ఆర్థిక మంత్రిత్వ శాఖ

ముంబయిలో ఆదాయపన్ను విభాగం తనిఖీలు

Posted On: 15 FEB 2021 6:58PM by PIB Hyderabad

ఈనెల 8వ తేదీన, ఆదాయపన్ను విభాగం అధికారులు ముంబయిలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. అతిథ్య రంగంలో ఉన్న ఓ వ్యాపార బృందం, గుట్కా, పాన్ మసాలా, అనుబంధ పదార్థాలను కూడా తయారు చేస్తోందన్న సమాచారంతో సోదాలు జరిగాయి. ఈ తనిఖీలు 13వ తేదీ వరకు కొనసాగాయి.

బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలండ్స్‌ (బీవీఐ)లో నమోదైన సంస్థకు చెందిన విదేశీ ఆస్తులను ఈ సోదాల్లో ఆదాయపన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సంస్థ కార్యాలయం దుబాయ్‌లో ఉంది. సంస్థ ఛైర్మన్‌ వ్యాపార బృందం మొత్తాన్ని నియంత్రిస్తూ, నిర్వహిస్తున్నారు. భారత్‌ నుంచి నిధులను సమీకరించి తన విలువను రూ.830 కోట్లకు ఆ సంస్థ పెంచుకుంది. ఈ బృందంలోని ముఖ్య సంస్థల్లో వాటా ప్రీమియం రూపంలో రూ.638 కోట్లను భారత్‌కు మళ్లించారు. ఈమెయిల్‌ సంప్రదింపులు, వ్యాపార బృందం ప్రమోటర్‌తో సంస్థ అనుబంధం మొత్తం ఆధారాలతోసహా ఆదాయపన్ను అధికారుల దర్యాప్తులో బయటపడింది. బీవీఐ సంస్థలో వాటాదారైన ఒక ఉద్యోగిని గుర్తించిన అధికారులు, ప్రమోటర్‌తోపాటు క్రాస్ ఎగ్జామిన్‌ చేశారు. ఆ సంస్థలో వాటా ఉందని ఆ ఉద్యోగికి తెలియదని, ప్రధాన ప్రమోటర్‌ సూచన మేరకు పత్రాలపై సంతకాలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

 అంతేగాక, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80ఐసీ కింద, ఈ వ్యాపార బృందం అడ్డదారిలో రూ.398 కోట్ల మేర  మినహాయింపు పొందినట్లు తేలింది. హిమాచల్‌ప్రదేశ్‌లో 2 సంస్థలను ఈ బృందం స్థాపించిందని, అడ్డదారిలో మినహాయింపు పొందడానికి తప్పుడు చర్యలకు కూడా పాల్పడినట్లు వెల్లడైంది.

ఈ వ్యాపార బృందంలోని రెండు ఫ్యాక్టరీల్లో తయారు చేస్తున్న రూ.247 కోట్ల విలువైన పాన్‌ మసాలను అధికారులు జప్తు చేశారు.

ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 10 ఏఏ కింద, గాంధీధామ్ యూనిట్‌లో అక్రమంగా రూ.63 కోట్ల మేర మినహాయింపు చూపినట్లు అధికారులు నిర్ధారించారు.

ఈ సోదాల్లో 13 లక్షల నగదుతోపాటు రూ.7 కోట్ల విలువైన నగలను ఆదాయపన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 16 లాకర్లు, 11 ప్రాంగాణాలపై నిషేధ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు దాదాపు 1500 కోట్ల రూపాయల విలువైన లెక్కల్లో చూపని లావాదేవీలను దర్యాప్తులో అధికారులు గుర్తించారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.

*****(Release ID: 1698286) Visitor Counter : 14