ఆర్థిక మంత్రిత్వ శాఖ
రూ.43 కోట్లకుపైగా ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ మోసం కేసులో ఒకరిని అరెస్టు చేసిన గురుగావ్ డీజీజీఐ అధికారులు
Posted On:
11 MAR 2021 12:05PM by PIB Hyderabad
హరియాణాలోని 'డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్' (డీజీజీఐ) 'గురుగావ్ ప్రాంతీయ కేంద్రం' (జీజడ్‌యూ) అధికారులు న్యూదిల్లీకి చెందిన రవీందర్ కుమార్ (రవీందర్ గార్గ్) అనే వ్యక్తిని అరెస్టు చేశారు. నకిలీ పత్రాలతో డొల్ల సంస్థలను ఏర్పాటు చేసి, జరగని వ్యాపారానికి దొంగ ఇన్‌వాయిస్‌లు సృష్టించి, వాటిపై ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ పొందినందుకు నిందితుడిని అరెస్టు చేశారు.
హరియాణా, దిల్లీ, ఝార్ఖండ్‌లో సొంతంగా, భాగస్వామ్యంతో, ప్రైవేటు లిమిటెడ్ సంస్థలను ఏర్పాటు చేసినట్లు రవీందర్ కుమార్ పత్రాలు సృష్టించినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. దీనిపై అతనికి ఎన్నిసార్లు శ్రీముఖాలు జారీ చేసినా విచారణకు రాకుండా తప్పించుకున్నాడు.
పరారీలో ఉన్న రవీందర్ కుమార్, తానుండే ప్రదేశాలను తరచూ మార్చేవాడు. అధికారులు అతని కోసం నిఘా పెట్టి చరుగ్గా గాలింపులు జరపగా, చాలా రోజుల తర్వాత ఎట్టకేలకు దొరికాడు. రెండు నకిలీ ప్రైవేటు లిమిటెడ్, ఒక భాగస్వామ్య సంస్థతోపాటు, తనపేరుపై అనేక సంస్థలను సృష్టించినట్లు నిందితుడు అంగీకరించాడు. వీటిపై రూ.237.98 కోట్ల విలువైన ఇన్వాయిస్‌లను సృష్టించి, రూ.43 కోట్లకుపైగా ఇన్‌పుట్ టాక్స్‌ను అక్రమంగా పొందినట్లు అధికారుల వద్ద ఒప్పకున్నాడు.
దిల్లీ, హరియాణాలోని అనేక ప్రాంతాల్లో దర్యాప్తు చేపట్టిన అధికారులు, నకిలీ పత్రాలతో డొల్ల సంస్థలను సృష్టించిన ముఠాలో రవీందర్ కుమార్ ప్రధాన సూత్రధారిగా తమకు లభించిన ఆధారాలు, నిందితుడి వాంగ్మూలం ఆధారంగా తేల్చారు. ఈనెల 9వ తేదీన రవీందర్ కుమార్‌ను అరెస్టు చేసిన అధికారులు, దిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. న్యాయస్థానం నిందితుడికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.
***
(Release ID: 1704131)
Visitor Counter : 170