కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

ఆర్థిక సంవ‌త్స‌రం 2020వ‌ర‌కు మూడు సంవ‌త్స‌రాల‌లో 3,82,875 కంపెనీల కార్య‌క‌లాపాల నిలిపివేత‌

Posted On: 09 MAR 2021 1:37PM by PIB Hyderabad

వ‌రుస‌గా రెండు లేక అంత‌క‌న్నాఎక్కువ సంవ‌త్స‌రాలకు పైగా ఆర్థిక నివేదిక‌ల‌ను న‌మోదు చేయ‌ని బోగ‌సు కంపెనీల‌ను గుర్తించి, కంపెనీల చ‌ట్టం,2013లోని సెక్ష‌న్ 248, కంపెనీలు (రిజిస్ట‌ర్ ఆఫ్ కంపెనీస్ నుంచి కంపెనీల పేర్లు తొల‌గింపు) నిబంధ‌న‌లు, 2016 కింద చ‌ట్ట ప్ర‌క్రియ‌ల‌ను అనుస‌రించి  ఆర్థిక సంవ‌త్స‌రం 2020 అంతం వ‌ర‌కు మూడు సంవ‌త్స‌రాల‌లో 3,82,875 కంపెనీల పేర్ల‌ను నిలిపివేయ‌డం జ‌రిగింది. కాగా, 2020-2021లో ఏ కంపెనీ పేరును కొట్టివేయ‌లేదు. 
ఈ విష‌యాన్ని కేంద్ర ఆర్థిక‌, కార్పొరేట్ వ్య‌వ‌హారాల శాఖ స‌హాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మంగ‌ళ‌వారం రాజ్య‌స‌భ‌కు ఇచ్చిన లిఖిత పూర్వ‌క స‌మాధానంలో పేర్కొన్నారు. 

కంపెనీల చ‌ట్టం, 2013లో (the Act) బోగ‌సు కంపెనీ (“Shell Company”) అన్న ప‌దానికి ఎటువంటి నిర్వ‌చ‌నాన్ని ఇవ్వ‌లేద‌ని మంత్రి చెప్పారు. సాధార‌ణంగా చురుకైన కార్య‌క‌లాపాలు లేక చెప్పుకోద‌గిన ఆస్తులు లేకుండా, కొన్ని సంద‌ర్భాల‌లో ప‌న్ను ఎగ‌వేత, మ‌నీలాండ‌రింగ్‌, అస్ప‌ష్ట‌మైన యాజ‌మాన్యం, బినామీ ఆస్తులు త‌దిత‌ర చ‌ట్ట‌వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డే కంపెనీని సాధార‌ణంగా షెల్ కంపెనీగా ప‌రిగ‌ణిస్తారు.  ఈ బోగ‌స్ కంపెనీల స‌మ‌స్య‌ను ప‌రిశీలించేందుకు ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన స్పెష‌ల్ టాస్క్ ఫోర్సు  షెల్ కంపెనీల‌ను గుర్తించేందుకు కొన్ని రెడ్ ఫ్లాగ్ సూచీల‌ను సిఫార్సు చేసింది. అటువంటి షెల్ కంపెనీల‌ను గుర్తించి, మూసివేయ‌డానికి ప్ర‌భుత్వం ప్ర‌త్యేక డ్రైవ్‌ను చేప‌ట్టింది. 
మ‌రిన్ని వివ‌రాల‌ను అందిస్తూ, త‌మ‌కు సీరియ‌స్ ఫ్రాడ్ అండ్ ఇన్వెస్టిగేష‌న్ ఆఫీస్ (SFIO) రాసిన లేఖ‌తో పాటుగా ఎంసిఎ నుంచి 331 షెల్ కంపెనీల జాబితా అందింద‌ని సెక్యూరిటీస్ ఎక్స్‌చేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి)తెలిపింది. ఇందులో అవ‌స‌ర‌మైన చ‌ర్య‌ల‌ను చేప‌ట్ట‌డానికి షెల్ కంపెనీల డాటా బేస్‌తో పాటుగా, వారి సూచ‌న‌లు ఇందులో పొందుప‌రిచార‌ని మంత్రి తెలిపారు.  ఎంసిఎ సూచ‌న ఆధారంగా, ఆగ‌స్టు 7, 2017 నాటి ఉత్త‌ర్వుల ఆధారంగా ముంద‌స్తు తాత్కాలిక చ‌ర్య‌లు చేప‌ట్ట‌వ‌ల‌సిందిగా స్టాక్ ఎక్స్‌చేంజీల‌కు సెబీ స‌ల‌హా ఇచ్చింది. 
ఎ) గుర్తించిన జాబితాలో గ‌ల కంపెనీల‌ను నిఘా కింద ఉంచ‌డం.
బి) అటువంటి గుర్తించిన కంపెనీల డైరెక్ట‌ర్లు, ప్ర‌మోట‌ర్ల వాటాల బ‌దిలీపై ఆంక్ష‌లు.
సి) అటువంటి కంపెనీల మూలాల‌ను/  యోగ్య‌తా ప‌త్రాల‌ను ధృవీక‌రించ‌డం. 
ఇందుకు అనుగుణంగా, దేశ‌వ్యాప్తంగా ఉన్న గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్‌చేంజీలు  (ఎన్ ఎస్ ఇ, బిఎస్ ఇ, ఎంఎస్ ఇఐ) అన్నీ కూడా  మార్కెట్ భాగ‌స్వాముల‌ను ఉద్దేశించిన ఆగ‌స్టు 7, 2017 నాటి ఉత్త‌ర్వుల ఆధారంగా సెబీ ఆదేశాల‌కు అనుగుణంగా చ‌ర్య‌లు ప్రారంభించాయి. మొత్తం అనుమానిత 331 షెల్ కంపెనీల‌లో, 221 కంపెనీలు ఈ దేశ‌వ్యాప్తంగా ఉన్న స్టాక్ ఎక్స్‌చేంజీల‌లో లిస్ట్ అయి ఉన్నాయి. అటువంటి 68 కంపెనీల‌పై ద‌ర్యాప్తు చేయ‌వ‌ల‌సిందిగా ఎంసిఎ ఆదేశించింద‌ని మంత్రి వివ‌రించారు. 

 

***
 

 



(Release ID: 1703527) Visitor Counter : 117


Read this release in: English , Urdu , Punjabi