నోయిడా హాట్ లో సరస్ జీవనోపాధి మేళా 2021ని కేంద్ర వ్యవసాయం రైతుల సంక్షేమ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి శ్రీ నరేంద్రసింగ్ తోమార్ ఈరోజు ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ సహాయమంత్రి శ్రీ కైలాష్ చౌదరి కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ తోమార్ స్వయం సహాయక బృందాలలో పెద్ద సంఖ్యలో మహిళలను సభ్యులుగా చేర్చడానికి గ్రామీణాభివృద్ధి శాఖ ప్రయత్నిస్తున్నదని తెలిపారు. కుటుంబ ఆదాయాన్ని పెంచడంతోపాటు జీవన ప్రమాణాలను మెరుగుపరిచే అంశంలో స్వయం సహాయక బృందాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని ఆయన అన్నారు.
స్వావలంబ భారతదేశ నిర్మాణం కోసం ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపును ప్రస్తావించిన శ్రీ తోమర్ ప్రభుత్వ పథకాలు చేస్తున్న ప్రయత్నాల వల్ల మాత్రమే స్వావలంబన సాధించలేమని అన్నారు. లక్ష్య సాధనకు ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని స్పష్టం చేసిన మంత్రి ఈ అంశంలో స్వయం సహాయక సంఘాలు ప్రధాన పాత్రను పోషించవలసి ఉంటుందని అన్నారు. సాధికారత కలిగిన స్వయం సహాయక సంఘాలు ముందుకు వచ్చి ఇతర స్వయం సహాయక బృందాలకు సహకరించి స్వావలంబ భారతదేశ నిర్మాణం కోసం తమ వంతు సహకారాన్ని అందించాలని ఆయన కోరారు.
కోవిడ్ కాలంలో గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించడానికి స్వయం సహాయక సంఘాలు చేసిన కృషిని శ్రీ కైలాష్ చౌదరి ప్రశంసించారు. ఎగుమతి చేయడానికి నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేసే సామర్థ్యం స్వయం సహాయక సంఘాలకు ఉందని పేర్కొన్న మంత్రి వీటి సహకారంతో సహాయంతో స్వావలంబ భారతదేశ నిర్మాణం సాకారం అవుతుందని అన్నారు.
వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరచు కోవాలని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ నాగేంద్రనాథ్ సిన్హా సూచించారు. ప్రకటనలు మరియు ఎస్ఎంఎస్ మార్కెటింగ్ ద్వారా మంత్రిత్వ శాఖ మేళాకు ప్రచారం కల్పించి మేళాలో ప్రదర్శిస్తున్న ఉత్పత్తులను ఎక్కువమంది తెలుసుకునేలా తమ మంత్రిత్వశాఖ చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు.
సరస్ జీవనోపాధి మేళా 2021 ను ఫిబ్రవరి 26 నుంచి మార్చి 21 వరకు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. 27 రాష్ట్రాల నుంచి 300 కి పైగా గ్రామీణ స్వయం సహాయక బృందాలు మరియు హస్తకళాకారులు మేళాలో పాల్గొంటున్నారు. 150 స్టాల్స్ మరియు ప్రాంతీయ వంటకాలను అందించే 15 ఫుడ్ స్టాల్స్ఏర్పాటుచేయబడ్డాయి. 60కి పైగాసాంస్కృతిక ప్రదర్శనల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఉత్పత్తి ప్యాకేజింగ్ మరియు డిజైన్, కమ్యూనికేషన్ స్కిల్స్, సోషల్ మీడియా పబ్లిసిటీ మరియు బిజినెస్ 2 బిజినెస్ మార్కెటింగ్ పై గ్రామీణ స్వయం సహాయక బృందాలు మరియు హస్తకళాకారులకు అవగాహన కల్పించడానికి వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు. మేళా రోజూ ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ డిజి డాక్టర్ జి. నరేంద్ర కుమార్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి అల్కా ఉపాధ్యాయ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ చరంజిత్ సింగ్ ఈ కార్యక్రమంలోపాల్గొన్నారు.