రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

క్షిపణి సాంకేతికతలో ఆత్మనిర్భరత సాధించాం: ఉపరాష్ట్రపతి

• ఈ రంగంలో భారత్‌పై ఇతర దేశాలు ఆధారపడే స్థాయికి ఎదుగుతున్నాం.

• ఆయుధాల దిగుమతి నుంచి ఎగుమతివైపు పయనంలో డీఆర్డీవో కృషికి అభినందనలు

• భవిష్యత్ రక్షణ సాంకేతికతపై దృష్టిపెట్టాలని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచన

• కరోనాపై పోరాటంలో భారత్ విజయాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయని వెల్లడి

• కరోనా వైరస్‌కు రికార్డు సమయంలో టీకా తయారు చేయడం అభినందనీయం.. త్వరలోనే ప్రతి భారతీయుడికీ టీకా అందుబాటులోకి వస్తుందని ఆశాభావం

• మహమ్మారిపై పోరాటంలో డీఆర్‌డీవో చొరవపై ప్రశంస

• శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళల పాత్ర మరింత పెరగాలని ఆకాంక్ష

• మాతృభాషలో ప్రజలకు విజ్ఞానాన్ని మరింత చేరువ చేయాలని సూచన 

Posted On: 25 JAN 2021 3:52PM by PIB Hyderabad

భారతదేశం క్షిపణి సాంకేతికత రంగంలో ఆత్మనిర్భరత సాధించిందని, ఈ రంగంలో భారత్‌పై ఇతర దేశాలు ఆధారపడే స్థితికి చేరుకున్నామని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ కీలక పరిణామంలో డీఆర్‌డీవో (రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ) శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు సాధించిన కృషిని ఆయన అభినందించారు. క్షిపణి రంగంలో ఆత్మనిర్భరత సాధించడం, దేశ రక్షణలో కీలక పాత్ర వహించడమే గాక, మన దేశానికి గర్వకారణంగా నిలిచిందని, స్వదేశీ సాంకేతికతతో ఇలా ముందుకెళ్లడం ప్రతి భారతీయుడికీ గర్వకారణమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

సోమవారం హైదరాబాద్‌లోని డీఆర్డీఎల్‌లోని డాక్టర్ అబ్దుల్ కలాం క్షిపణి కేంద్రాన్ని ఉపరాష్ట్రపతి సందర్శించారు. ఈ సందర్భంగా ఈ ప్రాంగణంలో రెండు నూతన భవనాలను ఆయన ప్రారంభించారు. సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రదర్శన (ఎగ్జిబిషన్)ను తిలకించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ఈ ప్రాంగణాన్ని సందర్శించిన తర్వాత దేశ రక్షణకు సంబంధించి డీఆర్డీవో శాస్త్రవేత్తలు సాధించిన గణనీయమైన ప్రగతి, ఈ రంగంలో దేశం ఆత్మనిర్భరత సాధించేందుకు వారు రూపొందిస్తున్న క్షిపణి సాంకేతికత విషయంలో మరింత విశ్వాసం పెరిగిందని పేర్కొన్నారు. శాస్త్రవేత్తల కృషి కారణంగా గతంలో విదేశాలనుంచి దిగుమతి చేసుకునే రక్షణ రంగ ఉత్పత్తులు వీలైనంత ఎక్కువగా భారతదేశంలోనే తయారవడమే గాక,  విదేశాలకు క్షిపణులను భారత్ ఎగుమతి చేస్తుండటం అభినందనీయమని తెలిపారు.

ఆత్మనిర్భర భారత్ కారణంగా స్వదేశీ సాంకేతికత ప్రదర్శనకు సరైన వేదిక లభించడంతోపాటు స్థానికంగా ఉపాధికల్పన, ఇతర అవకాశాలకు మార్గం సుగమం అవుతుందన్నారు. ఆకాశ్ క్షిపణులకు అవసరమైన ఉత్పత్తులను ఇకపై విదేశాలనుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదని ఇటీవల రక్షణ శాఖ తీసుకున్ననిర్ణయమే.. డీఆర్డీవో సాధిస్తున్న ప్రగతిపై విశ్వాసాన్ని వెల్లడిస్తోందన్నారు.

2018లో క్షిపణి సాంకేతికత నియంత్రణ (ఎంటీసీఆర్)పై సంతకానికి ముందు భారతదేశంలో అభివృద్ధి చెందిన దేశాల క్షిపణి సాంకేతికత సంబంధించిన వినియోగానికి సంబంధించి ఎన్నో పరిమితులుండేవని ఈ సందర్భంగా గుర్తు చేసిన ఉపరాష్ట్రపతి, ప్రస్తుత పరిస్థితులను అవకాశాలుగా మలచుకుని స్వదేశీ తయారీ క్షిపణులను రూపొందిస్తున్న డి.ఆర్.డి.ఏ. చొరవ అభినందనీయమని తెలిపారు.

రక్షణ రంగ ఉత్పత్తుల దిగుమతి దారు స్థాయి నుంచి, ఎగుమతి చేసే స్థాయికి ఎదగడంపై హర్షం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, ఈ దిశగా భారతదేశం మరింత ప్రగతిని సాధించేందుకు, భవిష్యత్ రక్షణ అవసరాలకు అనుగుణంగా వ్యూహాత్మక రక్షణ సాంకేతికత అభివృద్ధిపై దృష్టిపెట్టాలని సూచించారు. ఇందుకు తగ్గట్లుగా వీలునుబట్టి ప్రైవేటు రంగానికీ అవకాశాలు కల్పించాలన్నారు. భవిష్యత్ మిలటరీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని డీఆర్డీవో 8 అడ్వాన్స్డ్  టెక్నాలజీ సెంటర్స్ ను స్థాపించడాన్ని ఆయన అభినందించారు.

ఇటీవల భారతదేశంలో మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారని ప్రశంసిచిన ఉపరాష్ట్రపతి, రక్షణ, పరిశోధన రంగాల్లో వీరిని మరింతగా ప్రోత్సహించాలని సూచించారు. ఇటీవలి కాలంలో తాను పాల్గొంటున్న విశ్వవిద్యాలయాల స్నాతకోత్సవాల్లో ఎక్కువశాతం యువతులే బంగారు పతకాలు సాధిస్తున్న విషయాన్నీ ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు.

కరోనా మహమ్మారి కారణంగా సమాజంలోని అన్ని వర్గాలూ ఇబ్బందులకు గురయ్యాయని.. ప్రభుత్వం కీలకమైన సమయంలో తీసుకున్న అత్యంత కీలకమైన నిర్ణయాల కారణంగానే కరోనా వ్యాప్తి మరింత విస్తరించకుండా అడ్డుకోగలిగామని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. కరోనాకు ముందు పీపీఈ కిట్లు దిగుమతి చేసుకునే స్థితిలో ఉన్న భారతదేశం, ఇప్పుడు విదేశాలకు పీపీఈ కిట్లను, మాస్కులను ఎగుమతి చేసే స్థాయికి ఎదగడమే భారతదేశ ఆత్మనిర్భర భారత్ నినాదం కార్యక్షేత్రంలో చూపిస్తున్న ఫలితాలకు నిదర్శనమన్నారు.

కరోనాకు టీకా విషయంలో భారతదేశం అద్వితీయమైన ప్రగతిని సాధించిందన్న ఆయన, రికార్డు సమయంలో టీకా ఉత్పత్తితోపాటు, విదేశాలకు కూడా టీకా ఎగుమతి చేయడాన్ని ఆయన ప్రస్తావించారు. త్వరలోనే ప్రతి భారతీయుడికీ కరోనా టీకా అందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కరోనాను అరికట్టడంలో భారతదేశం విజయవంతం అయిందన్న ఉపరాష్ట్రపతి, ఈ ప్రయత్నంలో ముందువరసలో నిలిచి పోరాడిన పోలీసులు, రక్షణ బలగాలు, వైద్యులు,  వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, శాస్త్రవేత్తలతో పాటు రైతులు చూపించిన స్ఫూర్తిని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. అన్నదాతలు కరోనా సమయంలో రికార్డు స్థాయిలో ఉత్పత్తిని పెంచారని ప్రశంసించారు. 

పరిశోధనలు, ప్రయోగాల తుది లక్ష్యం ప్రజల జీవితాలను సౌకర్యవంతంగా మార్చడమేనన్న ఉపరాష్ట్రపతి, వాతావరణ మార్పులపైన మరిన్ని పరిశోధనలు జరగాలని సూచించారు. విజ్ఞాన శాస్త్రం సహా ప్రతి అంశం మాతృభాషలో ప్రజలకు మరింత చేరువ కావాలని సూచించారు. 12రోజుల వ్యవధిలో డీఆర్డీవో ఆధ్వర్యంలో యుద్ధప్రాతిపదికన ఢిల్లీలో కరోనా బాధితుల కోసం వెయ్యిపడకల ఆసుపత్రిని నిర్మించిన విషయాన్నీ ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

దేశం క్షిపణి రంగంలో ఇంత ప్రగతిని సాధించడంలో మాజీ రాష్ట్రపతి, భారతరత్న శ్రీ అబ్దుల్  కలాం పాత్ర చిరస్మరణీయమన్న ఉపరాష్ట్రపతి, నిరాడంబరుడైన శ్రీ కలాం గారిని ఎప్పుడు కలిసినా ఒక కొత్తవిషయాన్ని తెలుసుకోగలిగానని, అందుకే తనకు వారంటే అమితమైన గౌరవమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ హోంశాఖ మంత్రి శ్రీ మహ్మద్ మహమూద్ అలీ, డీఆర్డీవో చైర్మన్ శ్రీ జి.సతీశ్ రెడ్డితోపాటు డీఆర్డీవో శాస్తవేత్తలు పాల్గొన్నారు.

****



(Release ID: 1692193) Visitor Counter : 176


Read this release in: English , Urdu , Hindi