రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
2025 నాటికి భారత రసాయన పరిశ్రమలో 8 లక్షల కోట్ల పెట్టుబడులు : సదానంద గౌడ
ప్రపంచ రసాయన, పెట్రో కెమికల్ రంగంలో అగ్రగామి దేశంగా భారత్
Posted On:
17 MAR 2021 5:29PM by PIB Hyderabad
భారత రసాయన, పెట్రోకెమికల్ రంగంలో 2025నాటికి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులుగా రానున్నాయని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ సదానంద గౌడ వెల్లడించారు. న్యూ ఢిల్లీలో ఆయన 11వ ఇండియా కెమ్ 2021 సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ గౌడ దేశంలో రసాయన, పెట్రో కెమికల్ రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. ' రసాయనాలు పెట్రోకెమికల్స్ ఉత్పత్తి కేంద్రంగా భారతదేశం" అనే అంశంపై రసాయన పెట్రోకెమికల్స్ శాఖ, ఫిక్కీ ఈ సదస్సును నిర్వహించాయి. ప్రధానమంత్రి ఆశిస్తున్న ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణానికి రసాయన పెట్రోకెమికల్స్ రంగంలో జరుగుతున్నఅభివృద్ధి సహకరిస్తుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం ప్రారంభించిన 12 పిఎల్ఐ పథకాల వల్ల ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రసాయన రంగానికి ప్రయోజనం కలుగుతుందని ఆయన అన్నారు. రసాయన రంగాన్ని ప్రాధాన్యతా రంగంగా ప్రభుత్వం గుర్తించిందని తెలిపిన మంత్రి 2021-21 బడ్జెట్ లో నాఫ్తా పై దిగుమతి సుంకాన్ని నాలుగు నుంచి 2.05 శాతానికి తగ్గించమని అన్నారు. సదస్సును నిర్వహించిన రసాయన శాఖ మరియు ఫిక్కీ లను ఆయన అభినందించారు.
ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారతదేశం అభివృద్ధి చెందుతున్నదని రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ రసాయనాలు మరియు పెట్రోకెమికల్స్ విభాగం కార్యదర్శి శ్రీ యోగేంద్ర త్రిపాఠి అన్నారు. భారతదేశాన్ని ప్రముఖ రసాయనాలు మరియు పెట్రోకెమికల్స్ హబ్‌గా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఇండియా కెమ్ -2021 నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి, జాతీయ మౌలిక సదుపాయాల కల్పనకు జాతీయ అమలు జరుగుతున్న పథకాలు,వేతన రేట్లు లాంటి అంశాల వల్ల ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారతదేశం ముందు వున్నదని ఆయన వివరించారు.
పెట్టుబడులు పెట్టడానికి అవసరమైన అన్ని వసతులు తమ రాష్ట్రంలో ఉన్నాయని ఒడిశా పరిశ్రమల శాఖ మంత్రి కెప్టెన్ దిబ్యా శంకర్ మిశ్రా తెలిపారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే పెట్టుబడిదారులకు ప్రయోజనం కలుగుతుందని ఆయన అన్నారు. పెట్టుబడిదారులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించడానికి వ్యవస్థను అభివృద్ధి చేశామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమలను నెలకొల్పి వ్యాపారం సాగించాచడానికి సులభతరం వాణిజ్యం లాంటి అనేక సంస్కరణలను తమ ప్రభుత్వం అమలు చేస్తున్నాదని ఆయన వివరించారు. రసాయనాలు పెట్రోకెమికల్స్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ కు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. పెట్రోకెమికల్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్న కేంద్రప్రభుత్వాన్ని ఆయన అభినందించారు.
ఈ సందర్భంగా జరిగిన ప్రపంచ సీఈఓల సమావేశంలో భారతదేశంలో పెట్టుబడులను పెట్టడానికి గల అవకాశాలను చర్చించారు.
***
(Release ID: 1705700)
Visitor Counter : 266