “రానురాను ఉష్ణోగ్రత పెరుగుతోంది. ఈ పెరుగుదల కొనసాగే అవకాశం కూడా ఉంది. వాతావరణంలో పెనుమార్పుల నియంత్రణకు చర్యలు తీసుకోని పక్షంలో సముద్ర మట్టాలు కూడా  తీవ్రంగా పెరిగవచ్చు.  వివిధ దేశాల్లోని నగరాల్లో ఉన్న ఎక్కువ జనసాంద్రత కారణంగా, ఉధృత స్థాయిలో వర్షాలు రికార్డవుతున్నాయి. దీనితోపాటుగా అనేక చోట్ల మెరుపువరదలు కూడా పెరుగుతున్నాయి. గాలి తుంపరలు, మేఘాల్లో పరస్పర ప్రక్రియల నేపథ్యంలో వర్షపాతాన్ని గాలి తుంపరలు ప్రభావితం చేస్తున్నాయి.” అని ఆయన అన్నారు.

      “ఎల్ నినో తలెత్తిన ప్రతిసారీ అనావృష్టి, దుర్భిక్షం సంభవిస్తుందనిగానీ, అనావృష్టి పరిస్థితులన్నింటికీ ఎల్ నినో మాత్రమే కారణమనిగానీ చెప్పలేమని”  ఆయన అన్నారు. భారతీయ విజ్ఞానశాస్త్ర సంస్థ (ఐ.ఐ.ఎస్.) కు చెందిన ఒక శాస్త్రవేత్త ఇటీవల ఒక సైన్స్ మ్యాగజైన్.లో వెలవరించిన అధ్యయనాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. “ఈ రెండు రకాల వర్షాభావ పరిస్థితులు, అనావృష్టి పూర్తిగా విభిన్నమైనవి. వివిధ రుతువుల పరిణామ క్రమం ప్రకారం చూసినా ఇవి విభిన్నమైన పరిణామాలే. పసిఫిక్ మహా సముద్రంలో పరిణామాలకు గుర్తింపుగా మాత్రమే వీటిని పరిగణించరాదు. ఎల్ నినో తరహా అనావృష్టి పరిస్థితి ఏర్పడినకాలంలో ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో  తీవ్ర వ్యత్యాసంతో కూడిన అతి శీతల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎల్ నినో అనావృష్టి నేపథ్యంలో, వర్షరుతువు ప్రారంభంలో అంటే జూన్ నెల మధ్యలో లోటు  వర్షపాతం తలెత్తినపక్షంలో ఆగస్టు మధ్యకల్లా ఆ పరిస్థితి ఇంకా విషమించి వర్షపాతంలో మరింత లోటు ఏర్పడుతుంది. దీనితో దేశమంతా విస్తృత స్థాయిలో లోటు వర్షపాతం నెలకొంటుంది. ఇక ఎల్ నినోతో సంబంధం లేకుండా అనావృష్టి పరిస్థితి ఏర్పడినపుడు, జూన్ నెలలో మొదట్లో ఓ మోస్తరు లోటు వర్షపాతం ఏర్పడుతుంది. జూలై మధ్యనుంచి ఆగస్టు మధ్యకాలం నాటికల్లా వర్షాలు తిరిగి కోలుకునే సూచనలు కనిపిస్తాయి. అయితే, దాదాపు ఆగస్టు మూడవ వారంలో మరోసారి లోటు మొదలవుతుంది. ఆ తర్వాత మూడు వారాల్లోనే దేశమంతా లోటు వర్షపాతం ఏర్పడుతుంది.” అని అన్నారు.

   భారతదేశంలోని అన్ని రాష్ట్రాలూ వాతావరణంలోని పెనుమార్పులకు ప్రభావితమయ్యే ఆస్కారం ఉందని డాక్టర్ గుప్తా అన్నారు. “ఈ విషయంలో వరుసగా జార్ఖండ్ ఎక్కువగా, మహారాష్ట్ర తక్కువగా ప్రభావితమవుతాయి. జార్ఖండ్, మిజోరాం, ఒడిశా, చత్తీస్ గఢ్, అస్సాం, బీహార్, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి 8 రాష్ట్రాలు వాతావరణ మార్పులకు ఎక్కువగా ప్రభావితమవుతూ ఉంటాయి. అస్సాంలోని దాదాపు 90శాతం జిల్లాలు, బీహార్ లోని 80శాతం జిల్లాలు, జార్ఖండ్ లోని 60శాతం జిల్లాలకు ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.” అని డాక్టర్ గుప్తా వివరించారు.

   ఇలాంటి సమస్యలను ఎదుర్కొనేందుకు, పరిష్కరించేందుకు కేంద్ర విజ్ఞానశాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన శాఖ (డి.ఎస్.టి.) తన ప్రత్యేక కార్యక్రమం ద్వారా 1,500పైగా పరిశోధనా పత్రాలను తయారు చేసిందని వాటిలో వెయ్యికిపైగా పరిశోధనా పత్రాలు అంతర్జాతీయ జర్నల్స్ లో ప్రచురితమయ్యాయని ఆయన చెప్పారు. సమస్య పరిష్కారానికి డి.ఎస్.టి. తన ప్రత్యేక కార్యక్రమం ద్వారా వందదాకా కొత్త మెలకువలను రూపొందించిందని, 350 కార్యగోష్టులను నిర్వహించిందని, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో 250 శిక్షణా కార్యక్రమాలను నిర్వహించిందని, తద్వారా 50వేల మందికి శిక్షణ ఇచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో, పరిశోధనా విద్యార్థుల్లో సామర్థ్యాల నిర్మాణంకోసం డి.ఎస్.టి. కృషి చేసిందని, దాదాపు లక్షన్నర మందికి అవకాశం కల్పిస్తూ ఎన్నో అవగాహనా కార్యక్రమాలను కూడా డి.ఎస్.టి. నిర్వహించిందని అన్నారు.

   ప్రపంచ జల దినోత్సవ సందర్భంగా జరిగిన ఈ వెబినార్ లో,.. గీతమ్ వైస్ చాన్సిలర్ ప్రొఫెసర్ రామకృష్ణ, ప్రో వైస్ చాన్సిలర్ ప్రొఫెసర్ ఎ. సుబ్రమణ్యం, సైన్సెస్ విభాగం డీన్ ప్రొఫెసర్ ఎం శరశ్చంద్ర బాబు, జి.ఐ.ఎస్. ప్రిన్సిపల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. నీటికి తగిన విలువ ఇవ్వడం అన్న ఇతివృత్తంతో చేపట్టిన ఈ వెబినార్ ను, విశాఖపట్నంలోని గీతమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ పర్యావరణ అధ్యయన విభాగం నిర్వహించింది. పరిశుద్ధమైన తాగునీటికి ఏర్పడిన ఎద్దడి, జనాభా పెరుగుదల కారణంగా నీటి సరఫరాలో ఏర్పడిన ఆందోళనకర పరిస్థితులు తదితర అంశాలపై ఈ వెబినార్ లో విపులంగా చర్చించారు.

 

****



(Release ID: 1707443) Visitor Counter : 128


Read this release in: English , Hindi , Bengali , Punjabi