సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

కోవిడ్ నేపథ్యంలో పెన్షనర్లకోసం అనేక చర్యలు రాజ్యసభలో కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


Posted On: 11 FEB 2021 6:04PM by PIB Hyderabad

కోవిడ్-19 నేపథ్యంలో పెన్షనర్లకు సహాయార్థం అనేక చర్యలు తీసుకున్నట్టు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ఈశాన్య ప్రాంత అభివృద్ధి,  ప్రధాని కార్యాలయ వ్యవహారాలు, సిబ్బంది, ప్రజా సమస్యలు, పెన్షన్లు, అణుశక్తి మరియు అంతరిక్ష పరిశోధనా వ్యవహారాల శాఖలను స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రిగా డాక్టర్ జితేంద్ర సింగ్ అజమాయిషీ చేస్తున్నారు.రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో గురువారం ఆయన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ విషయం తెలిపారు. ఇదివరకెన్నడూ లేని రీతిలో తలెత్తిన కోవిడ్-19 మహమ్మారిన్యాపించిన నేపథ్యంలో లాక్ డౌన్ ఆంక్షలు విధించినప్పటినుంచి,పెన్షనర్ల సంక్షేమమే లక్ష్యంగా పలు కార్యక్రమాలు చేపట్టినట్టు మంత్రి చెప్పారు. కోవిడ్ వ్యాప్తి సమయంలో సకాలంలో  పెన్షన్., తదితర పదవీ విరమణ ప్రయోజనాలు పెన్షనర్లకు అందేలా, పెన్షనర్లు ఆరోగ్యంగా ఉండేలా, ఆరోగ్యరక్షణపై అవగాహన కలిగి ఉండేలా చూసేందుకు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఈ విషయంలోపెన్షన్ల శాఖ ప్రధానంగా చేపట్టిన కార్యక్రమాలను/సహాయక చర్యలను ఇక్కడ పొందుపరుస్తున్నాం:-

  • కోవిడ్-19వ్యాప్తి నేపథ్యంలో వైరస్.పై పెషనర్లలో భయాందోళనలను తొలగించే లక్ష్యంతో దేశంలోని 20 నగరాల్లోని పెషనర్లకు ప్రమేయం కల్పిస్తూ వెబ్ ఆధారిత కార్యక్రమాన్ని పెన్షన్ల శాఖ నిర్వహించింది. పెన్షనర్ల ఆందోళనలను తొలగించేలా అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్రాల అధ్యయన సంస్థ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా  ఈ కార్యక్రమం ద్వారా పెన్షనర్లతో ముచ్చటించారు.  

 

  • పెన్షనర్ల ఆరోగ్య రక్షణకు ముందు జాగ్రత్త చర్యగా యోగా ప్రక్రియలపై మరో వెబ్ ఆధారిత కార్యక్రమాన్ని కూడా  ఈ శాఖ నిర్వహించింది.  దేశంలోని దాదాపు 20 నగరాలకు వర్తింప జేస్తూ ఈ  కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం సందర్భంగా యోగా శిక్షకుడు ప్రత్యక్షంగా పెన్షనర్లతో మాట్లాడుతూ, యోగాసనాలను ప్రదర్శించారు. యోగాసనాలపై ఉపన్యాసం ఇచ్చారు. లాక్ డౌన్ నేపథ్యంలో పెన్షనర్లు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకుని, ఆరోగ్యాన్ని రక్షించుకునే అంశంపై  పెన్షనర్ల ప్రశ్నలకు శిక్షకుడితో సమాధానాలు ఇప్పించారు.
  • పెన్షనర్ల వ్యాధినిరోధక శక్తి పెంపుదల, సంపూర్ణ ఆరోగ్యం వంటి అంశాలపై ప్రశ్నలు-జవాబుల కార్యక్రమాన్ని ఈ శాఖ నిర్వహించింది. “కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఆలోచనాశక్తి,, ధ్యానం” అన్న అంశంపై ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
  • పెన్షన్ చెల్లింపు ఉత్తర్వులు (పి.పి.ఒ.లు) జారీ అయినప్పటికీ లాక్ డౌన్.తో సదరు ఉత్తర్వులు సెంట్రల్ పెన్షన్ అక్కౌంటింగ్ కార్యాలయానికి (సి.పి.ఎ.ఒ.కు) లేదా బ్యాంకులకు పంపని కారణంగా పెన్షన్ అందని సందర్భాల్లో ఈ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఈ సమస్యను జనరల్ అక్కౌంట్స్ కంట్రోలర్ (సి.జి.ఎ.) కార్యాలయం దృష్టికి తీసుకెళ్లింది. కోవిడ్ వ్యాప్తితో కనీవినీ ఎరుగని విపరీత పరిస్థితులు నెలకొన్నందున, పరిస్థితి చక్కబడి, తిరిగి మామూలు పరిస్థితులు నెలకొనేంతవరకూ పెన్షన్ చెల్లింపునకు ఎలెక్ట్రానిక్ పద్ధతులు పాటించేలా, సి.పి.ఎ.ఒ.ను, బ్యాంకుల సెంట్రల్ పెన్షన్ ప్రాసెసింగ్ విభాగాలను (సి.పి.పి.సి.లను) ఆదేశించాలని పెన్షన్ల శాఖ సి.జి.ఎ,ను కోరింది.
  • కోవిడ్-19 వ్యాప్తితో ఇదివరకు ఎన్నడూ కనీవినీ ఎరుగని పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో సత్వరం పెన్షన్ ప్రయోజనాలను మంజూరు చేసేందుకు వీలుగా 1972వ సంవత్సరపు  సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) నిబంధనల్లో 64వ నిబంధననను సడలించారు.
  • కేంద్ర ప్రభుత్వానికి చెందిన సివిల్ పెన్షనర్లకు “సులభతరమైన జీవనం” అవకాశాలను పెంపొందింపజేసేందుకు ఒక నిబంధనకు రూపకల్పన చేశారు. ఎలెక్ట్రానిక్ పెన్షన్ చెల్లింపు ఉత్తర్వును (ఇ-పి.పి.ఒ.e-PPO) డిజి లాకర్ తో సమీకృతం చేయడానికి ఈ నిబంధన దోహదపడుతుంది. దీనితో డిజీ లాకర్ వ్యవస్థలో పి.పి.ఒ. రికార్డును శాశ్వతంగా పొందుపరిచేందుకు, పెన్షనర్ తన పి.పి.ఒ.కు సంబంధించి ప్రింటవుట్ కాపీని పొందడానికి ఈ నిబంధన వీలు కలిగిస్తుంది.
  • కోవిడ్-19 వైరస్ వ్యాపించడం, వయోజనులకు ఈ వైరస్ సోకే ఆస్కారం ఎక్కువగా ఉండటం తదితర కారణాల నేపథ్యంలో పెన్షనర్లు తమ జీన ప్రమాణ పత్రాలు (లైఫ్ సర్టిఫికెట్లు) సమర్పించాల్సిన గడువును సడలించారు. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లంతా తమ లైఫ్ సర్టిఫికెట్లను 2020 నవంబరు 1నుంచి 2021 ఫిబ్రవరి 28వరకూ ఎప్పుడైనా దాఖలు చేసే అవకాశం కల్పించారు. అయితే, 80ఏళ్లు అంతకు మించి వయస్కులైన పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్ దాఖలుకు 2020 అక్టోబరు ఒకటవ తేదీనుంచి 2021 ఫిబ్రవరి 28వతేదీవరకూ గడువు ఇచ్చారు.
  • పెన్షనర్లు డిజిటల్ పద్ధతిలో లైఫ్ సర్టిఫికెట్ పొందే అవకాశాన్ని వారి ఇంటి ముంగిటికి అందించేందుకు ఇండియన్ పోస్ట్ చెల్లింపుల బ్యాంకును (ఐ.పి.పి.బి.ని) ఈ శాఖ రంగంలోకి దించింది.  ఐ.పి.పి.బి.కి ఉన్న భారీస్థాయి వ్యవస్థను వినియోగించుకుంటోంది. దీనితో దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లు తమ ఇళ్ల ముంగిట పోస్ట్.మాన్, గ్రామీణ డాక్ సేవక్.ల ద్వారా అందే సేవలను వినియోగించుకునేందుకు వీలు కలిగింది. నామమాత్రపు మొత్తం చెల్లింపుతో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దీనితో పెన్షనర్లకు ఏదైనా బ్యాంకు ముందుగానీ, బ్యాంకు శాఖముందుగానీ పొడవాటి క్యూలలో నిల్చుకునే అవసరం తప్పి పోయింది.
  • దేశవ్యాప్తంగా వంద ప్రధాన నగరాల్లోని ఖాతాదార్లకు సేవలదించడానికి సులభతర బ్యాంకింగ్ కార్యకలాపాలు అన్న సంస్కరణలో భాగంగా 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల కూటమిని రంగంలోకి దింపడంలో పెన్షన్ల శాఖ కీలకపాత్ర పోషించింది. “ఇంటి ముంగిటికే బ్యాంకింగ్ కార్యకలాపాలు” అన్న విధానాన్ని ఈ బ్యాంకులు పాటిస్తున్నాయి. ఇదే విధానం కింద లైఫ్ సర్టిఫికెట్లను సేకరించే సేవలను ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుల కూటమి ప్రవేశపెట్టింది.  లైఫ్ సర్టిఫికెట్లు పొందేందుకు వీడియో ఆధారంగా ఖాతాదార్ల గుర్తింపు ప్రక్రియను రిజర్వ్ బ్యాంకు మార్గదర్శక సూత్రాల పరిధిలో బ్యాంకులు చేపట్టేలా ఈ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనితో లైఫ్ సర్టిఫికెట్ కోసం బయోమెట్రిక్ గుర్తింపు పద్ధతిని పాటించాల్సిన అవసరం తప్పింది.

 

*****


(Release ID: 1697373) Visitor Counter : 241


Read this release in: English , Urdu , Marathi , Tamil