ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

న్యాయవ్యవస్థను సామాన్యుని వద్దకు అందుబాటులోకి తీసుకురావాలి - ఉపరాష్ట్రపతి

• ప్రజాప్రతినిధులకు సంబంధించిన నేరప్రమేయ కేసుల పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల అవసరముంది

• ఎన్నికల వివాదాలు, అధికార దుర్వినియోగం తదితర కేసులకూ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటును పరిశీలించాలి

• చట్టసభల్లో చర్చల సమయంలో ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరుపై ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆవేదన

• న్యాయవ్యవస్థలో నియామకాల వేగవంతం, వాయిదాలు తగ్గించుకోవడం ద్వారానే కేసుల భారం తగ్గించుకోవచ్చని సూచన

• వినియోగదారుల ప్రయోజనాలు కాపాడేందుకు చట్టాలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది

• తమిళనాడులోని డాక్టర్ అంబేడ్కర్ న్యాయ విశ్వవిద్యాలయం 11వ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి

Posted On: 27 FEB 2021 2:13PM by PIB Hyderabad

కేసుల పరిష్కారంలో ఆలస్యం, న్యాయ ప్రక్రియ అందుబాటులో ఉండకపోవడం, ఖర్చు పెరగడం తదితర కారణాలతో సామాన్యుడికి సరైన న్యాయం అందడంలో సమస్యలు ఎదురౌతున్నాయని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ‘సమాజంలోని పేద వ్యక్తికి కూడా న్యాయం అందినప్పుడే నిజమైన న్యాయం జరిగినట్లు’ అన్న మహాత్మాగాంధీ సూక్తిని న్యాయ వ్యవస్థతో అనుసంధానమైన వారంతా స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన సూచించారు.

శనివారం చెన్నైలోని డాక్టర్ అంబేడ్కర్ న్యాయ విశ్వవిద్యాలయం 11వ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఉపరాష్ట్రపతి, న్యాయవ్యవస్థ పట్ల ప్రజలకు విశ్వాసం పెంపొందించేందుకు మరింత కృషి జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసుల విషయంలో న్యాయప్రక్రియను వేగవంతం చేయడంపై దృష్టిసారించాలని సూచించారు. ఇలాంటి కేసులతోపాటు ఎన్నికల వివాదాలు, అధికార దుర్వినియోగానికి సంబంధించిన కేసుల పరిష్కారానికి ప్రత్యేక కోర్టులను, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందన్నారు. చట్టసభల్లో పార్టీఫిరాయింపులకు సంబంధించిన కేసులను కూడా నిర్దిష్ట సమయంలో విచారించి నిర్ణయం తీసుకోవాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీతో పాటు వివిధ రాష్ట్రాల చట్టసభల్లో చోటుచేసుకున్న ఘటనలపై ఉపరాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు ఉన్నతమైన విలువలను, ప్రమాణాలను పాటిస్తూ, ప్రతి వేదికపైనా ఆదర్శవంతమైన ప్రవర్తనను కనబరచాల్సిన అవసరం ఉందన్నారు. చట్టసభల్లో ప్రతి అంశానికీ చర్చలే అసలైన పరిష్కారమని, సభాకార్యక్రమాలకు విఘాతం కల్పించడం ద్వారా సాధించేది ఏదీ ఉండన్నారు.

న్యాయశాస్త్ర విద్యార్థులు, దీన్ని ఓ పవిత్రమైన వ్యవస్థగా గౌరవిస్తూ, న్యాయవ్యవస్థను సామాన్యులకు అన్ని విధాలుగా అందుబాటులోకి తీసుకురావాలన్న ఉపరాష్ట్రపతి, ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే విధానంలో కోర్టు తీర్పులు, వ్యవహారాలు ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. స్వరాజ్యం సముపార్జించి 75 ఏళ్ళ మైలురాయిని చేరుకుంటున్న తరుణంలోనూ, ఇంకా వలసపాలకుల పద్ధతులనే స్నాతకోత్సవంలో, కోర్టుల వ్యవహారాల్లో అమలుచేస్తున్న తీరులో మార్పులు రావాల్సిన అవసరం ఉందని సూచించారు.

న్యాయం, ధర్మం వంటివి భారతీయ నైతిక విలువల్లో ప్రధానపాత్ర పోషిస్తాయన్న ఉపరాష్ట్రపతి, భారత రాజ్యాంగ పీఠికలోని ‘న్యాయవ్యవస్థను కాపాడే సంకల్పం’ (రిసాల్వ్ టు సెక్యూర్ జస్టిస్)ను ఉటంకించారు. తిరుక్కురళ్‌లోని ‘పారదర్శక, నిష్పాక్షిక విచారణ ఆధారంగానే న్యాయవ్యవస్థ బలంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికీ సమన్యాయం అందుతుంది’ అన్న వాక్యాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

మన రాజ్యాంగంలో న్యాయవ్యవస్థ కీలకమైన అంగమన్న ఉపరాష్ట్రపతి, ఉన్నతమైన విలువల ద్వారా సమన్యాయం అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయ ప్రక్రియకు అవసరమయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుండటం కూడా అందరికీ సమన్యాయం అందడంలో ఓ ప్రధాన అడ్డంకి మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. అందరికీ న్యాయం అందుబాటులోకి వచ్చేందుకు లోక్ అదాలత్‌లు, మొబైల్ కోర్టుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. దీనికితోడు స్థానికులకు మాతృభాషలో న్యాయవ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం కూడా అత్యంత అవసరమన్నారు.

భారతీయ కోర్టుల్లో దాదాపు 4కోట్ల కేసులు పెండింగ్‌లో ఉండడం పట్ల ఆవేదన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, కిందిస్థాయి కోర్టుల్లోనే ఎక్కువకేసులు పెండింగ్‌లో ఉంటున్నాయన్నారు. న్యాయం అందటం ఆలస్యం కావడం అంటే, సదరు వ్యక్తికి న్యాయం జరగనట్లేనన్న విషయాన్ని గుర్తుచేశారు. 

పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించేందుకు పలు సూచనలు చేసిన ఉపరాష్ట్రపతి, అత్యవసర పరిస్థితుల్లో తప్ప తరచుగా వాయిదాలు వేయడం తగ్గించడం ద్వారా కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించవచ్చన్నారు. లోక్ అదాలత్ వంటి ప్రత్యామ్నాయ వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనికితోడు కోర్టుల్లో ఉన్న ఖాళీలకు నిర్దిష్ట సమయంలోనూ నియామాయకాలు చేపట్టడం ద్వారా దిగువకోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించవచ్చని సూచించారు. 

భారతదేశం పెట్టుబడుల స్వర్గధామంగా మారిన విషయాన్ని ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, ప్రపంచ వాణిజ్య విపణిలో మన స్థానాన్ని బలపరుచుకోవడంలో విధానపరమైన నిర్ణయాలతోపాటు, అవాంతరాలు, ఆలస్యాలు లేని న్యాయ వ్యవస్థ పాత్ర కూడా కీలకమని పేర్కొన్నారు.

న్యాయవ్యవస్థలో సాంకేతికతను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందన్న ఉపరాష్ట్రపతి, యువ న్యాయవాదులు సాంకేతికతను సద్వినియోగం చేసుకుని సామాన్యులకు, పేదలకు సరైన న్యాయాన్ని అందేలా చేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘బార్‌’తోపాటు న్యాయమూర్తులు కూడా సాంకేతికతను సద్వినియోగపరుచుకోవాలని ఆయన సూచించారు. కరోనా మహమ్మారి సందర్భంగా కేసుల ఈ-ఫైలింగ్, ఆన్‌లైన్లో కేసుల విచారణ తదితర అంశాలను కూడా ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడే విషయంలో చట్టాలను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు (ప్రజాప్రయోజన వ్యాజ్యం)ను ప్రయివేట్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (వ్యక్తిగత ప్రయోజన వ్యాజ్యం)గా మార్చే ప్రయత్నం కూడా సరికాదన్న ఉపరాష్ట్రపతి, విస్తృత ప్రయోజాలను దృష్టిలో ఉంచుకుని వచ్చే పిల్స్‌ ను మాత్రమే అనుమతించాల్సిన అవసరముందున్నారు. బడుగు, బలహీన వర్గాలపై అత్యాచారాలకు సంబంధించిన కేసులను కూడా త్వరితగతిన విచారించాలని కూడా ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి సూచించారు.

కార్యక్రమ ప్రారంభానికి ముందు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి ఉపరాష్ట్రపతి పుష్పాంజలి ఘటించారు. రాజ్యాంగ ఫలాలను సమర్థవంతంగా అందించడం ద్వారానే గణతంత్ర స్వప్నాలను చేరుకోగలమన్నారు. 

ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ శ్రీ భన్వరీలాల్ పురోహిత్, విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ టీఎస్ఎన్ శాస్త్రితోపాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

***



(Release ID: 1701368) Visitor Counter : 220