ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

గువహతిలోని ఎయిమ్స్‌ లో మొదటి బ్యాచ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన - డాక్టర్ హర్ష వర్ధన్

"దాదాపు 50 సంవత్సరాల విరామం తర్వాత, రెండవ ఎయిమ్స్ సంస్థను కనీసం ఒక భావనగా రూపుదిద్దుకోడానికి, శ్రీ అటల్ బిహారీ వాజపేయి కృషి చేశారు"

"సరసమైన ఆరోగ్య సంరక్షణలో "అంతరాలను" తగ్గించడంతో పాటు, భారతదేశంలోని సాధారణ జనాభాలో శ్రేయస్సును సృష్టించాలనే దీర్ఘకాలిక ఆశయానికి అనుగుణంగా, భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఎయిమ్స్ ఏర్పాటు"

"ప్రతి వెయ్యిమంది రోగులకు ఒక డాక్టర్ ఉండాలనే డబ్ల్యూ.హెచ్.ఓ. లక్ష్యాన్ని ఈ సంవత్సరంలోనే సాధించడానికి కృషి జరుగుతోంది" : డాక్టర్ హర్ష వర్ధన్

Posted On: 12 JAN 2021 5:35PM by PIB Hyderabad

గువహతిలోని ఎయిమ్స్‌ లో ఎమ్.బి.బి.ఎస్. విద్యార్థుల మొదటి బ్యాచ్  ప్రారంభోత్సవ కార్యక్రమానికి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే సమక్షంలో, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఈ రోజు వీడియో కాన్ఫరెన్సు ద్వారా అధ్యక్షత వహించారు. 

అస్సాం ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్;  అస్సాం రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హిమంతా బిస్వా శర్మ; గౌరవ అతిధులుగా ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. 

గువహతిలోని ఎయిమ్స్ లో చేరిన మొదటి బ్యాచ్ విద్యార్థులందరికీ, డాక్టర్ హర్ష వర్ధన్ ముందుగా హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. అందరికీ ఆరోగ్యం అందుబాటులో ఉంచాలనే, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఆశయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేస్తూ,  "గువహతి లోని ఎయిమ్స్ సంస్థ, ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షా యోజన (పి.ఎం.ఎస్.ఎస్.వై) కింద 5వ దశలో ఉద్భవించిన కొత్త ప్రతిష్టాత్మక సంస్థలలో ఒకటి.  దాదాపు 50 సంవత్సరాల విరామం తర్వాత, రెండవ ఎయిమ్స్ సంస్థను కనీసం ఒక భావనగా రూపుదిద్దుకోడానికి, శ్రీ అటల్ బిహారీ వాజపేయి చేసిన కృషిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ముందుకు తీసుకువెళ్తున్నారు.  "సరసమైన ఆరోగ్య సంరక్షణలో "అంతరాలను" తగ్గించడంతో పాటు, భారతదేశంలోని సాధారణ జనాభాలో శ్రేయస్సును సృష్టించాలనే దీర్ఘకాలిక ఆశయానికి అనుగుణంగా,  భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఎయిమ్స్ ఏర్పాటు చేయాలనే స్వల్ప కాలిక లక్ష్యాన్ని చేపట్టడం జరిగింది." అని తెలియజేశారు. 

అస్సాం ప్రజలకు మంచి ఆరోగ్య సంరక్షణ లభించే అవకాశం ఉందని డాక్టర్ హర్ష వర్ధన్ పేర్కొంటూ,  “ఇది 750 పడకల ఆసుపత్రి. ఇందులో బహుళ ప్రత్యేకతలతో పాటు సూపర్ స్పెషాలిటీ విభాగాలు కూడా ఉన్నాయి.  ఇది మొత్తం 1123 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన,  ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటి.  ఈ వ్యయంలో, అత్యాధునిక వైద్య పరికరాల కోసం 185 కోట్ల రూపాయలు కేటాయించారు.” అని తెలియజేశారు. "అస్సాం ప్రభుత్వం అవసరమైన సదుపాయాలు కల్పించడంతో, కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణతో, ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తవుతుందని నేను ఆశిస్తున్నాను" అని ఆయన కేంద్ర ఆరోగ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. 

ప్రతి వెయ్యిమంది రోగులకు ఒక డాక్టర్ ఉండాలనే డబ్ల్యూ.హెచ్.ఓ. లక్ష్యాన్ని ఈ సంవత్సరంలోనే సాధించడానికి ప్రభుత్వం చేపడుతున్న కృషిని డాక్టర్ హర్ష వర్ధన్ వివరిస్తూ,  "2013-14 విద్యా సంవత్సరం నుండి, ఆరు కొత్త ఎయిమ్స్ లో మొత్తం ఎమ్.బి.బి.ఎస్. సీట్ల సంఖ్య 600 కు పెరిగింది, దీనివల్ల అదనంగా 300 మంది ఎమ్.బి.బి.ఎస్. విద్యార్థులకు అవకాశం కలిగింది.  గువహతి లోని ఎయిమ్స్ తో సహా కొత్త ఎయిమ్స్ లను చేర్చడంతో, దేశంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మొత్తం ఎం.బి.బి.ఎస్. సీట్ల లభ్యత 42,545 కు పెరిగింది.  గువహతిలోని ఎయిమ్స్,  తన తాత్కాలిక ప్రాంగణం నుండి శాశ్వత ప్రాంగణంలోకి మారడం, మౌలిక సదుపాయాలు, మానవ వనరుల వృద్ధి జరగడంతో,  భవిష్యత్తులో ఈ ఎం.బి.బి.ఎస్.  సీట్లు మరింత పెరుగుతాయి.  గువహతిలోని ఎయిమ్స్ లో, ఇ.డబ్ల్యు.ఎస్. విద్యార్థులకు కేటాయించిన సీట్లతో సహా, మొత్తం 125 ఎం.బి.బి.ఎస్.  సీట్లు ఉన్నాయి.  వీటికి అదనంగా, నిర్ణీత సమయంలో, ఈ కళాశాలలో 60 మంది నర్సింగ్ విద్యార్థులను కూడా చేర్చుకుంటారు" అని తెలియజేశారు.  ఎం.బి.బి.ఎస్.  సీట్ల మొత్తం లభ్యతను 80,000 కు పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న కృషి గురించి ఆయన తెలియజేశారు.

ఉజ్వలమైన విద్యా ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న ప్రతిభావంతులైన విద్యార్థులను ఉద్దేశించి డాక్టర్ హర్ష వర్ధన్ మాట్లాడుతూ,  "నేను ఎల్లప్పుడూ యువ, ప్రతిభావంతులైన విద్యార్థులు, వైద్య వృత్తిని ఎంచుకోవాలని ప్రోత్సహిస్తాను.  ఎందుకంటే, డాక్టర్-రోగి సంబంధం పరోపకారం, కరుణ, మానవ బాధలను తగ్గించే కోరిక వంటి ఉత్తమమైన మానవ ధర్మాల ద్వారా మార్గనిర్దేశం చేయబడుతుంది.” అని పేర్కొన్నారు. 

కోవిడ్-19 మహమ్మారి సమయంలో లక్షలాది మంది ఫ్రంట్‌ లైన్ వైద్య సిబ్బంది అందిస్తున్న నిరంతర కృషి, త్యాగం గురించి, ఆయన,  యువ నిపుణులకు గుర్తుచేస్తూ,  “ప్రపంచంలో అన్నిచోట్లా మాదిరిగానే, భారతదేశంలో కూడా,  వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు విశేషమైన సేవలందించారు. మహమ్మారికి వ్యతిరేకంగా దేశ పోరాటంలో ముందంజలో ఉన్నారు. దేశం మొత్తం వారికి ఎంతో రుణపడి ఉంది”, అని పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమాన్ని - స్వామి వివేకానందకు, ఆయన కొత్తగా పుంజుకున్న భారతదేశాన్ని చూసిన యువతకు శ్రీ చౌబే  అంకితం చేస్తూ, దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సంరక్షణను అందించడానికి, ప్రధానమంత్రి చేపట్టిన కృషిని ఉత్తమంగా తెలియజేయడానికి, “ఢిల్లీ హో యా గువహతి; అప్ని దేశ్ అప్ని మాటి” అనే నినాదాన్ని ఉదహరించారు. "మారుమూల ప్రాంతాలలో సూపర్ స్పెషాలిటీ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను విస్తరించి, దాని అందుబాటును ప్రోత్సహించడానికి చేపట్టిన చర్యల్లో భాగంగా, పి.ఎం.ఎస్.‌ఎస్.‌వై.  కింద,  వివిధ రాష్ట్రాల్లో, కొత్త ఎయిమ్స్ ఏర్పాటుతో పాటు, జి.ఎం.సి. లను కేంద్రప్రభుత్వం మెరుగుపరుస్తోంది", అని, ఆయన, తెలియజేశారు. 

ఈశాన్య ప్రాంత అభివృద్ధి దిశగా తన దృష్టిని కేంద్రీకరిస్తున్నందుకు శ్రీ సోనోవాల్,  ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, " ఈశాన్య ప్రాంతం మరింతగా అభివృద్ధి చెంది, తనపై తాను నమ్మకంగా ఉండడంతో, ఈ ప్రాంతంలో గత 6 సంవత్సరాల్లో పెట్టుబడులు ఫలితాలను చూపించటం ప్రారంభించాయి." అని పేర్కొన్నారు. 

గౌహతీ లోక్ సభ సభ్యురాలు శ్రీమతి క్వీన్ ఓజా;  సిల్చార్ లోక్ సభ సభ్యులు డాక్టర్ రాజ్ దీప్ రాయ్; ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధులుగా హాజరయ్యారు. 

అస్సాం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ జిష్ణు బారువా,  అస్సాం రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య, సంక్షేమ శాఖకు చెందిన సీనియర్ అధికారులు కూడా, ఈ కారక్రమంలో పాల్గొన్నారు. 

 

గౌహతిలోని ఎయిమ్స్, ఐ.బి, అధ్యక్షులు ప్రొఫెసర్ చిత్రా సర్కార్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో - గువహతి, ఎయిమ్స్ కు మార్గదర్శకత్వం వహిస్తున్న సంస్థ, భువనేశ్వర్ లోని ఎయిమ్స్ డైరెక్టర్  డాక్టర్ గీతాంజలి పద్మనాభన్ బాట్మానబనే;  గుహహతిలోని ఎయిమ్స్, శరీరధర్మశాస్త్రం (ఫిజియాలజీ) విభాగం ప్రొఫెసర్ & హెడ్ డాక్టర్ మానసీ భట్టాచార్జీతో పాటు, గౌహతీ లోని ఎయిమ్స్ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.  గౌహతీ లోని జి.ఎమ్.సి., ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం, సిబ్బంది;  భువనేశ్వర్ లోని ఎయిమ్స్ కు చెందిన అధ్యాపక బృందం, అధికారులతో పాటు ఎమ్.బి.బి.ఎస్. మొదటి బ్యాచ్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు  కూడా పాల్గొన్నారు. 

*****



(Release ID: 1688134) Visitor Counter : 118